అటు చూడు
డాక్టర్ ముఖర్జీకీ పని అంటే ఎంత ఇష్టమో, స్నేహితులతో గడపడం అంటే అంతే ఇష్టం. ఏ మాత్రం సమయం చిక్కినా రెక్కలు కట్టుకొని స్నేహితుల దగ్గర వాలిపోతుంటాడు. వాళ్లతో కలిసి కొత్త ప్రదేశాలకు ప్రయాణం చేస్తుంటాడు. ముఖర్జీ ముక్కోపి. చిన్న చిన్న విషయాలకే అగ్గిమీద గుగ్గిలం అవుతుంటాడు. అందుకే ఒకసారి కనిపించిన స్నేహితులు మరోసారి అతని దగ్గర కనిపించరు. అయినా సరే ముఖర్జీతో స్నేహం చేయడానికి అందరూ
ఉవ్విళ్లూరుతుంటారు. దీనికి కారణం... ఆయన పేరున్న డాక్టరా?పలుకుబడి ఉన్న వ్యక్తా? అనేది తెలియదుగానీ... ముఖర్జీ స్నేహం నీటి చెలమలాంటిది. తరగనిది. అలాంటి ముఖర్జీ ఒకరోజు హత్యకు గురయ్యాడు.పని నుంచి విరామం కోసం స్నేహితులతో కలిసి నిర్జన ప్రదేశాలలో, స్నేహితులతో కలిసి రెండు రోజులు ప్రకృతి మధ్య గడపడం ముఖర్జీకి అలవాటు. ఈసారి కూడా అలాగే వెళ్లాడు.అయితే వెళ్లిన వ్యక్తి తిరిగిరాలేదు.
ఎవరితో కలిసి వెళ్లాడో కూడా ఎవరికీ తెలియదు. ఊరి బయట నిర్జనప్రదేశంలో పడి ఉన్న ముఖర్జీ శవాన్ని పశువుల కాపరి చూడడంతో, ముఖర్జీ హత్యకు గురయ్యాడనే విషయం లోకానికి తెలిసింది. చనిపోయే ముందు ఒక పెద్ద చెట్టుకు నడుం ఆన్చి కూలబడిపోయాడు. పక్కన పెద్దరాయిపై ఉన్న కుడిచేయి పైకి చూపిస్తున్నట్లుగా ఉంది.‘‘ఆ చెయ్యి యాదృచ్ఛికంగా పెట్టింది కాదు. అతను ఏదో క్లూ ఇవ్వడానికి ప్రయత్నించాడు’’ అన్నాడు ఇన్‌స్పెక్టర్ నరసింహ.
‘‘ఏమిటది?’’ అడిగాడు హెడ్‌కానిస్టేబుల్ సుందరం.‘‘అడగడం కాదు ఆలోచించు’’ చిన్నగా విసుక్కున్నాడు ఇన్‌స్పెక్టర్.‘‘అలాగే సార్’’ అంటూ వినయంగా బదులిచ్చాడు సుందరం.
పోలీసులు అనుమానితుల జాబితా సిద్ధం చేశారు.
1. శ్రీకర్, మోడల్
2. రాకేష్, చెఫ్
3. చంద్ర, ఇంజనీర్
4. తేజ, బేస్‌బాల్ కోచ్
ఆరాత్రి... హత్య జరిగిన ప్రదేశంలో చెట్టు దగ్గరికెళ్లి అచ్చం ముఖర్జీలా కూలబడి అదే పెద్దరాయిపై కుడిచేయి పెట్టాడు ఇన్‌స్పెక్టర్.
ఆ చేయి పైకి చూపిస్తుంది.
‘‘హంతకుడు ఎవరో తెలిసింది!’’ కాస్త గట్టిగానే అన్నాడు ఇన్‌స్పెక్టర్.
హంతకుడు ఎవరో మీరు చెప్పగలరా?
జవాబు: కుడిచేయి ఆకాశం వైపు చూపిస్తుంది. ఆకాశంలో నిండు చంద్రుడు కనిపిస్తున్నాడు. తనపై దాడి చేసిన చంద్ర (ఇంజనీర్) గురించి క్లూ ఇవ్వడానికి ముఖర్జీ చేయి చంద్రుడిని చూపించింది.