వంటతో తంటాలెందుకు?!
వాయనం: వంట... అలవాటైన వారికి చాలా చిన్న పని. కానీ ఉద్యోగినులకు అది చాలా పెద్ద పని. ముఖ్యంగా వంట చేసేటప్పుడు అనుకోకుండా జరిగే చిన్న చిన్న పొరపాట్లు, తెలియనితనం వల్ల జరిగే జాప్యాలు విసిగిస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఇలాంటి చిట్కాలు చాలా ఉపకరిస్తాయి!
- రోజూ కరివేపాకును తీసి, కడిగి కూరలో వేసేబదులు... ఇంట్లో ఉన్న రోజున ఎండబెట్టి, పొడి చేసి, డబ్బాలో వేసి నిల్వ చేసుకుని వాడుకుంటే సమయం ఆదా అవుతుంది!
- బెండకాయ ముక్కలు వేగడానికి ఎక్కువ సమయం ఎందుకు పడుతుంది... దానికుండే జిగురు వల్ల. అదే కోసిన వెంటనే వాటిమీద కాసింత నిమ్మరసం చల్లారనుకోండి... జిగురూ ఉండదు, త్వరగానూ వేగిపోతాయి!
- ఉప్మా ఉండ కట్టకుండా ఉండాలంటే... ముందే రవ్వకు కాస్త నూనె పూయండి. నూనె ఎక్కువవుతుందని భయమేస్తే... తాలింపులో తగ్గించుకోండి!
- అరటి, బంగాళాదుంపల వేపుళ్లు చేసేటప్పుడు తక్కువ మంట మీద ఎక్కువసేపు వేయించాల్సి వస్తుంది. అంత సమయం పట్టకుండా ఉండాలంటే... ముందు ముక్కలమీద ఉప్పునీళ్లు చల్లి, పావుగంట తర్వాత వేయిం చండి... బోలెడు టైమ్ మిగుల్తుంది!
- అన్నం వేడిగా ఉన్నప్పుడు పులిహోర చేస్తే ముద్దలా అయిపోతుంది. చల్లార బెట్టేంత సమయం లేకపోతే... అన్నం ఉడికేటప్పుడు ఓ చెంచాడు నెయ్యి కానీ, వెన్న కానీ వేస్తే, పొడిపొడిగా ఉండి ముద్ద అవ్వదు!
- కంద, చేమ దుంపలు ఉడికించేటప్పుడు నీటిలో చిన్న బెల్లంముక్క వేస్తే త్వరగా ఉడికిపోతాయి!
- ఉల్లిపాయలు వేయించేటప్పుడు కాసింత పంచదార వేస్తే, త్వరగా రంగు మారతాయి!
- కూరలో ఉప్పుకానీ పసుపు కానీ ఎక్కువైనప్పుడు ఓ బ్రెడ్ స్లైస్‌ను వేస్తే... ఎక్కువైనదాన్ని పీల్చేసుకుంటుంది. కానీ ఎక్కువసేపు ఉంచితే మెత్తబడి కూరలో కలిసిపోతుంది. కాబట్టి మెత్తబడేలోపే తీసేయండి!
- కూరలో పొరపాటున కారం ఎక్కువ పడితే... మళ్లీ నీళ్లు పోసి ఉడికిస్తూ పోకండి. దానివల్ల టైమ్ వేస్ట్ అవుతుంది. కాసిన్ని కొబ్బరిపాలు వేస్తే... కారం తగ్గుతుంది. రుచీ బాగుంటుంది!
- టైమ్ తక్కువ ఉంది కదా అని మంట ఎక్కువ పెడితే... వంటకాలు గిన్నెకు అంటుకుని మాడిపోతాయి. అలా జరక్కుండా ఉండాలంటే... ముందు గిన్నెలో చిటెకెడు ఇంగువ వేసి, తర్వాత మిగిలిన దినుసులన్నీ వేయండి!
పీనట్ బటర్ కావాలంటే... ఇదే బెటర్!
వేరుశెనగ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అందుకే వాటిని తగిన మోతాదులో తప్పక తీసుకొమ్మని సూచిస్తుంటారు వైద్యులు. ముఖ్యంగా పిల్లల ఎదుగుదలకు ఇవి ఎంతో అవసరం. అయితే ఎప్పుడూ మామూలుగానే తినమంటే వాళ్లు ఇష్టపడకపోవచ్చు. అదే బటర్‌లా చేసి, బ్రెడ్డుకు రాసి ఇవ్వండి... ఎగిరి గంతేస్తారు! నిజానికి మార్కెట్లో రెడీమేడ్ పీనట్ బటర్ దొరుకుతోంది. కానీ రేటు చాలా ఎక్కువ. ఒక డబ్బా 150 నుంచి 200 రూపాయల వరకూ ఉంటోంది. ఒకవేళ కొని తెచ్చుకున్నా... పిల్లలున్న ఇంట్లో నెలకొకటి అయిపోతుంది. ఆ లెక్కన సంవత్సరానికి ఎంత ఖర్చవుతుందో చూడండి! కాబట్టి ఈ పీనట్ బటర్ మేకర్‌ని కొనుక్కోవడం ఎంతైనా ఉత్తమం. దీని వెల రూ.3700 నుంచి నాలుగు వేల వరకూ ఉంటుంది. కాస్త ఎక్కువనిపించినా ఒక్కసారి కొని పెట్టేసుకుంటే బోలెడు డబ్బులు మిగులుతాయి కదా!