ఫైవ్ మినట్ బన్
సిగ సింగారం
ఈ హెయిర్ స్టయిల్ పేరు ‘ఫైవ్ మినట్ బన్’. పేరుకు తగ్గట్టుగానే దీన్ని వేసుకోవడానికి అయిదు నిమిషాలు చాలు. మొదట్లో కొంచెం ఎక్కువ టైం పట్టినా... వేసుకుంటూ ఉంటే అయిదు నిమిషాలు సరిపోతుంది. ఈ హెయిర్ స్టయిల్‌ను విదేశీయులు వివాహ వేడుకల్లో ఎక్కువగా వేసుకుంటారు. అలాగే భారతీయులు కూడా ఈ మధ్య ఈ స్టయిల్‌ను బాగా ఫాలో అవుతున్నారు. గౌన్లు, స్కర్ట్స్, గాగ్రా, ఫ్యాన్సీ శారీస్ మీదకు ఈ హెయిర్ స్టయిల్ బాగా నప్పుతుంది. మరి ఈ సిగ సోయగం మీకూ కావాలంటే.. వెంటనే వేసుకోండి మరి.
1. ముందుగా జుత్తునంతా చిక్కులు లేకుండా దువ్వుకోవాలి.
2. ఇప్పుడు ఫొటోలో కనిపిస్తున్న విధంగా... కింది భాగంలోని జుత్తుకు బ్యాండు పెట్టాలి.
3. ఆ పోనీని పూర్తిగా మెలితిప్పి, గుండ్రంగా కొప్పులా చుట్టాలి. చివర్లు బయటికి రాకుండా స్లైడ్స్ పెట్టేయాలి. పై భాగంలోని జుత్తు కిందకు రాకుండా టెంపరరీగా వాటికీ స్లైడ్స్ పెట్టాలి.
4. తర్వాత పై భాగంలోని జుత్తుకు పెట్టిన స్లైడ్స్‌ను తీసేయాలి. ఇప్పుడు ఆ జుత్తును రివర్స్‌లో దువ్వాలి (అంటే చివర్ల నుంచి మాడుకు... అలా చేస్తే పఫ్ బాగా వస్తుంది). ఆపైన మధ్య భాగంలోని జుత్తును తీసుకొని బ్యాండ్ పెట్టాలి.
5. ఇప్పుడు ఎడమ చెవి వైపు మరో రెండు పాయలను తీసుకొని, విడివిడిగా వాటికి బ్యాండ్స్ పెట్టాలి.
6. ఆపైన కుడి వైపు కూడా రెండు పాయలను తీసుకొని, విడివిడిగా బ్యాండ్స్ పెట్టి పోనీలు వేయాలి.
7. తర్వాత అన్ని పోనీలను... వాటి వాటి బ్యాండ్లలోంచి పై నుంచి కిందకు తీయాలి. (ఎలా అంటే.. బ్యాండ్ పెట్టాక, దాని పైభాగంలోని జుత్తును చేతి వేళ్లతో కాస్తంత దూరం చేయాలి. అప్పుడు పోనీని అందులోంచి పై నుంచి కిందకు తీయలి)
8. ఇప్పుడు రెండువైపుల ఉన్న నాలుగు చిన్న పోనీలను ఒక్కొక్కొటిగా మధ్య పోనీలోంచి పై నుంచి కిందకు తీయాలి.
9. ఆ మిగిలిన పెద్ద పోనీ (మధ్యది)ని పూర్తిగా మెలితిప్పాలి.
10. ఆ మెలితిప్పిన పోనీని కింద ఉన్న కొప్పు చుట్టూ చుట్టాలి. చివర్లు బయటికి రాకుండా స్లైడ్స్ పెట్టాలి.