కలిసినప్పటి నుంచీ...
సందేహం
నా వయసు 25. నాకు ఇద్దరు పిల్లలు. బాబుకు మూడేళ్లు, పాపకు రెండేళ్లు. రెండు సిజేరియన్ ఆపరేషన్లు జరిగాయి. డెలివరీ అయిన అయిదు నెలల వరకు దూరంగా ఉండాలని, లేదంటే సమస్యలు వస్తాయని ఫ్రెండ్స్ చెప్పారు. కానీ మా ఆయన బలవంతం మీద మేము కలిశాం. ఆ తర్వాత చాలా మంటగా అనిపించింది. యోని మొదలు, చివర చీలింది. నాకు బ్లీడింగ్ ఆగిపోయింది. కలిసినప్పటి నుంచి కుట్ల దగ్గర నొప్పిగా ఉంది. నాకు చాలా భయంగా ఉంది. ఏదైనా సమస్య కానీ, ఇన్‌ఫెక్షన్ కానీ వస్తాయా? ప్రెగ్నెన్సీలాగే కడుపు లావుగా ఉంది. నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఎలాంటి వ్యాయామాలు చేసి ఈ కడుపును తగ్గించుకోవాలి. దయచేసి పరిష్కారం చెప్పండి?
- జ్యోతి, అనంతపురం
సాధారణంగా సిజేరియన్ ఆపరేషన్ అయిన మూడు నెలల తర్వాత కుట్లలో నొప్పి ఏమీ లేకుండా ఉండి, బ్లీడింగ్ కాకుండా, నీరసం లాంటి ఇబ్బంది ఏమీ లేకపోతే.. నాలుగో నెల నుంచి భార్యభర్తలు కలవచ్చు. మీరు ఏ నెలలో కలిశారో రాయలేదు. ఇప్పటికీ ఇంకా నొప్పి, దురద ఉంటే ఒకసారి గైనకాలజిస్ట్‌ని సంప్రదించి చికిత్స తీసుకోవడం మంచిది. కాన్పుల తర్వాత తొమ్మిది నెలలు బిడ్డను మొయ్యడానికి గాను పొట్ట మీద సాగిన చర్మం, కండరాలు మొత్తంగా సాధారణ స్థితికి రావు. పొట్ట కండరాలు, చర్మం వదులవడం, పొట్టలో కొవ్వుపేరుకు పోవడం వల్ల పొట్ట లావుగా కనిపిస్తుంది. దీనిని చాలావరకు తగ్గించడానికి నడక, పొట్టకు సంబంధించిన వ్యాయామాలు వంటివి పాటించవలసి ఉంటుంది. ఇవి మీరు సొంతంగా చెయ్యలేనప్పుడు ఫిజియోథెరపిస్ట్‌ను సంప్రదించి వారి సమక్షంలో కొన్ని రోజులపాటు అబ్డామినల్ వ్యాయామాలు నేర్చుకొని, తర్వాత వాటిని పాటిస్తే సరిపోతుంది.
నా వయసు 26. నా బరువు 80. నాకు PCOD ప్రాబ్లమ్ ఉంది. నాకు పెళ్లై నాలుగేళ్లు అవుతుంది. కానీ ఇంకా పిల్లలు లేరు. నాకు ఎనిమిది ఐయూఐ సైకిల్స్ అయ్యాయి. ఇప్పుడు డాక్టర్ నన్ను నాలుగు నెలలు ట్రీట్‌మెంట్‌ను ఆపేయమన్నారు. ఈ నాలుగు నెలలు నాకు ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్లు, ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ వాడమని చెప్పారు. ఈ రెండు ట్యాబ్లెట్స్ వేసుకుంటే కూడా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నది సందేహంగా ఉంది. నాకు సరైన సూచనలను దయచేసి ఇవ్వగలరు.
- దీపిక, కాకినాడ
మీకు PCOD ప్రాబ్లమ్ ఉంది. అలాగే 80 కిలోల బరువు కూడా ఉన్నారు. బరువు ఎక్కువ ఉండి, ్కఇైఈ ఉన్నప్పుడు హార్మోన్ల అసమతుల్యత ఎక్కువగా ఉండడం వల్ల అండం నాణ్యత సరిగా ఉండదు. దానివల్ల అది సరిగా వీర్యకణాలతో ఫలదీకరణ చెందకపోవడం లేదా గర్భాశయం పిండాన్ని అందిపుచ్చుకోకపోవడం వంటి సమస్యలు ఏర్పడతాయి. దాంతో మీకు గర్భం నిలవడానికి ఇబ్బంది అవుతుంది. మీ డాక్టర్ సలహా మేరకు కొన్ని నెలలు చికిత్సకు వ్యవధి ఇచ్చి ఆగవచ్చు.
ఈ లోపల బరువు కూడా కనీసం 5-10 కిలోల వరకు తగ్గడానికి ప్రయత్నించాలి. దీని కోసం వ్యాయామాలు, యోగా, పరిమితమైన ఆహారం వంటివి పాటించాలి.ORAL CONTRACEPTIVE PILLS వాడేటప్పుడు గర్భం రాదు. ఈ వ్యవధిలో పిల్స్ వాడటం వల్ల PCODతో ఉండే హార్మోన్ల అసమతుల్యత కొద్దిగా తగ్గి, అవి ఆపిన తర్వాత కొందరిలో గర్భం దానంతట అదే నిలిచే అవకాశాలు పెరుగుతాయి. లేదంటే మళ్లీ ఇన్‌ఫర్టిలిటీ చికిత్స తీసుకుంటే, త్వరగా గర్భం నిలిచే అవకాశాలు పెరుగుతాయి. బరువు తగ్గడం వల్ల కూడా PCOD తో ఉండే హార్మోన్ల అసమతుల్యత చాలా వరకు తగ్గుతుంది.
నాకు ఇప్పుడు 22 ఏళ్లు. ఇంకా పెళ్లి కాలేదు. పిరుదుల్లో మంట, దురదలాగా వస్తోంది. ఇది వచ్చి వెళ్తూ ఉంటోంది. తగ్గింది కదా అని అనుకునేలోపే మళ్లీ వస్తోంది. వేగంగా నడిచినప్పుడు ఈ మంట, దురద బాగా తెలుస్తోంది. కానీ ఏదో ద్రవం లాంటిది కారినట్టు అనిపించి వెంటనే తగ్గిపోతుంది. ఒక్కోసారి మోషన్‌కి వెళ్లిన కొద్దిసేపటికి తెలుస్తుంది. మరోసారి ఎలాంటి సెన్సేషన్ లేకుండా మామూలుగానే వస్తుంది. మోషన్‌కి వెళ్లేటప్పుడు బ్లడ్ కానీ నొప్పి కానీ ఏమీ ఉండవు. నెల నుంచి యూరిన్ ఇన్‌ఫెక్షన్‌కు యాంటీ బయోటిక్స్ వాడుతున్నాను. డాక్టర్ దగ్గరకు వెళ్లాలంటే భయంగా ఉంది. నా ప్రాబ్లమ్‌కు సొల్యూషన్ చెప్పండి.
- లోహిత
డాక్టర్ దగ్గరకు వెళ్లాలంటే భయంగా ఉందని, సొంతంగా మందులు (యాంటీ బయోటిక్స్) వాడటం మంచిది కాదు. కడుపులో నులిపురుగులు ఉన్నా దురద, తెల్లబట్ట అవడం లేదా యోనిలో ఇన్‌ఫెక్షన్స్, మలాశయ మార్గం నుంచి క్రిములు యోని భాగంలోకి ప్రవేశించినా, ఫంగల్ ఇన్‌ఫెక్షన్స్ ఉన్నా కూడా యోని దగ్గర నుంచి తొడల మధ్యలో ద్రవాలు కారడం, దాని ద్వారా మంట, దురద ఏర్పడతాయి. రక్తహీనత ఉన్నా ఈ సమస్య మాటిమాటికీ వస్తుంటుంది. ఓసారి గైనకాలజిస్ట్‌ను సంప్రదించడం మంచిది. వారు మిమ్మల్ని పరీక్షించి, దానికి సంబంధించిన చికిత్సను కూడా మీకు అందిస్తారు. కారణం తెలుసుకోకుండా సొంతంగా నెలపాటు యాంటీ బయోటిక్స్ వాడితే నీరసం, ఇతర ఫంగల్ ఇన్‌ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
- డా॥వేనాటి శోభ
లీలా హాస్పిటల్, మోతీనగర్, హైదరాబాద్