నెత్తుటి పటం | Bloody Map | Sakshi
Sakshi News home page

నెత్తుటి పటం

Published Sun, Sep 18 2016 2:22 AM | Last Updated on Wed, Apr 3 2019 4:38 PM

నెత్తుటి పటం - Sakshi

నెత్తుటి పటం

పట్టుకోండి చూద్దాం
విశ్వేశ్వర్రావుకు శాస్త్రవేత్తగా దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. హైదరాబాద్‌లో ఖరీదైన ఇంట్లో నివసించే రావు తన శేషజీవితాన్ని స్వగ్రామమైన మంగన్నపాలెంలో గడపడానికి గట్టిగా నిర్ణయించుకున్నాడు. ఆయన నిర్ణయాన్ని కుటుంబసభ్యులంతా వ్యతిరేకించారు. ఏడ్చారు. పట్టుదలకు మారుపేరుగా కనిపించే విశ్వేశ్వర్రావు... వారి మాటను మన్నించలేదు. భవబంధాలలో చిక్కుకున్న రుషి తిరిగి తపస్సు చేసుకోవడానికి అడవికి వెళ్లినట్లు ఆయన తన స్వగ్రామానికి వెళ్లాడు. ఊరికి దూరంగా మంచి ఇల్లు ఒకటి కట్టుకొని అందులోనే ఉండడం మొదలు పెట్టాడు.
 
‘‘నేను ఇక్కడికి వచ్చింది సన్యాసం స్వీకరించడానికి కాదు... నాలో ఎన్నో ఆలోచనలు ఉన్నాయి. వాటికి సంబంధించిన ప్రయోగాలను ఇక్కడ చేయాలనుకుంటున్నాను. ప్రశాంతంగా, ఏకాంతంగా చేయాలి. పట్నంలో అది కుదిరే పని కాదు... అందుకే ఇలా వచ్చాను’’ అని గ్రామస్థులతో చెప్పేవాడు విశ్వేశ్వర్రావు.
 తమ ఊరికి కొత్తగా వచ్చిన విశ్వేశ్వర్రావుతో మాట్లాడడానికి  గ్రామస్థులు ఉత్సాహం ప్రదర్శించేవాళ్లు. మొదట్లో వారితో మాట్లాడడానికి ఆసక్తి చూపినా... ఆ తరువాత మాత్రం తనలోకంలో తానుండి పెద్దగా ఎవరితో మాట్లాడడానికి ఇష్టపడేవాడు కాదు.

ఈ విషయం తెలిసి, ఆయన ప్రశాంతతకు భంగం వాటిల్లకుండా గ్రామస్థులు పెద్దగా కలిసేవారు కాదు. సిటీ నుంచి మాత్రం అప్పుడప్పుడు ఆయన స్నేహితులు వచ్చి పోయేవాళ్లు. పెట్రోలుకు ప్రత్యామ్నాయ ఇంధనాన్ని తయారుచేసే ప్రయోగాల్లో విశ్వేశ్వర్రావు తలమునకలయ్యాడని గ్రామస్థులు చెప్పుకునేవారు. ఇది ఎంత వరకు నిజమో తెలియదు. ఇదే విషయాన్ని గురించి విశ్వేశ్వర్రావుని అడిగితే ‘అవును’ అని కాని, ‘కాదు’ అని కాని జవాబు చెప్పక చిన్నగా నవ్వేవాడు.
   
విశ్వేశ్వర్రావు రీడింగ్ రూమ్‌లో చేతికందే ఎత్తులో గోడ మీద ఇండియా మ్యాప్ ఉంటుంది. ఈ మ్యాప్ పెద్ద పెద్ద అక్షరాలతో తెలుగు భాషలో ఉంటుంది. రోజూ ఆ మ్యాప్‌ను చూడడం ఆయన అలవాటు. ఈ అలవాటు ఆయనలో ఎంత నేర్పును తెచ్చిందంటే... కళ్లకు గంతలు కట్టుకొని ఏ రాష్ట్రం, ఏ ప్రాంతం ఎక్కడ ఉందో స్టిక్‌తో చూపించి అందరినీ ఆశ్చర్యపరిచేవాడు. అప్పుడప్పుడు ఆయన కుటుంబసభ్యులు వచ్చేవారుగానీ సాయంత్రానికల్లా తిరిగి సిటీకి వెళ్లిపోయేవారు. విశ్వేశ్వర్రావు కోసం వచ్చే స్నేహితులు మాత్రం ఒకటి రెండు రోజులు ఉండి వెళ్లేవారు.
   
పాల కుర్రాడి ద్వారా విశ్వేశ్వర్రావు హత్యకు గురైన విషయం అందరికీ తెలిసింది. ఈ వార్త దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. విశ్వేశ్వర్రావు మేధావి, అజాతశత్రువు. ఆయన్ను చంపాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? పోలీసులు రంగంలోకి దిగారు. హత్య జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. ఇన్‌స్పెక్టర్ నరసింహ దృష్టి గోడ మీద ఉన్న పటంపై పడింది. రెండు చోట్ల రక్తపు మరకలు కనిపించాయి. ‘‘ఏమై ఉంటుంది?’’ అని ఆ మరకల గురించి సిబ్బందిని ప్రశ్నించాడు ఇన్‌స్పెక్టర్. ‘‘ఆ... ఏముంటుంది సార్... పైకి లేస్తూ  ఆసరా కోసం గోడను పట్టుకుకోవడానికి ప్రయత్నించే క్రమంలో... మ్యాప్‌పై ఈ రక్తపు మరకలు పడి ఉంటాయి’’ అన్నాడు ఒక కానిస్టేబుల్. ఇన్‌స్పెక్టర్ నరసింహకు మాత్రం అలా అనిపించలేదు. ఏదో ఉన్నట్లు అనిపించింది. ఏమై ఉంటుంది?
 
విశ్వేశ్వర్రావు చాలా తెలివైనవాడు. మ్యాప్‌పై ఉన్న రక్తపు మరకల ద్వారా ‘క్లూ’ ఏదైనా ఇవ్వాలను కున్నాడా?
 ఆ ‘క్లూ’ ఏమిటో మ్యాప్‌ని ఎన్నిసార్లు చూసినా అర్థం కాలేదు. తాను అతిగా ఊహిస్తున్నానేమో అని కూడా అనిపించింది. విశ్వేశ్వర్రావు కుటుంబసభ్యులతో కొద్దిసేపు మాట్లాడాడు ఇన్‌స్పెక్టర్.
 ‘‘ఆయనకు చాలా సన్నిహితులైన స్నేహితులు ఐదుగురు ఉన్నారు. వారు తప్ప... ఆయన దగ్గరికి వెళ్లేంత సాహసం ఎవరూ చేయరు’’ అని చెప్పారు. ‘‘వారు ఎలాంటి వారో చెప్పగలరా?’’ అనే ప్రశ్నకు ‘‘వారి పేర్లు వినడం తప్ప... వారు ఎలాంటి వారో మాకు బొత్తిగా తెలియదు’’ అనే సమాధానం వినిపించింది. ‘‘సరే... వారి పేర్లయినా చెప్పండి’’ అని అడిగాడు ఇన్‌స్పెక్టర్.
 1.రమణారావు 2.రాజా
 3. రఘుపతి 4. నాగరాజు
 5. కుటుంబరావు. ఈ పేర్లు వింటున్నప్పుడు... ఒకసారి తాను పదే పదే చూసిన మ్యాప్ గుర్తుకు వచ్చింది. ఈ అయిదు పేర్లలో రెండు పేర్లను టిక్ చేసి మ్యాప్ దగ్గరికి వెళ్లి చూశాడు. ‘‘రాజా, నాగరాజులను వెంటనే అరెస్ట్ చేయండి’’ అని ఆదేశించాడు. విశ్వేశ్వర్రావు హత్యకి కారణం తామేనని పోలీసుల విచారణలో ఒప్పుకున్నారు ఆ ఇద్దరు. మ్యాప్‌పై ఉన్న రెండు నెత్తుటి మరకలకు, ఆ పేర్లకు ఏమిటి సంబంధం? ఆ ఇద్దరిని ఇన్‌స్పెక్టర్ ఎందుకు అనుమానించాడు?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement