విశ్లేషణం : అంతఃసౌందర్యమే ఆమె ఐశ్వర్యం
ఐశ్వర్య మనసెంత అందమైనదో తెలియాలంటే.. ఆమె సౌందర్యం మాయనుంచి బయటపడి ఆమె చెప్పే మాటలు వినాలి.
ఐశ్వర్యారాయ్... ప్రపంచాన్ని మైమరపించిన సౌందర్యం! మోడలింగ్‌తో మెరిపించి, ప్రపంచ సుందరిగా మురిపించి, అందమైన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసి, బచ్చన్ ఇంటి కోడలుగా మెప్పించి, ఆరాధ్యకు తల్లిగా ఆనందాన్ని అనుభవిస్తున్న అందాలరాశి. మరి ఈ సౌందర్య దేవత వ్యక్తిత్వం కూడా అందమైనదేనా?
అందమైన ఆత్మవిశ్వాసం...
సెలబ్రిటీతో మాట్లాడకుండా కేవలం వారి పబ్లిక్ బిహేవియర్‌ను మాత్రమే పరిశీలించి వ్యక్తిత్వాన్ని అంచనావేయడం కష్టమైన పనే, కానీ అసాధ్యం కాదు. ఒక వ్యక్తి ఒక్క పదం కూడా మాట్లాడకపోయినా బాడీలాంగ్వేజ్, హావభావాలు వారి అంతరంగం గురించి అనేక విషయాలు వివరిస్తాయి. అనుభవాలను, అభిప్రాయాలను వ్యక్తం చేయడంలో ఎంచుకునే మాటలు వారి వ్యక్తిత్వాన్ని వెల్లడిస్తాయి. ఐశ్వర్య కాలుమీద కాలు వేసుకుని హుందాగా కూర్చుంటుంది. చేతులు రెండూ కలిపి ఉంచి, అవసరమైనప్పుడు, ఏమైనా వ్యక్తం చేయాలనుకున్నప్పుడు మాత్రమే ఓపెన్ చేస్తుంది. దీన్ని బట్టి ఆమె ఆత్మవిశ్వాసంతో ఉంటుందని, మనసులోని భావాలను వ్యక్తం చేయడంలో సెలక్టివ్‌గా ఉంటుందని తెలుస్తుంది. ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు కాస్త పైకి చూసి, ఆ తర్వాత ఎదుటివారివైపు సూటిగా చూస్తూ మాట్లాడుతుంది.
ఆమె విజువల్ పర్సన్ అని అర్థమవుతుంది. గలగలా మాట్లాడుతూ... కిలకిలా నవ్వుతూ, అప్పుడప్పుడూ నాలుక బయటకు పెట్టి తిప్పేస్తూ... ఎదుటివారిని గిలిగింతలు పెట్టేస్తుంది. ఇలా నవ్వడం, నాలుకను తిప్పేయడం ఫ్లర్టింగ్ అనిపించినా... అది నెర్వస్‌నెస్‌ను దాచుకునే ప్రయత్నంలో భాగమని కూడా అనుకోవచ్చు. ఇక తానేదైనా విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాలనుకున్నప్పుడు, ముఖ్యంగా సెటైరికల్‌గా చెప్పాలనుకున్నప్పుడు కొటేషన్ మార్క్‌ను వేళ్లతో చూపించడం ఐశ్వర్య ప్రత్యేక శైలి.
మధ్యేమార్గం...
అందమైన అమ్మాయి... అందులోనూ గ్లామర్‌ఫీల్డ్... ఎన్ని పుకార్లు పుట్టుకొస్తాయో అందరికీ తెలుసు. ఐశ్వర్య గురించి ఎన్నో పుకార్లు, మరెన్నో వివాదాలు. వాటి గురించి ఎవరైనా ప్రశ్నిస్తే మౌనంగా ఉంటుంది, లేదంటే దాటవేస్తుంది, మరీ ఒత్తిడి చేస్తే తన అభిప్రాయాన్ని వెల్లడిస్తుందే తప్ప... ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయకపోవడాన్ని బట్టి ఆమె సంయమనాన్ని అర్థం చేసుకోవచ్చు. బుద్ధుని మధ్యేమార్గమే తన మార్గమని ఆమె చెప్పే మాటలు కేవలం మాటలు మాత్రమే కాదని, తాను నిజంగా ఆచరిస్తుందని అర్థమవుతుంది. జీవితం గురించి తాను ఎలాంటి ప్రణాళికలు వేసుకోనని, ఎలా వస్తే అలా జీవితాన్ని స్వీకరిస్తానని చెప్పడం కూడా ఈ విషయాన్ని ధృవీకరిస్తుంది. కానీ తనగురించి అవాస్తవాలు రాసినప్పుడు ఎలాంటి జంకూగొంకూ లేకుండా మీడియాను సైతం విమర్శిస్తుంది.
అందమైన మనసు...
ఐశ్వర్య మనసెంత అందమైనదో తెలియాలంటే.. ఆమె సౌందర్యం మాయనుంచి బయటపడి ఆమె చెప్పే మాటలు వినాలి, ఆ మాటల్లోని మనసును అర్థం చేసుకోవాలి. చాలాకాలం కిందటే ఐశ్వర్యారాయ్ ఫౌండేషన్ స్థాపించి, దాని ద్వారా సమాజసేవ చేస్తున్న విషయం చాలామందికి తెలీదు. అలాగే పెటా, నేత్రదానం, పోలియో నిర్మూలన తదితర సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటుంది. 1994 లో మిస్ వరల్డ్‌గా ఎంపికయ్యాక... మీరు ఎవరిని కలవాలనుకుంటున్నారని అడిగితే... మదర్ థెరిస్సా అని చెప్పింది. సెలబ్రిటీలు అలాగే చెప్తారని అనుకోవచ్చు. కానీ ఇటీవలి కాలంలో ఇచ్చిన ఇంటర్వ్యూలలో మీకు ఇన్‌స్పిరేషన్ ఎవరని అడిగితే... తన పనిమనిషని చెప్పింది. కొడుకు హీమోఫిలియాతో బాధపడుతున్నా చెదరని ఆమె ఆత్మవిశ్వాసమే తనకు ఇన్‌స్పిరేషన్ అని చెప్పడం ఐశ్వర్య ఎంత డౌన్ టూ ఎర్త్‌గా ఉంటుందో వెల్లడిస్తుంది. డబ్బుతో మనం సంతోషాన్ని కొనలేం, కానీ ఆ డబ్బుతో ఇతరులకు సహాయం చేయడం ద్వారా మనం సంతోషంగా ఉండవచ్చు అని చెప్పడం ఆమె అందమైన మనసుకు ఒక ఉదాహరణ మాత్రమే. షి ఈజ్ యాన్ ఇన్‌క్రెడిబుల్ ఉమన్!
- విశేష్, సైకాలజిస్ట్