![బ్యాడ్ టైం](/styles/webp/s3/article_images/2017/09/5/51485026716_625x300.jpg.webp?itok=PaE25zFV)
బ్యాడ్ టైం
సుమన అలా ఏడవడం చుట్టుపక్కలవారికి కొత్తగా అనిపించింది.
ఎప్పడూ ధైర్యంగా, గంభీరంగా కనిపించే సుమన బేలగా ఏడుస్తోంది.
‘‘నేను ఎంత పాపిష్టిదాన్ని... నా చేతులతోనే చంపాను’’ అంటూ ఏడుస్తోంది.
ఇది విని అక్కడి వాళ్లు షాక్ అయ్యారు.
‘సుమన ఆమె భర్త రాజన్ చిలకాగోరింకల్లా ఉంటారు’ అని చాలామంది అనుకుంటారు.
అలాంటి సుమన భర్తను చంపడమేమిటి?!
‘‘అసలు ఏం జరిగింది?’’ సుమనను ప్రశ్నించాడు ఇన్‌స్పెక్టర్ నరసింహ.
‘‘నా భర్తను పిస్టల్‌తో కాల్చి చంపాను’’ దుఃఖం పొంగి వస్తుండగా చెప్పింది.
కొన్ని క్షణాల విరామం తరువాత ఇలా చెప్పింది...
‘‘ఇంటికి రావడానికి ఆలస్యం అవుతుందని రాత్రి ఫోన్ చేసి చెప్పారు రాజన్. నేను కొద్దిసేపు టీవి చూసి నిద్రపోయాను. రాత్రి పదకొండున్నర సమయంలో... విండోను పగలగొట్టిన శబ్ధం విని దిగ్గున లేచాను. ఆ చీకట్లో ఎవరో కనిపించారు. వెంటనే టేబుల్ సొరుగులో నుంచి పిస్టల్ తీసి కాల్చాను. నా ఉద్దేశం... కేవలం అతడిని భయపెట్టడం మాత్రమే... నా దురదృష్టం కొద్ది బుల్లెట్ తలలో నుంచి దూసుకెళ్లింది. లైట్ వేసి చూస్తే... నా భర్త రక్తం మడుగులో కనిపించారు’’ అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది సుమన.
‘‘అద్దం పగలగొట్టి లోనికి రావలసిన అవసరం ఆయనకు ఏమిటి?’’ అడిగాడు ఇన్‌స్పెక్టర్.
‘‘పిలిచాడేమోగానీ ఆ నిద్రలో నాకు వినబడలేదు. డోర్‌బెల్ నెల నుంచి ఔట్ ఆఫ్ ఆర్డర్‌లో ఉంది. దీంతో తప్పనిసరిపరిస్థితుల్లో కిటికి పగలగొట్టి ఉంటాడు’’ అన్నది సుమన.
ఆమె చెప్పింది పూర్తిగా నమ్మాడు ఇన్‌స్పెక్టర్.
మృతుడి జేబులో సెల్‌ఫోన్ కనిపించడంతో... ఆ ఫోన్‌ను పరిశీలించాడు. ఆతరువాత...
‘‘మీరు కావాలనే ఇతడిని కాల్చారు. మీరే హంతకురాలు’’ అని తేల్చి చెప్పాడు ఇన్‌స్పెక్టర్.
సెల్‌ఫోన్ హంతకురాలిని ఎలా పట్టించింది?
2
‘‘ఈసారి ఎలాగైనా సరే ఆ డ్రగ్ డీలర్‌ను పట్టుకోవాల్సిందే’’ దృఢంగా అన్నాడు ఇన్‌స్పెక్టర్ నరసింహ.
ఆయన చెప్పింది డ్రగ్ డీలర్ రాబర్ట్ గురించి.రాబర్ట్ దొరికినట్లే దొరికి తప్పించుకొని పోతున్నాడు.అలా అని అతడిని నిరాధారంగా అరెస్ట్ చేయడానికి వీలులేదు. ఎందుకంటే అతనికి పెద్ద మనిషిగా నగరంలో పేరుంది.ఆచితూచి వ్యవహరించాలి. సమయం వచ్చినప్పుడు పట్టేసుకోవాలి అనేది పోలీసుల వ్యూహం.ఆ సమయం రానే వచ్చింది.
‘హాట్ కార్నర్’ అనే కెఫేకు రాబర్ట్ వస్తున్నాడనే సమాచారం పోలీసులకు అందింది. ఊరకరారు మహానుభావులు... అన్నట్లు డ్రగ్స్ పని మీద రాబర్ట్ వస్తున్నట్లు పోలీసులు అనుమానించారు.
బయటి నుంచి అద్దాలలోకి చూస్తే... కెఫేలో ఎవరెవరు కూర్చున్నారనేది సులభంగా తెలిసిపోతుంది. పోలీసులు బయట కాపు కాశారు. సూటుబూటు తలకు టోపీతో రాబర్ట్ కెఫేలోకి అడుగుపెట్టాడు.ఒక కుర్చీలో కూర్చున్నాడు. అతడి ముందు కూర్చున్న వ్యక్తి కునుకు తీస్తున్నాడు.ఇద్దరి మధ్యలో ఒక హ్యాంగర్ స్టాండ్ ఉంది.తన టోపీని తీసి ఆ హ్యాంగర్‌కు తగిలించాడు. మూడు టోపీలు అంతకుముందే తగిలించి ఉన్నాయి.
కాఫీ తాగుతూ ఒక పదినిమిషాల సేపు ఫోన్‌లో ఎవరితోనో మాట్లాడాడు రాబర్ట్.
ఆ తరువాత హ్యాంగర్‌కు ఉన్న టోపీని తలకు తగిలించుకొని బయటికి వచ్చాడు.
‘‘ఏదో అనుకొని వచ్చాం. ఏమీలేదు’’ నిట్టూర్చాడు కానిస్టేబుల్ వెంకటస్వామి.
‘‘అదేమీ లేదు... పద వాడిని అరెస్ట్ చేద్దాం. పక్కాగా దొరికిపోయాడు. వాడి బ్యాడ్‌టైమ్ ఇవ్వాళ వచ్చేసింది’’ అని పరుగెత్తి రాబర్ట్‌ను అరెస్ట్ చేశాడు ఇన్‌స్పెక్టర్ నరసింహ.
రాబర్ట్‌ను ఇన్‌స్పెక్టర్ నరసింహ అరెస్ట్ చేయడానికి కారణం ఏమిటి?
1. సుమన నంబర్‌కు రాజన్ మూడుసార్లు ఫోన్ చేసినట్లు... కాల్‌లిస్ట్‌లో ఉంది. అప్పుడు సమయం... పన్నెండు గంటలు. కాల్పులు జరిపింది పదకొండున్నరకు అని చెబుతుంది సుమన. మరి చనిపోయిన వ్యక్తి... పన్నెండు గంటలకు ఎలా కాల్ చేస్తాడు?
2. బయటికి వచ్చేముందు టోపీ తలకు తగిలించుకున్నాడు రాబర్ట్. అది ఆయన టోపీలాగే కనిపించినప్పటికీ...జాగ్రత్తగా గమనిస్తే రంగు, సైజులలో తేడా కనిపిస్తుంది. రాబర్ట్ కెఫేలోకి వచ్చినప్పుడు... హ్యాంగర్‌కు తగిలించిన టోపీలో హెరాయిన్ ఉంది. రాబర్ట్ ముందు కూర్చున్నవాడు హెరాయిన్ కస్టమర్. నిద్రపోయినట్లు నటించాడు.