సర్జికల్స్ నుంచి సబ్బుల వరకు
మన దిగ్గజాలు
దేశంలో ఆధునిక వైద్యం అప్పుడప్పుడే అందుబాటులోకి వస్తున్న కాలంలో సర్జికల్ పరికరాలతో వ్యాపారం మొదలుపెట్టాడాయన. మన్నిక గల తాళాలను, ఉక్కు బీరువాలను జనాలకు అందుబాటులోకి తెచ్చాడాయన. ‘మేక్ ఇన్ ఇండియా’ నినాదం ఇప్పటిది కావచ్చు గాని, స్వాతంత్య్రానికి మునుపే తన ఉత్పత్తులపై ‘మేడ్ ఇన్ ఇండియా’ అని సగర్వంగా ముద్రించిన దార్శనికుడాయన. ఉక్కు బీరువాలకు తన ఇంటిపేరునే పర్యాయపదంగా చేసుకున్న ఆ పారిశ్రామికవేత్త అర్దేశిర్ గోద్రెజ్. ఆయన స్థాపించిన గోద్రెజ్ సంస్థ పలు రంగాల్లోకి విస్తరించి, దేశానికే గర్వకారణమైన పారిశ్రామిక సంస్థల్లో ఒకటిగా ఎదిగింది.
మూలధనం మూడువేలే...
అర్దేశిర్ గోద్రెజ్ అసలు పేరు అర్దేశిర్ బుర్జోర్జీ సోరాబ్జీ గోదెరాజీ. సంపన్న పార్శీ-జొరాస్ట్రియన్ కుటుంబంలో 1868లో పుట్టారు. తండ్రి బుర్జోర్జీ, తాత సొరాబ్జీ అప్పట్లో బాంబేలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు. బుర్జోర్జీ 1871లో ఇంగ్లిష్ వాళ్లు కూడా తేలికగా పలకడానికి వీలుగా తన ఇంటిపేరును గోద్రెజ్‌గా మార్చుకున్నారు. అప్పటి నుంచి అదే ఇంటిపేరు స్థిరపడింది. అర్దేశిర్‌కు 1890లో బాచూబాయితో వివాహం జరిగింది. పెళ్లయిన ఏడాది తిరగకుండానే ఒక దురదృష్టకరమైన సంఘటనలో బాచూబాయి మరణించారు.
ఆ తర్వాత అర్దేశిర్ మళ్లీ పెళ్లి చేసుకోలేదు. అలాగని కుంగిపోలేదు కూడా. విషాదాన్ని మరచిపోవడానికి వ్యాపారంలో మరింతగా నిమగ్నం కావాలనుకున్నారు. తాత తండ్రులకు భిన్నంగా ఏదైనా కొత్తగా చేయాలనుకున్నారు. ఆలోచన వచ్చిందే తడవుగా 1901లో మూడువేల రూపాయల మూలధనంతో కామా ప్రాంతంలో సర్జికల్ పరికరాల వ్యాపారాన్ని ప్రారంభించారు. ‘మేడ్ ఇన్ ఇండియా’ ముద్రతో వాటి విక్రయాలను విజయవంతంగా సాగించారు.
దేశంలో ఇళ్ల దోపిడీలు పెరుగుతున్నట్లు ఒకరోజు వార్తాకథనం చదివి, కట్టుదిట్టమైన తాళాలు ఉంటే ఇలాంటివి చాలా వరకు అరికట్టవచ్చు కదా అని భావించారు. వెంటనే తాళాల తయారీ, కొన్నాళ్లకే ఉక్కు బీరువాల తయారీ ప్రారంభించారు. గోద్రెజ్ తాళాలు, గోద్రెజ్ బీరువాలు నాణ్యతలో తిరుగులేనివిగా ప్రజల్లో నమ్మకం సంపాదించుకున్నాయి. వ్యాపారం విస్తరించడంతో 1906లో సోదరుడి వరుసయ్యే పిరోజ్‌షాకు భాగస్వామ్యం కల్పించారు. స్ప్రింగ్‌లెస్ తాళం కప్పల తయారీ కోసం 1908లో బ్రిటిష్ పేటెంట్ పొందారు.
సబ్బుల తయారీలో సంచలనం
సబ్బుల తయారీలో అర్దేశిర్ గోద్రెజ్ సంచలనమే సృష్టించారు. వ్యాపార యాజమాన్య హక్కులన్నింటినీ సోదరుడు పిరోజ్‌షాకు 1928లోనే బదలాయించేశారు. అయితే, వస్తువుల ఆవిష్కరణ ప్రయత్నాల్లో, వ్యాపారావకాశాల అన్వేషణలో ఆయన విరామం తీసుకోలేదు. అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా సబ్బుల తయారీలో ఎక్కువగా జంతువుల కొవ్వులనే వాడేవారు. అందువల్ల సంప్రదాయవాదులైన శాకాహారులు సబ్బులను కనీసం తాకేందుకైనా ఇష్టపడేవారు కాదు.
అలాంటి పరిస్థితుల్లో పూర్తిగా శాకాహార నూనెలను ఉపయోగించి సబ్బులను తయారు చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించారు అర్దేశిర్. పలచగా ఉండే శాకాహార నూనెలతో సబ్బుల తయారీ అసాధ్యం అంటూ అందరూ కొట్టి పారేశారు. అందరూ అసాధ్యమన్న దాన్నే ఆయన సుసాధ్యం చేశారు. శాకాహార నూనెలతో విజయవంతంగా సబ్బులను తయారు చేశారు. అదే విషయాన్ని ప్రముఖంగా ప్రచారంలోకి తేవడంతో గోద్రెజ్ సబ్బులు విపరీతంగా జనాదరణ పొందాయి. గోద్రెజ్ సంస్థ వ్యాపార విస్తరణలో తాళాలు, సబ్బులు గణనీయమైన పాత్రనే పోషించాయి. అందుకే గోద్రెజ్ గ్రూప్ ఎన్ని ఇతర రంగాలకు విస్తరించినా, తాళాలు, సబ్బుల ఉత్పత్తిని ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉంది.
స్వావలంబనతోనే స్వాతంత్య్రం
జాతీయోద్యమ కాలంలో బ్రిటిష్ ప్రభుత్వం భారత్‌లో తయారైన ఉత్పత్తులపై ఎడాపెడా పన్నులు వసూలు చేసేది. దీనిని ఖండిస్తూ దాదాభాయ్ నౌరోజీ ఒక పత్రికలో రాసిన వ్యాసాన్ని అర్దేశిర్ చదివారు. ఆ తర్వాత పన్నుల వసూలు అంశంపై క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. ఆర్థిక స్వాతంత్య్రం, స్వావలంబనతోనే స్వాతంత్య్రం సాధించుకోగలమని, కేవలం విదేశీ వస్తువులను బహిష్కరించినంత మాత్రాన సాధించేదీ ఉండదని నిష్కర్షగా స్పష్టం చేశారు.
స్వదేశీ ఉద్యమకారులను నిశితంగా విమర్శిస్తూ ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూను ‘నేషనల్ హెరాల్డ్’ పత్రిక ప్రముఖంగా ప్రచురించింది. పారిశ్రామిక ఆవిష్కరణల కోసమే జీవితంలో ఎక్కువకాలం వెచ్చించిన అర్దేశిర్ గోద్రెజ్ 1936లో అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన తదనంతరం ఆయన స్థాపించిన వ్యాపార సామ్రాజ్యం సువిశాలంగా విస్తరించింది.