భూమి పచ్చగా...
ఈ నెల 22న ఇంటర్నేషనల్ మదర్ ఎర్త్ డే
మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా ఆధారం మాత్రం నేలమీదనే. ఈ వాక్యంలో గొప్ప తాత్వికత ఉంది. జీవితసత్యమూ ఉంది. మనిషి జీవించడానికి భూమి మీద ఎంతగా ఆధారపడ్డాడో తెలియచేసే శాస్త్రీయ ఆలోచన కూడా ఉంది. భూమి మీద నివసిస్తూ, భూమి లోపల ఉన్న సహజవనరులను వాడుకుంటూ అంతరిక్షంలోకి ఎగిరే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అయితే ఈ వాడుక మితిమీరిపోతోందని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు.
ఈ వాడకం ఇదే రకంగా కొనసాగితే... భవిష్యత్తు తరాలకు చిక్కులు తప్పవనీ చెబుతున్నారు. వనరులను యధేచ్ఛగా వాడేస్తున్న పది దేశాల వివరాలను గణాంకాలతో వివరించారు.
పెరుగుతున్న గిరాకీ...
ఇంధన వనరుల గిరాకీకి, వాటి లభ్యతకు వ్యత్యాసం నానాటికీ పెరుగుతోంది. ఈ వినియోగంలో అమెరికాదే పైచేయి. వినియోగం పెరగడం, నిల్వలు తరగడం ఒకెత్తయితే... భూమండలం కాలుష్యకాసారంగా మారడంలోనూ ఈ టాప్‌టెన్ దేశాల వాటా ఎక్కువగా ఉంటోంది. ఎడాపెడా వాడేస్తున్న ఇంధన వనరుల వల్ల వాతావరణంలోకి చేరుతున్న కర్బన ఉద్గారాల సంగతి సరే, ఘనంగా చెప్పుకుంటున్న పారిశ్రామిక ‘పురోగతి’ ఫలితంగా పచ్చని పంటపొలాల్లో నేలలోకి ఇంకిపోతున్న ప్రమాదకర రసాయనాలు తిండిని, తాగేనీటిని విషతుల్యం చేస్తున్నాయి.
సౌరశక్తి, పవనశక్తి వంటి పునర్వినియోగ ఇంధనాల వల్ల కాలుష్యాన్ని కొంతవరకు నియంత్రించగల అవకాశాలు ఉన్నా, ప్రపంచంలో వాటి వినియోగం నామమాత్రమే. పారిశ్రామిక పురోగతి పరుగులు తీస్తున్న దేశాలే ఇంధన వనరులను విపరీతంగా వినియోగిస్తున్నాయి. వాటి ప్రభావం మిగిలిన దేశాలపైనా పడుతోంది. ముడిచమురు, బొగ్గు వంటి సంప్రదాయ ఇంధన వినియోగం పెరుగుతున్నందునే వాతావరణ కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంటోంది.
సహజ వనరుల వినియోగంలో గణనీయమైన పెరుగుదలకు జనాభా పెరుగుదల కూడా ఒక కారణమే. కానీ అగ్రరాజ్యాల అంతులేని ఆధిపత్య దాహమే భూమండలాన్ని కాలుష్యానికి కేరాఫ్ అడ్రస్‌గా మార్చేస్తోంది. భూమి ఉపరితలంపైనున్న వనరులనే కాదు, అట్టడుగున దాగి ఉన్న భూగర్భ జల, ఖనిజ వనరులనూ పలు దేశాలు విచక్షణారహితంగా వాడేసుకుంటున్నాయి. ఈ వాడుక ఇలాగే కొనసాగితే వందేళ్లలో ముడి చమురు నిల్వలు అంతరించిపోవచ్చని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
పవన విద్యుత్తు, సౌరశక్తి వంటి ప్రత్యామ్నాయ ఇంధన వనరులను వినియోగంలోకి తెచ్చుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నారు. తాజా పరిశోధనల ప్రకారం ఇతర గ్రహాలలో మనిషి జీవించే పరిస్థితులు ఏర్పడే వరకు మనిషికి భూమి ఒక్కటే ఆధారం. అప్పటి వరకైనా ఆ భూమాతను కాపాడుకోవాల్సిందే. అంటే ఈ తరానికి ఉన్న ఏకైక మార్గం భూమిని రక్షించుకోవడమే. ప్రతి ఒక్కరం ఓ మొక్కను బతికిద్దాం... భూమాత వేడిని తగ్గిద్దాం.