ఇవ్వడమే... క్రిస్మస్ పరమార్థం
డిసెంబర్ నెల రాగానే అంతటా క్రిస్మస్ సందడి ప్రారంభమైపోతుంది. అందరి ముంగిళ్లలోనూ క్రిస్మస్ ట్రీలు ప్రత్యక్షమవుతాయి. అందరి ఇళ్లకూ రంగురంగుల నక్షత్రాలు వేళ్లాడుతూ ఉంటాయి. కేకుల ఘుమఘుమలు ముక్కుపుటాలను అదరగొడుతుంటాయి. శాంటాక్లాజ్ రాక కోసం చిన్నారుల ఎదురుచూపులు మొదలవుతాయి. అయితే క్రిస్మస్ అనగానే ఇవన్నీ ఎందుకు గుర్తుకొస్తాయి? ఈ సంప్రదాయాలు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయి అని ఎప్పుడైనా ఆలోచించారా? సంప్రదాయాల వెనుక అర్థం తెలుసుకుంటే, పండుగ వెనుక ఉన్న అసలు అంతరార్థం బోధపడుతుంది. నిజమైన ఆనందం జీవితమంతా నిండుతుంది.
క్రిస్మస్ అంటే కేవలం అలంకరణలు, రుచికరమైన వంటకాలు, అందమైన దుస్తులు, ఇచ్చి పుచ్చుకునే కానుకలు మాత్రమే కాదు. ఆత్మీయాంతరార్థం మరుగున పడకుండా చూసుకోవడమే దాని వెనుక ఉన్న అసలు అంతరార్థం. యేసుక్రీస్తు నరావతారిగా భూలోకానికి వేంచేసిన దినమది. దీనులు, దరిద్రులు, నిరాశ్రయులు, నిరుపేదలకు అండగా, ఆసరాగా మానవాళి నిలవాలన్న సందేశాన్ని యేసుక్రీస్తు రూపంలో తెచ్చిన మహా పర్వదినమది. క్రిస్మస్ సందర్భంగా మనకోసం మనమెంత ఖర్చు చేస్తున్నామని కాక, పేదల కోసం కొంతైనా చేస్తున్నామా లేదా అన్నది తప్పక ఆలోచించుకోవాలి. అప్పుడే అది హ్యాపీ క్రిస్మస్... అర్థవంతమైన ఆత్మీయ క్రిస్మస్!
రెవ.టి.ఎ.ప్రభుకిరణ్
క్రిస్మస్ ట్రీ
ఇప్పుడంటే ఆర్టిఫీషియల్ క్రిస్మస్ ట్రీలు షాపుల్లో దొరికేస్తున్నాయి కానీ.. అప్పట్లో సరుగుడు చెట్లకొమ్మలు తెచ్చి, దాన్ని క్రిస్మస్ ట్రీలా అలంకరించేవారు. క్రిస్మస్ ట్రీ సంప్రదాయం మధ్యయుగంలో జర్మనీలో ఆరంభమైందని అంటారు. 18వ శతాబ్దంలో విక్టోరియా రాణి తన రాజ్య భవనంలో ఒక క్రిస్మస్ చెట్టును ఏర్పాటు చేయడంతో అది అత్యధికంగా ప్రాచుర్యం పొంది, క్రైస్తవులందరి ఇళ్లలోకీ క్రిస్మస్ ట్రీ చేరిందని సమాచారం. ఆ చెట్టును దీపాలు పెట్టి మొదటగా అలంకరించింది... సంస్కరణోద్యమ పితామహుడు మార్టిన్ లూథర్ అట. అప్పటి నుండి క్రిస్మస్ చెట్టును పళ్లు, కానుకలతోనే కాక దీపాలతో కూడా అలంకరిస్తున్నారని తెలుస్తోంది. ఏది ఏమైనా చెట్టును ఆనందానికి, పచ్చదనానికి, సిరి సంపదలకు చిహ్నంగా ప్రపంచంలోని అన్ని నాగరికతలూ గుర్తించాయి. ఆ క్రమంలోనే అది క్రిస్మస్ అలంకరణలో భాగమైంది. పైగా చెట్టుకు ఇవ్వడమే తప్ప తీసుకోవడం తెలియదు. అందుకే ఇవ్వడం, ప్రేమించడం, క్షమించడం ప్రధానాంశాలుగా ఉన్న క్రిస్మస్ పండుగ రోజున క్రిస్మస్ చెట్టుతో ఇంటిని అలంకరించుకుంటారు.
శాంటాక్లాజ్
క్రిస్మస్ తాత సంప్రదాయం మూడవ శతాబ్దంలో పరిచయమయ్యాడు. డెన్మార్క్‌లో సెయింట్ నికొలస్ అనే భక్తిపరుడైన క్యాథలిక్ బిషప్ ఉదంతమే శాంటాక్లాజ్ సృష్టికి మూలమని చెబుతారు. నికొలస్ బిషప్‌గా ఉన్న ప్రదేశంలో ఒక పేద రైతు తన ముగ్గురు కుమార్తెలకు కట్నాలిచ్చి పెళ్లిళ్లు చేయలేక అవస్థ పడుతుంటాడు. దాంతో బిషప్ నికొలస్ అర్ధరాత్రిపూట బంగారు నాణాలున్న మూడు చిన్న మూటలను చిమ్నీ ద్వారా ఇంట్లోకి జారవిడుస్తాడు. అవి చిమ్నీ ద్వారా జారి, అక్కడ ఆరబెట్టి ఉన్న ఓ సాక్స్‌లో పడ్డాయట (అందుకే క్రిస్మస్ అలంకరణలో సాక్స్‌ను రకరకాల రంగుల్లో వేలాడదీయడం ఆచారంగా మారింది). అలా ఆయన చేసిన సత్కార్యం ఒక పేదరైతు కుటుంబంలో ఎంతో ఆనందాన్ని నింపింది. ఈ మాట ఆ నోట ఈ నోట వెలువడి అంతా ప్రచారమైంది. దాంతో కష్టాల్లో ఉన్న చాలామంది తమకు కూడా అలా సాయం అందుతుందేమో అని చూడటం మొదలుపెట్టారు. దాంతో మనసున్నవాళ్లంతా రకరకాల సాయాలు చేసే క్రిస్మస్ తాతలుగా పుట్టుకొచ్చారు. కొన్ని చోట్లనైతే ఆ ఏడాదంతా సర్వే చేసి ఎవరికి ఏం అవసరమో తెలుసుకొని వారి వారి అవసరాల ప్రకారం అనామకంగా ఉంటూనే సాయం అందజేసే క్రిస్మస్ తాతలు బయలుదేరారు. క్రిస్మస్ ముందురాత్రి పడుకున్న తరువాత... క్రిస్మస్ తాత ఇంటింటికీ వెళ్లి వారి బహుమతులను ఇంటి ముంగిట పెట్టి తలుపుకొట్టి వెళ్లిపోయేవాడు. పాశ్చాత్యదేశాల్లో ఈ సంప్రదాయం బాగా ప్రాచుర్యం పొందింది. మనం క్రిస్మస్ తాత అంటాం... వాళ్లు శాంటాక్లాజ్ అంటారు.
క్రిస్మస్ అలంకరణ
క్రిస్మస్ సందర్భంగా ఇళ్లను రంగు రంగుల నక్షత్రాలు, గంటలతో డెకరేట్ చేయడం పరిపాటి. యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఆకాశంలో ఒక విలక్షణమైన తార దర్శనమిచ్చింది. ఆ తారను చూసిన కొందరు జ్ఞానులు తూర్పు దేశాల నుండి బయలుదేరి, ఆ తార చూపించే మార్గంలో పయనించి, బాలయేసు దగ్గరకు చేరుకున్నారు. యేసుక్రీస్తును సందర్శించి, ఆయన్ను ఆరాధించారు. ఈ ఉదంతాన్ని స్మరణకు తెచ్చుకొంటూ క్రైస్తవులంతా తమ ఇళ్ల ముందు క్రిస్మస్ సమయంలో ఒక తారను వేలాడదీస్తారు. నాటి తార యేసుప్రభువును జ్ఞానులకు పరిచయం చేసినట్టే తాము కూడా అభినవ తారలుగా ఆయన్ను లోకానికి పరిచయం చేస్తామంటూ ఆ విధంగా పరోక్షంగా దేవునికి వాగ్దానం చేస్తారన్న మాట. ఇక గంటల సంగతి. గడియారాలు లేని ఆ రోజుల్లో చర్చిలో సమయబద్దంగా మోగించే గంటలే ఊరంతటికీ సమయమెంతో తెలిపేవి. ముఖ్యంగా చర్చిలో పూజలు, ఆరాధనలప్పుడు అవి మోగితే అందరూ ఆలయాల్లో హాజరైపోయేవారు. ప్రభువు సన్నిధికి తాము వెళ్లే సమయాన్ని సూచిస్తున్నందున గంటకు ప్రత్యేకత ఏర్పడింది. అందుకే క్రిస్మస్ సమయంలో గంటలను ఇళ్లలో అలంకరించుకొని ఆనందపడతారు.
క్రిస్మస్ కేక్
క్రిస్మస్‌కి కేక్ తయారుచేయడం అనేది పూర్తిగా పాశ్చాత్య సంప్రదాయం. పాశ్చాత్యుల విందు భోజనాల్లో కేక్ ఒక అంతర్భాగం. ఇక ప్రత్యేక సందర్భాలైన పుట్టినరోజు, పెళ్లిరోజుల్లో కేక్‌ను కట్ చేయించడం వారికి అలవాటు. అందుకే ఎంతో ముఖ్యమైన క్రిస్మస్‌కి కూడా కేక్ కటింగ్ సంప్రదాయాన్ని అనుసరిస్తున్నారు. బ్రిటిష్ వారు పరిపాలించిన అన్ని దేశాల్లోకీ ఆ సంప్రదాయం విస్తరించింది. క్రిస్మస్ కేక్ అంటే ప్రసాదం లాంటిదేమీ కాదు. అదొక రుచికరమైన ఆహార పదార్థం మాత్రమే. అందరూ నోటిని తీపి చేసుకుని సరదాగా ఆనందించడానికే తప్ప ఈ సంప్రదాయం వెనుక ప్రత్యేకమైన కారణం ఏమీ లేదు.