ఎన్టీఆర్‌కి డబుల్ ధమాకా | Adhurs Movie Behind Story | Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్‌కి డబుల్ ధమాకా

Published Sun, Sep 27 2015 1:01 AM | Last Updated on Sun, Sep 3 2017 10:01 AM

ఎన్టీఆర్‌కి డబుల్ ధమాకా

ఎన్టీఆర్‌కి డబుల్ ధమాకా

సినిమా వెనుక స్టోరీ - 17
కొన్నిసార్లు వెతకబోయిన తీగ కాలికి తగులుతుంది. కొన్నిసార్లు వెతికి వెతికి దొరకబుచ్చుకున్న తీగ మెడకు చుట్టుకుంటుంది. కానీ అది బంగారు తీగని తెలిశాక మాత్రం చాలా సంతోషం వేస్తుంది. ‘అదుర్స్’ వెనుక ఇంత కథ ఉంది.
   
ఎన్టీఆర్‌కి ముగ్గురన్నలు. బ్లడ్ రిలేషన్ కాదు కానీ, అంతకన్నా ఎక్కువే. మొదటి అన్న... కొడాలి నాని. ఎన్టీఆర్‌కి మొదటి నుంచీ అండా దండా. ఎన్టీఆర్ స్టార్ అవుతాడని మొదటి నుంచీ బలంగా నమ్మిన వ్యక్తి. పొలిటికల్ బ్యాగ్రౌండ్ ఉన్నవాడు. కానీ సినిమాలంటే చాలా ఇంట్రస్ట్. కృష్ణాజిల్లాలో సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేశాడు. ఎన్టీఆర్‌తోనే ‘సారబ’ సినిమా ప్రొడ్యూస్ చేశాడు. రెండో అన్న... వల్లభనేని వంశీమోహన్. పెద్ద ఎన్టీఆర్‌కి, ఈ చిన్న ఎన్టీఆర్‌కి వీరాభిమాని. మూడో అన్న.. వీవీ వినాయక్. ‘ఆది’తో ఎన్టీఆర్‌ని స్టార్‌ని చేసినవాడు. ఎన్టీఆర్ మనసుకు చాలా దగ్గర మనిషి.
 
ఈ ముగ్గురన్నలతో ఎన్టీఆర్ సినిమా చేస్తున్నాడు. అది ఎలా ఉండాలంటే? కొండలను పిండి చేయకూడదు, కానీ బంగారుకొండలా ఉండాలి. టాటా సుమోలు, బాంబ్ బ్లాస్ట్‌లు, రక్తపాతాలు... ఇవన్నీ కనబడకూడదు. పొట్ట పగిలేలా పడీపడీ నవ్వాలి. ప్రయోగంలా ఉండాలి, కానీ కమర్షియల్‌గా వర్కవుట్ కావాలి. ఎన్టీఆర్‌ని మాస్, యాక్షన్ చట్రం నుంచి బయటకు తీసుకురావాలి. అలాంటి కథ కోసమే వెతుకులాట.
   
నెల... రెండు నెలలు... మూడు నెలలు... నాలుగు నెలలు... ఇలా నెలలు గడచిపోతున్నాయి. ఎన్టీఆర్ - వినాయక్ కాంబినేషన్లో వచ్చిన ఆది (2002), సాంబ (2004)లను మించే కథ అనుకుంటే ఏదీ ఆనడం లేదు. ‘దుర్గయ్య’ అని ఓ కథ అనుకున్నారు. కానీ నో యూజ్. డెరైక్టర్ దశరథ్ వినాయక్‌కి క్లోజ్. ఇద్దరూ రెగ్యులర్‌గా కలుస్తుం టారు. ఆ రోజు దశరథ్ సరదాగా ఓ కథ చెప్పాడు. పోలీసు కథ. వినాయక్‌కి విపరీతంగా నచ్చేసింది. ‘‘ఎన్టీఆర్‌కి బాగుంటుంది. కథ ఇచ్చేస్తావా?’’... అడిగాడు వినాయక్. ఓకే అన్నాడు దశరథ్. ఇద్దరూ కూర్చుని ఓ వెర్షన్ రెడీ చేశారు. ఫైనల్లీ నాట్ శాటిస్‌ఫైడ్. ‘మస్కా’ రైటర్ సూర్య ఓ లైన్ తీసుకొచ్చాడు. హీరో ఓ కాలేజ్ స్టూడెంట్. ఫస్ట్ హాఫ్ అదిరింది. సెకండాఫ్ సరిగ్గా లేదు. ఇదీ అంతే.
   
వినాయక్ కథలు వింటూనే ఉన్నాడు. బుర్ర వాచిపోతోంది. అవతల ఎన్టీఆర్ డేట్స్ దగ్గర పడుతున్నాయి. టెన్షన్ టెన్షన్. అలాగని ఏది పడితే అది చేసెయ్యకూడదు. ఆ రోజు రైటర్ కోన వెంకట్ కలిశాడు. నిలబెట్టి వంద కథలు చెప్పగలడు. సరదాగా ఓ డ్యుయల్ రోల్ కాన్సెప్ట్ చెప్పాడు. ఒకడు క్లాసు, ఇంకొకడు మాసు. కవలలుగా పుట్టి విడివిడిగా పెరుగుతారు. ఒకడు పిరికి. మరొకడు ధైర్యస్తుడు. వీళ్ల పాలిట ఒక కామెడీ డాన్. ఇద్దరూ కలిసి అతడి భరతం పట్టించడం కథ. వినాయక్ వెంటనే కనెక్టయిపోయాడు.
 
‘‘ఇందులో  పిరికివాడు పూజారైతే బావుంటుందేమో ఆలోచించండి’’...  వినాయక్ సజెషన్. కోన రెచ్చిపోయాడు. సింహాచలంలో తనకు తెలిసిన పూజారి గారబ్బాయి గుర్తొచ్చాడు. అతని ఇన్‌స్పిరేషన్‌తో ‘చారి’ క్యారెక్టర్ రెడీ చేశాడు. వినాయక్ ఫుల్ హ్యాపీ. రెండు క్యారెక్టర్లూ ఎన్టీఆర్‌కి నచ్చేశాయి. ఒకటి నరసింహ... ఫుల్ సీరియస్. రెండోది బృందావనం నరసింహాచార్యులు ఉరఫ్ చారి... ఫుల్ ఫన్. చారి క్యారెక్టర్‌ను కోన ఓ శ్లాంగ్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటే, ఎన్టీఆర్ పడీపడీ నవ్వాడు. కానీ వినాయక్‌లో ఎక్కడో చిన్న టెన్షన్.
 
ఎన్టీఆర్ లాంటి మాస్ హీరోని చారి పాత్రలో ఫ్యాన్స్ డెజైస్ట్ చేసుకోగలరా? ఎన్టీఆర్‌తో చెప్పి, ఫొటో సెషన్ పెట్టాడు. చారి గెటప్ కోసం చాలా హోమ్‌వర్క్ చేశారు. ఫైనల్‌గా గెటప్ రెడీ. చారిగా ఎన్టీఆర్ భలే ఉన్నాడు. ఇప్పుడు స్క్రిప్ట్ ఫైనల్ వెర్షన్ రెడీ చేస్తే షూటింగ్‌కి వెళ్లిపోవచ్చు. కోన ఆ పని మీదే ఉన్నాడు. ఫస్ట్ వెర్షన్... సెకండ్ వెర్షన్... థర్డ్ వెర్షన్. కానీ, సెకండాఫ్ కాంక్రీట్‌గా లేదు. అయినా పర్లేదు. రన్నింగ్‌లో చేసేసుకోవచ్చనే ధీమా.
 
షూటింగ్‌కి ఏర్పాట్లు మొదలయ్యాయి. ఇద్దరు హీరోయిన్లు. నయనతార ఫస్టే ఫిక్స్. వినాయక్‌తో ఆల్రెడీ రెండు సినిమాలు చేసింది... లక్ష్మీ, యోగి. ఇంకో హీరోయిన్‌గా ‘పరుగు’లో చేసిన షీలా ఓకే. విలన్‌గా రెగ్యులర్ ఫేస్ ఉండకూడదు. డాన్ పాత్రే అయినా అమాయకంగా కనబడాలి. దొరికాడు. మహేశ్ మంజ్రేకర్. బాలీవుడ్ డెరైక్టర్ టర్‌‌న్డ ఆర్టిస్ట్. కాస్టింగ్ ఓకే. క్రూ ఓకే. ప్రొడక్షన్ అంతా ప్రొడ్యూసర్ నల్లమలుపు బుజ్జికి అప్పగించారు.
   
2008 ఏప్రిల్ 23. హైదరాబాద్ - ఫిల్మ్‌నగర్ కల్చరల్ క్లబ్‌లో ఓపెనింగ్. ఫస్ట్ డే షూటింగ్. వినాయక్ టెన్షన్‌గా ఉన్నాడు. చారి గెటప్‌లో ఎన్టీఆర్ రెడీగా ఉన్నాడు. ‘చక్కెర తక్కువ’ అంటూ ఓ సీన్ తీయాలి. రెడీ.. స్టార్ట్... కెమెరా... ఆ సీన్‌లో ఎన్టీఆర్ యాక్టింగ్ చూసి యూనిట్ అంతా పడీపడీ నవ్వారు. దాంతో వినాయక్‌కి ఫుల్ కాన్ఫిడెన్స్. ఇక చారి గురించి ఆలోచించాల్సిన పనే లేదు. చారి ఎలా మాట్లాడాలి? ఎలా బిహేవ్ చేయాలి? కోన జస్ట్ ఇన్‌పుట్స్ ఇచ్చాడంతే. ఎన్టీఆర్ అల్లుకుపోయాడు. చారిగా ఎన్టీఆర్ పెర్‌ఫార్మెన్స్ చూసి వినాయక్ మురిసిపోతున్నాడు. తాను కోరుకుంది ఇదే.
   
టైటిల్ ఏం పెట్టాలి?
లవకుశ... దసరా... డబుల్ ధమాకా... ఇంకా చాలా చాలా అనుకున్నారు. చివరకు ‘అదుర్స్’ అని పెట్టారు. హ్యాపీగా ఫస్ట్ హాఫ్ షూటింగ్ అయిపోయింది. కానీ సెకండాఫ్ స్క్రిప్ట్ విషయంలోనే క్లారిటీ రాలేదు. టోటల్ సీరియస్ మూడ్‌లో వెళ్తోంది సెకండాఫ్. వినాయక్ ఫుల్ ఫన్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాడు. గోపీమోహన్ హెల్ప్‌తో కోన ఇంకో వెర్షన్ రెడీ చేయడం మొదలుపెట్టాడు.  ఈలోగా 2009 ఎలక్షన్ల హడావుడి. టఫ్ ఫైట్. టీడీపీ తరఫున ఎన్టీఆర్ ప్రచారం చేయాల్సిన పరిస్థితి. దాంతో ‘అదుర్స్’కి లాంగ్ బ్రేక్. ఎలక్షన్స్ అయిపోగానే షెడ్యూల్ వేసుకోమని చెప్పేశాడు ఎన్టీఆర్. ఆ పనిలోనే ఉంది యూనిట్. కానీ కాలం వేరే షెడ్యూల్ ప్లాన్ చేస్తోంది
   
2009 మార్చి 27. అర్ధరాత్రి
టీవీ చానల్స్‌లో ఒక్కసారిగా బ్రేకింగ్ న్యూస్. ప్రచారం పూర్తి చేసుకుని హైదరాబాద్ తిరిగొస్తున్న ఎన్టీఆర్ కారుకు ఘోరమైన యాక్సిడెంట్. ఎన్టీఆర్ జస్ట్ మిస్. హాస్పిటల్‌లో ఎమర్జెన్సీ అడ్మిట్ చేశారు. ‘5 పక్కటెముకలు విరిగిపోయాయి. 6 నెలలు విశ్రాంతి తీస్కోవాలి’... డాక్టర్ల వార్నింగ్. అలాగే బెడ్‌మీద పడి ఉన్నాడు ఎన్టీఆర్. కదల్లేకపోతున్నాడు. కూర్చోలేకపోతున్నాడు. ఎన్నాళ్లిలా? భయం వేసింది.
 
ఇంటికి తీసుకెళ్లారు. బెడ్‌మీద నుంచి కదల్లేకపోతున్నాడు. లేవలేని స్థితి. ఈ బాధకు తోడు... గాసిప్స్ బాధ. ఎన్టీఆర్ పని అవుట్. ఒకవేళ లేచి నడిచినా డ్యాన్స్ చేయలేడు. ఒకవేళ డ్యాన్స్ చేసినా మునుపటి స్పీడ్ ఉండదు... ఈ కామెంట్స్ అన్నీ ఎన్టీఆర్ చెవిన పడుతున్నాయి. కసి... పట్టుదల... తెగువ. తను మళ్లీ లేవాలి. మునుపటిలా డ్యాన్సులు చేయాలి. తనను కామెంట్ చేసినవాళ్ల నోళ్లు మూయించాలి. డాక్టర్లిచ్చే మెడిసిన్ కన్నా మనోబలమే గొప్ప మందు. ఎన్టీఆర్‌కి ఇప్పుడు అదే పనిచేస్తోంది.
 
ఇప్పుడు ఎన్టీఆర్ లేస్తున్నాడు. నడుస్తున్నాడు.  వినాయక్‌కి ఫోన్ చేశాడు. ‘‘వినయన్నా... షూటింగ్ పెట్టుకోండి. ముందు క్లైమాక్స్ సాంగ్ తీసేద్దాం’’ అని చెప్పాడు. వినాయక్ షాక్. ‘‘ఏంటి తారక్ నువ్వు మాట్లాడేది? ఇంకో 2 నెలలు రెస్ట్ తీసుకో. ఇప్పుడు సినిమా అర్జెంట్‌గా పూర్తిచేయాల్సిన అవసరం లేదు’’ అని సర్దిచెప్పాడు. ఎన్టీఆర్ మొండివాడు. ఎంతకూ వినడే!
   
దాదాపు 6 నెలలు షూటింగ్ లేదు. ‘అదుర్స్’ ఉంటుందా లేదా అని యూనిట్‌లోనే కొంతమందికి డౌట్. కానీ వినాయక్, కోన మాత్రం ఈలోగా సెకండాఫ్‌ను టైట్‌గా సెట్ చేశారు. ఇప్పుడు క్లైమాక్స్ కూడా సూపర్‌గా రెడీ. పాట కోసం ఆర్‌ఎఫ్‌సీలో సెట్ వేశారు. గాయాలు పచ్చిగానే ఉన్నా, రెడీ అయ్యి వచ్చేశాడు ఎన్టీఆర్.
 
షీలాతో ‘‘పిల్లా నావల్ల కాదు...’’ అంటూ డ్యూయెట్. కొరియోగ్రాఫర్ ప్రేమ్క్ష్రిత్ భయం భయంగానే స్టెప్ వేసి చూపించాడు. జస్ట్ అలా చూసి సెట్‌లోకి వెళ్లాడు ఎన్టీఆర్. షాట్ రెడీ. ఎలా చేశాడో కానీ మెరుపుతీగలా కదిలాడు ఎన్టీఆర్. సింగిల్ టేక్‌లో లెంగ్తీ స్టెప్ ఓకే. ఆగకుండానే స్టెప్పులేస్తున్నాడు. పక్కటెముకల్లో విపరీతమైన నొప్పులు. భరించలేకపోతున్నాడు. కానీ భరించాలి. డాక్టర్లనడిగి ఏవో మాత్రలు వేసుకున్నాడు. వినాయక్ సెట్ లోపలక్కూడా రాలేదు. బయటే టెన్షన్ పడిపోతూ ఉన్నాడు. షూటింగ్ ఆపేద్దామని గొడవ. ఎన్టీఆర్ సర్దిచెప్పాల్సి వచ్చింది.

అడ్డంకులు... అవరోధాలు... ప్రసవ వేదనలు... బోలెడన్ని మానసిక సంఘర్షణలు... ఇవన్నీ దాటుకుని ‘అదుర్స్’ 2010, జనవరి 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా సూపర్ హిట్... బంపర్ హిట్... బ్లాక్ బస్టర్ అయ్యిందా అనే విషయం పక్కన పెడితే ఎన్టీఆర్ మాత్రం ఇరగదీసేశాడు. చారి భాషలో చెప్పాలంటే... సాంతం అదరగొట్టేశాడు. ఇక భట్టు - చారి ఎపిసోడ్ అయితే పగలబడి నవ్వాల్సిందే. భట్టుగా బ్రహ్మానందం, చారిగా ఎన్టీఆర్ ఒకరికొకరు పోటీపడ్డారు. ఎన్టీఆర్‌లోని యాక్టర్‌ని న్యూ డెమైన్షన్‌లో ఆవిష్కరించిందీ చారి పాత్ర. ఇక ఏ దారిలో వెళ్లినా విజయం సాధించొచ్చనే భరోసా వచ్చింది ఎన్టీఆర్‌కి. అటు విజయం... ఇటు భరోసా... ఎన్టీఆర్ డబుల్ ధమాకా!
 
వెరీ ఇంట్రస్టింగ్...
* ఎన్టీఆర్‌కు హీరోగా 16వ సినిమా. వినాయక్‌కు దర్శకునిగా 10వ చిత్రం. వీరిద్దరి కాంబినేషన్‌లో ఇది మూడోది. ఇంతకుముందు ‘ఆది’ (2002), ‘సాంబ’ (2004) చేశారు.

* వినాయక్‌కి కొన్ని సెంటిమెంట్స్ ఉన్నాయి. తన కొత్త సినిమా షూటింగ్ కచ్చితంగా ఫైట్‌తోనే మొదలుపెడతాడు. అలాగే ఆయన అన్ని సినిమాల్లోనూ ఎక్కడో ఓ చోట రెడ్ క్లాత్ చుట్టిన బ్లాక్ కలర్ విగ్రహం కనిపిస్తుంది. కలకత్తాలోని కాళీమాత టెంపుల్‌లో ఒక్క సీన్ అయినా తీయడం వినాయక్‌కి సెంటిమెంట్.

* ‘వేరీజ్ దట్’ పాటను ఎన్టీఆర్ స్వయంగా పాడారు.

* ‘అదుర్స్’కి సీక్వెల్ చేసే ఆశ, ఆలోచన వినాయక్‌కి ఉన్నాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement