ట్యాంక్‌బాండ్‌ | funday Laughing fun | Sakshi
Sakshi News home page

ట్యాంక్‌బాండ్‌

Published Sun, Mar 25 2018 12:30 AM | Last Updated on Sun, Mar 25 2018 12:30 AM

funday Laughing fun - Sakshi

చిన్న వ్యాపారమైనా సరే పుంజుకోవడానికి సంవత్సరమైనా పడుతుంది. అలాంటిది స్విట్జర్లాండ్‌లో ప్రారంభమైన ‘ఎన్‌యం వియం’ అనే ఇంటర్నేషనల్‌ బ్యాంకు కేవలం ఆరునెలల్లో  ప్రపంచ బ్యాంకులలోనే నంబర్‌వన్‌ బ్యాంక్‌గా నిలిచి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.‘ఎన్‌యం వియం’ దెబ్బకు స్విట్జర్లాండ్‌లోని  ప్రపంచ ప్రసిద్ధ బ్యాంకు ‘యుబీఎస్‌’, అమెరికాలోని ‘సిటీ’ బ్యాంక్, చైనాలోని ‘చైనా మర్చంట్స్‌ బ్యాంక్‌’....ఒక్కటనేమిటి....ఎన్నో బ్యాంకులు కుదేలైపోయాయి.ఆరోజు స్విట్జర్లాండ్‌లోని  ప్రెస్‌క్లబ్‌లో ‘ఎన్‌యం వియం’ బ్యాంక్‌ చైర్మన్‌తో ముఖాముఖి కార్యక్రమం జరుగుతోంది. ఈ ప్రెస్‌మీట్‌కు ప్రపంచ నలుమూలల నుంచి ప్రసిద్ధ బిజినెస్‌ జర్నలిస్ట్‌లు వచ్చారు.అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న  ‘ఎన్‌యం వియం’ చైర్మన్‌ సిమోనెట్టా పంజాగుట్ట రానే వచ్చాడు.పేరులో పంజాగుట్ట ఏమిటని పరేషానవుతున్నారా?అవును. అది మన పంజాగుట్టే. సిమోనెట్టా ముత్తాతకు ముత్తాత ముత్తులింగం మన తెలుగు వాడే. హైదరాబాద్‌లో పంజాగుట్టలో ఉండేవాడు. వ్యాపార నిమిత్తం స్విట్జర్లాండ్‌కు వెళ్లిన ముత్తులింగం అక్కడి అమ్మాయిని పెళ్లి చేసుకొని అక్కడే  స్థిరపడిపోయాడు. తమ భారతీయ మూలాలను గుర్తు తెచ్చుకోవడానికి ముత్తులింగం వంశస్తులు పేరు చివరన ‘పంజాగుట్ట’ అని తగిలించుకోవడం పరిపాటయింది.

ఇప్పుడు మళ్లీ మనం ప్రెస్‌మీట్‌ దగ్గరికి వద్దాం.‘‘ఈరోజుల్లో బ్యాంకింగ్‌ వ్యాపారం  ఎంత రిస్కో అందరికీ తెలిసిందే...నిన్నటి వరకు కలర్‌ఫుల్‌గా ఒక్క వెలుగు వెలిగిన బ్యాంకులు కూడా ఒక్క దెబ్బతో నెత్తి మీద వైట్‌క్లాత్‌ వేసుకొని బిక్కచచ్చి బిత్తరచూపులు చూస్తున్నాయి. ఇలాంటి క్లిష్ట సమయంలో బ్యాంక్‌ ప్రారంభించిన ఆరు నెలల్లోనే ప్రపంచంలోనే నంబర్‌వన్‌ బ్యాంక్‌గా నిలవడం చాలా గొప్ప విషయం. మీ విజయరహస్యం ఏమిటి?’’ అడిగాడు ఒక జర్నలిస్ట్‌.‘‘పెద్దల సలహాలు తీసుకున్నాను. తీసుకుంటాను. తీసుకుంటూనే ఉంటాను...’’ అని బదులిచ్చాడు సిమోనెట్టా పంజాగుట్ట. కొద్దిసేపటి తరువాత....‘‘ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. మీలో ఎవరైనా సమాధానం చెప్పండి!’’ అని సవాలు విసిరాడు సిమోనెట్టా.‘‘అడగండి సర్‌’’ అన్నారు జర్నలిస్టులంతా మూకుమ్మడిగా.
అప్పుడు సిమోనెట్టా గొంతు సవరించి ఇలా అడిగాడు...‘‘ఒక బ్యాంకును దోచుకోవడానికి ఇద్దరు దొంగలు వెళ్లారు. ఆ దొంగలు సరాసరి బ్యాంకు మేనేజర్‌ దగ్గరికి వెళ్లి... ‘మేము ఈ బ్యాంకును దోచుకోవడానికి వచ్చాం. బ్యాంకులో ఒక్కరూపాయి కూడా లేకుండా మొత్తం ఊడ్చేసి ఈ బ్యాగుల్లో  సర్ది పెట్టండి. లేకుంటే  ఏం జరుగుతుందో తెలుసా?’’ అంటూ ఇద్దరు ప్యాంట్‌ జేబులో చేయిపెట్టారు.
వాళ్ల గుండె ఆగినంత పనైంది.ఎందుకంటే వాళ్లు పిస్టల్‌ తెచ్చుకోవడం మరిచిపోయారు. అయినా సరే.... ఆ బ్యాంకును విజయవంతంగా దోచుకెళ్లారు. చిన్న ఆయుధం కూడా లేకుండా ఉత్త చేతులతో వాళ్లు ఎలా బ్యాంకును దోచుకువెళ్లారో  మీలో ఎవరైనా చెప్పగలరా?’’ జర్నలిస్టులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. అయిదు నిమిషాలు. పదినిమిషాలు. టైమ్‌ గడుస్తూనే ఉందికాని ఎవరూ సమాధానం చెప్పలేకపోయారు. అప్పుడు సిమోనెట్టా  ఇలా సమాధానం ఇచ్చాడు...‘‘అరే పిస్టల్‌ తేవడం మరిచామే... అని గట్టిగా గొణుక్కున్నారు ఇద్దరు దొంగలు.అప్పుడు బ్యాంక్‌ మేనేజర్‌ ఏమన్నాడో తెలుసా?‘‘ఏం ఫరవాలేదు. ఐ ట్రస్ట్‌ యూ, యు కెన్‌ షో మీ ది గన్‌ టుమారో’’... చెప్పొచ్చేదేమింటే ఇలాంటి పిట్టకథలెన్నో నన్ను సక్సెస్‌ఫుల్‌ బ్యాంకర్‌గా మలిచాయి’’

ఇప్పుడు ఇండియాలో...
 నీరవ్‌ మోదీ కేసును ట్యాంక్‌బాండ్‌007కు అప్పగించింది పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌. ఈయన కాస్త పేరున్న ప్రైవేట్‌ డిటెక్టివ్‌. జేమ్స్‌బాండ్‌ అనబోయి ట్యాంక్‌బాండ్‌ అనలేదు. ఆయన పేరు నిజంగానే ట్యాంకుబాండ్‌! ఈ ట్యాంకుబాండ్‌ వాళ్ల నాన్న కొంతకాలం  హైదరాబాద్‌లో ఉద్యోగం చేశాడు. ఆఫీసు అయిపోగానే ఆయన రోజూ సాయంత్రం ట్యాంక్‌బండ్‌ మీద  కూర్చొని జేమ్స్‌బాండ్‌ నవలలు చదువుకునేవాడు. తనకు ఇష్టమైన ట్యాంక్‌బండ్, జేమ్స్‌బాండ్‌ను ఎప్పుడూ గుర్తు వచ్చేలా తన కొడుకుకు ‘ట్యాంక్‌బాండ్‌’ అని పేరు పెట్టుకుని మురిసిపోయాడు. సరే, ఈ పేరు సంగతి వదిలేసి మ్యాటర్‌లోకి వద్దాం.‘పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌’ అధికారులను చూసీ చూడగానే...టీవీ ముందు కూర్చున్న ట్యాంక్‌బాండ్‌ లేచి‘జస్ట్‌ ఇప్పుడే  క్లూ కనిపెట్టాను’’ అన్నాడు.  అధికారులు ఆనందం తట్టుకోలేక ‘యురేక తకమికా’ అని అరిచారు.రెండు రోజుల తరువాత తాటికాయంత అక్షరాలతో న్యూస్‌పేపర్లలో వచ్చిన సంచలన  హెడ్‌లైన్‌లు ఇవి...‘ఎన్‌యం వియం బ్యాంకు  చైర్మన్‌ సిమోనెట్టా పంజాగుట్ట అరెస్ట్‌’. ‘ఎన్‌యం వియం బ్యాంక్‌ ఎవరిదో కాదు... నీరవ్‌ మోదీ, విజయ్‌మాల్యాలదే! వీళ్లకు సిమోనెట్టా పంజాగుట్ట బినామీ’. ‘బ్యాంకు నుంచి దోచుకెళ్లిన డబ్బుతో కొత్త బ్యాంకు స్థాపించడం ప్రపంచ చరిత్రలో ఇదే ప్రథమం’. ‘ఎన్‌ఎం వియంలో  ఎన్‌ఎం అంటే నీరవ్‌ మోదీ, వియం అంటే విజయ్‌ మాల్యా’ ... ఇలా అంతులేని వార్తాకథనాలు నాన్‌స్టాప్‌గా వస్తూనే ఉన్నాయి!

‘‘క్లూ ఎలా దొరికింది?’’ ట్యాంక్‌బాండ్‌ 007ను ఆసక్తిగా అడిగింది మీడియా.‘‘లియన్‌ గ్లాస్‌ అనే రచయిత్రి రాసిన ‘ది బాడీ లాంగ్వేజ్‌ ఆఫ్‌ లయర్స్‌’ అనే పుస్తకాన్ని అప్పుడే చదవడం పూర్తి చేసి టీవీ ఆన్‌ చేశాను. సిమోనెట్టా ప్రెస్‌మీట్‌ కార్యక్రమం వస్తుంది. అయిపోయేంత వరకు చూశాను. ఆ పుస్తకంలో తెలుసుకున్న విషయాల ఆధారంగా సిమోనెట్టా అబద్ధాలకోరు అని అతని బాడీలాంగ్వేజి ద్వారా కనిపెట్టాను. చాలా షార్ట్‌టైమ్‌లో ఒక బ్యాంకు  నంబర్‌వన్‌గా నిలిచిందంటే... ఆ విజయం వెనుక బ్యాంకుల గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేసిన మేధావులైనా ఉండాలి, బ్యాంక్‌ల గురించి బాగా తెలిసిన బ్యాంకుదొంగలైనా ఉండి ఉండాలి.  మేధావులుండేంత సీన్‌ సిమోనెట్టాకు లేదు. కాబట్టి దీని వెనుక నీరవ్‌ మోదీ, విజయ్‌మాల్యాలు కచ్చితంగా ఉంటారని ఊహించాను. నా ఊహ నిజమైంది’’ అసలు విషయం చెప్పాడు ట్యాంక్‌బాండ్‌ 007.
– యాకుబ్‌ పాషా 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement