‘‘ఆ పిల్ల వచ్చెళ్లిందిరా నీ కోసం’’ అంది అమ్మ. ఆ పిల్ల అంటే.. హేమంతి! ‘‘నా కోసం ఎందుకొస్తుంది? పండక్కి వచ్చిందేమో’’ అన్నాను. ‘‘పండక్కే ఊరొచ్చి, నీ కోసం మనింటికి వచ్చింది. బిడ్డని చంకనేసుకొచ్చింది. ముద్దుగా ఉందది’’ చెప్పింది అమ్మ. ‘‘ఏంటటా?’’ అన్నాను. ‘‘వాడు పండక్కి రాలేదా ఆంటీ అని అడిగింది’’. వాడు అంటే నేనే. మా అమ్మ తర్వాత ఈ ప్రపంచంలో నన్ను ‘రేయ్’ అని ఒక్క హేమంతే అంటుంది. నాన్న కూడా నన్ను రేయ్ అనరు. ‘బాబూ’ అనేది ఆయన పిలుపు. ‘‘అయినా నువ్వేంట్రా, ఎవరైనా పండక్కి వస్తారు. పండక్కని చెప్పి నువ్వు పండక్కి ముందో, పండగ తర్వాతో వచ్చెళతావు. తను వచ్చినప్పుడు నువ్వు ఉండుంటే బాగుండేది కదా!’’ అంది అమ్మ.\ ‘‘ఊ’’ అన్నాను. ‘‘వాడి ఫోన్ నెంబరు ఇవ్వనా అమ్మా అంటే, ‘వద్దాంటీ’ అని.. ‘ఇదిగో ఈ కవరు వాడికివ్వండి’ అని చెప్పి వెళ్లింది’’ అంది అమ్మ. కవర్ తీసుకున్నాను. అంటించి ఉంది. లోపల అసలు ఏమైనా ఉందా లేదా అన్నంత పలుచగా ఉంది కవరు. మూడేళ్లయింది హేమంతిని చూసి!
హేమంతి పేరు హేమంతి కాదు. అది నేను పెట్టుకున్న పేరు. ఆ సంగతి హేమంతికి కూడా తెలీదు. టెన్త్‌లో నా క్లాస్‌మేట్ హేమంతి. ఏదో ఊర్నుంచి ట్రాన్స్‌ఫర్ అయి వచ్చారు. రోజూ మా ఇంటికి వచ్చేది. ఇంటి ముందు సన్నజాజి పందిరి కింద నిలబడి మాట్లాడుకునేవాళ్లం. ‘ఆడపిల్లల్తో మాటలేంట్రా?’ అంది అమ్మ ఓ రోజు, హేమంతితో మాట్లాడి ఇంట్లోకి రాగానే. ‘అదేంటమ్మా..’ అన్నాను. అమ్మేం మాట్లాడలేదు. ఇంటర్‌లో కూడా హేమంతి, నేను కలిసే చదువుకున్నాం. అప్పుడు పెట్టుకున్నదే హేమంతికి నేను ఆ పేరు. ఆ సంగతి తనకి చెప్పలేదు. అది నా సొంత విషయం అనుకున్నాను. హేమంతి బాగుంటుందని కాలేజ్‌లో అందరూ అనేవారు. అమ్మ కూడా అంటుండేది.. ‘చక్కటి పిల్లరా’ అని. ఎందుకనో అమ్మాయిలందరూ నాకు చక్కగానే కనిపించేవారు. హేమంతి.. ఇంకాస్త చక్కటి అమ్మాయి కావచ్చు. అయితే చక్కగా ఉంటుందని తనకు నేను హేమంతి అనే పేరు పెట్టుకోలేదు. హేమంతాన్ని, చామంతిని కలిపేసి.. హేమంతి అనే పదాన్ని క్రియేట్ చేశాను. ఆ క్రియేషన్ నాకు చాలా నచ్చింది. తనకి పెట్టుకోవాలనిపించింది. పెట్టుకున్నాను. ఇంటర్‌లోకి వచ్చాక కూడా అమ్మ నాకు చెబుతుండేది.. ‘ఆడపిల్లల్తో ఎక్కువగా మాట్లాడకు’ అని! చిన్నప్పుడు నాన్న నన్ను కొట్టి, నేను ఏడుస్తూ ఉంటే దగ్గరకు తీసుకుని ‘అబ్బెబ్బే.. మగపిల్లలు ఎక్కడైనా ఏడుస్తారా?’ అని కళ్లు తుడిచేవారు. ఎందుకు ఏడవకూడదు? నాన్న నన్ను కొట్టడం తప్పు కానప్పుడు, నేను ఏడ్వడం తప్పెలా అవుతుంది? చాలాసేపు ఆలోచించేవాడిని. తర్వాత నాన్నే కరెక్ట్ అని తెలిసింది. సినిమాల్లో హీరో, విలన్ ఒకర్నొకరు కొట్టుకుంటూ ఉంటారు. హీరో ఏడ్వడు, విలనూ ఏడ్వడు. మగాళ్లు ఏడ్వరనీ, ఏడ్వకూడదనీ అలా నా మనసులో పడిపోయింది. ఆడపిల్లల్తో ఎక్కువ మాట్లాడకూడదని ఎప్పుడూ అమ్మ చెబుతుండే మాట కూడా అలాగే నా మనసులో పడిపోయింది. తర్వాత్తర్వాత.. అమ్మ అలా చెప్పడానికి నేనొక కారణాన్ని కనిపెట్టాను. నేను బాగుండను! బాగుండను అంటే.. అమ్మాయిలకు నచ్చేంత బాగుండను. ఆ సంగతి నాకు తెలుసు. నేనెవరినైనా ఇష్టపడి, వాళ్లు కాదంటే మనసు నొచ్చుకుంటానని, ముందు జాగ్రత్తగా అమ్మ అలా చెప్పేదేమో!
హేమంతికి నేను పేరు పెట్టుకున్నానే కానీ, హేమంతిపై ఆశలు పెట్టుకోలేదు. హేమంతికి కాలేజ్ నిండా ఫ్రెండ్సే. ఇంటి దగ్గర మాత్రమే తనకి నాతో మాట్లాడే టైమ్ దొరుకుతుంది. హేమంతికి, నాకు కామన్ ఫ్రెండ్ ఒకడున్నాడు. హేమంతిని వాడు భలే నవ్వించేవాడు. పొట్ట చేత్తో పట్టుకుని మరీ నవ్వుతుంది హేమంతి. అలా నవ్వుతున్నప్పుడు హేమంతి ఇంకా బాగుండేది. వాడికి బైక్ ఉంది. ఆ బైక్ మీద ఎప్పుడైనా ఇద్దరూ కలిసి కనిపించేవారు. ఓరోజు నన్నూ ఎక్కమన్నాడు వాడు. ‘ముగ్గురమా!’ అన్నాను. ‘ఎక్కరా పర్లేదు’ అన్నాడు. అప్పటికే వాడి వెనుక హేమంతి కూర్చొని ఉంది. హేమంతి వెనుక నేను కూర్చోబోయాను. ‘ఫట్’మని నా చెంప మీద కొట్టాడు వాడు. ‘ఆడపిల్లని మధ్యలో కూర్చోబెట్టుకుంటార్రా ఎవరైనా?’ అన్నాడు! ‘లేదూ.. నీ ఫ్రెండ్ కదా. నీ వెనకే ఉంటే బాగుంటుందనీ..’ అన్నాను. ఈసారి ‘ఫట్’మని హేమంతి నా చెంప మీద కొట్టింది. వాడి కన్నా గట్టిగా కొట్టింది. ‘ఎవరికిరా బాగుండేది? నీకా’ అని మళ్లీ కొట్టింది. ‘నేను రాను. మీరు వెళ్లండి’ అన్నాను.
అదే కాలేజ్‌లో మా డిగ్రీ. థర్డ్ ఇయర్‌లో ఉండగా.. రోజూ వచ్చినట్లే.. మా ఇంటికొచ్చింది హేమంతి. ఎప్పటిలా సన్నజాజి పందిరి కింద నిలబడి మాట్లాడుకుంటున్నాం. హేమంతి డల్‌గా ఉంది. ‘నాన్న ఒప్పుకోవడం లేదు. మంచి సంబంధం అంటున్నారు’ అంది. ‘చేసుకోవచ్చు కదా’ అన్నాను. ‘నీకేం అనిపించడం లేదా?’ అంది హేమంతి. ‘పెళ్లి తర్వాత కూడా చదువుకోవచ్చు అన్నారు కదా. ఇంకేంటి?’ అన్నాను. హేమంతి వెళ్లిపోయింది. ‘పెళ్లి ఖాయం అయ్యేలా ఉంది. వెళ్లిపోతాం ఇక్కణ్నుంచి’ అంది హేమంతి మళ్లీ ఒకరోజు వచ్చి. ‘అవునా?’ అన్నాను. ‘నీకేం అనిపించడం లేదా?’ అంది. ‘ఏంటి అనిపించడం?’ అన్నాను. హేమంతి మాట్లాడలేదు అదే చివరిసారి నేను హేమంతిని చూడడం. ఇంట్లోకొచ్చి ఎందుకనో అద్దం చూసుకున్నాను. కళ్లు మామూలుగానే ఉన్నాయి. కళ్లల్లో నీళ్లు లేవంటే మనిషి ఏడ్వడం లేదనేనా?!
గదిలోకి వెళ్లాక, అమ్మకు హేమంతి ఇచ్చి వెళ్లిన కవరు తెరిచి చూశాను. లోపల చిన్న కాగితం ఉంది. అందులో రెండే వాక్యాలు. ‘కోరికలు తీరకుండా చనిపోతే దెయ్యాలవుతారని అంటారు. మనసులో ప్రేమను పెట్టుకుని తిరిగే మనుషులకు ఏ పేరు పెడితే బాగుంటుందో ఆలోచించు. చక్కటి పేర్లు పెట్టగలవు కదా!’
– హేమంతి
హేమంతి
Published Sun, Feb 4 2018 12:43 AM | Last Updated on Tue, Feb 6 2018 5:14 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment