పెంచలదాసు (రచయిత, గాయకుడు): రాజశేఖరరెడ్దిగారంటే నాకు చాలా ఇష్టం. నేను కూడా కడప జిల్లావాడిని కనుక మరింత ఇష్టం ఉండి ఉండొచ్చు. ఆయన మహాభినిష్క్రమణ విధానం చూస్తే ఎవరికైనా కంట నీరు ఆగదు. అటువంటి స్థితి ఎవ్వరికీ రాకూడదు. నాకు గుండెల నిండా దుఃఖం వచ్చింది. ఆయన గురించి చాలామంది కవితలు రాశారు, పాటలు రాసి పాడారు, నాకు మాత్రం ‘యాత్ర’ చిత్రంలో ‘మరుగైనావా రాజన్నా... కనుమరుగైనావా రాజన్నా/మా ఇంటి దేవుడవే మా కంటి వెలుగువే/ఒరిగినావా రాజన్నా ఒరిగినావా రాజన్నా’ పాట రూపంలో ఘనమైన నివాళి ఇచ్చే అదృష్టం కలిగింది. వైయస్సార్ అంటే ఇష్టపడని వారు ఉండరు కదా.
వైయస్సార్ మీద ‘యాత్ర’ సినిమా తీస్తున్న సందర్భంగా ఆ చిత్ర దర్శకులు మహి రాఘవ నన్ను పిలిచి, ఒక పాటకు ఫోక్ స్టయిల్‌లో డ్యాన్స్ చేయాలన్నారు. నేను డ్యాన్సర్‌ని కాదు కనుక మిన్నకుండిపోయాను. యాత్ర సినిమా మొదలైనప్పటి నుంచి నా మనసంతా అటువైపే ఉంది. ఈలోగా ‘అరవింద సమేత’ చిత్రంలో పాత్రలకు మాండలికం నేర్పడానికి శబ్దాలయా స్టూడియోకి వచ్చాను. అక్కడే ఉన్న మహి రాఘవ గారిని పలకరించాను. ‘నన్ను డ్యాన్సుకి పిలిచారు కదా, నేను డ్యాన్సర్‌ని కాదు, అందుకే రాలేదు’ అన్నాను.
వాస్తవానికి ఆయన నన్ను పాట రాయడానికి పిలిచారట. ఆ చిత్రంలో మొత్తం ఐదు పాటలు సిరివెన్నెలగారితో రాయించారు. సినిమా విడుదలకు ఐదు రోజుల ముందు రాఘవగారు ఫోన్ చేసి, ‘వైయస్సార్ ఆఖరి రోజుకు సంబంధించిన పాట మీరు రాస్తే బావుంటుందనుకుంటున్నాం. పెద్దాయనది మీ జిల్లా కదా, మీ జిల్లా మాండలికంలో, యాసలో పాట రాయండి’ అని స్వేచ్ఛనిచ్చారు. సంగీతం గానం కూడా నన్నే చేయమన్నారు. నాలుగు రోజుల్లో సమాధానం చెప్పమని ఫోన్ చేశారు. నాకు మంచి పని పడింది కదా అని ఒక పక్క సంతోషం, ఎలా రాస్తానా అని మరో పక్క భయం రెండూ కలిశాయి. నేను రాసే ఈ పాట పదికాలాల పాటు నిలిచిపోవాలనుకున్నాను.
వైయస్సార్ నిర్యాణం బాధాకరం. ఆయన నిర్యాణం తరవాత ఎంతోమంది ప్రాణాలు వదిలారు. అంతటి మహోన్నత వ్యక్తి గురించి ఎలా రాయాలా... అని నడుస్తున్నా, పడుకున్నా నిరంతరం అదే ఆలోచన. అద్భుతమైన మాటలతో ప్రారంభించాలనుకున్నాను.
అవధూతలు నిర్యాణం చెందినప్పుడు ‘చనిపోయారు’ అని కాకుండా, ‘మరుగైనారు’ అంటారు. వైయస్సార్ కూడా అవధూతలాంటి వారు. మనుషులను ప్రేమించేవారు. మహా నాయకుడు. అందుకే ‘మరుగైనావా రాజన్నా’ అని పాట ప్రారంభించాను. పాటను తన్మయంతో పాడాలి. నాకు నాటకాలలో పద్యాలు, పాటలు పాడిన అనుభవం ఉన్న కారణంగా బాగానే పాడగలిగాను.
మా అన్న చిన్నయదాసు (ఇప్పుడు ఆయన లేరు) గొప్ప జానపద గాయకుడు. మా అన్నయ్యను వైయస్సార్‌గారు ‘ఏం చిన్నయదాసు’ అని ఆప్యాయంగా పిలిచేవారు. అంత గొప్పనాయకుడు మనల్ని అంత గుర్తు పెట్టుకుని పలకరించడం చాలా సంతోషంగా వుండేదని మా అన్న తరచూ చెబుతూ వుండేవారు. మా అన్నయ్య తరం వారు ఆలి, ఆకలి తెలియకుండా తిరిగే జానపద కళాకారులు. ఆయన పాడిన జానపద గీతాల్లో ‘‘ఏమన్నాడు హనుమన్నా? ఏమన్నాడు రామయ్యా? ఏమన్నాడు రామయ్యా? ఎట్లున్నాడు లక్ష్మయ్య’ అని ఒక గీతం పాడేవారు. మా అన్నయ్యకు దండం పెట్టుకుని నేను రాసుకున్న ‘మరుగైనావా రాజన్నా’ పాటను అదే ట్యూన్‌లో పాడాను.
మా పల్లెల్లో ఎవరైనా గొప్పవాళ్లు, మహనీయులు మరణిస్తే – వాళ్లని చనిపోయారు అనే మాటకు బదులు ‘కొండంత మనిషి వొరిగిపోయాడురా!’ అంటారు. అందువల్ల ఆ పదాన్ని పల్లవిలో ఉపయోగించాను.
‘‘అద్దుమానం అడవిలోనా/ ఏలకాని ఏల కాడ/పైన పోయే పచ్చులారా/ ఏడమ్మా మన రాజన్నా/
నువ్వొచ్చే దావల్లో... పున్నాగా పూలు జల్లి/నీ కోసం వేచుంటే... చేజారీపోతివా’ అని ఒక చరణం రాశాను. అధ్వానం అనే పదాన్ని అద్దుమానం అంటారు మా మాండలికంలో. ఆకాశంలో పక్షులు తిరుగుతుంటాయి. ఆ పైన నుంచి వాటికి రాజన్న కనిపించాడేమోనని ‘మీరైనా చూడలేదా’ అని ప్రశ్నించాను ఈ చరణంలో. పాట పాడుతున్నంతసేపూ నాకు ఏడుపు ఆగలేదు.
వైయస్సార్‌గారి వేషధారణ, నడక, నవ్వు... మనిషిని అధీనం చేసుకుంటాయి. ఆయన నడుస్తుంటే తెల్ల కలువలా ఉంటాడు. ఆయన స్వచ్ఛమైన నవ్వుని, తెల్లని బట్టలను దృష్టిలో ఉంచుకుని, ‘చల్లానీ నీ నవ్వూ... చక్కానీ నీ నడక/రచ్చబండా చేరకనే... నేల రాలిపోతీవా/మాట తప్పని రాజన్నా... మడమ తిప్పని మనిషివయా/మరువజాలము నీ రూపం... నీకు సాటి ఎవరయ్యా’ అని రాశాను. ఈ పాటను మొత్తం 40 వాక్యాలు రాశాను. సినిమాకి అనుగుణంగా తగ్గించారు.
సహజంగా రాయలసీమ గ్రామాల్లో సాయంకాలం సమయంలో మట్టి ప్రమిదలో ఒత్తి పెట్టి, ఆవు పేడ పిడను ఉంచి, దీపం వెలిగించి, దానికి దండం పెడతారు. ఆ సందర్భాన్ని ఇక్కడ రాజన్నకు కలిసేలా ‘‘మా గుండెల్లో గుడిసెల్లో... కొలువుంటావు రాజన్నా/సాయం సంధ్యా దీపంలో... నిన్నే తలుచూకుంటాము/నిన్నే తలుచుకుంటాము...’’ అని రాశాను. నా జీవితంలో నాకు ఇష్టమైన పాట, నా మనసుకి నచ్చిన పాట. ఈ పాట రాయడం పూర్తయ్యాక దర్శకనిర్మాతలకు వినిపించాను. అందరూ బాగుందని మెచ్చుకున్నారు. డైరెక్టరు గారైతే పాట వింటూ మౌనంగా ఉండిపోయారు. అలా ఆ పాట పూర్తయ్యింది. ఏదో ఒక పాట పాడి భ్రష్టుపట్టడం నాకు ఇష్టం లేదు. నచ్చినవి మాత్రమే పాడతాను. నా వరకు ఇది పెద్దాయనకు నేను నా హృదయమంతటితో ఆత్మతృప్తిగా ఇచ్చిన ఘనమైన అక్షర నివాళి. నేను డ్రాయింగ్ వేస్తుంటాను. వ్యాసాలు రాస్తుంటాను. బాటిక్ పెయింటింగ్‌లో రాష్ట్రస్థాయి అవార్డు పొందాను. ఈ పాటకు నాకు డబ్బులు బాగానే ఇచ్చారు. ‘‘పెద్దాయనా! ఆర్థికంగా కూడా నన్ను ఆదుకున్నావు’’ అనుకున్నాను.
– సంభాషణ: వైజయంతి పురాణపండ
Comments
Please login to add a commentAdd a comment