జయంతి మహల్‌ | A crime story of jayanthi mahal | Sakshi
Sakshi News home page

జయంతి మహల్‌

Published Sun, Jul 1 2018 12:41 AM | Last Updated on Sun, Jul 1 2018 4:37 AM

A crime story of jayanthi mahal - Sakshi

జయంతి మహల్‌లో ఎవరో వార్డుబాయ్‌ చెట్టుకుఉరేసుకున్నాడని అన్నారు. అంతే! ఆ విషయం విన్న కొందరు  గ్రామస్తులు ఇది అంత మంచి స్థలం కాదని తాము ముందే చెప్పామని, ఎప్పుడూ ఏదొక కీడు జరుగుతూనే ఉందని అన్నారు. అంతకు ముందు వరకు జయంతి మహల్‌ సందడిగా ఉండేది. ఇప్పుడు అది అరణ్యంలా మారింది.


రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా, రామ్‌ నగర్‌లో గెలుపు మాత్రం తులసీదాస్‌దే. నియోజకవర్గ ప్రజలకు ఏ అవసరమొచ్చినా నిత్యం అందుబాటులో ఉంటాడు. ఎమ్మెల్యే అయినా సాధారణ జీవనాన్నే గడుపుతాడు. తులసీదాస్‌కు అచ్చం తన తండ్రి పోలికలే వచ్చాయని వయసులో పెద్దవారు అనుకుంటూ ఉంటారు. తులసీదాస్‌ తండ్రి రఘురామయ్య కూడా ఇదే నియోజకవర్గం నుంచి ఆరు సార్లు గెలిచారు. ఈ ప్రాంత ప్రజలకు ఆయన దేవుడితో సమానం. రఘురామయ్య మీదున్న ప్రేమని యథావిధిగా ఆయన కూమారుడు తులసీదాస్‌పై చూపిస్తుంటారు. రఘురామయ్యకు తులసీదాస్‌ ఒక్కడే కుమారుడు. ఆయన చనిపోయాక తులసీదాస్‌ మొదటిసారి బై ఎలక్షన్‌లో భారీ మెజారిటీతో గెలుపొందినప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. తులసీదాస్‌కు కూడా ఒక్కడే కుమారుడు. పేరు సంహిత్‌. సంహిత్‌ ఐర్లాండ్‌లో కార్డియాలజీలో పీజీ చేస్తున్నాడు.

కొడుకు తన చదువును పూర్తి చేసి వచ్చాక తన నియోజకవర్గంలోనే ఒక పెద్ద ఆస్పత్రి కట్టించి ఉచిత వైద్యం అందించాలని భావించాడు. రాజధాని నుంచి తన నియోజకవర్గమైన రామ్‌నగర్‌కు వచ్చే దారిలో వాళ్ల నాన్న ఉన్న కాలంలో జయంతి మహల్‌ అనే సినిమా థియేటర్‌ ఉండేది. ప్రస్తుతం అది పూర్తిగా శిథిలమై ఉంది. కానీ అది విశాలంగా ఉన్న అయిదు ఎకరాల విస్తీర్ణంలో ఉండటంతో ఎక్కువ స్థలముందని, కావాలంటే ఆ మహల్‌ను కూలగొట్టి ఆస్పత్రి కట్టించొచ్చు అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా ఆ థియేటర్‌‡యజమాని ఎక్కడున్నాడో కనుక్కొమ్మని తన అనుచరులను పురమాయించాడు. తర్వాత ఆ థియేటర్‌ యజమాని అతని కుటుంబ సభ్యులు ఆ థియేటర్‌ ప్రాంగణంలో ఉన్న వాళ్లింట్లో దారుణంగా హత్యకు గురయ్యారని వారి బంధువుల ద్వారా తులసీదాస్‌కు తెలిసింది. దాంతో ఆ నియోజకవర్గ ప్రజలకు ఆ థియేటర్‌ అంటే చాలా భయం పట్టుకుంది.

దాన్ని ఒక భూత్‌ బంగ్లాగా చూస్తారని, రాత్రి వేళల్లో ఆ దారివైపు ఒంటరిగా ఎవరూ వెళ్లరని తులసీదాస్‌కు చెప్పడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నాడు తులసీదాస్‌. ఒక రోజు నియోజకవర్గ ప్రజలతో తన నివాసంలో సమావేశం ఏర్పాటు చేశాడు. తను ఆ థియేటర్‌ స్థానంలో ఆస్పత్రి కట్టించబోతున్నానని తన అభిప్రాయాన్ని చెప్పాడు తులసీదాస్‌. ఎన్నాళ్లని భయపడుకుంటూ ఉంటారు. నేను చిన్నతనంలో ఉన్నప్పటి నుంచి ఇవే గుసగుసలు. అపోహలు. ఆ రోజుల్లో అంటే ఎలాంటి అక్షరాస్యత లేక నమ్మారనుకుంటే, ఇప్పుడు ఉన్న వాళ్లకేమైంది? ఇంత టెక్నాలజీ ఉండి కూడా ఇంకా దెయ్యాలు, భూతాలు అంటూ భయపడుతూనే ఉన్నారని తలసీదాస్‌ గద్దించాడు. ఆ మాటకు అందరూ కిమ్మనకుండా ఆయన చెప్పింది వినసాగారు. అక్కడ ఆస్పత్రి కట్టించి తన కుమారుడితో వైద్యం చేయిస్తానని, వైద్యానికి దూరమైన మన ప్రజలకు ఇది గొప్పవరమని చెప్పి తన నిర్ణయాన్ని ప్రకటించాడు.

మూడేళ్ల తర్వాత... ఏంటీ జయంతి మహల్‌ దగ్గర అంత జనం ఉన్నారని అక్కడ గుమిగూడిన వాళ్లలో ఒకరిని ఆ ఊరి వాడు అడిగాడు. ‘‘ఓరి..! నీకు తెలీదా? జయంతి మహల్‌ను ప్రభుత్వం అవయవ మార్పిడి ఆస్పత్రిగా మార్చిందిగా. దీన్ని ప్రారంభించడానికి ఆరోగ్య మంత్రి తులసీదాస్‌ వస్తున్నారు. అందుకే మేమంతా చూడ్డానికి వచ్చాం’’ అన్నాడు. ఇంతలోనే పోలీస్‌ కాన్వాయ్‌లో మంత్రి తులసీదాస్‌ వచ్చారు. దిగగానే పక్కనే ఎదురు చూస్తున్న ఆ గ్రామ జనంతోటి ‘బాగున్నారా’ అని పలకరించాడు. ఆస్పత్రిని ప్రారంభించిన మంత్రి భవనాన్ని పరిశీలించడానికని వైద్య బృందంతో లోపలికి వెళ్లాడు. ఇతరులనెవరినీ లోనికి రానీయకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ‘‘సర్‌..! ఇది గుండె మార్పిడి గది. దీనిలో నాలుగు ఎమర్జెన్సీ బెడ్స్‌తో సహా సకల సౌకర్యాలున్నాయి. ఇది బాడీని డీకంపోజ్‌ కాకుండా ప్రిజర్వ్‌ చేసే గది’’ అని జయంతి మహల్‌ను అవయవ మార్పిడి ఆస్పత్రిగా మార్చాక వైద్యులు ఒక్కొక్క దాని గురించి మంత్రికి వివరిస్తున్నారు.

రెండున్నరేళ్ల క్రితం ఎమ్మెల్యే తులసీదాస్‌ జయంతి మహల్‌ను ఆస్పత్రిగా మార్చి ప్రజలకు అందివ్వాలనే ఉద్దేశంతో తన కుమారుడి చేత ఆస్పత్రిని ప్రారంభించాలనుకున్న క్రమంలో దురదృష్టవశాత్తు సెలవులకని ఇంటికి వచ్చిన సంహిత్‌కు యాక్సిడెంట్‌ జరిగింది. డాక్టర్లు ఎంత ప్రయత్నించినా చివరకు ప్రాణాలు కోల్పోయాడు. కొడుకు మరణంతో తులసీదాస్‌ తీవ్రమైన డిప్రెషన్‌లోకి వెళ్లాడు. ప్రజల పాలనకు తన వ్యక్తిగత జీవితానికి పూర్తిగా దూరమయ్యాడు. తర్వాత మెల్లమెల్లగా అంతా కుదుటపడ్డాక తన సాధారణ జీవితంలోకి వచ్చాడు. తులసీదాస్‌ ప్రజాసేవను, మచ్చలేని రాజకీయ జీవితాన్ని గుర్తించిన ప్రభుత్వం ఏడాది క్రితం జరిగిన మంత్రి వర్గ విస్తరణలో ఆరోగ్య శాఖను కేటాయించింది. తనకు వారసులు లేరని తన రాజకీయ జీవితాన్ని మొత్తం ప్రజలకే అంకితం చేయాలనుకున్నానని తన కుమారుడు ఉన్నప్పుడు ఏర్పాటు చేస్తానన్న ఆస్పత్రి స్థానంలో అవయవ మార్పిడి కేంద్రం గురించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాడు.

రాజధానికి అంత దూరంలో అవయవ మార్పిడి ఆస్పత్రి ఏర్పాటు చేస్తే కష్టమని చెప్పిన ప్రభుత్వం రాజధానిలో ఉన్న కేంద్రానికి అనుబంధంగా ఎమర్జెన్సీ కేంద్రంగా ఏర్పాటు చేయడానకి అనుమతినిచ్చింది. అందులో భాగంగానే జయంతి మహల్‌ను పాక్షికంగా కూలగొట్టి ఆస్పత్రికి అనుగుణంగా మార్పు చేశారు. ఇక్కడే ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఇంకో కారణాన్ని పరిగణించింది. రాజధానిలో అవయవమార్పిడి కేంద్రంలో కేసులు ఎక్కువైతే ట్రాఫిక్‌ కారణంగా త్వరగా రోగులకు అవయవాలను తరలించలేమని, అత్యవసరం అయితే రామ్‌నగర్‌లో ఉన్న ఎమర్జెన్సీ హెలిప్యాడ్‌ కేంద్రాన్ని ఉపయోగించుకుని జయంతి మహల్‌కు చేరవేయొచ్చని భావించి అక్కడ ఏర్పాటుకు అనుమతిచ్చింది. అయితే ఇక్కడ మౌలిక సదుపాయాల కల్పన, ప్రభుత్వం చేపట్టిన అవయవాలను రోగులకు అమర్చే బాధ్యతను ప్రభుత్వం, ప్రైవేట్‌ భాగస్వామ్మంతో జరుగుతుంది. ప్రైవేటు ఆస్పత్రి తరపున సుజనా హాస్పిటల్స్‌ను ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ హాస్పిటల్‌ ఎండీ డాక్టర్‌ రజనీకాంత్‌ ఆధ్వర్యంలో ఎన్నో అవయన మార్పిడి ఆపరేషన్లు విజయవంతంగా జరిగాయి. ఆయనకున్న మంచి పేరుకు ప్రభుత్వం ఆ ఆస్పత్రిని భాగస్వామ్యం చేసింది. దేశ, రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే అవయవ మార్పిడి కేసుల్లో ఎక్కువ జయంతి మహల్‌కు తీసుకొస్తుంటారు.

‘‘ఏమైంది? అక్కడ అంతా పోలీసులు ఉన్నారు. జనమంతా అక్కడున్నారేంట’’ని రోడ్డు మీద వెళ్తున్న ఒకరు అటుపోతున్న వాళ్లని అడిగాడు. జయంతి మహల్‌లో ఎవరో వార్డుబాయ్‌ చెట్టుకు ఉరేసుకున్నాడని చెప్పారు. అంతే ఆ విషయం విన్న కొందరు గ్రామస్తులు.. ఇది అంత మంచి స్థలం కాదని తాము ముందే చెప్పామని, ఎప్పుడూ ఏదొక కీడు జరుగుతూనే ఉందని అన్నారు. అంతకు ముందు వరకు జయంతి మహల్‌ వద్ద రాకపోకలతో సందడిగా ఉండే ప్రాంతం ఒక్కసారిగా అరణ్యంలా మారింది. ఆస్పత్రిలో పనిచేసే వాచ్‌మన్‌ నుంచి వార్డుబాయ్‌ వరకు పని చేయడానికి కుదిరిన ఆ గ్రామస్తులంతా పని మానేశారు. తర్వాత అక్కడ పని చేయడానికి ఇతర రాష్ట్రాల నుంచి హిందీ వాళ్లని కొంతమందిని నియమించారు. పగటిపూట కేసుల్ని ఎక్కువగా తీసుకొస్తుండటంతో గ్రామస్తులు భయపడుతున్నారని రాత్రిపూటే అంబులెన్స్‌ల రాకపోకలు సాగేవి. పగలు తక్కువగా ఉండేవి.

‘‘అసలేం జరుగుతుందయ్యా! పోలీసులు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా? ఇన్ని కేసులు నమోదవుతున్నా ఏం తేల్చలేక పోతున్నారేంటి’’ అని పోలీసు అధికారులపై మంత్రి తులసీదాస్‌ తన చాంబర్‌లో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నలభైరెండు అవయవాల మిస్సింగ్‌ కేసులు నమోదవగా రామ్‌నగర్‌ నియోజకవర్గంలోనే ఇరవైమూడు కేసులు నమోదయ్యాయి.æప్రజలంతా రోజూ తనని కలిసి తమ గోడు చెబుతుంటే కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయన్నారు. ప్రజలకు ప్రభుత్వం ఏం సమాధానం చెప్పాలని పోలీస్, వైద్యాధికారులపై గుర్రుమన్నారు. ‘‘రామ్‌నగర్‌ డీఎస్పీ ఎవరయ్యా.. ఆయన అధికారిగా ఉన్నచోటే ఇంత జరుగుతున్నా కేసుల్లో ఎలాంటి పురోగతి లేదు’’ అని మంత్రి అరిచేసరికి.. సర్‌ ఈయనే రామ్‌నగర్‌ డీఎస్పీ నరేశ్‌ అని, మూడ్రోజుల క్రితమే కామారెడ్డి నుంచి బదిలీ అయ్యి వచ్చారని పై అధికారి మంత్రికి వివరణ ఇచ్చుకున్నాడు. సరే తన శాఖలో ఇదంతా జరుగుతోంది కాబట్టి, ప్రభుత్వానికి తాను సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందని, త్వరగా కేసులను ఓ కొలిక్కి తేమని హుకుం జారీ చేశాడు మంత్రి.

డీఎస్పీ నరేశ్‌ తన పరిధిలోని అవయవాల మిస్సింగ్‌ కేసులను పరిశోధించసాగాడు. ఈ క్రమంలో ఆ మరుసటి రోజే బాధితుల్లో కొందరి కుటుంబ సభ్యులను డీఎస్పీ నరేశ్‌ను కలిశాడు. ‘‘సార్‌! మాది రామ్‌నగర్‌ నియోజకవర్గంలోని కొండాపూర్‌. మా అబ్బాయి ప్రసాద్‌ ఇంటర్మీడియట్‌ రెండో సంవత్సరం చదువుతున్నాడు. కాలేజీలో ఉండగా ఉన్నట్టుండి కిందపడిపోయాడు. కాలేజీ వాళ్లు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి డాక్టర్‌లు చూసి మా అబ్బాయికి సడెన్‌గా కార్డియాక్‌ అరెస్ట్‌ అయిందని వెంటనే గుండె మార్పిడి చేయాలన్నారు. అందుకోసం రాజధానిలోని అన్ని ఆస్పత్రులకు తిప్పి చివరికి కాపాడలేక చేతులెత్తేయగా ప్రసాద్‌ చనిపోయాడు. కానీ మా బంధువుల్లో ఒకరు మెడికల్‌ ఫీల్డులో ఉన్న వ్యక్తి ఇందులో అనుమానం ఉందని భావించి తనకు తెలిసిన డాక్టర్‌తో శవాన్ని పరీక్షింపచేయగా, మా అబ్బాయి శరీరంలో కిడ్నీలు, లివర్‌ లేవని తెలిసింది’’ అని ఏడుస్తూ చెప్పారు. తర్వాత కేసును ఈ స్టేషన్‌కు బదిలీ చేశారని సిబ్బంది తెలిపారు.

తర్వాత ఆ డాక్టర్‌ను కలిసిన డీఎస్పీ నరేశ్‌.. ప్రసాద్‌ను ఏయే ఆస్పత్రులకు తిప్పారని, చివరకు ఏ ఆస్పత్రిలో చనిపోయాడని కనుక్కుని వివరాలన్నీ సేకరించాడు. అందులో సుజనా ఆస్పత్రి పేరు కూడా ఉంది. ప్రసాద్‌ శవాన్ని పరీక్షించినప్పుడు అవయవాలు లేవని తెలియడంతో పాటు ఈ చిన్న సర్జికల్‌ నైఫ్‌ శరీరంలోనే ఉందని డీఎస్పీ నరేశ్‌కు డాక్టర్‌ చూపించాడు. ఆ నైఫ్‌ను ఆపరేషన్‌ చేశాక శరీరంలోనే మర్చిపోయి ఉంటారని భావించిన నరేశ్‌ దాన్ని ల్యాబ్‌కు పంపించి వివరాలు కనుక్కోమని సిబ్బందికి చెప్పాడు. సాయంత్రం కల్లా వచ్చిన వివరాల్లో నైఫ్‌ మీద ‘ఎస్‌హెచ్‌’ అని చిన్న అక్షరాలున్నాయని, అది సుజనా హాస్పిటల్స్‌ లోగో అని నరేశ్‌కు విచారణలో తేలింది. దాంతో ఇప్పటి వరకూ మిస్సయిన కేసుల్లో కూడా ఆ హాస్పిటల్‌ వ్యవహారం అనుమానాస్పదంగా ఉండటం, పైగా జయంతి మహల్‌లో కూడా భాగస్వామ్యం ఉండటంతో డీఎస్పీ నరేశ్‌కు ఆ ఆస్పత్రి ఎండీ డాక్టర్‌ రజనీకాంత్‌పై సందేహం కలిగింది. వెంటనే ఆస్పత్రి వివరాలు కావాలని అడిగేసరికి సిబ్బంది ఆస్పత్రికి సంబంధించిన బ్రోచర్‌ను చూపించారు. అందులో డాక్టర్‌ రజినీకాంత్‌ ఫొటో చూసి ఆశ్చర్యపోయాడు నరేశ్‌.
అతనిపై అనుమానం కలిగినప్పటి నుంచి వివరాలన్నీ సేకరించి రజినీకాంత్‌ను అదుపులోకి తీసుకోవాలని పై అధికారులకు తెలిపారు. కష్టంగా లభించిన అనుమతితో రజినీకాంత్‌ను అదుపులోకి తీసుకున్న నరేశ్‌ ఇంటరాగేషన్‌ ప్రారంభించాడు.

‘‘ఆ.. చెప్పండి.. ఈ ఆర్గాన్‌ రాకెట్‌కు మీకు ఏంటి సంబంధం’’ అని రజినీకాంత్‌ను అడిగాడు నరేశ్‌.  ఏదో ఇన్ఫర్మేషన్‌ కావాలని తీసుకొచ్చి ఏం మాట్లాడుతున్నారని ఎదురు ప్రశ్నించాడు రజినీకాంత్‌. ‘‘అసలు నన్నేమనుకుంటున్నావ్‌..?’’ అని లేచే సరికి పోలీసు ట్రీట్‌మెంట్‌ చవిచూపించాడు డీఎస్పీ. ‘‘చెప్పు.. నీకూ, మినిస్టర్‌ తులసీదాస్‌కు ఏంటి సంబంధం? అసలు ఈ అవయవ మార్పిడి కేంద్రంగా ఏం జరుగుతోంద’’ని బాంబు పేల్చేసరికి తెల్లబోయాడు రజినీకాంత్‌. ‘‘ఆ రోజు మినిస్టర్‌ చాంబర్‌ నుంచి నేను బయటికి వస్తుంటే నువ్వు మంత్రిని కలవడానికి అక్కడ కూర్చున్నావ్‌.. మా సిబ్బంది మీ ఆస్పత్రి బ్రోచర్‌ను చూపించినప్పుడే నీ ఫొటో చూసి అనుమానం కలిగింద’’ని చెప్పాడు. విచారణ కొంచెం హార్డ్‌గా చేసే సరికి నిజం కక్కాడు రజినీకాంత్‌.. ‘‘నేనూ, తులసీదాస్‌ కలిసి చదువుకున్నాం. కానీ మధ్యలో వాళ్ల నాన్న గారు చనిపోవడంతో అతను ఎమ్మెల్యేగా పోటీ చేశాడు. తన కోరికను తన కొడుకు తీర్చాలని సంహిత్‌ను ఐర్లాండ్‌లో డాక్టర్‌ చదివించి పెద్ద ఆస్పత్రి నిర్మించి డబ్బు సంపాదించాలని అనుకున్నాడు.

అందుకు తన నియోజకవర్గంలోనే ప్రజల మధ్య సంహిత్‌తో చిన్న ఆస్పత్రి ప్రారంభించి ఉచిత సేవలు ప్రారంభిద్దామని అనుకున్నాడు. సంహిత్‌ ఇక్కడెందుకు ఫారిన్‌లో ప్రాక్టీస్‌ చేయిద్దామనేసరికి, ఇక్కడైతే ప్రాక్టీసులో ఏమైనా పొరపాటు జరిగినా తాను చూసుకుంటానని, పైగా తనకు ఇక్కడి ప్రజల మధ్య మంచి పేరు వస్తే రాజకీయంగా ఉపయోగపడుతుందని అన్నాడు. కానీ సంహిత్‌కు రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు హార్ట్‌ను మార్చాలని డాక్టర్లు వెతుకుతుండగా, సరిగా అదే సమయానికి రామ్‌నగర్‌ వ్యక్తి ఒకరు బ్రెయిన్‌ డెడ్‌ అయ్యారు. అతని గుండె కావాలని వారి తల్లిదండ్రులను కోరితే వారు ఎంతకీ ఒప్పుకోలేదు. దీంతో సంహిత్‌ చనిపోయాడు. అంతే..! అప్పట్నుంచి కొడుకు పోయిన బాధ ఒక వైపు.. తాను ప్రజలకు ఇంత చేసినా.. తన కొడుకు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే సాయం చేయాలేకపోయారని పగ మరోవైపు.

రెండు రకాలుగా తులసీదాస్‌ నలిగిపోయాడు.  తర్వాత తన పలుకుబడితో ఆరోగ్య శాఖ మంత్రి అయ్యాడు. ముందుగా అనుకున్న ప్రకారమే ప్రజలు భయపడుతున్న జయంతి మహల్‌ను ఆస్పత్రిగా కాకుండా, అవయవ మార్పిడి కేంద్రంగా మార్చాం. అక్కడ మా ఆస్పత్రి ఆధ్వర్యంలో రాజధాని నుంచి వచ్చే కేసుల్లో అవయవాలను వేరుచేసి వేరే దేశాలకు రహస్యంగా ఎగుమతి చేస్తున్నాం. అందులో భాగంగానే అక్కడ జనం ఎక్కువగా తిరుగుతూ పనికి ఇబ్బందిగా మారిందని వార్డ్‌బాయ్‌ని చంపి చెట్టుకు ఉరివేశాం. భయంతో అప్పట్నుంచి జనం అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. మా వ్యాపారానికి అవసరమైన అనుమతులు ఇచ్చి ప్రభుత్వం నుంచి తులసీదాస్‌ సహాయం చేసేవాడు’’ అని ముగించాడు రజనీకాంత్‌. ఈ ఇన్వెస్టిగేషన్‌ తర్వాత తులసీదాస్‌ మంత్రి పదవి ఊడింది. అంతేకాదు, డాక్టర్‌తో పాటు తులసీదాస్‌ కూడా జైలుపాలయ్యాడు.
 

- ఉమేశ్‌ కోమటి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement