ఒకటా... రెండా...? ఏడు దశాబ్దాల ప్రయాణం! పదకొండు సిరీస్‌ల ప్రస్థానం! నలభై నాలుగు టెస్టుల పరంపర! గెలిచింది మాత్రం ఐదంటే ఐదే! ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియాకు ఎంతటి గడ్డు కాలం సాగిందో చెప్పేందుకు ఈ గణాంకాలే నిదర్శనం. కాలక్రమంలో వెస్టిండీస్, ఇంగ్లండ్‌లపై వారివారి దేశాల్లోనే సిరీస్‌లు నెగ్గిన భారత్‌కు కంగారూలు మాత్రం ఇంతవరకు కొరుకుడుపడలేదు. ఇందులో తుది ఫలితం సంగతి అటుంచి... ఓ ఐదుసార్లు మాత్రం మన జట్టు విజయాలను ఒడిసిపట్టింది. ఆ పంచ రత్నాలేమిటో చూద్దామా..!
సాక్షి క్రీడా విభాగం
ఎవరెన్ని చెప్పనీ... ఆస్ట్రేలియా ఎంత బలహీనపడనీ... టీమిండియా ఎంత బలంగా ఉండనీ... కంగారూ దేశంలో ‘టెస్టు సిరీస్ నెగ్గడం’ మనకింకా తీరని కలే! స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి పోరాడుతున్నా... అదో అందని ద్రాక్షే! సిరీస్ సంగతి సరే... అసలు తొలి విజయానికే 30 ఏళ్లు పట్టిందంటే ఆసీస్‌తో సమరం ఎంత కఠిన సవాలో తెలుస్తోంది. అంతెందుకు...? ఈ ఆధునిక యుగంలోనూ వారి గడ్డపై టెస్టు నెగ్గి పదేళ్లయిందంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈసారి విరాట్ కోహ్లి సేన కొంత మెరుగైన ఫలితం సాధించే అవకాశం కనిపిస్తోన్న నేపథ్యంలో, గతంలో రెండేసి వరుస సిరీస్‌లలో టీమిండియా అందుకున్న ఆణిముత్యాల్లాంటి ఓ ఐదు విజయాలివి...
పెర్త్‌లో పటాకా... 2008 జనవరి 16–19
అంపైరింగ్ నిర్ణయాలతో వివాదాస్పదమై, అప్పటికే రెండు టెస్టులను కోల్పోయి, మంకీ గేట్ దుమారంతో సంచలనం రేపిన సిరీస్ ఇది. అయితే... ‘ఈ సిరీస్‌లో ఒక్క జట్టే క్రీడా స్ఫూర్తితో ఆడింది’ అన్న ఒకే ఒక్క మాటతో భారత కెప్టెన్ అనిల్ కుంబ్లే ఇచ్చిన పంచ్ ఆస్ట్రేలియన్లు తలొంచుకునేలా చేసింది. అదే సమయంలో కుంబ్లే జట్టులో ఆత్మవిశ్వాసం నింపి సారథిగా విశిష్టతను చాటుకున్నాడు. ఈ క్రమంలో మూడో టెస్టులో ద్రవిడ్ (93), సచిన్ (71) రాణించడంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 330కి ఆలౌటైంది. ఆర్పీ సింగ్ (4/68) మెరుపులతో పాటు ఇషాంత్, ఇర్ఫాన్ పఠాన్, కుంబ్లే రెండేసి వికెట్లు పడగొట్టడంతో ఆసీస్‌ను 212కే కట్టడి చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో లక్ష్మణ్ (79) స్పెషల్ ఇన్నింగ్స్, సెహ్వాగ్ (43), ఇర్ఫాన్ (46) ఆకట్టుకోవడంతో టీమిండియా 294 పరుగులు చేసింది. 412 పరుగుల ఛేదనలో ఆసీస్‌ను ఇర్ఫాన్ (3/54), ఆర్పీ సింగ్ (2/95) దెబ్బ కొట్టారు. దీంతో ఆ జట్టు 340కే ఆలౌటై లక్ష్యానికి 72 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఈ సిరీస్‌లో కొత్త కుర్రాడు ఇషాంత్ శర్మ... ఆసీస్ దిగ్గజ బ్యాట్స్‌మన్ రికీ పాంటింగ్‌ను తీవ్రంగా ఇబ్బంది పెట్టడంతో వార్తల్లో నిలిచాడు.
మెల్‌బోర్న్ మెరుపు
1977 డిసెంబర్ 30– 1978 జనవరి 4
ఆస్ట్రేలియాలో తొలి టెస్టు (1947) ఆడిన 30 ఏళ్లకు... మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా టీమిండియాకు ఓ గెలుపు దక్కింది. వాస్తవానికి ఈ సిరీస్ భారత్‌కు ఓ మరుపురానిదిగా మిగిలిపోయేదే. ‘కెర్రీ ప్యాకర్’ ఉదంతంతో చాపెల్ సోదరులు, డెన్నిస్ లిల్లీ వంటి ఉద్ధండులు దూరమవడంతో కొంత బలహీనపడిన ఆసీస్... ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి రెండు టెస్టులను అతి కష్టం మీద
(16 పరుగులు, 2 వికెట్లు) నెగ్గింది. మూడో దాంట్లో మాత్రం మనదే పైచేయి అయింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్... ఓపెనర్లు సునీల్ గావస్కర్, చేతన్ చౌహాన్ ఖాతా తెరవకుండా ఔటైనా, మొహిందర్ అమర్‌నాథ్ (72), గుండప్ప విశ్వనాథ్ (59) అర్ధశతకాలతో కోలుకుంది. వెంగ్‌సర్కార్ (37), వినూ మన్కడ్ (44), సయ్యద్ కిర్మాణీ (29) తలోచేయి వేయడంతో 256 పరుగులకు ఆలౌటైంది. బీఎస్ చంద్రశేఖర్ (6/52) స్పిన్ మాయ, బిషన్‌సింగ్ బేడి (2/71), కర్సన్ ఘావ్రీ (2/37) దెబ్బకు ఆసీస్ 213 పరుగులకే పరిమితమైంది. రెండో ఇన్నింగ్స్‌లో లిటిల్ మాస్టర్ గావస్కర్ (118) అద్భుత శతకం, విశ్వనాథ్ (54) అర్ధశతకాలకు తోడు అమర్‌నాథ్ (41) రాణించడంతో భారత్ 343 పరుగులు చేసింది. చంద్రశేఖర్ (6/52) మరోసారి ఆరేయగా... బేడి (4/58) మిగతా వారి పని పట్టాడు. దీంతో 386 పరుగుల ఛేదనలో ప్రత్యర్థి 164కే చాప చుట్టేసింది. టీమిండియా 222 పరుగులతో జయభేరి మోగించింది.
సిడ్నీలో సూపర్...: 1978 జనవరి 7–12
మెల్‌బోర్న్ విజయం ఊపును కొనసాగించిన భారత్ వెంటనే జరిగిన సిడ్నీ టెస్టునూ కైవసం చేసుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్... చంద్రశేఖర్ (4/30), బేడి (3/49) ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో 131 పరుగులకే కుప్పకూలింది. విశ్వనాథ్ (79), ఘావ్రీ (64) అర్ధ శతకాలతో పాటు గావస్కర్ (49), చౌహాన్ (42), వెంగ్‌సర్కార్ (48), కిర్మాణీ (42) తోడ్పాటుతో 396/8 వద్ద డిక్లేర్ చేసింది. ఫాలోఆన్‌లో కంగారూలను ఎరాపల్లి ప్రసన్న (4/51) దెబ్బకొట్టాడు. చంద్రశేఖర్, బేడి, ఘావ్రీ తలా రెండేసి వికెట్లు పడగొట్టారు. దీంతో ఆసీస్ 263కే ఆలౌటైంది. భారత్ ఇన్నింగ్స్, 2 పరుగులతో వరుసగా రెండో విజయం సాధించింది. అయితే, ఐదో టెస్టు (ఆడిలైడ్) నాలుగో ఇన్నింగ్స్‌లో 492 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో మన జట్టు తీవ్రంగా పోరాడి 445 వద్ద ఆగిపోయింది. 47 పరుగులతో నెగ్గిన ఆసీస్ సిరీస్‌ను 3–2తో కైవసం చేసుకుంది.
మళ్లీ మొదటి చోటే...: 1981 ఫిబ్రవరి 7–11
ఈ పర్యటనలో తొలి టెస్టు ఓడి, రెండో టెస్టును ‘డ్రా’ చేసుకున్న టీమిండియా మూడో దాంట్లో విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో సిరీస్ 1–1తో సమమైంది. అయినా, చివరి టెస్టులో భారత్ విజయాన్ని ప్రత్యేకంగా చెప్పుకోక తప్పదు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన మన జట్టు గుండప్ప విశ్వనాథ్ (114) వీరోచిత శతకంతో తొలి ఇన్నింగ్స్‌లో 237 పరుగులు చేయగలిగింది. అలెన్ బోర్డర్ (124) శతకం, గ్రెగ్ చాపెల్ (76), వాల్టర్ (78) అర్ధశతకాలతో ఆసీస్ 419 పరుగులు చేసింది. ఓపెనర్లు గావస్కర్ (70), చేతన్ చౌహాన్ (85) ఇచ్చిన శుభారంభాన్ని వెంగ్‌సర్కార్ (41), విశ్వనాథ్ (30), సందీప్ పాటిల్ (36) సద్వినియోగం చేయడంతో రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 324 పరుగులు చేయగలిగింది. 142 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో ఆసీస్‌ను కపిల్ దేవ్ (5/28) కుదేలు చేశాడు. దీంతో ఆ జట్టు 83 పరుగులకే ఆలౌటై 59 పరుగుల తేడాతో ఓడింది.
లక్ష్మణ్ స్పెషల్ ద్రవిడ్ డబుల్...
అడిలైడ్: 2003 డిసెంబర్ 12–16
అటు రికీ పాంటింగ్ (242), ఇటు రాహుల్ ద్రవిడ్ (233) డబుల్ సెంచరీల మోతతో రెండు జట్లు హోరాహోరీగా తలపడిన మ్యాచ్ ఇది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 556 పరుగులకు ఆలౌటైంది. అనిల్ కుంబ్లే (5/154) ఐదు వికెట్లు పడగొట్టాడు. స్కోరు 85/4 ఉన్న దశలో డబుల్ సెంచరీతో ద్రవిడ్, భారీ శతకంతో వీవీఎస్ లక్ష్మణ్ (148) ఐదో వికెట్‌కు 385 పరుగులు జోడించడంతో భారత్ 523 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో అజిత్ అగార్కర్ (6/41) అద్భుత స్పెల్‌తో ప్రధాన బ్యాట్స్‌మెన్‌ను ఔట్ చేయడంతో ఆసీస్ 196కే పరిమితమైంది. 229 పరుగుల ఛేదనలో ద్రవిడ్ (72)కు సెహ్వాగ్ (47), సచిన్ (37), లక్ష్మణ్ (32) సహకారం అందించడంతో భారత్ 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. ఈ సిరీస్‌లో మొదటి టెస్టు ‘డ్రా’ కాగా... భారత్ రెండో దాంట్లో గెలిచి 1–0 ఆధిక్యంలో నిలిచింది. ఇలా జరగడం ఇదే తొలిసారి కావడం విశేషం. అయితే, ఆసీస్ మూడో టెస్టును 9 వికెట్లతో గెల్చుకుని సిరీస్‌ను 1–1తో ‘డ్రా’ చేసింది. 1981 తర్వాత 22 ఏళ్లకు ఆస్ట్రేలియాలో భారత్ టెస్టు గెలవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment