మృతి చెందిన ఏనుగుకు పూలతో శ్రద్ధాంజలి ఘటిస్తున్న స్థానిక మహిళ
గువాహటి (అసోం) : అసోంలో అత్యంత హృదయవిదారకమైన సంఘటన చోటుచేసుకుంది. హబైపుర్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు ఢీకొట్టడంతో నాలుగు ఏనుగులు దుర్మరణం పాలవ్వగా, ఓ ఏనుగుకు తీవ్ర గాయాలయ్యాయి. శనివారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో గువాహటి- సిల్చార్ ప్యాసింజర్ రైలు ఐదు ఏనుగులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 4 ఏనుగులు అక్కడికక్కడే మృతిచెందాయి.
ఏనుగులను వేగంగా ఢీకొట్టడంతో రైలు కుదుపునకు గురైంది. దీంతో రైలు ఇంజిన్ బోగీలనుంచి విడిపోయింది. అనుకోకుండా జరిగిన ఈ పరిణామానికి రైల్లో ఉన్న వందలాది ప్రయాణికులు భయాందోళలనలకు గురయ్యారు. అసోంలోని సోనిట్‌పూర్ జిల్లాలో గత డిసెంబర్‌లో గుహవాటి-నాహర్‌లాగున్ ఎక్స్‌ప్రెస్ ఢీకొని ఐదు ఏనుగులు మృతి చెందిన విషయం తెలిసిందే. గత ఏడాది అసోంలో రైలు ఢీకొని 12 ఏనుగులు మృతిచెందాయి. 2011 సెన్సెస్ లెక్కల ప్రకారం 5,620 ఏనుగులతో అసోం రాష్ట్రం భారత్‌లో ప్రథమ స్థానంలో ఉంది. రైలు ప్రమాదాల నుంచి ఏనుగులను రక్షించడానికి రైల్వే శాఖ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోతోంది. గ్రామాలు విస్తరిస్తుండటంతో అడవుల నరికివేత జోరుగా సాగుతోంది. దీంతో అడవుల వైశాల్యం తగ్గడంతో అక్కడ నివసించే జంతువులకు రక్షణ కరువైంది.
Comments
Please login to add a commentAdd a comment