
ఘాటుగా స్పందించిన విజయమ్మ
నల్లొండ జిల్లాలో తన పర్యటనను అడ్డుకొని అరెస్ట్ చేయడం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఘాటుగా స్పందించారు.
నల్లొండ జిల్లాలో తన పర్యటనను అడ్డుకొని అరెస్ట్ చేయడం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఘాటుగా స్పందించారు. శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని ఖమ్మం-నల్గొండ జిల్లాల సరిహద్దుల్లోని పైనంపల్లి వద్ద పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. అందుకు ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అడ్డుకున్నందుకు నిరసనగా ఆమె అక్కడే నేలమీద బైఠాయించారు. వరద బాధితులను పరామర్శిస్తూ కొనసాగుతున్న తన పర్యటనను రాజకీయం చేయడం పట్ల ఆమె మండిపడ్డారు. బాధితులకు ధైర్యం చెప్పి, భరోసా ఇవ్వడానికి వెళుతుంటే అడ్డుకోవడంతో ఆమెకు బాధకలిగింది. ఇంతకు ముందు ఎన్నడూ మాట్లాడనంత ఆగ్రహంతో మాట్లాడారు.
మా మీద ఏమైనా రౌడీషీటుందా? ఇదేమైనా పాకిస్థానా? బంగ్లాదేశా? సమైక్యవాదాన్ని వినిపిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణలో పర్యటిస్తే ఆయనను కూడా అరెస్ట్ చేస్తారా? అడ్డుకుంటారా? బాధితులను పరామర్శించడం కూడా తప్పేనా? అడ్డుకునే వారిని అరెస్ట్ చేయాలి. రైతులను పరామర్శిస్తే అరెస్ట్ చేస్తారా? మనం ప్రజాస్వామ్యా దేశంలో ఉన్నామా? అని ఆమె ప్రశ్నించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమైక్యతకు కట్టుబడి ఉంది. ప్రజలందరూ కలిసి మెలిసి ఉండాలని తాము కోరుకుంటున్నట్లు చెప్పారు. తెలంగాణ ప్రాంత ప్రజలు వైఎస్ రాజశేఖరరెడ్డిని, జగన్ బాబును గుండెల్లో పెట్టుకుని చూస్తున్నారు. కొంత మంది నాయకులు, పార్టీలు వ్యక్తిగత స్వేచ్చను కాలరాస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలను కలవనీయకుండా ప్రభుత్వమే అడ్డుకోవడం దారుణం అన్నారు. తుపాను వల్ల నష్టపోయిన రైతులను మంత్రులు గానీ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గానీ, ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ గానీ, సోనియా గాంధీ గానీ పరామర్శించారా అని ప్రశ్నించారు. త్వరలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
తాము మళ్లీ వస్తామని విజయమ్మ ప్రజలకు భరోసా ఇచ్చారు.
వైఎస్ విజయమ్మ నల్లొండ జిల్లా పర్యటనను అడ్డుకోవాలని మంత్రులు జానా రెడ్డి, ఉత్తమకుమార్ రెడ్డిలు పిలుపు ఇవ్వడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలతోపాటు కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా వ్యతిరేకిస్తున్నారు. ప్రాంతాలకు అతీతంగా బాధితులను పరామర్శించడం అనేది మానవత్వంతో కూడిన అంశం. ఒక పార్టీ గౌరవాధ్యక్షురాలుగా వెళ్లడం ఆమె బాధ్యత. ఇటువంటి పర్యటనను అడ్డుకోవాలనిప్రభుత్వంలోని మంత్రులే పిలుపు ఇవ్వడాన్ని ప్రజాస్వామ్యవాదులు తప్పుపడుతున్నారు. వారు రెచ్చగొట్టేవిధంగా మాట్లాడటం బాధ్యతారాహిత్యంగా పేర్కొంటున్నారు. అధికారంలో ఉండి ఇలా విద్వేషాలు రెచ్చగొట్టడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. పిసిసి మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ కూడా వారి వ్యాఖ్యలను వ్యతిరేకించారు.
అన్నీ కోల్పోయి నిరాశ, నిస్పృహల్లో ఉన్న అన్నదాతను, ప్రజలకు తామున్నామని భరోసా కల్పించే ఉద్దేశంతో తలపెట్టిన విజయమ్మ పర్యటనను రాజకీయ కోణంలో ఆలోచించడం దిగజారుడు రాజకీయమన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన ఉత్తమ కుమార్ రెడ్డి కూడా ఆ విధంగా పిలుపు ఇచ్చారంటే దీనికి వెనుక సిఎం హస్తం కూడా ఉన్నట్లు పలువురు భావిస్తున్నారు. విడిపోయినా అందరం కలిసుందామన్న జానారెడ్డి ఇప్పుడు విజయమ్మ పర్యటనను అడ్డుకోవాలని పిలుపు ఇవ్వడం రాజకీయ లబ్ధికోసం ఆయన పూటకోమాట మాట్లాడతారన్న విమర్శలు వినవస్తున్నాయి.