పంద్రాగస్ట్ (ఆగస్ట్ 15)కు వారం రోజుల ముందు నుంచే మా స్కూల్లో హడావుడి మొదలయ్యేది. లెక్కల క్లాసు, ఫిజిక్సు క్లాసు, ఇంగ్లిష్ క్లాసు... ఇలా ఏ క్లాసుల బెడదా ఉండదు. ఏ క్లాసు లేకుండా కులాసాగా తిరుగొచ్చు. ఎందుకంటే ఈ వారం రోజులు ఆటల పోటీలు మాత్రమే ఉంటాయి.కబడ్డీ నుంచి చెస్ వరకు ఎన్నో ఆటలు.కాస్త బలంగా ఉన్నవాళ్లు, హల్‌చల్ చేసేవాళ్లు కబడ్డీ ఆట, ‘నేను మరియు నా ప్రపంచం’ అనుకునే సెన్సిటివ్‌లు చెస్ ఆట ఆడేవాళ్లు. ఇక మూడోరకం వాళ్లు మాత్రం ఇలా ఆలోచించేవాళ్లు –‘కబడ్డీ ఆడితే ఏమొస్తుంది?మోకాలు చిప్ప పగులుతుంది.అవసరమా?ఆటలో గెలిచిన కప్పు కంటే నా మోకాలు చిప్పే నాకు ముఖ్యం.చెస్ ఆడితే ఏమొస్తుంది?కప్పు రావచ్చు. కాని దానికంటే ముందు తలనొప్పి వస్తుంది.మాట్లాడుకోవడానికి... ల్యావాదులాడుకోవడానికి... ల్యాఈలకొట్టడానికి... ల్యాతొండి చేయడానికి... ల్యా’. ఇలా ఆలోచించేవాళ్లు ఏమీ చేయకుండా ఉంటారా అంటే అదీ లేదు. వక్తృత్వం (ఉపన్యాస పోటీ), వ్యాసరచన పోటీలలో తలదూర్చేవాళ్లు. అలా తలదూర్చిన ఒక వీరశూర నారిగాడి కథ ఇది.
ఉపన్యాస పోటీలో మాట్లాడాల్సిన టాపిక్ గురించి ఏ పావుగంట ముందో, అర్ధగంట ముందో చెప్పేవాళ్లు. ఈ టైమ్‌లోనే ఆ పుస్తకం ఈ పుస్తకం వెదికి సబ్జెక్ట్ ప్రిపేరై స్టేజీ మీదికి వెళ్లి దడదడలాడించాలి. న్యాయనిర్ణేతల మనసును కిలోలకొద్దీ దోచుకోవాలి.అప్పుడే గ్రౌండ్‌లో కబడ్డీ ఆట చూసొచ్చిన మేము యాపచెట్టు నీడలో కూలబడిపోయాం. ఈలోపు అక్కడికి రమేష్‌గాడు వచ్చి, ‘‘మీకో విషయం తెలుసా?’’ అని ఊరించాడు.‘‘ఏ విషయం?’’ అంటూ అందరం వాడిని చుట్టుముట్టాం.‘‘ఎవడు చాయ్ తాగిస్తే వాడికి చెబుతా’’ అని వేలంపాట మొదలుపెట్టాడు రమేష్.‘‘వీడెప్పుడింతే’’ అంటూ మళ్లీ చెట్టు కింద సెటిలయ్యాం.నారిగాడు మాత్రం అలా చెట్టుకిందికి రాలేదు.‘వీడి దగ్గర ఏదో మ్యాటర్ ఉంది’ అనుకుంటూ రమేష్‌ను స్కూలుకు అతి దగ్గర్లోని రాజస్తాన్ టీస్టాల్‌కు తీసుకెళ్లాడు.టీ తాగించాక –‘‘ఏదో చెబుతానన్నావు?’’ అడిగాడు.‘‘చాలా ఇంపార్టెంట్ విషయం. ఎవరికీ చెప్పకు. వక్తృత్వపోటీ టాపిక్ లీకైంది’’ అన్నాడు రమేష్.‘‘లీకైందా? ఏమిటది?’’ తన చిన్నకళ్లు పెద్దవి చేస్తూ అడిగాడు నారిగాడు.‘‘భారతీయ సంగీతం, దాని గొప్పదనం అనేది టాపిక్. ఇంకా రెండు గంటల టైమ్ ఉంది. నువ్వు బాగా ప్రిపేర్ కావచ్చు. ఫస్ట్ ప్రైజ్ నీకే’’ చెప్పాడు రమేష్.ఏ పోటీలో ఏ ప్రైజూ రాని నారిగాడు ఎగిరి గంతేశాడు. కళ్లు మూసి తెరిచేలోగా మాయమై తన ఇంట్లో తేలాడు. వాళ్ల నాన్న లైబ్రరీ నుంచి ఆ పుస్తకం ఈ పుస్తకం తీసుకొని నోట్సు రాసుకొని ప్రిపేరయ్యాడు. టైమ్‌కేసి చూశాడు. పోటీ మొదలై అప్పటికే పావుగంట దాటింది. పరుగందుకొని స్టేజీ దగ్గరకు దూసుకొచ్చాడు.
‘వెంకటనారాయణ... వెంకటనారాయణ’ అని తన పేరు మైకులో వినిపిస్తోంది.మెరుపువేగంతో స్టేజీ ఎక్కి మైక్ ముందు నిల్చొని ఇలా మొదలు పెట్టాడు –‘‘భారతీయ సంగీతానికి మూలం వేదాలు. భారతీయ సంగీతం అనేక సంప్రదాయ రీతులతో భాసిల్లుచున్నది. వాటిలో ముఖ్యమైనవిగా కర్ణాటక, హిందుస్తానీ సంగీత సంప్రదాయములని చెప్పబడుచున్నవి. ప్రసిద్ధములైన ఇతర సంప్రదాయములు కూడా ఉన్నాయి...’’నారిగాడి ప్రసంగ ప్రవాహానికి అడ్డుపడిన న్యాయనిర్ణేత –‘‘మిస్టర్ నారాయణా! నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తోందా?’’ అన్నాడు కోపంగా.‘‘భారతీయ సంగీతం గొప్పదనం గురించి మాట్లాడుతున్నాను సార్’’ అన్నాడు నారిగాడు.‘‘అధిక జనాభాతో అనర్థాలు అనేది టాపిక్ అయితే నువ్వేమో భారతీయ సంగీతం గురించి తెగ వాయిస్తున్నావు’’ అంటూ అంతెత్తు లేచాడు న్యాయనిర్ణేత.‘సచ్చింది గొర్రె’ అంటూ నాలిక కర్చుకున్నాడు నారిగాడు.అంత షార్ట్‌టైమ్‌లో కూడా రమేష్‌గాడిని తిట్టిన తిట్టు రిపీట్ కాకుండా తిట్టుకున్నాడు. వెంటనే సర్దుకొని –‘‘నేను మాట్లాడబోయేది కూడా జనాభా సమస్య గురించే సార్. సంగీతాన్ని లీడ్‌గా తీసుకున్నాను. అంతే’’ అంటూ ఇలా దంచడం మొదలెట్టాడు నారిగాడు –‘‘సంగీతంలో రాగాలు ఎలాగైతే ఉంటాయో, దేశంలో జనాభా కూడా అలాగే ఉంటుంది. రాగం సాగితే పాట చెడిపోతుంది. జనాభా పెరిగితే డెవలప్‌మెంట్ ఆగిపోతుంది. ఎక్కువగా గారెలు తింటే ఎంత మంచి గారె అయినా చేదు అనిపిస్తుంది. ఎంత మంచి పాట అయినా ఎక్కువసార్లు వింటే చేదు అనిపిస్తుంది. అలాగే ఎంత సంపన్న దేశమైనా జనాభా ఎక్కువైతే పేదదేశం అయిపోతుంది...’’‘‘ఒరేయ్! ముందు మేము అయిపోయేట్లు ఉన్నాం. దిగరా స్టేజీ’’ అంటూ దూకుడు విద్యార్థులైన రఘు, హరి, వీరేంద్ర... నారిగాడిని బరబరా స్టేజీ మీది నుంచి కిందికి లాక్కొచ్చారు.వాళ్లు ఆ పని చేసి ఉండకపోతే? వా...............మ్మో! తలుచుకుంటేనే భయమేస్తుంది. ఎప్పుడైనా హారర్ సినిమా చూస్తున్నప్పుడు నారిగాడి స్పీచ్ లీలగా వినబడుతూనే ఉంటుంది.
– యాకుబ్ పాషా
సచ్చింది గొర్రె!
Published Sun, Aug 12 2018 12:08 AM | Last Updated on Sun, Aug 12 2018 11:41 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment