ఈద్గాలో నమాజు అయిపోయినాక ఒక్కరికి కూడా ఈద్‌ముబారక్ చెప్పకుండా, ఛాతీ ఛాతీ కలిపి వాటేసుకోకుండా, చిల్లర డబ్బుల కోసరం వెంటపడే బుడబుక్కలోళ్లని పుణ్యానికి కూడా పట్టించుకోకుండా ఏందో అర్జెంటు పనున్నట్టుగా యింటికొచ్చేస్తాడు మా నాయిన. ఆయన వెనకనే మా అన్నా నేనూ. పలావొండుంటారు కదా. అదీ కత. కానీ మా నాయిన పుణ్యమా అని ఏ రంజాను పండక్కి కూడా పస్టు పస్టు తినే బాగ్యం మాకు లా. ముందు పెండెం రవికి క్యారేజి కట్టాలి. ఆనేకనే మేము తినాలి. మా నాయినమ్మా అమ్మా అయితే అప్పుడు కూడా తినేదానికిలా. రవికి కట్టిన క్యారేజీని మా నాయిన తీసకెళ్లి వాళ్లింట్లో యిచ్చొచ్చేసినాక – పలావెంకారెడ్డోళ్లొచ్చి పండగ దావత్ చేసెళ్లినాక – బిస్తర్ ఎత్తుకొని, బాసన్లు సర్దుకొని, అప్పుడు తినాలి మా నాయినమ్మా అమ్మా. పాపం వాళ్లు పొద్దుననంగా లేచి పరగడుపున వంటపని మొదలుపెట్టి, మావుసం ముక్కులు శుద్దం చేసుకొని, కొబ్బరి మసాలా నూరుకొని, గోంగూర వొలుచుకొని, కట్టెల పొయ్యిమీద సస్తా బతకతా అంతా రెడీ చేసి పెట్టుంటే మా నాయిననేవోడు నమాజు నుంచి రావడంతోటే ‘మీరు తిన్నారంటమ్మే’ అని అడగబళ్లా? ‘రవికి క్యారేజీ కట్టినారంటమ్మే’ అని అడగతాడు.అడగటమే కాకుండా అటకమీది నుంచి అయిదు డబ్బాల క్యారేజీ దించి, దాని నిండుగా ఆయన సొహస్తాలతో పలావు ముక్కలూ, ఖుర్మా, గట్టి సేమ్యాలూ, పాలసేమ్యాలూ దిట్టంగా పెట్టుకుంటాడు. మా అమ్మా నాయినమ్మా ఎంతో యిష్టంగా ఒండుకున్న పలావులోని ముక్కలన్నీ మా నాయిన లోడుకొని లోడుకొని పోతా వున్నా వాళ్లిద్దరూ నోరు మెదపడానికి లా. కళ్లల్లో ప్రాణాలు పెట్టుకొని చూస్తా వుండిపోవాల్సిందే.
యింతకీ యీ పెండెం రవి ఎవరో తెలియాలంటే గరానా వొంశెస్తుడైన మా నాయిన పూటకు ఠికానా లేని కరెంటు పనోడు ఎట్టయినాడనే కథను తెలుసుకునే పనుంది.మా నాయిన సొంతూరు కావలికి ఉత్తరం తట్టున్న రామాయపట్నం. ‘తెట్టు’ దగ్గిర దిగి మూడు మైళ్లు తూర్పుకెళితే తెల్లటి యిసకా, దూరంగా బులుగు రంగులో సముద్రం ఆనేక మా ఊరూ అవుపిస్తాయి. పొట్టి పెంకుల యిళ్లతో, తాటాకు వసారాలతో, చిల్లచెట్లతో, బకింగ్ హాము కాలవతో బలే కళగా వుంటుంది మా వూరు. మేం పిలకాయలుగా వున్నప్పటి కంటే మా నాయినోళ్ల చిన్నతనంలోనే మా వూరు యింకా కళగా వుండేదంట. అట్టా కళగా వున్నరోజుల్లోనే ఆడ మా తాత మొహమ్మద్ సాయిబు చేపలాపారం చేస్తా లాట్‌గవర్నర్ అమ్మా మొగుడిలా చెలాయిస్తా వుండేవాడంట. అప్పట్లో మా తాత చేతి కింద నాలుగు నాటు పడవలు, పదిమంది పట్టెపోళ్లు, లెక్కలు రాయడానికి ఇద్దరు గుమాస్తాలు వుండేవాళ్లంట. మా తాత హయాములో మాకు సముద్రం దగ్గిర పదిహేనెకరాల సరుగుడు తోట, తెట్టు దగ్గిర రోడ్డు వారగా బెంగుళూరు మామిడితోట,ఆరెకరాల పొలం వుండేవి. (యిప్పుడు యాబై అంకణాల యింటి జాగా మాత్రమే మిగిలింది.) అట్టా డబ్బుదస్కం తిండీ గిండీ జంజామతంగా వున్న మా యింట్లో మా నాయిన ఒక్కగానొక్క మొగపిల్లోడిగా పుట్టినాడు. అందువల్ల మా తాతకీ, మా నాయినమ్మకీ, మా నాయిన కంటే ముందూ వెనకా పుట్టిన మా ముగ్గురు మేనత్తలకీ మా నాయినంటే బలే గారాబం. మా నాయిన యిది కావాలంటే కావాలి. అది వద్దంటే వద్దు రీతిలో చలాయించినాడు.
ముందు నుంచీ కూడా మా నాయినకు చదువంటే బలే యింటరెస్టు వుండటం చూసి మా తాత మా నాయిన్ని ఫస్టుఫారం అయిపోయినాక నెల్లూరులోని సిఎంసి హైస్కూలులో సెకండ్ ఫారం చేర్పించినాడు.ఇస్కూల్లో చదువుకోవడం, కుమార్‌గల్లీలోని మా పెదత్త (మా నాయిన పెదక్క) యింట్లో తిని పొణుకోవడం తప్పితే యింకో పని ఎరగని మా నాయినకు ఎస్‌ఎల్‌సిలో పడింది దెబ్బ. అది కూడా మా పెదత్త బర్తయిన నెల్లూరు సాయిబు రూపంలో. నెల్లూరు సాయిబంటే మా యిలాకాలో చిన్న కత కాదు. ఆయనంత శ్రీమంతుడు, జల్సా మనిషి యింకెవ్వరూ లేరు మా యిళ్లలో. (నెల్లూరు టౌనోడినని బలే డాబుసరిచూపిస్తాడు కాబట్టి మా యిళ్లల్లో ఆయన్ని నెల్లూరు సాయిబు అని పిలస్తారు). మా పెదత్త కట్నం కింద ‘ఊదుబుట్ట’ నిండుగా ఎనబై సవర్ల బంగారాన్ని మా తాత పెడితే ‘నేనంత లెవిలు తక్కువోణ్ణా’అని నలగరి ముందర నగల బుట్టని కాలితో తన్నినాడంటే నెల్లూరు సాయిబు మిడిసిపాటు అప్పట్లో అలా వుండేది. ఒకప్పుడు కుమార్‌గల్లీలో సగం ఆస్తులకు ఓనరయిన మా నెల్లూరు సాయిబు గానాబజానా ఆడోళ్ల పిచ్చిలో పడి ఆస్తులన్నీ కరగపెట్టుకున్నా, బెట్టుసరికి పోయి, ‘నవాబుగారూ’ అంటా మళ్లా ఏ పిలుపు వచ్చినా కాదనుకుండా తయారయి పోతా వుండేవాడంట. అట్టాంటి అలివిగాని మనిషైన నెల్లూరు సాయిబు ఒకరోజు వున్నట్టుండి మా పెద్దత్తను పట్టుకొని సావగొట్టేసినాడు – ‘బిడ్డలు ఎదిగొస్తా వున్నారు... నీ జల్సాలు మానుకోయ్యా’ అని నోరు తెరిచి చెప్పిన పాపానికి. సావగొట్టడమే గాకుండా ‘నువు నాకు అక్కర్లేదు పో’ అని మా పెదత్తని మా తాతింటికి తరిమేసినాడు. ఆమె వెనుకనే ఏడ్చుకుంటా మా నాయిన.
ఆ రావడం రావడం మూడు నెలల దాక మా పెదత్త పోనేలా. నెల్లూరు సాయిబు రానేలా. యింక చేసేదేముంది. లక్షణంగా పరీక్షలు రాయాల్సిన మా నాయిన గోళ్లు గిల్లుకుంటా ఇంట్లో కూచుండిపోయినాడు.
అప్పటికే మా తాత యాపారంలో లాసయిపోయి, మా రెండో అత్త పెళ్లికి సరుగుడు తోట అమ్మకనూకి, చేతిలో డబ్బులాడక అల్లాడతా వున్నాడు. ఆ టయిములో మా పెదత్తొచ్చి నెత్తిన కూచోవడమే కాకుండా మా నాయిన చదువు ఖరాబై పోవడంతో ఆ విసుగునంతా మా నాయిన మీద చూపించినాడంట మా తాత. ఒకరోజు మా బరెగొడ్డు పేడేస్తా వుంటే – ‘రే.. అబయా.. గమ్మున్నట్టా కూచోకపోతే ఆ పేడైనా ఎత్తరాదా’ అన్నాడంట మా నాయినతో.అంతే. మా నాయినకు పొడుచుకొచ్చేసింది.‘యీ నా కొడుకు నన్నింత మాటంటాడా?’ అని అదే రోజు రాత్రి మా యినప్పెట్టెలో నుంచి పదో యిరవయ్యో అంటే ఎల్లికొల్ల కదా. వాటితో రెండు రోజుల పాటు హాయిగా నెల్లూరులో తిరిగి ఆనేక బస్సెక్కి నేరుగా కర్నూల్లో దిగినాడంట మా నాయిన. ఆడ ఏమి చేయాల్నో తెలియక ఆఖరకుఎవుర్నో బతిమిలాడుకొని కరెంటు పనిలో చేరిపోయినాడు.కర్నూలులో మా నాయన పని అట్టా వుంటే రామాయపట్నంలో మా తాత పని యింకోలాగా వుంది. పాపం, కొడుకు కనిపించకుండా పోయేసరికి పిచ్చోడాల తయారయ్యి ఊరూరా తిరిగి వెతకడం మొదలు పెట్టినాడాయన. ఆరు నెలలకి కూడా మా నాయిన కాణ్ణుంచి ఉత్తరం పత్తరం లాకపోయేసరికి ‘వారం రోజుల్లో నా కొడుకుని చూపించినావో సరేసరి. లాకపోతే సముద్రంలో దూకిచస్తా’ అని ఫైనలు వార్నింగిచ్చేసింది మా నాయినమ్మ.
దాంతో మా తాత ‘ఎట్టరా బగమంతుడా’ అనుకుంటా వుంటే ఏడో నెలలో మా నాయిన ఊర్లోకి దిగినాడు, ఒక చేతిలో కరెంటు పనితో యింకో చేతిలో ఎనబై రూపాయిల తొలి సంపాదనతో.ఇదీ మా నాయన కరెంటు పనోడైన కత.నిజానికి యీడతో కతయిపోవాల్సిందేకానీ మా నాయన మామూలోడు కాదు కాబట్టి యింకా కత నడిపించినాడు. మాతాత అన్న మాటని అన్నాళ్లు పోయినా మనసులో నుంచి చెరిపెయ్యకుండా ‘నువ్వూ వద్దూ నీ ఆస్తీ వద్దు’ అంటా కావలికి వచ్చేసినాడు.కావలిలో మా నాయినకు దొరికిన గురువే పెండెం రవి.అప్పట్లో ఆయన పెద్ద ఎలక్ట్రికల్ కాంట్రాక్టరు. మంచి పలుకుబడున్నోడే కాకుండా బలే మనసున్న మనిషాయన. కావల్లో దిక్కూ దివాణం లాకుండా తిరుగుతున్న మా నాయిన్ను చూసి పెండెం రవే పిలిచి ఆయన చేతికిందకు తీసుకున్నాడు. అంతేగాకుండా కన్నకొడుకాల పోషించి పెద్ద పనిమంతుడిలా తీర్చిదిద్దినాడు.అందుకనే మా నాయినకు రవీ అంటే అంత బయం. అంత బక్తి. రంజాను పండగొస్తే ఆయనకు క్యారేజీ కట్టి తీసకెళ్లి ఇస్తేనే మా నాయినకు పండగ చేసుకున్నట్టు లెక్క. లాకుంటేలా.అయితే దేనికైనా మితం వుండబళ్లా?ఆ సముచ్చరం క్యారేజీ తీసకపోయిన మా నాయన మళ్లా కాసేపటికే వచ్చి యింకో క్యారేజీ కావాలని కూచున్నాడు.‘రవోళ్ల కూతురూ అల్లుడూ వచ్చుండారు. వాళ్లకు కూడా పలావు పెట్టబళ్లా?’ అని డిమాండు చేసినాడు. ఆయన డిమాండింగు చూసి మా అమ్మకు సర్రన ఎక్కింది కోపం. ‘యాడుందయ్యా అంత? ఏం బళ్లేదులే’ అనింది అడ్డం చెబుతా.మా నాయిన వింటేగా. ‘పండగ చేసుకునేది మనం తినడానికంటమ్మే. తీ గబాల్న’ అంటా మళ్లా రెండో క్యారేజీలో పలావూ, ముక్కలూ పెట్టుకొని వెళ్లిపోయినాడు. ఆ దెబ్బకి దబరలోని సగం ముక్కలుఖాళీ. పలావెంకారెడ్డోళ్లు దావత్‌కి వచ్చినాక ‘యీ ఒక్క ముక్కే.. యీ ఒక్క ముక్కే’ అంటా మా నాయిన ఎచ్చులకి పోయి మిగిలిన ముక్కలన్నీ కూడా ఖాళీ చేయించేశాడు.యింకేముంది? మొత్తం ఖాళీ!అంతా అయిపోయినాక ఎంకారెడ్డోళ్లని సాగనంపి, ఆకొక్క వేసుకొని, ఫ్యాను కింద హాయిగా నిదరపోతున్న మా నాయిన్ను ఊసురోమంటా చూసినారు మా నాయినమ్మా అమ్మా.ఉత్త మెతుకులూ టమేటా తొక్కులూ మిగిలిన పలావు దబర తట్టే చూస్తా ‘యీ నా కొడుకుని కని ఏనాడు బాగుపడ్డానని’ అనింది మా నాయినమ్మ మంటగా.‘యీ మహానుబావుణ్ణి కట్టుకొని ఏమి సుకపడ్డానని?’ అనింది మా అమ్మ కచ్చగా.ఆనేక వాళ్లిద్దరూ పొయ్యిలోని బొగ్గుతో మొకాలు కడుక్కొని, ఆ ఉత్త మెతుకులనే గోంగూరతో కలుపుకొని తిని, గమ్మున పొణుకున్నారు.
పండగ పూట పలావు ముక్కల కత!
Published Sun, Jun 10 2018 2:05 AM | Last Updated on Thu, Jul 11 2019 6:18 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment