అమ్మానాన్నల పెళ్లి... జరిగింది మళ్లీ
శీర్షిక చూసి ఇదేం తలతిక్క కపిత్వమని అనవసరంగా కోప్పడిపోకండి. ఆ అమ్మా నాన్నలకు మళ్లీ పెళ్లి జరిగింది. వాళ్లకు మళ్లీ పెళ్లి చేసిన ఘనత వాళ్ల అబ్బాయికే దక్కుతుంది. ఇంతకీ కథ ఏమిటంటే... ఇంగ్లాండ్‌లోని కెంట్ ప్రాంతంలో ఆనెట్ వెన్‌స్లీ అనే అమ్మాయి, డంకన్ గ్రే అనే అబ్బాయి ప్రేమలో పడ్డారు. కొంతకాలం తర్వాత ప్రేమను పండించుకోవాలనే నిర్ణయానికి వచ్చి 1979లో పెళ్లి చేసుకున్నారు. చక్కగా కాపురం చేసుకోసాగారు.
ఈలోగా పండంటి కొడుకు పుట్టాడు. స్టూవర్ట్ అని పేరు పెట్టుకున్నారు. పెళ్లి జరిగి పదేళ్లయినా పూర్తి కాకుండానే దంపతుల మధ్య గొడవలు తలెత్తాయి. నిత్యం పోట్లాడుకుంటూ కలసి ఉండలేమనుకున్నారు. చివరకు 1989లో విడాకులు తీసుకున్నారు. విడాకుల తర్వాత డంకన్.. రెండువందల మైళ్ల దూరంలోని సౌత్ యార్క్‌షైర్‌కు వెళ్లిపోయాడు. స్టూవర్ట్ తల్లి వద్ద పెరిగాడు. ఊహ తెలిసిన తర్వాత ఎప్పుడూ తండ్రి గురించి అడిగేవాడు. కాస్త ఎదిగాక ఎలాగైనా తల్లిదండ్రులిద్దరినీ కలపాలనే కృతనిశ్చయానికి వచ్చాడు. తల్లి ఆనెట్ సాయంతో 2009 నుంచి తండ్రి డంకెన్ కోసం వెదుకులాట ప్రారంభించాడు.
చివరకు గత ఏడాది సెప్టెంబర్‌లో తండ్రి జాడ కనుగొన్నాడు. అయితే అప్పటికే డంకెన్... పేగు క్యాన్సర్ నుంచి కోలుకుంటున్నాడు. అమ్మానాన్నలిద్దరూ మళ్లీ కలుసుకోవాలన్నదే తన కోరిక అని స్టూవర్ట్ చెప్పినప్పుడు డంకెన్ కాదనలేకపోయాడు. తనను కాదనుకుని వెళ్లిపోయిన డంకెన్ మీద ఆనెట్ తొలుత కొంత కినుక చూపినా, స్టూవర్ట్ బతిమాలడంతో పెళ్లికి అంగీకరించింది. ఇద్దరూ అంగీకరించడంతో స్టూవర్ట్ అమ్మా నాన్నల పెళ్లిని అంగరంగ వైభవంగా జరిపించాడు. పెళ్లిలో స్టూవర్ట్ తానే తోటి పెళ్లికొడుకుగా వ్యవహరించడం విశేషం.