కాక్టస్‌  | Funday horror story of the week 27-01-2019 | Sakshi
Sakshi News home page

కాక్టస్‌ 

Published Sun, Jan 27 2019 12:43 AM | Last Updated on Sun, Jan 27 2019 12:43 AM

Funday horror story of the week 27-01-2019 - Sakshi

‘‘గుడ్‌ మార్నింగ్‌ సర్‌.... ’’ నవ్వుతూ మేనేజర్‌ను  విష్‌ చేసింది గ్రేస్‌.. ఆ ఆఫీస్‌లో  మొదటి రోజును ఆహ్లాదంగా ఆహ్వానిద్దామని.  ‘‘వెరీ గుడ్‌ మార్నిం.....’’ అసంకల్పితంగానే ఆన్సర్‌ చేస్తూ తలెత్తిన మేనేజర్‌ వాక్యం పూర్తి కాకుండానే ఆగిపోయాడు గ్రేస్‌ చేతిలో ఉన్న మొక్కను చూస్తూ! మొహం మీది చిరునవ్వూ మాయమైంది.  సడెన్‌గా బాస్‌ ఎక్స్‌ప్రెషన్‌ మారిపోయే సరికి అయోమయంలో పడింది గ్రేస్‌. ‘‘ఈజ్‌ దేర్‌ ఎనిథింగ్‌  రాంగ్‌ విత్‌ మీ సర్‌?’’ చాలా వినయంగా అడిగింది. ‘‘వాట్స్‌ దట్‌?’’ ఆమె చేతిలో ఉన్న మొక్కవైపు చూస్తూ అన్నాడు చిరాగ్గా.  ‘‘ప్లాంట్‌.. కాక్టస్‌ ప్లాంట్‌ సర్‌’’ అంటూ రెండు చేతులతో పట్టుకున్న చిన్న తొట్టిని ఆయన ముందుకు చాపింది.  ‘‘హేయ్‌.. వాట్‌ ఆర్‌ యూ డూయింగ్‌?’’ అరిచేశాడు. బెదిరిపోయింది గ్రేస్‌. ‘‘నాకు కాక్టస్‌ అంటే చాలా ఇష్టం. ఫస్ట్‌ డే కదా.. మీకు ఈ మొక్క ఇచ్చి గ్రీట్‌ చేద్దా..మ..ని..’’ ’’ బెరుగ్గా అన్నది. ‘‘జస్ట్‌ షటప్‌. నాకిలాంటివి నచ్చవ్‌. కాక్టస్‌ అంటే అస్సలు నచ్చదు. ఐ హేట్‌ దట్‌.. నౌ యు కెన్‌ గెట్‌బ్యాక్‌ టు  యువర్‌ ప్లేస్‌’’ కోపంగా మేనేజర్‌. బిక్క మొహం వేసుకొని క్యాబిన్‌లోంచి బయటకు వచ్చింది గ్రేస్‌.  మేనేజర్‌ మొహంనిండా చెమటలు.

టేబుల్‌ మీద.. తన సిస్టమ్‌ పక్కనే ఆ చిన్ని తొట్టిని పెట్టుకొని ప్రేమగా.. ముద్దుగా మొక్కను చూసుకుంది గ్రేస్‌. ఆమె పెదవుల మీద చిరునవ్వు. ‘‘హాయ్‌..’’ అంటూ పక్కన కొలీగ్‌ పలకరింపు వినిపించేసరికి తల తిప్పింది గ్రేస్‌.‘‘దిస్‌ ఈజ్‌ శీతల్‌.. ’’ గ్రేస్‌ను పరిచయం చేసుకుంది  కొలీగ్‌. ‘‘ఓ.. హాయ్‌.. ఐయామ్‌  గ్రేస్‌’’ షేక్‌ హ్యాండ్‌ ఇచ్చింది గ్రేస్‌. ‘‘ఇదీ.. ’’అంటూ గ్రేస్‌ టేబుల్‌ మీదున్న మొక్కను చూపిస్తూ ఆగింది శీతల్‌. ‘‘కాక్టస్‌..’’ఉత్సాహంగా చెప్పింది గ్రేస్‌. ‘‘అదే.. ఆఫీస్‌కు తెచ్చుకునేంత ఇష్టమా?’’ ఐబ్రోస్‌ ముడి వేసింది శీతల్‌.‘‘ప్రాణం’’ వాటి ముళ్లు గుచ్చుకోకుండా జాగ్రత్తగా ఆ తొట్టిని హత్తుకుంటూ తన్మయత్వంగా చెప్పింది గ్రేస్‌. ‘‘ఇంతకుముందు ఈ క్యుబికల్‌ ఆరుషి అనే అమ్మాయి వాడేది. ఆమెకూ అంతే! కాక్టస్‌ అంటే పిచ్చి. రెండు,మూడు తెచ్చిపెట్టుకుంది. ఒకటి టేబుల్‌ మీద, రెండు ఫుట్‌రెస్ట్‌ పక్కన. వండర్‌ అనిపించేది..’’ శీతల్‌. ‘‘తనెక్కడ ఇప్పుడు?’’ అడిగింది ఆత్రంగా గ్రేస్‌. ‘‘అక్కడ’’పైకి చూపిస్తూ చెప్పింది శీతల్‌. ‘‘ఓ.. పై ఫ్లోర్‌లోనా?’’ గ్రేస్‌.‘‘నో.. చనిపోయింది’’ శీతల్‌. ‘‘అయ్యో.. సో సారీ .. ఎలా?’’ అడిగింది నొచ్చుకుంటూ గ్రేస్‌. ‘‘తెలీదు’’ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది శీతల్‌. అంత హఠాత్తుగా ఆమె మూడ్‌ ఎందుకు మారిందో అర్థం కాలేదు గ్రేస్‌కు. ‘‘ఎనీవే.. ’’ అని నిట్టూరుస్తూ పనిలో పడిపోయింది. ఇంతలోకే మేనేజర్‌ గది లోంచి కాల్‌ వచ్చింది గ్రేస్‌కి. గబగబా వెళ్లింది. కూర్చోమన్నట్టు కుర్చీ చూపించాడు. ఒద్దిగ్గా కూర్చుంది. ఆమె చేయాల్సిన పనుల గురించి చెప్తున్నాడు. తల వంచుకొనినోట్‌ చేసుకుంటోంది. ఆమెనే తధేకంగా చూస్తున్నాడు. చివాల్న తలెత్తింది. షాక్‌ అయ్యాడు మేనేజర్‌. ‘‘కాక్టస్‌ ఈజ్‌ మై ఫేవరేట్‌’’ అంది నవ్వుతూ. మళ్లీ ముచ్చెమటలు మేనేజర్‌కి. బజర్‌ నొక్కబోయాడు బయట ఉన్న బాయ్‌ని పిలవడానికి. అది మోగలేదు. ఆమె నవ్వుతూనే ఉంది. లేచి డోర్‌ తెరవ బోయాడు. తెరుచుకోలేదు.. ఆమె నవ్వుతూనే ఉంది. అరుస్తున్నాడు. గొంతు పెగలట్లేదు.తడారి పోతోంది. ఆమె నవ్వుతూనే ఉంది. మెడలో ఉన్న టై బిగిసుకుపోయి ఊపిరి రావట్లేదు. తలుపు బాదుతున్నాడు.. శబ్దం రావట్లేదు. ఆమె నవ్వుతూనే ఉంది.. కాక్టస్‌ ఈజ్‌ మై ఫేవరేట్‌ సర్‌.. అంటోంది. 

ఇంతలోకే బాయ్‌ డోర్‌ తెరిచేసరికి ఆ విసురికి వచ్చి కుర్చీలో కూలబడ్డాడు మేనేజర్‌. కళ్లు తేలేసిన బాస్‌ను చూసి.. ‘‘సర్‌... సర్‌.. ఏ మైంది సర్‌..’’ అంటూ మంచినీళ్ల గ్లాస్‌ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు బాయ్‌. ఎదురుగా ఉన్న కుర్చీ చూపిస్తూ.. ‘‘ఆరుషి.. ఆరుషి’’ అంటూ ఏదో చెప్పబోతున్నాడు. ‘‘ఏంటి సర్‌’’అంటూ ఎదురుగా చూశాడు బాయ్‌. ఎవరూ లేరక్కడ. ‘‘సర్‌ .. ఎవరూ’’ అంటూ మళ్లీ రెట్టించాడు బాయ్‌.మేనేజర్‌కీ ఆ కుర్చీ ఖాళీగానే కనిపించింది. బాయ్‌ని తోసేసి  బయటకు వచ్చి గ్రేస్‌ క్యుబికల్‌ వైపు చూశాడు. సీరియస్‌గా తన సిస్టమ్‌లో తలపెట్టి కనిపించింది. అతని కాళ్లు వణుకుతున్నాయి. అలాగే వెళ్లి కుర్చీలో కూలబడ్డాడు. ఇంటర్‌కమ్‌  మోగుతోంది.. వణుకుతున్న చేయితోనే లిఫ్ట్‌ చేశాడు. ‘‘హలో.. సర్‌’’ అవతలి నుంచి ‘‘యె..’’ జీరబోయేసరికి గొంతు సవరించుకుని ‘‘యెస్‌’’ అన్నాడు మేనేజర్‌. పీలగానే ఉంది స్వరం. ‘‘సర్‌.. ఈరోజు మీ సెక్షన్‌లో జాయిన్‌ కావాల్సిన గ్రేస్‌ రాత్రి జరిగిన ఆ బస్‌ యాక్సిడెంట్‌లో చనిపోయిందట సర్‌’’ చెప్పింది హెచ్‌ఆర్‌ ఎంప్లాయ్‌. షాక్‌ అయ్యాడు మేనేజర్‌. ఫోన్‌ రిసీవర్‌ను అలాగే వదిలేసి  బయటకు వచ్చాడు. గ్రేస్‌ క్యుబికల్‌ వైపు చూశాడు. గ్రేస్‌ లేదు. కాక్టస్‌ ఉంది. చిత్రంగా గాలికి కదులుతూ! 

అతని మనసులో ఆరుషిలా..
ఆరుషీని ఎంతలా ప్రేమించాడు!  కానీ ఆమె  లెక్కచేయలేదు. ఫ్లాట్‌.. గోల్డ్‌..బ్యాంక్‌ బ్యాలెన్స్‌ చూపించాడు బదులుగా! ఛీ.. థూ అని ఊసింది. తుడిచేసుకున్నాడు సిగ్గులేకుండా. ఆ రోజు.. ఆరుషి బర్త్‌ డే.కేక్‌తోపాటు డైమండ్‌ బ్రేస్‌లెట్‌ ముందు పెట్టాడు. రెండిటినీ తోసేసింది. కారణం అడిగాడు. ‘‘నీకు ఆల్రెడీ పెళ్లవడం’’ అంది. ‘‘ డైవోర్స్‌ ఇచ్చేస్తాను’’అన్నాడు. ‘‘అయినా నో’’ అంది మొండిగా. ‘‘ఎందుకు’’ అడిగాడు అంతే మొండిగా. ‘‘నాకు ఇష్టంలేదు. నో అంటే నో అంతే’’ అంది. అవమానం అతనిలో. తుడుచుకోవడానికి ఆత్మాభిమానమూ అడ్డొచ్చింది. అహం రెచ్చగొట్టింది. ఆమెను పట్టుకోబోయాడు.తప్పించుకుంది. పట్టుబట్టాడు. టెర్రస్‌ మీదకు పరిగెత్తింది. తనూ వెళ్లాడు. కార్నర్‌ చేశాడు. ఆమె భుజాలు పట్టుకొని మొహంలో మొహం పెట్టాడు.  తప్పించుకోవడానికి జరిగిన గింజులాటలో అతని పట్టు సడలి రక్షణగా ఉన్న అల్యూమినియం రెయిలింగ్‌ మీదకు ఒరిగింది. అప్పటికే అతుకులుఊడిన ఆ రెయిలింగ్‌   ఆమె బరువుకి విరిగింది..ఆ నాలుగో అంతస్తు మీద నుంచి ఆమె జారింది. తల పగిలింది. రక్తపు  మడుగులో అచేతనంగా ఆరుషి. 
- ∙సరస్వతి రమ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement