పట్టుకోవడం కష్టం కాదు... అసాధ్యం!
అప్పారావు: దూరంగా ఉన్నవేవీ కనిపించడం లేదండీ.డాక్టర్ వెంగళ్: ఈ కిటికీలో నుంచి చూసి చెప్పు... ఆకాశంలో చందమామ కనిపిస్తుందా?అప్పారావు: బేషుగ్గా.డాక్టర్ వెంగళ్: అంత దూరాన ఉన్న చందమామనే చూడగలిగావ్. నీకెలాంటి సమస్యా లేదు వెళ్లు!
బాక్సాఫీసు సూత్రాన్ని శాశ్వతంగా పట్టుకోవడం కష్టం కాదు... అసాధ్యం. డాన్‌ని కూడా అంతే. డాన్ కో పకడ్‌నా ముష్కిల్ నహీ... న ముమ్‌కిన్ హై!
‘షోలే’తో పుట్టారు సలీమ్-జావేద్ అనే బాలీవుడ్ పరుచూరి బ్రదర్స్. కానీ, 1978లో ‘డాన్’ క్యారెక్టర్‌ని హీరోగా చేసి రాసిన స్క్రిప్టుతో బాలీవుడ్‌లో ఏ దర్శకుడిని, నిర్మాతని, హీరోని ఒప్పించ లేకపోయారు. అందరి తిరస్కారానికీ గురైన ఆ స్క్రిప్టు ‘నారీమన్ ఎ. ఇరానీ’ అనే సినిమాటోగ్రాఫర్ కమ్ నిర్మాత జీవితాన్ని నిలబెట్టిందంటే ఆశ్చర్యం వేయక మానదు.
ఇరానీ ఒక చిత్రం తీసి చేతులు, కాళ్లు, వళ్లు అన్నీ కాల్చుకుని కోటి ఇరవై లక్షల అప్పులో మునిగిపోతే, కెమెరామేన్‌గా వచ్చిన డబ్బులు బతకడానికీ, ఇంత పెద్ద అప్పు తీర్చడానికీ సరిపోక జీవితం దురవస్థల పాలైతే, ఆయన కెమెరామెన్‌గా మనోజ్ కుమార్ ప్రొడక్షన్‌లో ‘రోటీ కప్‌డా ఔర్ మకాన్’ అనే చిత్రానికి పనిచేస్తుంటే, దాని అసిస్టెంట్ డెరైక్టర్ చందర్ బారోత్ ఈయన దుస్థితిని చూడలేక, అమితాబ్‌ని, జీనత్ అమన్‌ని, నారీమన్‌గారు నిర్మాతగా ఒక్క చిత్రం చేసిపెడదాం అందరం కలిసి అని ఒప్పించారు.
సలీమ్-జావెద్‌లని కలిస్తే ఎలాగా కంచి గరుడ సేవే కాబట్టి అప్పటికే కంచికి వెళ్లిపోయిందనుకున్న ‘డాన్’ కథని చవకగా ఇచ్చేశారు. మూడేళ్లు నానా కష్టాలూ పడి ఫైనాన్స్‌లు సమ కూర్చుకుని చందర్ బారోత్ దర్శకుడిగా చిత్రాన్ని పూర్తిచేస్తే, ఈలోపు నారీమన్ ఇరానీ చనిపోయారు.
చిత్రం మీద వచ్చే డబ్బు ఆయన భార్యకి చెందేలా ఏర్పాటు చేసి మొత్తానికి చిత్రాన్ని రిలీజ్ చేస్తే అట్టర్ ఫ్లాప్ టాక్. అయినా ఓపిగ్గా థియేటర్ల వాళ్లు అలాగే ఉంచితే, ఆ నోటా ఈ నోటా ‘ఖైకే పాన్ బనారస్ వాలా..’, ‘అరె దీవానో...’, ‘యే మేరా దిల్...’ పాటలు బాగా పాపులర్ అయిపోయాయి. దాంతో జనం థియేటర్లకు పరుగు తీశారు. ఆ దెబ్బకి సినిమా రెండో వారం నుంచి పికప్ అయ్యి, చివరికి పెద్ద హిట్టయ్యి కూచుంది.
సినిమాలో సెకండాఫ్ ట్విస్టులతో చాలా హెవీ అయిపోయింది కాబట్టి ప్రేక్షకుడికి రిలీఫ్ కోసం ఒక పాట పెట్టమని రషెస్ చూసిన మనోజ్‌కుమార్ సలహా ఇస్తే, అప్పుడు ఆలోచించి పెట్టిన పాటే ‘ఖైకే పాన్ బనారస్ వాలా’. చివరికి అదే ఈ చిత్రాన్ని పైలట్‌లా ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లింది.
తర్వాత ఇదే డాన్ 2006లో ఓ కొత్త రికార్డు నెలకొల్పాడు. జావేద్ అక్తర్ కొడుకు ఫర్హాన్ అక్తర్ దర్శకుడిగా బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌తో ‘డాన్’ మరో సారి వచ్చింది. మళ్లీ సూపర్ హిట్ అయ్యి కూర్చుంది. డాన్‌ని పట్టుకోవడం కష్టం కాదు అసాధ్యం అనుకుంటే కమర్షియల్ సినీ అభిమానులు ఆ డాన్‌ని అలవోకగా అభిమానంతో పట్టేశారు. గుండెల్లో దాచేశారు. ఇది చేసిన ఆర్టిస్టుల గొప్పదనం కాదు. తీసిన దర్శకుల గొప్పదనం కాదు. నిర్మాతల ఘనత అంతకన్నా కాదు. ఇది పూర్తిగా రచయితల విజయం.
అన్నీ అమరి, అందరూ అప్పు తీర్చడానికి నడుం కట్టి సినిమా చేస్తే, ఆ సంకల్ప బలం నారీమన్ అప్పుల్ని తీర్చింది గానీ, వేరే సినిమా షూటింగ్‌లో కెమెరామెన్‌గా యాక్సిడెంట్‌కి గురైతే ఆయన ప్రాణాల్ని కాపాడలేకపోయింది. జీనత్ అమన్ మాత్రం చాలా జెన్యూన్‌గా ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు పారితోషికంగా. నిజమైన చారిటీ ఆమెదే.
మొదటి డాన్ దర్శకుడు చందర్ తర్వాత చెప్పుకోదగ్గ చిత్రాలేవీ తీయలేదు. కానీ ‘డాన్’తో బాక్సాఫీస్‌ని అద్భుతంగా ప్రభావితం చేసి, ‘డాన్’ డెరైక్టర్‌గా మిగిలిపోయారు. ‘డాన్’ హీరోయిజమ్, విలనిజమ్ రెండు షేడ్సూ హీరోలకి మాస్ ఇమేజ్‌ని పెంచే క్యారెక్టర్లుగా మిగిలి పోయాయి. ఎనిమిదిన్నర కోట్ల బడ్జెట్‌తో తీస్తే డెబ్భై కోట్లు వసూలు చేసింది. ఇక షారుఖ్ ‘డాన్’ అరవై కోట్ల ఖర్చుతో తీస్తే నూట అయిదు కోట్లు వసూలు చేసింది.
78లోనే తెలుగులో ఎన్టీఆర్ ‘యుగంధర్’గా, తమిళంలో రజనీకాంత్ ‘డాన్’ పేరుతో ఈ హిందీ ‘డాన్’ని రీమేక్ చేసి హిట్టు కొట్టారు. మళ్లీ 2006లో షారుఖ్ ‘డాన్’ని తమిళంలో విష్ణువర్థన్ దర్శకత్వంలో అజిత్ హీరోగా ‘బిల్లా’ పేరుతో, తెలుగులో మెహర్ రమేష్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ‘బిల్లా’ పేరుతో రీమేక్ చేసి హిట్టు కొట్టారు. షారుఖ్ పక్కన ప్రియాంకా చోప్రా అందాలు ఆరబోస్తే, అజిత్ పక్కన నయనతార, ప్రభాస్ పక్కన అనుష్క ఎప్పుడూ లేనంత గ్లామరస్‌గా కనిపించి ప్రేక్షకుల మతులు పోగొట్టారు.
షారుఖ్ ‘డాన్’లో ఫర్హాన్ అక్తర్ టేకింగ్ స్టైల్ చాలా బావుంటుంది. అమితాబ్ లాంటి హీరో సినిమాని ఎవరు చేసినా సాధారణంగా చూడబుద్ధి కాదు. అలా చూసుకుంటే షారుఖ్ కొంత కొరతగా అనిపించవచ్చు గానీ, ఆ పోలిక లేకుంటే షారుఖ్ కూడా ప్రేక్షకుల్ని బాగా మెప్పించినట్టే. కొత్త డాన్ హిట్ కావడానికి షారుఖ్ ఇమేజ్ బాగా పని చేసిందన్నది కాదనలేని వాస్తవం.
పాటల్లో కూడా ‘ఖైకే పాన్ బనారస్ వాలా’, ‘యే మేరా దిల్’ని రీమిక్స్ చేసి మంచి పనిచేశారు దర్శకుడు ఫర్హాన్. హెలెన్ పోషించిన కామిని పాత్రని కరీనా కపూర్ పోషించడం సినిమాకి పెద్ద అట్రాక్షన్. అర్జున్ రామ్‌పాల్ పోషించిన జస్జీత్ పాత్ర చేయమని మొదట అక్షయ్ కుమార్‌ని అడిగితే, ‘డాన్’ పాత్ర అయితే చేస్తాను తప్ప వేరే పాత్ర చేయనన్నాట్ట. దాంతో అది అర్జున్‌కి దక్కింది.
78లో సలీమ్ - జావెద్ ఊహించిన ‘డాన్’ పాత్ర చిత్రణ, దాని నడవడిక, అందులో వచ్చిన ట్విస్ట్‌లు, పాత్రల స్వభావం కోసం వారు రాసిన మాస్, పంచ్ డైలాగులు... ఇవన్నీ 2006లో కూడా యథాతథంగా అంతే మోడరన్‌గా, స్టైలిష్‌గా ఉన్నాయి. ప్రేక్షకులను అంతే ఆకట్టుకుఆన్నయి. అంటే ఒరిజినల్ ఆలోచన ఎంత గొప్పదో ఊహించుకోవచ్చు. మేధస్సంటే అదే. కాయితం మీద ఇలాంటి చిత్రాన్ని ఇంత బలంగా సృష్టించడం. దురదృష్టమంటే కూడా ఇదే. అంత పెద్ద రచయితలు కూడా ఇలాంటి స్క్రిప్టుతో ఎవరినీ ఒప్పించలేక పోవడం. అదృష్టమంటే ఆడియన్స్‌దే. ఏదో ఒకలా ఒక బలమైన సంకల్పం మూడున్నరేళ్లు కష్టపడి వెండితెరమీద బొమ్మైపడడం. అది మనసుల్ని రంజింపజేయడం.
ఎంతమంది కథకులు నేర్చుకోవాల్సిన విషయాలున్నాయో ‘డాన్’ స్క్రిప్టులో అడుగడుగునా. ఈ ‘డాన్’ సక్సెస్ హాలీవుడ్‌లో ఒక చిత్రాన్ని ఇన్‌స్పైర్ చేసింది. కానీ అది ఆడలేదు. ఇదే సక్సెస్ రేఖ హీరోయిన్‌గా ‘మేడమ్ గీ’ పేరుతో ఇంకో చిత్రం రూపొందడానికి కూడా కారణమయ్యింది. అదీ ఆడలేదు. ఇలా ప్రభావితమై కొత్తగా రాసుకుని తీసిన చిత్రాలన్నీ ఫెయిలయ్యాయి. యథాతథంగా రీమేక్ చేసిన చిత్రాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. అందుకే అన్నాను ఇది రచయితల విజయం అని.
‘దేడ్ కహానీ’ అని దశాబ్దంన్నర కాలంలో బాలీవుడ్ సూపర్ హిట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా! 2000 నుంచి 2006 వరకూ నేను ప్రస్తావించిన ప్రతీ చిత్రమూ పాత కథే. అత్యంత పాత కథ షేక్‌స్పియర్‌ది (1595). అంటే ఒకటిన్నర దశాబ్ద కాలంలో బాలీవుడ్‌లో చిత్రాలుగా వచ్చిన కథలన్నీ మ్యాగ్జిమమ్ నాలుగు వేల సంవత్సరాల పాతవన్నమాట. కావాలంటే వెనక్కెళ్లి మళ్లీ అన్ని ఆర్టికల్సూ చూడండి... మీకే తెలుస్తుంది!