కొర్రల వంటలు | Funday Korrala cuisine special story | Sakshi
Sakshi News home page

కొర్రల వంటలు

Published Sun, Dec 30 2018 12:16 AM | Last Updated on Sun, Dec 30 2018 12:16 AM

Funday Korrala cuisine special story - Sakshi

కొర్ర మామిడి అన్నం
కావలసినవి:  కొర్ర బియ్యం – ఒక గ్లాసుడుమామిడి తురుము – అర కప్పు అల్లం తురుము – ఒక టీ స్పూనుఉప్పు – తగినంత నెయ్యి/నూనె – 2 టేబుల్‌ స్పూన్లు పచ్చి సెనగ పప్పు – 2 టీ స్పూన్లు
మినప్పప్పు – 2 టీ స్పూన్లు ఎండు మిర్చి – 4 తరిగిన పచ్చి మిర్చి – 5 ఆవాలు – ఒక టీ స్పూను మెంతులు – పావు టీ స్పూను పసుపు – పావు టీ స్పూను ఇంగువ – పావు టీ స్పూను
కరివేపాకు – 3 రెమ్మలు

తయారీ: 
కొర్ర బియ్యాన్ని సుమారు మూడు గంటలపాటు నానబెట్టిన తరవాత నీళ్లు ఒంపేసి, తగినన్ని మంచినీళ్లు జత చేసి అన్నం ఉడికించాలి. ఉడికిన కొర్ర అన్నాన్ని వేడిగా ఉండగానే ఒక ప్లేటులో ఆరబెట్టుకోవాలి. స్టౌ మీద బాణలిలో నెయ్యి/నూనె వేసి కాగాక ఆవాలు, మెంతులు, పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు, అల్లం తురుము, పచ్చి మిర్చి తరుగు, ఎండు మిర్చి, కరివేపాకు, ఇంగువ పసుపు వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. మామిడి తురుము జత చేసి ఐదు నిమిషాల పాటు వేయించి, దింపి చల్లారాక, కొర్ర అన్నంలో వేసి బాగా కలపాలి. ఉప్పు జత చేసి మరోమారు కలపాలి. రెండు గంటల పాటు బాగా ఊరిన తరవాత తినాలి.

100 గ్రాముల ధాన్యాల్లో పోషకాలు, పీచు పదార్థం ఎంత?
కొర్రలు (Foxtail Millet)  
నియాసిన్‌ l (Niacin)mg (B3)    0.7
రిబోఫ్లావిన్‌(Rivoflavin)mg (B2)     0.11
థయామిన్‌  (Thiamine) mg (B1)    0.59
కెరోటిన్‌ (Carotene)ug        32
ఐరన్‌(Iron)mg        6.3
కాల్షియం (Calcium)g        0.03
ఫాస్పరస్‌(Phosphorous)g    00.29
ప్రొటీన్‌  (Protein)g        12.3
ఖనిజాలు  (Minerals) g        3.3
పిండిపదార్థం (Carbo Hydrate) g    60.6
పీచు పదార్థం(Fiber) g        8.0
పిండిపదార్థము/పీచు నిష్పత్తి (Carbo Hydrate/Fiber Ratio)    7.57

కొర్ర దోసె
కావలసినవి: కొర్రలు – 3 కప్పులు, మినప్పప్పు – ఒక కప్పుఉప్పు – తగినంత, మెంతులు – పావు టీ స్పూను
నూనె – తగినంత

తయారీ: మెంతులు, మినప్పప్పు, కొర్రలను విడివిడిగా తగినన్ని నీళ్లు జత చేసి, ముందు రోజు రాత్రి నానబెట్టాలి. మరుసటిరోజు ఉదయం నీళ్లు ఒంపేయాలి. గ్రైండర్‌లో మినప్పప్పు, కొర్రలు, మెంతులు వేసి కొద్దికొద్దిగా నీళ్లు జత చేస్తూ దోసెల పిండి మాదిరిగా మెత్తగా రుబ్బుకోవాలి. సుమారు ఆరేడు గంటలు బాగా ఊరిన తరవాత తగినంత ఉప్పు జత చేయాలి. స్టౌ మీద పెనం ఉంచి వేడయ్యాక కొద్దిగా నెయ్యి/నూనె వేయాలి. రుబ్బి ఉంచుకున్న పిండిని గరిటెతో తీసుకుని దోసె మాదిరిగా వేయాలి. చుట్టూ నెయ్యి/ నూనె వేసి కాలిన తరవాత, తిరగేసి రెండో వైపు కూడా కాలిన తరవాత ప్లేటులోకి తీసుకోవాలి. కొబ్బరి చట్నీతో తింటే రుచిగా ఉంటాయి.

కొర్ర కొబ్బరి అన్నం
కావలసినవి:  కొర్ర బియ్యం – ఒక కప్పుకొబ్బరి తురుము – ఒక కప్పుకొత్తిమీర తరుగు – 2 టీ స్పూన్లుఉప్పు – తగినంతనెయ్యి – 2 టీ స్పూన్లుపోపు కోసంజీలకర్ర – ఒక టీ స్పూనుపచ్చి సెనగ పప్పు – 2 టీ స్పూన్లుమినప్పప్పు – 1 టీ స్పూనుఅల్లం తురుము – ఒక టీ స్పూనుపచ్చి మిర్చి తరుగు – అర టీ స్పూనుఎండు మిర్చి – 2 (ముక్కలు చేయాలి)కరివేపాకు – 2 రెమ్మలు
జీడిపప్పులు – 10

తయారీ:  కొర్ర బియ్యాన్ని రెండు గంటల పాటు నానబెట్టాక, నీళ్లు ఒంపేసి తగినన్ని నీళ్లు జత చేసి స్టౌ మీద ఉంచి అన్నం ఉడికించాలి. వెంటనే వెడల్పాటి పళ్లెంలో పోసి పొడిపొడిగా చేసి చల్లారబెట్టుకోవాలి. స్టౌ మీద బాణలిలో నెయ్యి వేసి కరిగాక, జీలకర్ర, పచ్చి మిర్చి తరుగు, అల్లం తురుము, పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు, జీడిపప్పులు, ఎండు మిర్చి, కరివేపాకు ఒకదాని తరవాత ఒకటి వేసి దోరగా వేయించాలి. కొబ్బరి తురుము చేర్చి రెండు నిమిషాలు పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తగినంత ఉప్పు, జత చేసి బాగా కలిపి దింపేయాలి. కొర్రల అన్నం మీద వేసి కలియబెట్టి, కొత్తిమీరతో అలంకరించి వేడివేడిగా అందించాలి.

కొర్ర ఇడ్లీ
కావలసినవి: 
కొర్రల రవ్వ – 3 కప్పులు, మినప్పప్పు – ఒక కప్పు
నెయ్యి/నూనె – తగినంత, ఉప్పు – తగినంత
తయారీ: 
మినప్పప్పును శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు జత చేసి, సుమారు మూడు గంటలసేపు నానబెట్టాలి. కొర్ర రవ్వకు తగినన్ని నీళ్లు జత చేసి మూడు గంటలసేపు నానబెట్టాలి. పప్పులో నీళ్లు వడగట్టేసి, మినప్పప్పును మిక్సీలో వేసి మెత్తగా రుబ్బి, పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. రవ్వలో నీటిని గట్టిగా పిండి తీసేసి, రుబ్బిన పిండిలో కలుపుకోవాలి. తగినంత ఉప్పు జత చేసి సుమారు ఆరేడు గంటలు నానబెట్టాలి. ఇడ్లీరేకులకు నెయ్యి/నూనె పూసి, పిండిని గరిటెతో వేసి, ఇడ్లీ కుకర్‌లో ఉంచి, స్టౌ మీద పెట్టి, ఆవిరి మీద ఉడికించాలి. వేడి వేడి ఇడ్లీలను చట్నీతో వడ్డించాలి.


కొర్ర రొట్టెలు
కావలసినవి: కొర్ర పిండి – 100 గ్రా., ఉప్పు – తగినంత, నెయ్యి – తగినంత, నీళ్లు – తగినంత
తయారీ: కొర్ర పిండిని శుభ్రంగా జల్లించి పక్కన ఉంచాలి. వేడి నీళ్లను కొద్దికొద్దిగా జత చేస్తూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. కలిపిన పిండి మీద తడిబట్ట వేసి రెండు గంటలపాటు ఉంచాలి. తరువాత ఉండలు చేసి పక్కన ఉంచాలి. కొద్దికొద్దిగా పిండి జత చేస్తూ,  గుండ్రంగా ఒత్తాలి. ముందుగా వేడి చేసిన పెనం మీద రెండు పక్కలా నెయ్యి వేసి కాల్చి తీయాలి. వేడిగా కూరలతో గాని, పప్పుతో గాని తింటే రుచిగా ఉంటాయి.

కొర్రల తీపి పొంగలి
కావలసినవి: కొర్రలు – అర కప్పు, పెసర పప్పు – అర కప్పు, కొబ్బరి పాలు – 2 కప్పులుబెల్లం పొడి – ఒక కప్పు, ఏలకుల పొడి – పావు టీ స్పూనునెయ్యి – రెండు టేబుల్‌ స్పూన్లు, జీడి పప్పులు – 10
ఎండు కొబ్బరి ముక్కలు – ఒక టేబుల్‌ స్పూను

తయారీ: పెసర పప్పును శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు జత చేసి ఉడికించాలి. ఒక చిన్న గిన్నెలో కొర్రలు, కొబ్బరి పాలు వేసి స్టౌ మీద ఉంచి మెత్తగా ఉడికించాలి. ఉడికించిన పెసరపప్పు జత చేసి బాగా కలియబెట్టాలి. బెల్లం పొడి, ఏలకుల పొడి జత చేసి మరోమారు కలియబెట్టి, దింపేయాలి. స్టౌ మీద చిన్న బాణలిలో నెయ్యి వేసి కరిగాక జీడి పప్పులు, ఎండు కొబ్బరి ముక్కలు వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి. ఉడికిన పొంగలిలో వేసి కలియబెట్టి, వేడివేడిగా వడ్డించాలి.

కొర్రల హల్వా
కావలసినవి: నెయ్యి – ఒక కప్పు కొబ్బరి పాలు – ఒక కప్పు కొర్ర పిండి – ఒక కప్పు బెల్లం పొడి – ఒక కప్పు జీడి పప్పులు – 10 కిస్‌మిస్‌ – ఒక టేబుల్‌ స్పూను బాదం పప్పులు – ఒక టేబుల్‌ స్పూను

తయారీ: స్టౌ మీద బాణలిలో ఒక చెంచాడు నెయ్యి వేసి కరిగాక, కొర్ర పిండి వేసి దోరగా వేయించాలి. కొబ్బరి పాలు జత చేసి బాగా కలియబెట్టాలి. కొద్దిగా ఉడుకుతుండగా, బెల్లం పొడి వేసి అది కరిగేవరకు కలుపుతుండాలి. మిగతా నెయ్యి జత చేసి బాగా కలిపి ఉడికించాలి. చిన్న బాణలి స్టౌ మీద ఉంచి కొద్దిగా నెయ్యి వేసి కరిగాక జీడి పప్పులు, కిస్‌మిస్, బాదం పప్పులు వేసి దోరగా వేయించి, ఉడికించిన హల్వాలో వేసి కలపాలి. కొద్దిగా చల్లారాక కప్పులలో అందించాలి.

కొర్ర సాంబారు అన్నం
కావలసినవి: కొర్ర బియ్యం – ఒక గ్లాసు కంది పప్పు – ఒక గ్లాసుచింతపండు గుజ్జు – 2 టీ స్పూన్లుఉప్పు – తగినంతకూరగాయ ముక్కలు – ఒక కప్పు (క్యారట్, బీన్స్, మునగకాడ మొదలైనవి)నెయ్యి లేదా నూనె – 2 టీ స్పూన్లుకొత్తిమీర తరుగు – 2 టీ స్పూన్లుబిసిబేళబాత్‌ మసాలా – 2 టీ స్పూన్లుపోపు కోసంఆవాలు – ఒక టీ స్పూనుకరివేపాకు – 2 రెమ్మలుఎండు మిర్చి – 2పచ్చిమిర్చి – 2– జీడిపప్పు – 10ఇంగువ – పావు టీ స్పూనుఉల్లి తరుగు – పావు కప్పు

తయారీ: 
కొర్ర బియ్యం, కంది పప్పులను శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లలో విడివిడిగా సుమారు మూడు గంటలపాటు నానబెట్టాలి. కూరగాయ ముక్కలను ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఐదుగ్లాసుల నీరు మరగబెట్టాలి. నీళ్లు మరుగుతుండగా కంది పప్పు వేసి మూడు వంతులు ఉడికిన తరవాత, కొర్ర బియ్యం కూడా చేర్చి మెత్తగా ఉడికించాలి. స్టౌ మీద బాణలిలో నూనె లేదా నెయ్యి వేసి కాగాక ఆవాలు, పచ్చి మిర్చి, ఎండు మిర్చి, ఉల్లి తరుగు, కరివేపాకు, జీడిపప్పులు, ఇంగువ వేసి దోరగా వేయించాలి. చింత పండు గుజ్జు, ఉప్పు జత చేసి కొద్దిసేపు ఉడికించాలి. బిసిబేళబాత్‌ మసాలా వేసి కలపాలి. మెత్తగా ఉడికించిన కొర్రబియ్యం, కంది పప్పు మిశ్రమాన్ని జత చేసి, మరో రెండు నిమిషాలు ఉడికించి దింపేయాలి. కొత్తిమీర, నెయ్యి వేసి కలియబెట్టి, అప్పడాలు, కారబ్బూందీ, పిండి వడియాలతో వేడివేడిగా వడ్డించాలి.

కొర్ర బిస్కెట్లు
కావలసినవి:  కొర్ర పిండి – ఒక కప్పు, బేకింగ్‌ పౌడర్‌ – పావు టీ స్పూను నెయ్యి – ఒక టేబుల్‌ స్పూను, బెల్లం పొడి – అర కప్పు వెనిలా ఎసెన్స్‌ – కొద్దిగా, ఉప్పు – చిటికెడు

తయారీ:  ముందుగా కొర్ర పిండి, బేకింగ్‌ పౌడర్, ఉప్పు కలిపి జల్లెడ పట్టాలి. నెయ్యిని ప్లానిటరీ మిక్సర్‌లో వేసి అరగంట సేపు బాగా కలపాలి. జల్లించిన పిండిని, బెల్లం పొడిని జత చేసి మరో ఐదు నిమిషాలు కలిపి బయటకు తీయాలి. వెనిలా ఎసెన్స్‌ జత చేయాలి. అంగుళం మందంలో పిండిని ఒత్తాలి. బిస్కెట్‌ కటర్‌తో కావలసిన ఆకారంలో బిస్కెట్లను కట్‌ చేయాలి. 150 డిగ్రీల దగ్గర అవెన్‌ను ప్రీ హీట్‌ చేసి, తయారుచేసి ఉంచుకున్న బిస్కెట్లను అందులో ఉంచి సుమారు అరగంటసేపు బేక్‌ చేసి బయటకు తీయాలి. కొద్దిగా చల్లారాక గాలిచొరని డబ్బాలోకి తీసుకోవాలి. ఇవి నెల రోజుల దాకా నిల్వ ఉంటాయి.

కొర్ర వెజిటబుల్‌ బిర్యానీ
కావలసినవి: కొర్రలు – పావు కేజీతరిగిన ఉల్లిపాయ – 1క్యారట్‌ తరుగు – పావు కప్పుబీన్స్‌ తరుగు – పావు కప్పుఅల్లం వెల్లుల్లి ముద్ద – 2 టీ స్పూన్లుఉప్పు – తగినంతతరిగిన పచ్చి మిర్చి – 4పచ్చి బఠాణీ – ఒక టేబుల్‌ స్పూనుటొమాటో తరుగు – అర కప్పుపుదీనా తరుగు – అర కప్పుకొత్తిమీర – అర కప్పుతరిగిన బంగాళ దుంప – 1నిమ్మ రసం – 2 టీ స్పూన్లుపెరుగు – ఒక టేబుల్‌ స్పూనునెయ్యి/నూనె – 2 టేబుల్‌ స్పూన్లుధనియాల పొడి – ఒక టీ స్పూనుజీలకర్ర పొడి – ఒక టీ స్పూనుబిర్యానీ మసాలా – 2 టీ స్పూన్లుగరం మసాలా – ఒక టీ స్పూనుఉడకబెట్టడానికి నీళ్లు – తగినన్ని

తయారీ: కొర్రలకు నీళ్లు జత చేసి సుమారు రెండుగంటల సేపు నానబెట్టాలి. పచ్చి బఠాణీ ఉడికించి పక్కన పెట్టుకోవాలి. స్టౌ మీద బాణలిలో నెయ్యి/నూనె వేసి కాగాక, ఉల్లి తరుగు, బంగాళ దుంప ముక్కలు, పెరుగు, క్యారట్‌ తరుగు, బీన్స్‌ తరుగు వేసి దోరగా వేయించాలి (క్యారట్‌ బీన్స్‌ తక్కువగా వేగాలి. బీన్స్‌ కొంచెం పచ్చిగా ఉంటేనే బాగుంటుంది). స్టౌ మీద పెద్ద పాత్రలో నీళ్లు పోసి మరిగించాలి. మరుగుతుండగానే ఉప్పు, నెయ్యి/నూనె, బిర్యానీ మసాలా, గరం మసాలా వేసి దోరగా వేయించాలి. నానబెట్టిన కొర్ర బియ్యాన్ని వేసి కలపాలి. కొద్దిగా పలుకుగా ఉన్నప్పుడే ఒకసారి వార్చుకోవాలి. వార్చిన తరవాత కొద్దిగా చల్లటి నీళ్లు జల్లి పక్కన పెట్టాలి. స్టౌ మీద బాణలిలో నూనె వేసి వేడయ్యాక పచ్చి మిర్చి వేసి వేయించాలి. అల్లం వెల్లుల్లి ముద్ద వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు దోరగా వేయించాలి. టొమాటో తరుగు వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించాలి. టొమాటో వేగుతుండగానే, వేయించి ఉంచుకున్న కూరగాయ ముక్కలు సగం వేసి వేయించాలి. బఠాణీ జత చేయాలి. ఆ తరువాత ఉడికించిన కొర్ర బియ్యం ఈ కూరల మీద పొరగా ఒక వరుస వేయాలి. నిమ్మ రసం, కొద్దిగా గరం మసాలా, అల్లం వెల్లుల్లి ముద్ద, జీలకర్ర పొడి సమానంగా పైన చల్లాలి. చిన్న పాత్రలో కొద్దిగా పాలు, మిఠాయి రంగు వేసి కలిపి, మసాలా పొడి మీద చల్లాలి. ఉల్లి తరుగు, కొత్తిమీర తరుగు, టొమాటో తరుగు, పుదీనా తరుగు పైన వేసి మూత పెట్టి, పది నిమిషాలు చిన్న మంట మీద ఉడికించాలి. పది నిమిషాల తరవాత కొర్ర బిర్యానీ వేసుకునేటప్పుడు ఒక పక్క నుండి తీసుకోవాలి. 

కొర్రలు – క్యాబేజీ ముత్తియాస్‌
కావలసినవి: తురిమిన క్యాబేజీ – ఒక కప్పుకొర్ర పిండి – ఒక కప్పుపెరుగు – 5 టేబుల్‌ స్పూన్లునిమ్మ రసం – ఒక టీ స్పూనుఅల్లం + పచ్చి మిర్చి ముద్ద – ఒక టీ స్పూనుపసుపు – అర టీ స్పూను
బేకింగ్‌ సోడా – చిటికెడుఉప్పు – తగినంతపోపు కోసంనెయ్యి/నూనె – ఒక టీ స్పూనుజీలకర్ర – ఒక టీ స్పూనుఇంగువ – పావు టీ స్పూనుకరివేపాకు – 4 రెమ్మలుకొత్తిమీర – అలంకరించడానికి తగినంత

తయారీ:  ఒక గిన్నెలో తురిమిన క్యాబేజీ, కొర్ర పిండి, పెరుగు, నిమ్మ రసం, అల్లం పచ్చి మిర్చి ముద్ద, పసుపు, బేకింగ్‌ సోడా, ఉప్పు వేసి బాగా కలపాలి. తగినన్ని నీళ్లు జత చేసి మెత్తటి పిండిగా తయారుచేసుకోవాలి. ఉండలు చేసి, చేతితో వడ మాదిరిగా ఒత్తాలి. స్టౌ మీద పెనం ఉంచి, వేడయ్యాక కొద్దిగా నూనె వేసి, తయారుచేసి ఉంచుకున్న ముత్తియాస్‌లను ఒకటొక్కటిగా వేస్తూ రెండువైపులా కాల్చాలి. స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక నెయ్యి/నూనె వేసి కాచాలి. జీలకర్ర, ఇంగువ, కరివేపాకు వేసి కొద్దిగా వేయించాలి. తయారుచేసి ఉంచుకున్న ముత్తియాస్‌ని పోపులో వేసి వేయించాలి. కొత్తిమీరతో అలంకరించి సాస్‌తో ప్లేట్‌లో ఉంచి అందించాలి.

కొర్ర బ్రెడ్‌
కావలసినవి: కొబ్బరి పాలు – అర కప్పుకొర్ర పిండి – ఒక కప్పుఈస్ట్‌ – అర టీ స్పూను, నీళ్లు – అర కప్పుబెల్లం పొడి – 2 టీ స్పూన్లు.ఉప్పు – తగినంతబ్రెడ్‌ ఇంప్రూవర్‌ – 0. 05 గ్రా.
గోధుమ పిండి –  ఒకటిన్నర కప్పులు

తయారీ: స్టౌ మీద బాణలిలో నీళ్లు పోసి వేడి చేయాలి. గోరు వెచ్చగా ఉండగానే అందులో ఈస్ట్, బెల్లం పొడి, ఉప్పు వేసి కలిపి దింపేయాలి. కొబ్బరి పాలు జత చేయాలి. కొర్ర పిండి, గోధుమ పిండి, బ్రెడ్‌ ఇంప్రూవర్‌ మూడింటినీ కలుపుకుని, అప్పడాల పీట మీద వేసి బాగా కలపాలి. ఒక గిన్నెకు నూనె పూసి, ఈ తయారైన పిండి ముద్దను అందులో పెట్టి, మూత పెట్టి, రెండు గంటలపాటు నాననివ్వాలి. అప్పుడు అది పొంగుతుంది. అవెన్‌ను 180 డిగ్రీల దగ్గర వేడి చేయాలి. బన్‌ పాన్‌ తీసుకుని దానికి నూనె పూయాలి. ఈ తయారైన ముద్దను మళ్లీ పది నిమిషాల పాటు బాగా కలపాలి. ఆ తరవాత ట్రే లో ఉంచి, అవెన్‌లో పెట్టి పావు గంట సేపు బేక్‌ చేసి తీసేయాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement