వెంటాడుతున్నారా?! | Air Crash Memorial Site to Tourists | Sakshi
Sakshi News home page

వెంటాడుతున్నారా?!

Published Sat, Mar 12 2016 11:51 PM | Last Updated on Sun, Sep 3 2017 7:35 PM

వెంటాడుతున్నారా?!

వెంటాడుతున్నారా?!

ఆ వార్త... ఆస్ట్రేలియాను ఒక కుదుపు కుదిపేసింది. ఎక్కడ చూసినా జనాలు ఆ వార్త గురించే చర్చించుకుంటున్నారు.

మిస్టరీ
ఆ వార్త... ఆస్ట్రేలియాను ఒక కుదుపు కుదిపేసింది. ఎక్కడ చూసినా జనాలు ఆ వార్త గురించే చర్చించుకుంటున్నారు. 13 ఆగస్ట్, 1940. ఆస్ట్రేలియా రాజధాని కాన్‌బెర్రా  శివార్లలో  ఉదయం పది గంటల సమయంలో ఒక ఎయిర్‌క్రాఫ్ట్ ప్రమాదానికి గురైన దుర్ఘటనలో పదిమంది చనిపోయారు. వీరిలో ముగ్గురు క్యాబినెట్ మంత్రులు, ఆస్ట్రేలియా ఆర్మీ చీఫ్ కూడా ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రమాదకారణం మిస్టరీగానే మిగిలిపోయింది. ‘వాతావరణం అనుకూలంగా  ఉన్నప్పటికీ  ఈ ప్రమాదం ఎందుకు జరిగింది అనేది అంతుపట్టకుండా ఉంది’ అని రాసింది ‘మెల్‌బోర్న్ హెరాల్డ్’ పత్రిక.
 
సాంకేతిక సమస్య తలెత్తడం వల్ల ఏర్పడిన ప్రమాదమా? విద్రోహచర్య వల్ల జరిగిందా? అనేది  ఒక మిస్టరీ అయితే, ప్రమాదం జరిగిన ప్రాంతంలో చిత్ర విచిత్రమైన సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయనేది మరో మిస్టరీగా మారింది. కాన్‌బెర్రా శివారులో  ‘ఎయిర్ క్రాష్ మెమోరియల్ సైట్’ నిర్మాణం జరిగింది. ఈ స్మారక కేంద్రాన్ని చూడడానికి దేశం నలుమూలల నుంచి పర్యాటకులు వస్తుంటారు. అలా వచ్చే పర్యాటకులు, మెమోరియల్ సైట్ సమీపంలో  ప్రయాణించే వారిలో కొద్దిమందికి వింత వింత అనుభవాలు ఎదురయ్యాయి.
 
స్మారక కేంద్రం ఉన్న ప్రాంతం నుంచి ప్రయాణించిన ఒక ప్రయాణికుడు తన అనుభవాన్ని ఇలా రాశాడు... ‘ఎయిర్‌క్రాష్ మెమోరియల్ సమీపిస్తుండగా ఏ కారణం లేకుండానే కారు అదుపు తప్పింది. ఇంజన్ నుంచి వింత శబ్దం వచ్చింది. కారు ఒక పక్కకు ఒరిగిపోతున్నట్లుగా కూడా అనిపించింది. భయంతో మా డ్రైవరుకు ముచ్చెమటలు పోశాయి’ ఇలాంటి విషయాలు ఎయిర్‌క్రాష్ మెమోరియల్ గురించి  చాలా వినిపిస్తాయి.
 
వాతావరణంలో ఊహించని మార్పులు వస్తుంటాయని, వ్యక్తుల మానసిక ప్రవర్తనలో అప్పటికప్పుడు హఠాత్తుగా మార్పులు వస్తాయని, ఎవరో అరుస్తున్న శబ్దాలు గట్టిగా వినిపిస్తాయని...ఇలా ఎన్నో రకాల కథనాలు  ఈ ‘ఎయిర్ క్రాష్ మెమోరియల్ సైట్’ చుట్టూ తిరుగుతుంటాయి. కొందరు కెమెరాలు, డిజిటల్ వాయిస్ రికార్డర్లతో వెళ్లి  పరిశోధనలు కూడా  చేశారు. దుర్ఘటనలు ఏవీ జరగనప్పటికీ... విచిత్రమైన కొన్ని శబ్దాలు, కళ్లు తెరచి మూసే లోపే మాయమయ్యే  ఆకారాలు వారికి కనిపించాయట.
 
‘ఎయిర్‌క్రాష్ మెమోరియల్ సైట్’ చుట్టూ జరుగుతున్న ప్రచారాన్ని ఒకానొక దశలో ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. కొందరు కావాలనే లేనిపోని ప్రచారం చేస్తున్నారని,  ఈ ప్రచార ప్రభావంతో మానసిక భ్రమకులోనై ఏవేవో ఊహించుకొని భయపడుతున్నారని, దగ్గర్లో ఉన్న అడవిలో జంతువుల శబ్దాలను విని గందరగోళానికి గురువుతున్నారు తప్ప భయపడాల్సిన అవసరం లేదని ప్రభుత్వ వర్గాలు ఎప్పటికప్పుడు చెబుతూనే  ఉన్నాయి.
 
అయినప్పటికీ- ‘నేను హేతువాదిని. నాకు ఎలాంటి మూఢనమ్మకాలు లేవు. నేను అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు. ఆరోజు మెమోరియల్ సైట్ దగ్గర చిత్రమైన అనుభవాలు ఎదుర్కొన్నాను. ఎవరో అరుస్తూ పరుగెడుతున్నట్లు అనిపించింది ఒకసారి. మరోసారి... పెద్ద ఎత్తున నవ్వులు వినిపించాయి. ఉన్నట్టుండీ విపరీతమైన తలనొప్పి. కొద్ది నిమిషాలు శ్వాస ఆడనట్లు అనిపించింది’
 
‘చాలా దగ్గర నుంచి విమాన శబ్దం వింటున్నట్లుగా అనిపిస్తుంది. తీరా ఆకాశంకేసి చూస్తే ఏమీ కనిపించదు...’ ‘కారులో ప్రయాణిస్తున్నప్పుడు...ఉన్నట్టుండి... కారుకు ఎవరో అడ్డుగా వచ్చినట్లు అనిపిస్తుంది.  బ్రేక్ వేస్తే...ఎవరూ కనిపించరు!’.....ఇలాంటి విషయాలు ‘ఎయిర్‌క్రాష్ మెమోరియల్ సైట్’ గురించి ఎన్నో వినిపిస్తుంటాయి. అందుకే ఈ మెమోరియల్ సైట్‌ను ‘మిస్టరీ సైట్’ అని కూడా అంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement