ఆవిష్కరణం : కళ్లద్దాలు... కొత్తవేం కాదండీ!
ఇప్పుడు మనం బహువిధాలుగా ఉపయోగించుకొంటున్న కళ్లజోళ్లు.. మొదట ఏ ఉపయోగం కోసం వాడారు అనే విషయం గురించి శోధిస్తే మూలాలు ఈజిప్టులో కనిపిస్తాయి. క్రీస్తుపూర్వం ఐదో శతాబ్దంలోనే ఈజిప్టు నాగరికతలో కళ్లజోళ్ల ప్రస్తావన ఉంది. అయితే వారు ఎందుకోసం ఉపయోగించారు? అనేదానిపై స్పష్టత లేదు. యూరోపియన్ చరిత్రలోనూ వీటి ప్రస్తావన ఉంది. రోమ్‌ను పాలించిన నీరో చక్రవర్తికి గురువైన సెనెకా ది యంగర్ కళ్ల జోళ్ల గురించి గ్రంథస్తం చేశాడు. ఆయన క్రీస్తు శకం ఒకటో శతాబ్దానికి చెందిన వారు. ‘‘రసాయనం నింపిన అద్దాలను కళ్లకు పెట్టుకొని చూడటం ద్వారా అక్షరాలు చాలా పెద్దవిగా కనిపిస్తాయి..’’ అని యంగర్ తన గ్రంథం ఒకదానిలో పేర్కొన్నాడు. దీన్ని బట్టి మొదట దృష్టిలోపాన్ని సవరించడానికి, చిన్న సైజులో రాసి ఉన్న అక్షరాలను చదువుకోవడానికి అద్దాలను ఉపయోగించారని అర్థం చేసుకోవచ్చు.
ఆ తర్వాత చాలా మంది యూరోపియన్ గ్రంథకర్తలు కళ్ల జోళ్ల గురించి తమ రాతల్లో ప్రస్తావించారు. వీరందరూ ‘‘అక్షరాలను పెద్దవిగా చూపించే’’ కళ్ల జోళ్ల గురించి మాత్రమే చర్చించారు. క్రీస్తు శకం 12 వ శతాబ్దం వరకూ వాటి వినియోగం ఎలా ఉందో అంచనా వేయలేం కానీ.. భూతద్దంలా ఒక చేత్తో పట్టుకుని ఉపయోగించేవారని తెలుస్తోంది. ఇక 12 శతాబ్దంలోనే చైనీయులు సన్ గ్లాసెస్ ఉపయోగించినట్టు చారిత్రక ఆధారాలున్నాయి. అయితే కళ్లజోడు జీవన శైలిలో భాగం అయినది, దృష్టి సంబంధ సమస్యలను అధిగమించడానికి ఒక మార్గంగా మారింది మాత్రం 16, 17 వ శతాబ్దాల్లోనే. అప్పుడే బయోఫోకల్ గ్లాసెస్ కూడా అందుబాటులోకి వచ్చాయి. అలాగే ఐ ప్రొటెక్షన్ కోసం కూడా కళ్లజోడు ఉత్తమమైనవిగా మారాయి.