క్యాన్సర్ నివారణ అస్సలు సాధ్యం కాదా?
ఇది పూర్తిగా వాస్తవం కాదు. నిజానికి క్యాన్సర్‌కు కారణమయ్యే అంశం నిర్దిష్టంగా తెలియదు. కాబట్టి ఎన్ని ఆరోగ్య నియమాలు పాటించినా కొందరిలో క్యాన్సర్ కనిపించవచ్చు. అయితే సాధారణంగా చాలా మంచి జీవనశైలిని అనుసరించే అనేక మందిలో క్యాన్సర్ నివారణ సాధ్యమవు తుందని గుర్తించారు. ప్రధానంగా కాలుష్యం లేని చోట్ల నివసించేవారిలో స్వాభావికంగానే క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయని అనేక అధ్యయనాల్లో తేలింది.
బరువును అదుపులో పెట్టుకోవడం, మంచి పోషక విలువలు ఉన్న ఆహారం తీసుకోవడం, వేట మాంసం (రెడ్ మీట్) బదులు చికెన్, చేపలు తినడం, ఆల్కహాల్, పొగతాగే దురలవాట్లను పూర్తిగా మానేయడం వంటి మంచి జీవన శైలితో క్యాన్సర్‌ను నివారించవచ్చు. ఇక క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం క్యాన్సర్ నివారణకు దోహదపడే అంశమే. అలాగే కుటుంబాల్లో పెద్దలకు క్యాన్సర్ ఉంటే అనువంశీకంగా క్యాన్సర్ వస్తుందనేది పూర్తిగా అపోహ మాత్రమే.
అక్కచెల్లెళ్లు, అమ్మ, చిన్నమ్మ వంటి వారికి రొమ్ము క్యాన్సర్ వంటివి ఉంటే ముందుగా తెలుసుకోవడం వల్ల శస్త్రచికిత్సతో దాన్నుంచి పూర్తిగా విముక్తం అయ్యే అవకాశం ఉన్నందున ఫ్యామిలీ హిస్టరీలో క్యాన్సర్ ఉన్నప్పుడు ముందునుంచే అవసరమైన పరీక్షలు చేయించుకుంటూ, డాక్టర్ సలహా మేరకు తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. అంతే తప్ప క్యాన్సర్‌ను భయంకరమైన వ్యాధిగా భావించి, అనవసరంగా ఆందోళన పడక్కర్లేదు.