అపురూపం: చెక్కు చెదరని జ్ఞాపకాల మందిరం
తాజ్‌మహల్!
ప్రపంచ వింతల్లో ఒకటి!
ఒక భర్త తన భార్య గుర్తుగా ఇంత భారీగా
కట్టించిన మహల్ భువిపై ఇంకొకటి లేదు!
మొఘల్ చక్రవర్తి షాజహాన్‌కు భార్య ముంతాజ్ అంటే ఎంతో ప్రేమ!
ఆమె 1631లో పరమపదించారు.
ఆమె గుర్తుగా తాజ్‌మహల్‌ని కట్టారు షాజహాన్!
ఉత్తరప్రదేశ్ ఆగ్రాలో...
యమునా నదీ తీరాన...
పూర్తిగా పాలరాయితో...
వెయ్యి ఏనుగుల సాయంతో...
ఇరవై వేల మంది కార్మికులు
ఇరవై రెండేళ్ల పాటు శ్రమించి నిర్మించిన అతిగొప్ప కట్టడమిది!
కట్టి శతాబ్దాలు అవుతోంది.
అయినా దాని వన్నె తగ్గలేదు.
కనీసం ఒక్కసారైనా ఆ మహాకట్టడాన్ని చూడాలని ఉబలాటపడేవారే అందరూ!
సినీ తారలూ దీనికి మినహాయింపు కాదు!
నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు శ్రీమతి అన్నపూర్ణ దంపతులు తాజ్‌మహల్‌ను సందర్శించుకున్నప్పటి ఫొటోని పైన చూడవచ్చు!
అలాగే ఢిల్లీలో జరిగిన జాతీయ చలనచిత్ర అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మహానటి సావిత్రి, ప్రఖ్యాత నటుడు శివాజీ గణేశన్, వారి అర్థాంగి కమలా గణేశన్ ప్రత్యేకంగా ఆగ్రా వెళ్లి తాజ్‌మహల్‌ని దర్శించుకున్నప్పటి
స్టిల్ కూడా.
అలాగే నేటి హాస్యబ్రహ్మ బ్రహ్మానందం తన శ్రీమతి లక్ష్మితో కలిసి తాజ్‌మహల్ ముందు తీపిగుర్తుగా తీయించుకున్న స్టిల్.
అమెరికా అధ్యక్షుడైనా అతి సామాన్యుడైనా
తాజ్‌మహల్ అందాలకు ముగ్ధుడవ్వాల్సిందే.
ఆ నిర్మాణానికి ఆశ్చర్యపోవాల్సిందే.
దాని ముందు ఫొటో దిగాల్సిందే!
ఎందుకంటే...
తాజ్‌మహల్ వంటి దృశ్యకావ్యం
మరొకటి లేదు గనుక!
వేరొకటి సాటి రాదు గనుక!!
ఇంకొకటి కట్టలేరు గనుక!!!
- సంజయ్ కిషోర్