పాతబస్తీలో కాల్పుల మోత
హైదరాబాద్ పాతబస్తీలో కాల్పుల ఘటన కలకలం రేపింది. ఓ వివాహ బరాత్ కార్యక్రమంలో 10 రౌండ్ల కాల్పులు జరిపారు. రెండు రివాల్వర్‌లతో స్వయంగా వరుడే గాల్లోకి కాల్పులు జరిపి మరీ తన పెళ్లి సంబరాలు జరుపుకున్నాడు. పెళ్లి కొడుకు అలా గాల్లోకి కాల్పులు జరుపుతుండగా బంధువులు, స్నేహితులు కేరింతలు కొడుతూ ఉత్సాహపరిచారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఫలక్‌నుమాలో చోటుచేసుకుంది. ఆత్మరక్షణ కోసం తుపాకీ లైసెన్సులు పొందుతున్న వారు ఇలా వేడుకల్లో తమ డాబును ప్రదర్శిస్తూ.. ప్రజల ప్రాణాలతో చలగాటమాడుతుందటం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమౌతున్నాయి. ఇంతకీ పెళ్లికొడుక్కి గన్ లైసెన్స్ ఉందా లేదా అనే విషయం తెలియరాలేదు.
ఫలక్‌నుమాలో పెళ్లి కొడుకు కాల్పుల ఘటన దృశ్యాలు మీడియాలో ప్రసారం కావడంతో సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ ఆదివారం స్పందించారు. ఫలక్‌నుమా ఏసీపీ ఆధ్వర్యంలో విచారణ జరుగుతుందన్నారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు.