ప్లీజ్ విజిట్ బీబీపూర్.కామ్
భారతదేశంలో నూటాపాతిక కోట్ల మంది జనాభా ఉన్నారు. కానీ నిండా పాతిక కోట్ల మంది కూడా ఇంటర్నెట్లో లేరు. ఉన్న వారిలో చాలా మంది ఇంకా ఆన్‌లైన్ అంటే నమ్మకం లేకుండానే దానిని వాడుతున్నారు. దేశం ఇంత వెనుక ఆలోచిస్తుంటే బీబీపూర్ అనే హర్యానాలోని గ్రామం ఏం చేసిందో తెలుసా... తెలుసుకుందాం రండి.
కరెంటు, ఇంటర్నెట్ ఈ రెండే ఆధునిక మానవుడి ఆయువు పట్లు. ఈ రెండూ ఉన్నాయంటే మనం బాహ్య ప్రపంచానికి అన్నిరకాలుగా దగ్గరగా ఉన్నట్టు లెక్క. ఇంటర్నెట్ గురించి ఈ దేశంలో ఇంకా ఇరవైశాతం మందే అర్థం చేసుకుని ఉండొచ్చు గానీ హర్యానా రాష్ర్టంలోని జింద్ జిల్లా, బీబీపూర్‌లోని ప్రతిఒక్కరూ ఆ ఇరవై శాతం మందిలోనే ఉన్నారు. దేశంలో పూర్తిగా డిజిటలైజ్ అయిన పల్లెటూరు బీబీపూర్. ఇప్పటికీ చాలా పట్టణాలకు వెబ్‌సైట్ లేదు. కానీ ఆ ఊరికి సంబంధించిన ప్రతి విషయం ఆన్‌లైన్లోనే దొరుకుతుంది.
బీబీపూర్.కామ్ (ఛజీఛజీఞఠట.ఛిౌఝ) లోకి వెళ్తే ఆ ఊరి గురించి మీరు ఇక ఏ న్యూస్‌పేపరులోనూ చూడక్కర్లేదు. ఆ గ్రామంలో జరిగే ప్రతి ఈవెంట్ ఆన్‌లైన్లోనే దొరుకుతుంది. 5000 జనాభా ఉన్న బీబీపూర్ పదమూడో శతాబ్దం నాటి నుంచి ఉనికిలో ఉందట. ఎబౌట్ విలేజ్ అంటూ ఆ ఊరి స్వభావం గురించి, సంస్కృతి గురించి వారి వ్యవసాయం గురించి ఈ వెబ్‌సైట్‌లో వివరించారు. ఊరి భూముల్లో పండే పంటలు, ఊరి ప్రజలు ఆచరించే సంప్రదాయాలు, స్థానిక ప్రజల వృత్తులు వివరించారు. ఇది చదివితే ఆ ఊరి గురించి ఒక స్థూలమైన ఐడియా వస్తుంది.
ఊర్లో ఉన్న రవాణా, వైద్యం, విద్య, ఆధ్యాత్మిక కేంద్రాలు వంటి ప్రతి సదుపాయాన్ని ఇందులో పొందుపరిచారు. అంతేకాదు, గ్రామంలోని ఓటర్ల జాబితా మొత్తం ఆన్‌లైన్లో ఉండటం వల్ల ఆ ఊరి వాళ్లు ఎక్కడున్నా దాన్ని చూసుకునే అవకాశం ఉంటుంది. ఆ ఊరి పంచాయతీ అధ్యక్షుడు-సభ్యుల వివరాలను అందుబాటులో ఉంచడమే కాకుండా అది ఇంకా ఎంత బాధ్యతగా ఉందంటే పంచాయతీ తరఫున కట్టిన ప్రతి బిల్లును వెబ్‌సైట్లో ఉంచింది. పాలనలో ఇంతకుమించిన పారదర్శకత ఏముంటుంది? పంచాయతీలో తీసుకున్న తీర్మానాలన్నీ ఎప్పటికపుడు ఈ పోర్టల్‌లో పెడతారు.
ఊరిని ఎవరూ మిస్ కారు
ఎవరికీ లేని వరం ఈ ఊరి ప్రజలకుంది. ఈ ఊర్లో జరిగే ప్రతిదీ దేశంలో, ప్రపంచంలో ఏ మారుమూలన ఉన్నా అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో నిరంతరం ఫొటోలు, వీడియోల రూపంలో సమాచారం అప్‌లోడ్ చేస్తుంటారు. దీనివల్ల ఆ ఊరిలో ప్రతి అభివృద్ధి పని, ప్రతి కార్యక్రమం ఎప్పటికపుడు తెలుసుకునే అవకాశం ఉంటుంది. త్వరలో ఈ ఊరికి సంబంధించి ఒక మ్యాగజైన్ కూడా నడపాలని నిశ్చయించారు. ఆ విషయాన్ని కూడా వెబ్‌లో ప్రకటించారు. ఆ ఊరి అభివృద్ధికి పాటుపడాలనుకునే వారికి అవకాశం కల్పిస్తూ ‘డొనేట్’ ఆప్షన్‌ని కూడా పెట్టారు.
రాష్ట్రానికే ఆదర్శం
ఇలా కేవలం ఈ-పాలన, అభివృద్ధి విషయంలోనే కాకుండా అనేక సంక్షేమ విషయాల్లోనూ బీబీపూర్ వినుతికెక్కింది. ప్రతి నెల పంచాయతీ మహిళల సమావేశం ఏర్పాటుచేస్తుంది. ఇటీవల వారు ఓ కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. భ్రూణ హత్యలు నివారించి, ఇక నుంచి ఊర్లో ఎవరు ఆ పనికి పాల్పడినా ఊరంతా కలిసి సాక్ష్యం చెప్పి వారికి శిక్ష పడేదాకా ఊరుకోకూడదని తీర్మానించారు.
ఈ నిర్ణయం అతితక్కువ స్త్రీల నిష్పత్తి ఉన్న హర్యానా రాష్ట్రాన్ని తద్వారా ఆ సర్కారును ఉలిక్కిపడేలా చేసింది. ఆఘమేఘాల మీద ఆ ప్రభుత్వం ‘బీబీపూర్’ను చూసి సిగ్గుతెచ్చుకోండి. ప్రతి ఆడపిల్ల పెరిగి పెద్దవ్వాలి అంటూ అధికారులను తీవ్రంగా హెచ్చరించింది. అసలైన డిజిటలైజేషన్ ఇదే. ఒక గ్రామపంచాయతీ రాష్ట్రాన్ని కదిలించడం అంటే మాటలు కాదు కదా!