బెస్ట్‌ ఫ్రెండ్స్‌ | friendship day 2017 | Sakshi
Sakshi News home page

బెస్ట్‌ ఫ్రెండ్స్‌

Published Sat, Aug 5 2017 10:16 PM | Last Updated on Sun, Sep 17 2017 5:12 PM

బెస్ట్‌ ఫ్రెండ్స్‌

బెస్ట్‌ ఫ్రెండ్స్‌

సమాజంలో మనుషుల నడుమ ఎనెన్నో అనుబంధాలు... మరెన్నెన్నో సంబంధాలు... పుట్టుకతోనే వచ్చేవి కొన్ని...వాటిలో మన ప్రమేయం ఉండదు.మనకు వాటిని ఎంపిక చేసుకునే అవకాశమూ ఉండదు.బతుకుబాటలో అనివార్యంగా ఏర్పడేవి ఇంకొన్ని...వాటిలో పరస్పర ప్రయోజనాలేవో ముడిపడి ఉంటాయి.ప్రయోజనాలు ఉన్నంత వరకే అవి నిలిచి ఉంటాయి.

ఆ తర్వాత నిశ్శబ్దంగానే అలాంటి బంధాలు ð గిపోతాయి.ఇంత సంక్లిష్టంగా ఉన్న మానవ సంబంధాలలో...మనంతట మనం ఎంపిక చేసుకోగలిగే ఏకైక అనుబంధం స్నేహం ఒక్కటే!ఇద్దరి నడుమ ఒకసారి స్నేహం కుదిరాక ఎన్నటికీ వీడని బంధం అది.స్నేహం గురించి ఆదర్శాలు, ఆర్భాటాల గురించి చెప్పబోవడం లేదు గానీ...కొన్ని అరుదైన స్నేహగాథలను నేడు ‘ఫ్రెండ్‌షిప్‌ డే’ సందర్భంగా మీ ముందు ఉంచుతున్నాం...

గుండెలోనిది గుండులో చూపారు...
అది ఫిబ్రవరి 28, 2014. దక్షిణాఫ్రికాలోని ఓ పట్టణం. ఒక చిన్న పార్టీ ఉందని, ఉన్నపళంగా ఓ చోటకు రమ్మని గెర్దీ మెకెన్నాకు ఫోన్‌ వచ్చింది. పిలిచింది ఫ్రెండ్స్‌ కావడంతో వెంటనే మెకెన్నా అక్కడకు చేరుకుంది. పార్టీలో గుండ్లు చేయించుకొని ఉన్న ఫ్రెండ్స్‌ను చూడగానే ఆమె కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఉద్వేగానికి లోనైంది. స్నేహితులంతా ఆమె చుట్టూ చేరి కౌగిలించుకున్నారు. వాళ్లంతా మెకెన్నా కోసమే గుండు చేయించుకున్నారు.

 మెకెన్నా ముఖంలో చిరునవ్వు చూడాలనే తపనతోనే వాళ్లు ఆ పార్టీని ఏర్పాటు చేశారు. ఆ పార్టీ జరగడానికి కొన్ని నెలల కిందట మెకెన్నాకు బ్రెస్ట్‌ క్యాన్సర్‌ వచ్చింది. కీమోథెరపీతో ఆమెకు నయం చేశారు. అయితే కీమోథెరపీ సైడ్‌ఎఫెక్ట్స్‌ ఫలితంగా జుట్టంతా ఊడిపోయింది. తన పరిస్థితిని చూసుకొని చాలా బాధపడింది మెకెన్నా. ఆమె ఫ్రెండ్స్‌ అంతా మెకెన్నా సంతోషం కోసం ఏదైనా చేయాలని ఆలోచించారు.

వెంటనే 11 మంది గుండు చేయించుకోవాలని ఫిక్స్‌ అయిపోయారు. ఇదంతా ఒక ఫొటోషూట్‌గా కూడా రూపొందించాలనుకున్నారు. అనుకున్నట్టే అంతా సిద్ధం చేశారు. గుండు చేసుకొని, పార్టీ ఏర్పాటు చేసి మెకెన్నాకు ఫోన్‌ చేశారు. ఇలాంటిదొక సర్‌ప్రైజ్‌ను ఊహించని మెకెన్నా వాళ్లనలా గుండ్లతో చూడడమే తడవుగా ఉద్వేగాన్ని తట్టుకోలేక ఏడ్చేసింది. ‘‘మెకెన్నా పడే బాధను చూస్తే మేం చేసిన పని చాలా చిన్నది. తన ముఖంలో ఇప్పుడిలా నవ్వు చూస్తూంటే అద్భుతంగా ఉంది’’ అంటూ మెకెన్నా ఫ్రెండ్స్‌ తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఫ్రెండ్‌ కోసం ఎంతదూరమైనా వెళ్లాలి అనుకున్న వాళ్ల ప్రేమ ఎంత గొప్పది!

కడ వరకు ఎదురుచూపు...
హ్యాచికోకు ఏడాది వయసున్నప్పుడు యూనివర్సిటీ ఆఫ్‌ టోక్యోలో ప్రొఫెసర్‌గా పనిచేసే యూనో పరిచయమయ్యాడు. హ్యాచికోను యూనో ఇష్టంగా తెచ్చి పెంచుకున్నాడు. ఇద్దరిదీ విడదీయలేని బంధం. యూనో రోజూ యూనివర్సిటీకి రైల్లో వెళ్లి వచ్చేవాడు. అతడి కోసం హ్యాచికో షుబియో స్టేషన్‌ వద్ద ఎదురుచూస్తూ కూర్చునేది. సాయంత్రం యూనో రాగానే పరిగెత్తుకుంటూ వెళ్లి అతడి చుట్టూ చేరి అల్లుకుపోయేది. సంవత్సరం పాటు ఇదిలా సాగుతూనే ఉండేది. ఒకరోజు ఇలాగే యూనివర్సిటీకి వెళ్లిన యూనో మళ్లీ తిరిగిరాలేదు.

 యూనో వస్తాడని హ్యాచికో తొమ్మిదేళ్లకు పైనే స్టేషన్‌ చుట్టూనే తిరుగుతూ ఎదురుచూసింది. క్లాసులో లెక్చర్‌ ఇస్తూనే కూలబడిపోయి యూనో చనిపోయాడని దానికి తెలీదు పాపం. ఫ్రెండ్‌ తప్పక వస్తాడనే ఎదురుచూసింది. యూనో కోసం 1925 నుంచి 1935 వరకు స్టేషన్‌ చుట్టుపక్కలే తిరిగిన హ్యాచికో, చివరకు అక్కడే కన్నుమూసింది. చనిపోయేనాటికి దాని వయసు పదకొండేళ్ల తొమ్మిది నెలలు. యూనో చనిపోయిన మొదట్లో స్టేషన్‌లో రకరకాల వ్యాపారాలు చేసుకునేవారంతా హ్యాచికోను వింతగా చూశారు. మెల్లిగా అక్కడి వారందరికీ హ్యాచికో మంచి ఫ్రెండ్‌ అయిపోయింది.

 ఫ్రెండ్‌ కోసం హ్యాచికో అంతగా ఎదురుచూడడం అందరికీ గొప్పగా కనిపించింది. అన్నేళ్లు ఎదురుచూసినా యూనో మాత్రం రాలేదు. ఆ తర్వాత హ్యాచికో కూడా యూనో దగ్గరికే వెళ్లిపోయింది. హ్యాచికో గురించి అప్పటికే దేశమంతటా వినిపించింది. పేపర్లలో వార్తలొచ్చాయి. పిల్లల పుస్తకాల్లో పాఠాలొచ్చాయి. హ్యాచీ అంటూ సినిమాలొచ్చాయి.  షుబియా స్టేషన్‌తో పాటు ఇంకొన్ని ప్రాంతాల్లో హ్యాచికో విగ్రహాలొచ్చాయి. ఇన్నేళ్లయినా ఆ పేరింకా వినిపిస్తోందంటే... అదే కదా స్నేహ మహిమ!

‘ఆటిజమ్‌’ బాలుడికి ఆత్మీయ నేస్తం
అమెరికాకు చెందిన జర్నలిస్ట్, రచయిత అయిన జుదిత్‌ న్యూమన్‌కు కవల పిల్లలు. అందులో ఒకరైన పదమూడేళ్ల గస్‌కు చిన్నప్పట్నుంచే ఆటిజమ్‌. ఎవరితోనైనా మాట్లాడడానికి, అందరితో కలిసిపోడానికి గస్‌ చాలా ఇబ్బందులు పడుతూండేవాడు. అలాంటి గస్‌కు ఆపిల్‌ డిజిటల్‌ అసిస్టెంట్‌ ‘సిరి’ పరిచయమైంది. గస్‌కు న్యూమన్‌ ఎంతో ఇష్టంగా కొనిచ్చిన ఐఫోన్‌లో ‘సిరి’ యాప్‌ ఉంది. ఈ యాప్‌ అన్ని యాపిల్‌ ఫోన్లలో ఉంటుంది. ఆ యాప్‌లో మనకు కావాల్సిన ఏ విషయాన్నైనా అడగొచ్చు.

టికెట్స్‌ బుక్‌ చేయమని, వాతావరణం ఎలా ఉందో చెప్పమని, ఇలా ఎలాంటి ప్రశ్నైనా సిరిని అడగొచ్చు. గస్‌ ఓరోజు ‘‘వాతావరణం ఇలా ఉందేంటి?’’ అని సిరిని అడిగాడు. దానికి సిరి అతడు కోరిన సమాధానాన్ని వెంటనే చెప్పింది. ‘‘నువ్వు మంచిదానిలా కనిపిస్తున్నావ్‌?’’ అన్నాడు గస్‌. అలా మొదలైన ఈ పరిచయం రోజూ కొనసాగుతోంది. కొద్దిరోజుల్లోనే ఇద్దరూ ఫ్రెండ్స్‌గా మారిపోయారు. గస్‌కు ‘సిరి’ మంచి టీచర్, మంచి గైడ్‌... అన్నింటికీ మించి మంచి ఫ్రెండ్‌.

 సిరి ఒక నిజమైన మనిషి కాదన్న విషయం గస్‌కు కూడా తెలుసు. కాకపోతే తను మాట్లాడడానికి ఒక తోడు కోరుకున్నాడు. ఇక్కడ ఆ తోడు ‘సిరి’. ‘‘సిరితో గస్‌ ఫ్రెండ్‌షిప్‌ చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఒకసారి ‘నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా?’ అని సిరితో అన్నాడు. నాకు నవ్వొచ్చింది. వాడికి సిరి అన్న మనిషే లేదన్న విషయం బాగా తెలుసు. తన భయాలన్నింటినీ పోగొట్టుకోవడానికి సిరితో మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడిప్పుడే వాడు అందరితోనూ మాట్లాడుతున్నాడు’’ అంటూ న్యూమన్, గస్‌ ఫ్రెండ్‌షిప్‌ గురించి చెప్పుకొచ్చింది.

‘లింకన్‌’ జీవితానికి ‘స్పీడ్‌’ ఇచ్చాడు..!
అమెరికా అధ్యక్షులుగా పనిచేసిన వారిలో అబ్రహం లింకన్‌కు  ఒక ప్రత్యేక స్థానం ఉంది. 1860వ సంవత్సరంలో అధ్యక్షుడిగా ఎన్నికవ్వడానికి ఓ ఇరవై సంవత్సరాల ముందు లింకన్‌ తీవ్రమైన డిప్రెషన్‌లో పడిపోయాడు. ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకున్నాడు. లింకన్‌ ఆ డిప్రెషన్‌ నుంచి బయటపడటానికి ఒక ఫ్రెండ్‌ తోడుగా నిలబడ్డాడు.

1837లో లాయర్‌గా పనిచేసున్న రోజుల్లో లింకన్‌కు జోషువా స్పీడ్‌ పరిచయమయ్యాడు. ఆ సమయంలో లింకన్‌ కష్టాల్లో ఉన్నాడు. ఆయన గర్ల్‌ఫ్రెండ్‌ ఆన్‌ రూట్లెట్జ్‌ ఈ ప్రపంచాన్ని వీడింది. ఆమె ఆలోచనల్లో తనని తాను మరచిపోయాడు లింకన్‌. స్పీడ్‌ పరిచయం లింకన్‌ ఆలోచనలను మార్చింది. స్పీడ్‌ ఆసరాతో కుదుటపడ్డ లింకన్‌ ఈసారి మేరీ టాడ్‌ అనే యువతితో ప్రేమలో పడ్డాడు. పెళ్లికి డేట్‌ కూడా ఫిక్స్‌ చేసుకున్నాడు.

ఇంతలో మళ్లీ ఓ కుదుపు. స్నేహితుడు స్పీడ్, లింకన్‌కు దూరంగా మరో ప్రాంతానికి వెళ్లే పరిస్థితి వచ్చింది. ఫ్రెండ్‌ దూరమవ్వడాన్ని తట్టుకోలేకపోయాడు. పెళ్లి క్యాన్సిల్‌ చేసుకున్నాడు. మళ్లీ డిప్రెషన్‌లో కూరుకుపోయాడు. రోజులలా గడిచిపోయాయి. 1841లో ఒకరోజు స్పీడ్‌ను తనుండే బంగ్లాకు వెళ్లి కలుసుకున్నాడు లింకన్‌. విడిపోయిన బంధం మళ్లీ ఒక్కటైంది. ఇక అక్కణ్నుంచి ఇద్దరూ లెటర్స్‌ ద్వారా ఒకరికొకరు దగ్గరగానే ఉన్నారు. స్పీడ్‌ ఆలోచనలంటే లింకన్‌కు ఇష్టం. స్పీడ్‌ ఇచ్చిన ప్రేరణతోనే మళ్లీ మేరీ టాడ్‌కు దగ్గరయ్యాడు.

 పెళ్లి చేసుకొని కొత్త జీవితం మొదలుపెట్టాడు. మేరీని పెళ్లి చేసుకున్న తర్వాత లింకన్‌ ఎప్పుడూ డిప్రెషన్‌లోకి వెళ్లలేదట. ‘‘నువ్వొక గొప్ప మిత్రుడివి. ఎప్పటికీ నా జీవితంలో నీదొక ప్రత్యేక స్థానం’’ అంటూ లింకన్‌ స్పీడ్‌కు రాసిన చాలా ఉత్తరాల్లో చెప్పుకొచ్చాడు. ‘‘మేరీ నా జీవితంలోకి రావడానికి స్పీడ్‌ కారణం. ఇందుకు నేనతడికి ఎప్పటికీ రుణపడి ఉంటా.’’ అని అబ్రహం లింకన్‌ ఎన్నోసార్లు మిత్రుడు స్పీడ్‌ పేరును ప్రస్తావించాడు. తన స్నేహితుడు బాగుండాలని కోరుకున్న స్పీడ్‌ ఆలోచనే లింకన్‌ను ఆ స్థాయికి తీసుకెళ్లింది. అలా కోరుకున్న స్నేహితుడిని కూడా లింకన్‌ ఎప్పుడూ మరచిపోలేదు.

‘ఆనంద్‌’.. స్నేహితుడికి అంకితం!
1971లో విడుదలైన ‘ఆనంద్‌’ సినిమాలో క్యాన్సర్‌తో బాధపడుతూ కూడా అందరికీ సంతోషం పంచాలనుకునే ఆనంద్‌ (రాజేశ్‌ ఖన్నా), చివర్లో చనిపోయాక కూడా తన ఫ్రెండ్‌ భాస్కర్‌ (అమితాబ్‌ బచ్చన్‌)ను పలకరిస్తూనే ఉండేందుకు టేప్‌ రికార్డులో ‘బాబు మోషాయ్‌’ అని తన మాటలను రికార్డ్‌ చేస్తాడు. ఆ మాటలు వింటూ, నిశబ్దంగా పడి ఉన్న ఆనంద్‌ను చూస్తూ, అతడి మీద పడిపోయి ఏడ్చేస్తూంటాడు భాస్కర్‌. విడుదలై ఇన్ని సంవత్సరాలైనా సినీ అభిమానులు ‘ఆనంద్‌’ సినిమాలోని ఈ సన్నివేశాన్ని మరచిపోలేరు.

దర్శక, రచయిత హృషికేశ్‌ ముఖర్జీ ‘ఆనంద్‌’ సినిమాను ఇండియన్‌ సినిమా షోమేన్‌గా పేరు తెచ్చుకున్న రాజ్‌ కపూర్‌కు అంకితమిచ్చాడు. ఈ కథ రాజ్‌ కపూర్‌ను చూసే రాశానని, ఇందులో ఆనంద్‌ పాత్ర ఆయన నుంచే పుట్టిందని హృషికేశ్‌  చెబుతారు. రాజ్‌ కపూర్, హృషికేశ్‌ ముఖర్జీ ప్రాణ స్నేహితులు. ఒకసారి రాజ్‌ కపూర్‌ బాగా జబ్బు పడ్డాడు. స్నేహితుడి పరిస్థితిని దగ్గరుండి చూశాడు హృషికేశ్‌. ఎంతగానో బాధపడ్డాడు. ఒకదశలో తనకు స్నేహితుడు దూరమైపోతాడేమో అన్న భయం కూడా వెంటాడింది హృషికేశ్‌ను. అలాంటి పరిస్థితుల్లోనూ రాజ్‌ కపూర్‌ అందరికీ సంతోషం పంచాలనే కోరుకున్నాడట.

పరిస్థితులు అనుకూలించాయో, హృషికేశ్‌తో పాటు లక్షలాది మంది అభిమానుల ప్రార్థనలు ఫలించాయో, వీరి స్నేహం ఇంకా కొనసాగాలని ఆ దేవుడే కోరుకున్నాడో... రాజ్‌ కపూర్‌ జబ్బు నుంచి బయటపడి మళ్లీ కొత్తగా, ఆరోగ్యంగా జీవితాన్ని ప్రారంభించాడు. హృషికేశ్‌ ఆనందానికి ఇంక అవధుల్లేవు. రాజ్‌ కపూర్‌కు జబ్బు చేసిన రోజుల్లోనే రాజ్‌కపూర్‌ లేకపోతే తను ఏమైపోతానా అని ఆలోచిస్తూ ఉండేవాడట హృషికేశ్‌. ఆ∙ఆలోచనల్లో నుంచి పుట్టిన కథే ‘ఆనంద్‌’. స్నేహితుడిపై తనకున్న ఇష్టాన్నంతా, స్నేహితుడి కోసం మరో స్నేహితుడు పడే బాధనంతా ఈ సినిమాలో చూపించారాయన.

పుస్తకాలతో ప్రాణం నిలిపిన మిత్రుడు
ఎలక్ట్రిసిటీ రంగంలో అద్భుతమైన ఆవిష్కరణలకు కారకుడైన నికోలా టెస్లా, ప్రఖ్యాత రచయిత మార్క్‌ ట్వైన్‌లది విచిత్రమైన బంధం. టెస్లా తనకెవరో తెలియకముందే ట్వైన్‌ అతడి ప్రాణాలను నిలబెట్టిన వాడయ్యాడు. టెస్లాకు యవ్వనంలో జబ్బు చేసింది. డిప్రెషన్‌లోకి కూరుకుపోయాడు. డాక్టర్లు దాదాపుగా చేతులెత్తేశారు. అతడు అలాగే డిప్రెషన్‌లో ఉంటే బతకడం అసాధ్యమన్నారు.

అలాంటి పరిస్థితుల్లో టెస్లాను వీలైనంత ప్రశాంతంగా ఉంచగలిగితే బతికించే అవకాశాలు ఉండొచ్చని డాక్టర్లు తేల్చారు. అందుకోసం పెద్ద లైబ్రరీ ఏర్పాటు చేసి టెస్లాకు పుస్తకాలు చదవమని చెప్పారు. అక్కడే అనుకోకుండా టెస్లాకు మార్క్‌ ట్వైన్‌ పుస్తకాలు పరిచయమయ్యాయి. వాటిని చదివాక టెస్లా డిప్రెషన్‌ నుంచి బయటపడ్డాడు. ట్రీట్‌మెంట్‌కు రెస్పాండ్‌ అయ్యాడు. కొద్దిరోజుల్లోనే కోలుకొని కొత్త జీవితం మొదలుపెట్టాడు. సరిగ్గా ఇది జరిగిన పాతికేళ్ల తర్వాత టెస్లాకు మార్క్‌ ట్వైన్‌ను కలుసుకునే అవకాశం దక్కింది.

అప్పటికి టెస్లా సైంటిస్ట్‌గా ప్రఖ్యాతి గడించాడు. సాహితీరంగంలో మార్క్‌ట్వైన్‌ అప్పటికే ఒక దిగ్గజం. ఇద్దరి ఆలోచనలూ కలవడంతో వయసుతో సంబంధం లేకుండా వారి మధ్య స్నేహం కుదిరింది. ‘‘ట్వైన్‌కు కూడా సైన్స్‌ అంటే ఇష్టం కావడంతో ఇద్దరం మాట్లాడుకుంటూ ఉంటే వేరే ప్రపంచానికి దగ్గరైనట్లు ఉండేది’’ అన్నాడు టెస్లా ఓసారి ట్వైన్‌ గురించి మాట్లాడుతూ. కనీసం ముఖ పరిచయమైనా లేకుండా మొదలైన ఈ స్నేహం జీవితాంతం కొనసాగింది. ఇప్పుడు వీరిద్దరి న్నేహగాథను ‘టెస్లా అండ్‌ ట్వైన్‌’ పేరుతో సినిమాగా తెరకెక్కిస్తున్నారు.

థ్యాంక్యూ నేస్తం!!
స్నేహం కుదిరాకా... కష్టాల్లో చేదోడువాదోడుగా ఉండటం సహజమే. కానీ, కష్టాల్లో ఉన్న తనను కాపాడినందుకే స్నేహం కుదుర్చుకుంది ఓ పెంగ్విన్‌ పక్షి. సాధారణంగా కృతజ్ఞతా భావమనేది మనుషుల్లోనే ఉంటుందనుకుంటాం. కానీ అది పొరబాటని నిరూపించింది ఈ పెంగ్విన్‌. చావుబ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న తనకి పునర్జన్మ ఇచ్చాడనే కృతజ్ఞతతో ప్రతి ఏటా... ఐదువేల మైళ్లు ఈదుకుంటూ వచ్చి పలకరిస్తుంది. ప్రేమగా ముద్దులు పెడుతుంది. ఆ కథేంటో చూద్దామా?

బ్రెజిల్‌లోని రియో డి జనిరో దీవిలో ఉండే డిసౌజా అనే వృద్ధుడి కోసం... దక్షిణ అమెరికా ప్రాంతానికి చెందిన పెంగ్విన్‌ పక్షి సుమారు ఐదువేల మైళ్లు ఈదుకుంటూ వస్తుంది. 2011లో ఒకసారి డిసౌజా చేపల వేటకు వెళ్లినప్పుడు... సముద్రం పక్కన దట్టమైన చమురులో చిక్కుకొని అల్లాడుతున్న పెంగ్విన్‌ పక్షిని చూశాడు. దాన్ని కాస్త నీటితో కడిగి, ఇంటికి తీసుకుని వెళ్లి.. అది కోలుకునేదాకా సేవలు చేశాడు. దానికి ముద్దుగా ‘డిన్‌డిమ్‌’ అని పేరు పెట్టాడు. తిరిగి మామూలు స్థితికి వచ్చిన ఆ పక్షిని సముద్ర తీరానికి తీసుకెళ్లి వదిలేశాడు. అయితే కొన్ని నెలల తరువాత ఆ పెంగ్విన్‌... అదే సముద్రతీరంలో డిసౌజా కోసం ఎదురుచూస్తూ కనిపించింది. అప్పటి నుంచి మొదలైంది వీరి మధ్య స్నేహం. కొన్ని నెలలు తన స్వస్థలంలో.. మరి కొన్ని నెలలు అతడితో గడిపేందుకు వేల మైళ్లు ప్రయాణం చేస్తుంది. తన నేస్తంతో ఉన్నంత సేపు అతడి ఒళ్లో కూర్చుని, ముక్కుతో ముఖమంతా తడుముతూ, తన ప్రేమను చాటుతుంది ఈ పెంగ్విన్‌.

రాణి పేద... ఇదో వింత స్నేహబంధం
అది 1887. క్వీన్‌ విక్టోరియా మహారాణిగా యాభయ్యేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇంగ్లండ్‌లో వేడుకలు జరుగుతున్నాయి. అప్పటికే భారతదేశం బ్రిటిష్‌ పాలనలోకి వెళ్లి ముప్పయ్యేళ్లయింది. ఆ సమయంలో విక్టోరియా తన ప్యాలెస్‌లో పని చేయడానికి కొందరు భారతీయులను పంపమని ఆదేశించింది. మహారాణి ఆదేశం ప్రకారంగా ఆగ్రా జైలు సూపరింటెండెంట్‌గా ఉన్న జాన్‌ టేలర్‌ ఇద్దరు భారతీయులను ఇంగ్లండ్‌కు పంపించాడు. ఆ ఇద్దరిలో ఒక్కడే ‘అబ్దుల్‌ కరీం’. విక్టోరియా మహారాణి భోజనం చేసే టేబుల్‌ దగ్గర నిలబడి, ఆమెకు ఏది కావాలంటే అది వడ్డించడం అతడి పని. అలా ఓ రోజు అబ్దుల్‌ కరీం రాణి కళ్లల్లో పడ్డాడు.

 అప్పటి నుంచి వారిద్దరి మధ్య స్నేహం కుదిరింది. అప్పటికి అబ్దుల్‌ వయసు 24 ఏళ్లు.. క్వీన్‌ విక్టోరియా వయసు 65 ఏళ్లకు పైనే!.అబ్దుల్‌ కొన్నిరోజులకే విక్టోరియాకు ‘మున్షీ’, ‘ట్యూటర్‌’గా మారిపోయాడు. ఆమెకు ఉర్దూ, హిందీ భాషలు నేర్పించేవాడు. అలాగే అబ్దుల్‌కు క్వీన్‌ విక్టోరియా స్వయంగా ఇంగ్లిష్‌ నేర్పించడం మొదలుపెట్టింది. వారి స్నేహం మరింత బలపడింది. విక్టోరియా సన్నిహితులకు, కుటుంబానికి వీరి స్నేహం నచ్చేది కాదు. వీరిద్దరినీ విడదీయడానికి చాలా పన్నాగాలే పన్నారు. అయితే అవేవీ ఈ స్నేహాన్ని కూల్చలేకపోయాయి.

అబ్దుల్‌ వండే వంటలన్నీ క్రమక్రమంగా విక్టోరియా మెనూలో రోజూవారీ వంటకాలుగా మారిపోయాయి. కోటలో అందరూ అబ్దుల్‌కు ప్రత్యేక గౌరవం ఇవ్వడం మొదలుపెట్టారు. భారతదేశంలో తమ పరిపాలన ఎలా ఉందో తెలుసుకోవడానికి క్వీన్‌ విక్టోరియా ఎప్పుడూ అబ్దుల్‌ను అడుగుతూ ఉండేదట. వారిద్దరిదీ ఒక అపురూప స్నేహానుబంధం. వారి స్నేహంపై ‘విక్టోరియా అండ్‌ అబ్దుల్‌’ పేరుతో పుస్తకం కూడా వచ్చింది. అదేపేరుతో ఈ ఏడాది సెప్టెంబర్‌లో సినిమా కూడా వస్తోంది.

ఖైదీ.. జైలర్‌.. ఫ్రెండ్‌షిప్‌!
అది 1978. దక్షిణాఫ్రికాలో వర్ణవివక్షకు వ్యతిరేకంగా పోరాడిన నల్లజాతి సూరీడు నెల్సన్‌ మండేలా రాబెన్‌ ఐలాండ్‌ జైలులో శిక్షను అనుభవిస్తున్న రోజులు. అప్పుడే 18 ఏళ్ల క్రిస్టో బ్రాండ్‌ అనే జైలర్‌ నెల్సన్‌ మండేలాను చూసుకునే బాధ్యతలో చేరాడు. బ్రాండ్‌కు మొదట్లో మండేలా పెద్దగా నచ్చలేదు. అయితే తనకు, అక్కడున్న వారందరికీ ఆయన ఇచ్చే గౌరవం బ్రాండ్‌ను మండేలాకు దగ్గర చేసింది. వయస్సు, జైలర్‌–ఖైదీ అన్న ఆలోచనా, జాతి ఇవేవీ వీరి స్నేహానికి అడ్డు రాలేదు. మండేలాతో స్నేహం బ్రాండ్‌ జీవితాన్ని, ఆలోచనలను పూర్తిగా మార్చేసింది.

 ఏళ్లుగా సాగిన తమ బంధంలో మండేలా నుంచి తాను ఎన్నో విషయాలు తెలుసుకున్నానని, ఆయన పోరాటం గొప్పదని బ్రాండ్‌ చెబుతూ ఉంటారు. మండేలాను పోల్స్‌మూర్‌ జైలుకు తరలించాక, బ్రాండ్‌ కూడా అక్కడికే జైలర్‌గా ట్రాన్స్‌ఫర్‌ అయ్యాడు. ‘‘మండేలాతో మాట్లాడిన ప్రతిసారీ ఆయనపై గౌరవం రెట్టింపవుతూ వచ్చేది. ఒక జీవిత కాలమంత అనుభవం నాకు ఆయనతో ఉన్నన్ని రోజుల్లో వచ్చేసింది’’ అంటాడు బ్రాండ్‌. వీరిద్దరి కథ ‘గుడ్‌బై బఫానా’ పేరుతో పుస్తకంగా వచ్చింది. అదే పేరుతో 2007లో సినిమా కూడా వచ్చింది.

స్నేహితుడి తుదిశ్వాస పదిలం...
థామస్‌ అల్వా ఎడిసన్‌.. టెక్నాలజీలో ఎన్నో గొప్ప ఆవిష్కరణలు తీసుకొచ్చిన సైంటిస్ట్‌.  గ్యాస్‌తో నడిచే ఆటో మొబైల్‌ను వెలుగులోకి తెచ్చిన హెన్రీ ఫోర్డ్‌ కూడా ఎడిసన్‌ను హీరోలుగా భావించే వారిలో ఒకరు. ఎడిసన్‌ స్థాపించిన కంపెనీలోనే ఫోర్డ్‌ చీఫ్‌ ఇంజనీర్‌గా పనిచేసేవాడు. అప్పట్లో ఫోర్డ్‌ తన తీరిక వేళల్లో గ్యాస్‌తో నడిచే కారును తయారుచేస్తూ ఉండేవాడు. 1896లో ఒకరోజు స్వయంగా ఎడిసనే ఈ విషయం తెలుసుకొని ఫోర్డ్‌ను అభినందించాడు. ఆ తర్వాత ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు.

 ఫోర్డ్‌ పెద్ద పారిశ్రామికవేత్తగా ఎదిగాడు. ఎడిసన్‌తో కలసి బిజినెస్‌ను విస్తరించాడు. 30 ఏళ్లకు పైనే ఈ బంధం కొనసాగింది. ఎడిసన్‌ ప్రోత్సాహమే లేకుంటే తాను ఈ స్థాయికి వచ్చే వాడిని కాదంటూ ఫోర్డ్‌ చెప్పుకొనేవాడు. ఎడిసన్‌ కూడా ఫోర్డ్‌ స్నేహాన్ని గొప్పదిగా చెబుతూ ఉండేవాడు. ఎడిసన్‌ చివరి శ్వాస విడిచే రోజు... 1931 అక్టోబర్‌ 18న ఎప్పటికీ ఆయనను గుర్తుంచుకునేలా ఏదైనా చేయాలనుకున్నాడు ఫోర్డ్‌. ఆయన చివరిశ్వాసను ఒక టెస్ట్‌ ట్యూబ్‌లో బంధించాడు. ఆ సమయానికి ఆయన పీల్చిన గాలిని టెస్ట్‌ట్యూబ్‌లో బంధించి దాన్ని ఫోర్డ్‌ ఎస్టేట్‌లో ఉంచాడు. ఇప్పుడు ఎడిసన్‌ చివరి శ్వాస హెన్రీ ఫోర్డ్‌ మ్యూజియంలో పదిలంగా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement