ఆశ్రిత  వత్సలుడు | Capturing Seethamma like Aditi Shakti | Sakshi
Sakshi News home page

ఆశ్రిత  వత్సలుడు

Published Sun, Apr 14 2019 4:02 AM | Last Updated on Sun, Apr 14 2019 4:02 AM

Capturing Seethamma like Aditi Shakti - Sakshi

పరదారాపహరణం చాలా పాపమని, సాక్షాత్తూ ఆదిశక్తి వంటి సీతమ్మను తెచ్చి బంధించడం లంకకు చేటని, రావణునికి అత్యంత ప్రమాదకరమని, మర్యాదగా సీతమ్మని రామునికి అప్పగించి, క్షమాపణలు వేడుకోమని ఎంతో హితబోధ చేశాడు విభీషణుడు తన అన్న అయిన రావణునికి. పోగాలం దాపురించిన రావణుడు ఆ మాటలను చెవికెక్కించుకోకపోగా తీవ్రంగా అవమానించడంతో విభీషణుడు దుష్టుడైన అన్నను వదిలి ధర్మస్వరూపుడైన రాముని శరణు వేడాలన్న ఉద్దేశ్యంతో ఎప్పుడూ తననే అనుసరించే నలుగురు అనుచరులతోపాటు లంకను వదిలి సముద్రాన్ని దాటి అవతలి తీరంలో వానర సేనతో ఉన్న శ్రీ రామచంద్రుడి దగ్గరకు వచ్చి ఆకాశంలోనే నిలచి రాముడిని శరణు వేడాడు.  అప్పుడు విభీషణుని చూసిన సుగ్రీవుడు ఆ వచ్చిన వారు రాక్షసులనీ, వారిని వెంటనే ఎదుర్కోవలసిందనీ తన సేనలను ఆజ్ఞాపించాడు. సుగ్రీవుడి ఆనతిని అందుకున్న వానర సేన తనను చుట్టుముట్టబోగా, వారిని చూసి విభీషణుడు తాను లంకాధిపతి రావణుని సోదరుడిననీ, అన్నను వదిలి ధర్మమూర్తి అయిన రాముని శరణు కోరి వచ్చాననీ, తాను మిత్రుడినే తప్ప శత్రువుని కాననీ చెప్పాడు. ఆ మాటలు విని సుగ్రీవుడు, అంగదుడు, జాంబవంతుడు, మైందుడు తదితరులు అతనిని ఎంతమాత్రమూ నమ్మవద్దని, అతడికి ఆశ్రయం ఇవ్వడం ప్రమాదకరమనీ రామునికి చెప్పారు. హనుమంతుడు కూడా ఇంచుమించు అవే మాటలు చెప్పాడు.

అప్పుడు రాముడు వారితో–  ‘‘వానర వీరులారా! విభీషణుని గురించి మీరంతా చెప్పినవి విన్నాను. మీరు చెప్పిన మాటలు యదార్థమే కావచ్చునేమో కానీ, నాకొక వ్రతం ఉంది. అదేమంటే, నాకు శత్రువైనా, మిత్రుడైనా ఎవరైనా నా దగ్గరకు వచ్చి ‘శరణు’ కోరితే, వారిలో ఎటువంటి దోషాలున్నా, వారు ఎంతటి చెడ్డవారయినా సరే, నేను వారికి అభయమిచ్చి తీరుతాను. సుగుణాలు ఉన్నవానిని రక్షించడం కంటే దోషాలున్న వారిని రక్షించడంలోనే మంచితనం బయటపడుతుంది. మరొకటి, ఇక్కడున్న ధర్మసూక్ష్మమేమిటంటే, దుష్టుడైన రావణునికి ధర్మం తెలిసిన విభీషణుడు తమ్ముడు కాకూడదన్న నియమమేమీ లేదు కదా... అదేవిధంగా మన శత్రువుల వద్ద నుంచి వచ్చినంత మాత్రాన అతడు కూడా మనకు శత్రువు కానవసరం లేదు! మనకు మిత్రుడు కావచ్చు కదా! లోకంలో దాయాదులెవరూ మిత్రుల్లా కలిసి మెలిసి ఉండరు. వారిలో వారికి మనస్పర్ధలుంటాయి. అందుకే జ్ఞాతులు సాధారణంగా విడిపోతుంటారు. ఒకరితో ఒకరు కలహించుకుంటూ ఉంటారు. అలాగే సీత కారణంగా రావణుడికి, విభీషణుడికి భేదాభిప్రాయాలు వచ్చి ఉంటాయి. అందుకే రావణుడు తమ్ముడిని తరిమి వేసి ఉంటాడు. మనం వచ్చిన కార్యం... అధర్మపరుడైన రావణుని ఎదిరించి, నా సీతను తీసుకు రావడం. కాబట్టి విభీషణుడికి, మనకు శత్రుత్వం ఎలా ఉంటుంది? ఒకవేళ మీరందరూ అనుమానించినట్లుగా విభీషణుడు దుష్టుడైనా కానీ మనకు వచ్చిన భయమేమీ లేదు. అతడు నాకు గానీ, మీలో ఎవరికైనా కానీ ఎటువంటి అపకారమూ చేయలేడు.
 

నేను తలచుకుంటే ఈ భూమి మీద ఉన్న రాక్షసులను, దానవులను, యక్షులను ఒంటిచేత్తో ఎదుర్కోగలను. అలాంటిది ఈ ఐదుగురు రాక్షసులు ఎంత? శరణన్న విభీషణుడికి అభయమిస్తున్నాను. అతనిని ఇప్పుడే లంకకు రాజుగా ప్రకటిస్తున్నాను’’ అన్నాడు. రాముడికి ఉన్న ధర్మనిరతి, సంయమనం, ఆలోచన శక్తి, కుశాగ్రబుద్ధి, కొండంత ఆత్మవిశ్వాసాన్ని దీనిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. రాజైనవాడు ఎటువంటి విపత్కర పరిస్థితులలో ఉన్నప్పటికీ కేవలం అనుచరులు చెప్పిన మాటలను అసలు వినకుండా ఉండకూడదనీ, అదేవిధంగా ఆ మాటలను మాత్రమే విని, వాటిని బట్టి నిర్ణయం తీసుకోరాదనీ, తాను నిర్ణయించుకున్న విషయాన్ని ఎటువంటి తొట్రుపాటూ మరెంతటి మిడిసిపాటూ లేకుండా చక్కగా వివరించి చెప్పడం, చక్కగా ఆలోచించడం, సత్వర నిర్ణయాలు తీసుకోగలగడం, ఆ తీసుకున్న నిర్ణయాలను వెంటనే అమలు చేయడం ఎంతో మంచి చేస్తుందనీ మనం అర్థం చేసుకోవాలన్నదే ఇందులోని నీతి. 
– డి.వి.ఆర్‌. భాస్కర్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement