దేవదేవుడైన శ్రీవేంకటేశ్వరునికి భక్తులు వివిధ రూపాల్లో మొక్కులు చెల్లిస్తూ భక్తితో శరణు కోరుతుంటారు. భక్తి తత్పరులు, కోర్కెలు నెరవేరినవారు, కోర్కెలు నెరవేరాల్సిన వారు ఆపదమొక్కులవాడికి ఎన్నోరకాల మొక్కులు చెల్లిసారు. ఏడుకొండల వాడికి మొక్కులు చెల్లించేందుకు నిర్ణీతకాలంలో ప్రత్యేకంగా దీక్షా మార్గాన్ని ఎంచుకుంటారు. భూ శయనం, బ్రహ్మచర్య దీక్ష, ఏకభుక్తం వంటి నియమాలతో తల వెంట్రుకలు తీయకుండా దీక్షను చేపడతారు. పూర్తికాగానే కాలినడకన యాత్రగా తిరుమలకు చేరుకుంటారు. భక్తిశ్రద్ధ్దలతో తలనీలాలు సమర్పించి పుష్కరిణిలో పుణ్యస్నానం ఆచరిస్తారు.
దివ్యమైన కాలినడక
కోర్కెలు తీర్చే కోనేటిరాయుడిని ప్రసన్నం చేసుకునేందుకు భక్తులు తొలుత చేసేది... నడచి వచ్చి స్వామివారిని దర్శించుకోవడమే. కొందరు మోకాళ్లతో, మరికొందరు పొర్లుదండాలతో ఎక్కుతూ మొక్కులు చెల్లిస్తుంటారు. ఇంకొందరు మెట్టు మెట్టుకూ పూజలు, మరికొందరు ప్రతిమెట్టుకూ పసుపు, కుంకుమ పూసి, కర్పూరం వెలిగిస్తే, మరి కొందరు కొబ్బరికాయలు కొడుతూ తిరుమల కొండెక్కుతారు. రోడ్డు, వాహన సదుపాయాలు లేనిరోజుల్లో కాలిబాటే తిరుమలకు ఏకైక మార్గం. అధునాతనమైన రెండు ఘాట్‌రోడ్లు ఏర్పడి రోజుకు పదివేలకుపైగా వాహనాలు రాకపోకలు సాగిస్తున్నా తిరుమలకు నడిచివెళ్లే భక్తుల సంఖ్య మాత్రం రోజురోజుకీ పెరిగిపోతోందంటే ఈ మొక్కుపై భక్తులకు ఎంత విశ్వాసం ఉందో అర్థం చేసుకోవచ్చు. సాధారణ రోజుల్లో 15 వేలు, సెలవలు, ఉత్సవాల రోజుల్లో 40 వేలవరకు భక్తులు కాలినడకన కొండెక్కుతున్నారు.
‘తల’ నీలాల సమర్పణ
వెంకన్న మొక్కులో తలనీలాల మొక్కు అత్యంత ప్రధానమైంది. అనాదిగా వస్తున్న ఈ ఆచారానికి ఆధునిక కంప్యూటర్ యుగంలో కూడా భక్తులు బ్రహ్మరథం పడుతుండటం విశేషం. క్రీ.శ.1830కు ముందు నుండే తలనీలాలు మొక్కుగా చెల్లించే ఆచారం ఉన్నట్టు శాసనాధారం.
పుష్కరిణి పుణ్యస్నానం
భక్తుల మొక్కులలో పరమ పవిత్రమైంది పుష్కరిణీ స్నానం. బ్రహ్మాండంలోని సర్వ తీర్థాల నిలయం శ్రీవారి పుష్కరిణి. పుష్కరిణి దర్శించడం, తీర్థాన్ని సేవించడం, పుణ్యస్నాన మాచరించడంతో సర్వపాపాలు తొలగి, మోక్షం సిద్ధ్దిస్తుంది. ప్రతియేటా బ్రహ్మోత్సవాల చివరి రోజున చక్రస్నానం కార్యక్రమాన్ని పుష్కరిణిలో వేడుకగా నిర్వహిస్తారు. అలాగే, ప్రతి ఏడాది ఫాల్గుణ మాసంలో ఐదు రోజుల పాటు తెప్పోత్సవాలు నిర్వహిస్తారు.
వరాహస్వామి దర్శనం
తిరుమల క్షేత్రంలో ఆదిదైవం శ్రీ వరాహస్వామి. అందుకే ఈ పుణ్యతీర్థాన్ని ఆది వరాహ క్షేత్రమని పిలుస్తుంటారు. వైకుంఠం వదిలి భూలోకం వచ్చిన శ్రీనివాసునికి వరాహస్వామివారే స్థలాన్ని ప్రసాదించారు. దీనికి ప్రతిఫలంగా భక్తుల తొలి దర్శనాన్ని వరాహస్వామి పొందారు. దానితోపాటు తొలిపూజ, తొలినైవేద్యం వరాహస్వామికే! సామాన్య భక్తుడి నుండి ప్రముఖుల వరకు తొలుత వరాహస్వామిని దర్శించిన తర్వాతే శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు. దీన్ని కొనసాగిస్తేనే ఫుణ్యఫలం దక్కుతుంది.
తులా ‘భారం’.. నిలువుదోపిడీ
తిరుమలేశునికి భక్తులు తులాభార రూపంలో చిల్లర, బెల్లం, పటిక బెల్లంతో మొక్కులు చెల్లిస్తుంటారు. కొందరు ముడుపుల రూపంలో పోగుచేసిన నగదును హుండీలో సమర్పిస్తారు. వెంకన్నను కొలిచే భక్తుల్లో దాదాపుగా పుట్టిన ప్రతి బిడ్డనూ ఏదో ఒక సందర్భంలో స్వామివారికి ఏదో ఒక రూపంలో తులాభారం సమర్పించి మొక్కులు చెల్లిస్తుంటారు. రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, అధికారులు కూడా తులాభారం సమర్పిస్తుంటారు. కొందరు ఇంకో అడుగు ముందుకేసి నిలువుదోపిడీ రూపంలో తాము ధరించిన ఆభరణాలన్నిటినీ హుండీలో సమర్పిస్తారు. వెంట తీసుకొచ్చిన నగదు, ఇతర కానుకల్ని కూడా సమర్పిస్తారు.
ఆపద్బాంధవా... మా మొక్కులివిగోనయ్యా!
Published Sun, Oct 6 2013 2:17 AM | Last Updated on Fri, Nov 9 2018 6:29 PM
Advertisement
Advertisement