మోజు | Funday crime story of the week 28 nov 2018 | Sakshi
Sakshi News home page

మోజు

Published Sun, Nov 25 2018 2:26 AM | Last Updated on Sun, Nov 25 2018 2:26 AM

Funday crime story of the week 28 nov 2018 - Sakshi

ఎవరి ప్రమేయం లేకుండా ఓ రోజు మొదలైంది. వీధిదీపాలు ఆర్పేసమయాన్ని కూడా వేగంగా దాటేసింది.మరుసటిరోజు దినపత్రికల్లో.. ‘‘ప్రముఖ నగల వ్యాపారి కశ్యప్‌చంద్‌ అదృశ్యం’’ అనే వార్త ప్రధానంగా అందరినీ ఆకర్షించింది. గత వారం రోజులుగా అతడు కనిపించకపోవడంతో పోలీసులకు ఆ కేసు సవాలుగా మారింది.

‘‘సార్‌..! మా కాకా(చిన్నాన్న) కశ్యప్‌ చంద్‌ విషయం ఏమైనా తెలిసిందా?’’ చాలా ఆందోళనగా అడిగాడు విశాల్‌ చంద్‌(కశ్యప్‌ చంద్‌ అన్నకొడుకు).‘‘మీరే చెప్పాలి..! కనిపించక ఇన్ని రోజులైతే మీరు నిన్నొచ్చి కేసు పెట్టారు. ఈ రోజు వచ్చి కేసు ఎంత వరకూ వచ్చిందంటున్నారు? అసలు ఇన్ని రోజులు మీరెందుకు కేసు పెట్టలేదు’’ అని అడిగాడు ఇన్‌స్పెక్టర్‌ ప్రణయ్‌.‘‘సార్‌ మా కాకా వాళ్ల కొడుకు నిరాల్‌ చంద్‌ ఢిల్లీలో నగల వ్యాపారం చేస్తుంటాడు. అప్పుడప్పుడూ మా కాకా ఢిల్లీలో ఉన్న కొడుకు ఇంటికి వెళ్తుంటాడు. సో అలా వెళ్లి ఉంటాడని అనుకున్నాం. కానీ నిన్ననే ఢిల్లీకి ఫోన్‌ చేస్తే తెలిసింది మా కాకా అక్కడలేడని. వెంటనే బంధుమిత్రుల ఇళ్లల్లో వెతకడం మొదలుపెట్టాం. చివరికి మీకు కంప్లైంట్‌ ఇచ్చాం’’ అని చెప్పుకొచ్చాడు విశాల్‌ చంద్‌.విశాల్‌ పక్కనే ఉన్న అతడి భార్య కౌనికా చంద్‌ కళ్లను అప్రయత్నంగా గమనించాడు ఇన్‌స్పెక్టర్‌ ప్రణయ్‌. ముఖంలో ప్రత్యేకమైన ఆకర్షణ లేకున్నా ఆమె చూపుల్లో ఏదో గమ్మత్తుంది. ఎలాంటివారినైనా ఆ కళ్లు కట్టిపారేస్తాయి. కొన్ని క్షణాలపాటు ప్రణయ్‌ది కూడా అదే పరిస్థితి.‘‘మా కాకా చాలా మంచివాడు సార్‌. అందరితోనూ చాలా చనువుగా ఆప్యాయంగా మాట్లాడతాడు. మా చిన్నమ్మ చనిపోయి చాలా ఏళ్లు అయ్యింది. పనివాళ్ల సహకారంతో ఆయన ఒక్కడే ఒంటరిగా ఉంటున్నాడు. ప్లీజ్‌ సార్‌! ఆయన ఆచూకీని కనిపెట్టే ఏ అవకాశాన్ని వదిలిపెట్టకండి. ఎలాంటి సపోర్ట్‌ కావాలన్నా మా నుంచి ఉంటుంది’’ అన్నాడు విశాల్‌.విశాల్‌ మాటలకి చూపు తిప్పిన ఇన్‌స్పెక్టర్‌.. ‘‘సరే విశాల్‌..! అవసరముంటే మిమ్మల్ని స్టేషన్‌కి పిలుస్తాను. మీరు వెళ్లొచ్చు’’ అన్నాడు గంభీరంగా.

రోజులు గడుస్తున్నాయి. కేసు పరిశీలనలో భాగంగా కశ్యప్‌ చంద్‌ జ్యూయెలరీ షోరూమ్‌ వెళ్లాలనుకున్నాడు ఇన్‌స్పెక్టర్‌ ప్రణయ్‌. ఎందుకంటే అప్పటిదాకా కేసులో ఏ ఆధారమూ దొరకలేదు. పైగా ఎఫ్‌.ఐ.ఆర్‌లో కూడా ఎవరిమీద అనుమానం ఉన్నట్లుగా పేర్కొనలేదు. జ్యుయెలరీ షాప్‌ చాలా విశాలంగా ఉంది. చాలామంది పనివాళ్లున్నారు. దేశవ్యాప్తంగా చాలా బ్రాంచ్‌లు పెట్టినా హైదరాబాద్‌లో ఉన్న జ్యుయెలరీ షాప్‌ అంటేనే కశ్యప్‌ చంద్‌కి చాలా ఇష్టమని చెప్పాడు ఓ సిబ్బంది. ఎందుకని అడిగితే... ‘కశ్యప్‌ సారు మొదటిగా ప్రారంభించి షాప్‌ ఇదే’ బదులిచ్చాడు. షాప్‌ అంతా తిరిగి గమనించాడు ప్రణయ్‌. కశ్యప్‌ చంద్‌ కూచునే కౌంటర్‌ చాలా విశాలంగా ఉంది. పక్కనే కొంచెం చిన్న క్యాష్‌కౌంటర్‌లో ఓ పాతికేళ్ల అమ్మాయి ఉంది. ఆమె పేరు నీనా వైశాలి. ఇన్‌స్పెక్టర్‌ ప్రణయ్‌ ఒక్కొక్కటీ పరిశీలిస్తూ షాప్‌ మధ్యలోకి వచ్చి నిల్చున్నాడు. ఇంకా కశ్యప్‌ చంద్‌ అలవాట్లు, ఆసక్తులు, ఎవరెవరితో చనువుగా ఉంటాడనే విషయాలు అన్నీ తెలుసుకోవాలనుకున్నాడు.‘‘కశ్యప్‌ చంద్‌ పూర్తిగా శాకాహారి. సిగరెట్‌ కాల్చడు. యాలక్కాయలో ఒకే ఒక్క పలుకు గింజ, లేదా లవంగంలో సగం నోట్లో వేసుకుని అటూ ఇటూ ఆడిస్తుంటాడు. అంతకు మించి అతని ఆహారంలో మరే ప్రత్యేకత లేదు. రాత్రి నిద్రపోయే ముందు మాత్రం ఓ చల్లని ‘యాపిల్‌ ఫీజ్‌’ తాగుతుంటాడు. కస్టమర్లతో ఆహ్లాదకరంగా మాట్లాడుతుంటాడు. వచ్చేది ఎక్కువగా మహిళలే కనుక అందరితో సౌమ్యంగా, ఆత్మీయంగా సంభాషిస్తుంటాడు. అది అతనిలో ఉన్న ప్రత్యేకత’’ చెప్పుకొచ్చాడు మరో సిబ్బంది. అయితే చివరగా ఆ సిబ్బంది కొన్ని ముఖ్యమైన విషయాలనే చెప్పాడు. కశ్యప్‌ చంద్‌ స్త్రీలోలుడు. ఆడవాళ్లని అందులోనూ అందమైన ఆడవాళ్లని తన మాటలతో బురిడీ కొట్టించే మనస్తత్వం కలవాడనే అర్థమొచ్చేలా కొన్ని విషయాలను చాలా సాధారణంగా చెప్పాడు ఆ సిబ్బంది.

స్టేషన్‌కి తిరిగి వచ్చిన ఇన్‌స్పెక్టర్‌ ప్రణయ్‌కి.. ఆ సిబ్బంది చెప్పిన చివరి మాటలు పదేపదే గుర్తుకొచ్చాయి. అంటే కశ్యప్‌ చంద్‌కి ఆడయావ ఎక్కువ. వయసు 60 దాటినా ఆడ పిచ్చిపోలేదు’’ అనుకుంటూ ఆలోచనల్లో పడిన ప్రణయ్‌కి... వారంరోజుల క్రితం స్టేషన్‌కి వచ్చిన విశాల్‌ చంద్‌(కశ్యప్‌ చంద్‌ అన్నకొడుకు) భార్య కౌనికా చంద్‌తో పాటు కశ్యప్‌ చంద్‌ జ్యుయెలరీ షాప్‌లో పనిచేస్తున్న నీనా వైశాలీ గుర్తుకొచ్చారు.వెంటనే వాళ్లని స్టేషన్‌కి పిలిపించాడు. ముందుగా కౌనికా చంద్‌ని ప్రశ్నించడం మొదలుపెట్టాడు ప్రణయ్‌.‘‘మీరేం చేస్తుంటారు?’’‘‘జాబ్‌ అంటూ ఏం లేదు. మావారికి సహకరిస్తుంటాను.’’‘‘మీ చిన్న మావయ్య.. అదే కశ్యప్‌ చంద్‌ మీతో ఎలా ఉండేవారు.’’‘‘చాలా సరదాగా ఉండేవారు. అప్పుడప్పుడూ నేనే ఆయనకి డిన్నర్‌ తీసుకెళ్లేదాన్ని’’ చెప్పింది కౌనికా.‘‘మీరే ఎందుకు? పనివాళ్లు చాలా మంది ఉంటారుగా వాళ్ల చేత పంపొచ్చుగా?’’‘‘నేను వెళ్తే ఆయన చాలా సంతోషించేవారు. ‘ఆడ దిక్కులేని కొంప. అప్పుడప్పుడూ వచ్చిపోతుండు’ అనేవారు. అందుకే నాకు తీరిక దొరికినప్పుడు, పనివాళ్లు అందుబాటులో లేనప్పుడూ నేనే స్వయంగా డిన్నర్‌ తీసుకెళ్లి వడ్డించేదాన్ని’’‘‘మరి.. ఆయన స్త్రీలోలుడని విన్నాను నిజమేనా?’’‘ఆయనకు కాస్త సరసాలెక్కువే. కోడలినైనా నాతోనూ డబుల్‌ మీనింగ్‌ మాటలు మాట్లాడేవారు.అవకాశం ఇస్తే అతడు ఎలాంటి సంబంధానికైనా సిద్ధమన్నట్లుగా ఉండేవాడు.’’‘‘మరి మీరెప్పుడూ అతడి ప్రవర్తనతో ఇబ్బంది పడలేదా?’’‘‘అంటే.. మొదట్లో కాస్త ఇబ్బంది పడేదాన్ని. తర్వాత ఆయన మనస్తత్వం అంతేనని సరిపెట్టుకోవడం మొదలుపెట్టాను. ఒంటరి ముసలివాడనే జాలి ఎక్కువగా ఉండేది నాకు. నా భర్త కూడా రెండుమూడు సార్లు అతడి ప్రవర్తన గురించి నన్ను హెచ్చరించారు. ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండేందుకు ప్రయత్నించేదాన్ని.’’‘‘ఆయన్ని చివరగా ఎప్పుడు చూశారు?’’‘‘సుమారు పదిహేను రోజులవుతుంది. నేను మా పుట్టింటికి వెళ్లే ముందు రోజు అతడికి డిన్నర్‌ తీసుకెళ్లాను. నేను తిరిగి వచ్చేసరికి అతడు ఊర్లో లేడని తెలిసింది. ఢిల్లీ వెళ్లి ఉంటారనుకున్నాం. కానీ అతడు అక్కడ కూడా లేకపోయేసరికి మిమ్మల్ని ఆశ్రయించాం.’’ప్రణయ్‌ రెట్టించినా.. గర్దించినా.. అంతకు మించి ఏం రాలేదు ఆమె నుంచి. మొత్తానికి అదృశ్యమైన కశ్యప్‌ చంద్‌ ‘స్త్రీ లోలుడని’’ అర్థమైంది. నీనా వైశాలీ కూడా ఆ విషయాన్ని స్పష్టంగా ధ్రువీకరించింది. కశ్యప్‌ చంద్‌ ఇంట్లో వంటపని చేసే టిట్టూని ప్రశ్నించాడు. ఆమె కాస్త వణికింది. ఎందుకని ఆరా తీస్తే.. తన పట్ల కూడా కశ్యప్‌ అసభ్యంగా ప్రవర్తించేవాడని, ఎక్కడ ఉద్యోగం పోతుందోననే భయంతో అతడి ఆగడాలను భరించానని చెప్పుకొచ్చింది.

చివరగా షోరూమ్‌లో ఉన్న సీసీ పుటేజ్‌లను పరిశీలించాలని నిర్ణయించుకున్నాడు ఇన్‌స్పెక్టర్‌ ప్రణయ్‌. కశ్యప్‌ చంద్‌ కనిపించకుండా పోయిన రోజు నుంచి వెనక్కి ఒక్కో రోజు ఒక్కో రోజూ సీసీ ఫుటేజ్‌లో గమనించాడు. ఆ ఫుటేజ్‌లో కొందరు ఆడవాళ్లు కశ్యప్‌తో చాలా చనువుగా ఉన్నారు. దాంతో వాళ్లందరినీ స్టేషన్‌కి పిలిపించి విచారించాడు. ఎక్కడా ఏ క్లూ దొరకలేదు. మళ్లీ మళ్లీ ఆ సీసీ ఫుటేజ్‌లను పరిశీలిస్తూనే ఉన్నాడు. రోజు, వారాలు, నెలలు వెనక్కి వెనక్కి వెళ్లి మరీ షోరూమ్‌ దృశ్యాలను సీసీ ఫుటేజ్‌లో చూస్తూనే ఉన్నాడు. ఈ సారి షోరూమ్‌కి వచ్చే ఆడవాళ్లని కాదు. షోరూమ్‌లో ఉన్న కశ్యప్‌ చంద్‌ హావభావాలపై దృష్టిపెట్టాడు. అలా చూస్తూ ఉండగా కశ్యప్‌ చంద్‌ ఎక్స్‌ప్రెషన్స్‌ ఓ చోటా కాస్త డిఫరెంట్‌గా తోచాయి. ఎదురుగా డోర్‌ తెరుచుకుని లోనికి వస్తున్న ఓ మహిళను చూసి ఎడమ కన్ను మీటుతున్నాడు. ఆమె నవ్వుకుంటోంది. ఆమెని మరింత జూమ్‌ చేసి చూశాడు ఇన్‌స్పెక్టర్‌ ప్రణయ్‌. చాలా అందంగా చురుగ్గా ఉన్న ఆమెకు వయసు ముప్ఫై దాటినట్లే ఉన్నాయి. ఎంక్వైరీలో భాగంగా మొత్తానికీ ఆమెను వెతికిపట్టుకున్నారు పోలీసులు.కాలింగ్‌ బెల్‌మోగుతోంది. పోలీసులను చూసి నిర్ఘాంతపోయింది ఆమె.‘‘మీ పేరు?’’ లోపలికి నడిచాడు ప్రణయ్‌.‘‘సుగుణ కుమారి’’‘‘కశ్యప్‌ చంద్‌ మీకు తెలుసా?’’ సోఫాలో కూర్చుంటూ అడిగాడు.‘‘ఏ కశ్యప్‌ చంద్‌?’’‘‘అదే జ్యుయెలరీ షాప్‌ ఓనర్‌ కశ్యప్‌ చంద్‌!?’’‘‘తెలీదు. ఆయన్ని నేనెప్పుడూ చూడలేదు.’’‘‘అవునా? పోనీ.. ఆయన కన్నుగీటితే ముసిముసిగా నవ్వుకున్నారా?’’ అన్నాడు ప్రణయ్‌ చాలా వెటకారంగా.అతడి ప్రశ్నకి షాక్‌ అయ్యింది సుగుణ. ‘‘ఏమ్‌.. ఏం మాట్లాడుతున్నారు?’’ అంది వణుకుతున్న స్వరంతో.‘‘ఇప్పటికీ మించిపోయింది లేదు. కశ్యప్‌ని ఎక్కడ దాచారో చెబితే శిక్ష తగ్గుతుంది. కచ్చితంగా మీరే ఈ పని చేశారని నా ఎంక్వైరీలో తేలింది’’ గదమాయించాడు ప్రణయ్‌.‘‘కశ్యప్‌ చంద్‌ చనిపోయాడు. నేనే.. నేనే.. చంపేశాను’’ బాగా ఏడుస్తోంది సుగుణ.‘‘వాట్‌? ఎందుకు?’’‘‘నా స్నేహితురాలు జ్యుయెలరీ కొనడానికి ఒకరోజు కశ్యప్‌ చంద్‌ షాప్‌కి తీసుకెళ్లింది. అప్పుడే అతడు నాకు పరిచయం. ఆ తర్వాత చిన్న చిన్న జ్యుయెలరీలు నేనూ ఇక్కడే కొనేదాన్ని. అతడి మాట తీరు, అతడు చూపించే అభిమానం నాకు బాగా నచ్చేవి. మాటల సందర్భంలో నా భర్త బిజినెస్‌లో లాస్‌ అయ్యారని, అప్పులు తీర్చేందుకు గల్ఫ్‌ వెళ్లారని, ఏదో కేసు విషయంలో అక్కడే జైలు పాలైన నా భర్తను తిరిగి ఇండియాకు రప్పించేందుకు డబ్బులు సర్ధుబాటు కావట్లేదని అతడితో చెప్పుకున్నాను. డబ్బుపరంగా ఏ అవసరం ఉన్నా నేను సహకరిస్తానని మాటిచ్చాడు. పైగా అదే రోజు మా ఇంటికి వచ్చాడు. ‘నేను చేయబోయే డబ్బుసాయానికి కృతజ్ఞతగా ఏమిస్తావ’న్న అతడి కోరికకు నేను లొంగిపోయాను. ఆ రోజు నుంచీ డబ్బు సర్ధుబాటు చెయ్యమంటే ఇదిగో.. అదిగో.. అని జరిపేవాడు. కానీ రెగ్యులర్‌గా మా ఇంటికి వచ్చి ఆనందంగా గడిపి వెళ్లిపోయేవాడు. కొన్ని రోజులకి మేము కలిసి దిగిన కొన్ని అభ్యంతరకరమైన ఫొటోలను చూపించి నానుంచే డబ్బులు తీసుకోవడం మొదలు పెట్టాడు. రెండు మూడు చోట్ల అప్పు చేసి కూడా అతడికి డబ్బులిచ్చాను. అతడి ఆగడాలకు విసిగిన నేను అతడిని మట్టుపెట్టాలని నిర్ణయించుకున్నాను. ఒకరోజు రాత్రి మా ఇంటికి వచ్చాడు. నిద్రపోయే ముందు యాపిల్‌ ఫీజ్‌ తాగడం అతడికి అలవాటు.అందులో అప్పటికే నిద్రమాత్రలు కలిపి ఉంచాను. అది తాగి మైకంలోకి పోగానే గొంతు నులుమి చంపేశాను. ఆధారాలన్నీ కాల్చి బూడిద చేశాను. శవాన్ని ముక్కలు చేసి మూట కట్టి అర్ధరాత్రి సమయంలో స్కూటీపైన తీసుకెళ్లి మూసీ నదిలో పడేశాను’’ అని ఏడుస్తూ ముగించింది సుగుణ. సుగుణ వాంగ్మూలం తీసుకున్న ప్రణయ్‌.. అరెస్ట్‌ చేసి స్టేషన్‌కి తీసుకెళ్లాడు.పోగొట్టుకున్నచోటే వెతకాలనే నానుడి నమ్మి.. సీసీçఫుటేజ్‌ మళ్లీ మళ్లీ శోధించడం వల్లే కన్నుగీటుతున్న కశ్యప్‌ చంద్‌ స్టిల్‌ చూడగలిగాడు. లేదంటే కేసు ఎప్పటికి తేలేదో!!’ అనుకున్నాడు ఇన్‌స్పెక్టర్‌ ప్రణయ్‌.
  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement