కథ: ప్రాణమున్న ఏటీఎం | Funday story of the week | Sakshi
Sakshi News home page

కథ: ప్రాణమున్న ఏటీఎం

Published Sun, Mar 23 2014 2:00 AM | Last Updated on Sat, Sep 2 2017 5:01 AM

కథ: ప్రాణమున్న ఏటీఎం

కథ: ప్రాణమున్న ఏటీఎం

 అలారం మోతతో నిద్రలేచాను!  పొద్దున్న నాలుగున్నరకు లేవడం నాకలవాటు. ఆ టైములో లేస్తే తప్ప నా పనులు అవవు. ఎదురుగా ఫొటోలో ఉన్న వేంకటేశ్వరస్వామికి దండం పెట్టుకుని మంచం దిగాను. పక్కన పడుకున్న శ్రీవారు అలారం మోతకి కొంచెం కదిలి మళ్లీ నిద్రలోకి జారుకున్నారు. వేకువజాము నిద్ర ఆయనకి చాలా ఇష్టం మరి. పిల్లలిద్దరూ ముసుగు తన్ని నిద్రపోతున్నారు. ఎవరు లేచినా లేవకపోయినా నేను లేవడం మాత్రం తప్పనిసరి.  టాయిలెట్‌కి వెళ్లొచ్చి స్టౌవ్ మీద పాలు పెట్టాను. పాలు మరిగే లోపు బ్రష్ చేసుకున్నాను. తర్వాత కాఫీ కలుపుకొని బాల్కనీలోకొచ్చి కూర్చున్నాను. ప్రాతఃకాలపు వాతావరణం నాకెప్పుడూ ఫాసినేటింగ్‌గా ఉంటుంది. రోజంతా ఇంటి పనులతోనూ, ఆఫీసు పనులతోనూ హడావుడి! శరీరానికి విశ్రాంతి ఉన్నా మనసుకి విశ్రాంతి ఉండదు.
 
 నా మనసుతో నేను మాట్లాడుకునేది ఈ టైములోనే కాబట్టి రిలాక్స్‌డ్‌గా కాఫీ సిప్ చేయసాగాను. ఎలక్ట్రానిక్స్ రంగానికి సంబంధించిన ఒక పబ్లిక్ సెక్టార్ కంపెనీలో ‘సీనియర్ టెక్నికల్ ఆఫీసర్’గా పనిచేస్తున్నాను. వయసు నలభైకి దగ్గర పడుతోంది. జుట్టు అక్కడక్కడ నెరవడం మొదలైంది. మావారు బ్యాంక్‌లో సీనియర్ మేనేజర్. ఎప్పుడూ బిజీ బిజీ అంటుంటారు. ఇంటి విషయాలు పట్టించుకునేంత తీరిక, ఓపిక ఆయనకు లేవు.
 అలాగే ప్రశాంతంగా కూర్చున్నాను. పక్షుల కువకువలు వీనులవిందుగా వినిపిస్తున్నాయి. చల్లటి గాలి తెమ్మెర ఒకటి నన్ను దాటుకొని వెళ్లిపోయింది. నెమ్మదిగా తెల తెలవారడం ప్రారంభించింది. లేలేత భాను కిరణాలు తూర్పు దిక్కున పైకి వస్తున్నాయి. సూర్య భగవానుడికి నమస్కరించుకొని, కిచెన్‌లోకి వెళ్లాను. ఒక యంత్రంలా అన్ని పనులూ చకచకా చేసుకుంటూ పోయాను. బ్రేక్‌ఫాస్ట్ రెడీ అవుతోన్న టైములో పిల్లలు నిద్రలేచారు. ‘మమ్మీ... మమ్మీ...’ అంటూ ఒకటే అరుపులు. అబ్బాయి టెన్త్ చదువుతున్నాడు. అమ్మాయి సెవెన్త్ చదువుతోంది. ఇద్దరిదీ ఒకే స్కూల్ కాబట్టి కలిసి వెళ్లి వస్తూ ఉంటారు. వాళ్లు టిఫిన్ తిని రెడీ అయి, స్కూల్‌కి వెళ్లేటప్పటికి ఎనిమిదైంది. ఇంతలో మావారు నిద్ర లేచారు. నేను ‘కార్యేషు దాసీ’ అవతారం ఎత్తాను. ఆయన రెడీ అయి బ్రేక్‌ఫాస్ట్ చేస్తుండగా,  ‘రాజీ’ వచ్చింది. రోజూ కంటే గంట లేటు.
 ‘‘మేడమ్‌గారు రోజురోజుకీ తొందరగా వచ్చేస్తున్నారు?’’ కొంచెం వ్యంగ్యంగా అన్నాను. చిన్నగా నవ్వారు మావారు.
 ‘‘లేదక్కా. ఒంట్లో కొంచెం బాలేదు. పొద్దున్నే లేవలేకపోయాను’’ సంజాయిషీగా చెప్పింది. ముప్ఫయ్యేళ్ల వయసున్న రాజీ నన్ను ‘అక్కా’ అని సంబోధిస్తుంది. నాక్కూడా పెద్ద అభ్యంతరం లేదు. ఒక రకంగా అది మా మధ్య అంతరాన్ని తగ్గించింది. పైగా నాతో ఏ విషయమైనా చక్కగా మాట్లాడుతుంది. ఆమె పనిచేసే పద్ధతి కూడా నాకు నచ్చుతుంది. అందుకే అది అప్పుడప్పుడు డుమ్మాలు కొడుతున్నా ఇంకా తీసేయడం లేదు.
 ‘‘సర్లే! రోజూ ఏదో ఒక కహానీ చెబుతావు. పని ప్రారంభించు. నేను ఆఫీసుకి వెళ్లాలి’’ అంటూ పురమాయించాను. బ్రేక్ ఫాస్ట్ పూర్తయ్యాక, మావారు ఆఫీసుకి వెళ్లిపోయారు. తుపాను వెలిసినంత ప్రశాంతంగా మారింది వాతావరణం. ఆఫీసుకి రెడీ అవుతూ రాజీని ఒక కంట గమనించాను. మనిషి ఎందుకో డల్‌గా ఉంది. కానీ ఇప్పుడు టైము లేదు. నేను రెడీ అయ్యేలోపు అంట్లు తోమి, బట్టలుతకసాగింది రాజీ. ఒకసారి మాట్లాడాలనిపించింది. కానీ ఇప్పుడు కాదు. ‘‘రాజీ... సాయంత్రం తప్పకుండా రా. ఎగ్గొట్టకు’’ అని చెప్పి నా స్కూటీ మీద ఆఫీసుకి వెళ్లిపోయాను.
    
 ‘‘మేడమ్! ఈ రెండు కాంపొనెంట్స్ మధ్య కంటిన్యూటీ రావడం లేదు’’ అని చెబుతూ నా దగ్గరకు వచ్చింది రాధిక. ఆమె నా కింద పనిచేసే ట్రైనీ ఇంజనీర్. ఆమె చేతిలో ఉన్న ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్‌ని నా చేతుల్లోకి తీసుకున్నాను. దాన్ని జాగ్రత్తగా పరిశీలించి, ప్రాబ్లమ్ ఎక్కడుందో చెప్పాను. ‘అర్థమైంది’ అన్నట్లు ఆమె బోర్డ్ తీసుకుని టెస్ట్ బెంచ్ వైపు వెళ్లిపోయింది. సీట్లో రిలాక్సింగ్‌గా వెనక్కి వాలి ‘ఎలక్ట్రానిక్స్ ఫర్ యూ’ మ్యాగజైన్ తిరగేయసాగాను. ఎప్పుడో పదిహేనేళ్ల క్రితం డిప్లొమా పూర్తవగానే ఇక్కడ జాయిన్ అయ్యాను. అంచెలంచలుగా ఎదిగినా, పనిలో పెద్ద తేడా లేదు. ఈ మధ్యనే నా కింద కొంతమందిని రిక్రూట్ చేయడంతో కొంచెం ఊపిరి తీసుకోగలుగుతున్నాను. మ్యాగజైన్‌లో రీసెంట్‌గా వచ్చిన కొత్త టెక్నాలజీ గురించి చదువుతుండగా, సెల్ రింగ్ అయ్యింది. స్క్రీన్‌మీద మావారి పేరు కనపడింది. ‘‘ఆ! చెప్పండి. ఇప్పుడు చేశారేంటి?’’
 ‘‘ఏం లేదు. ఊరికే. నా కొలీగ్స్ కొందరు వైజాగ్ దగ్గర ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఇళ్లు తీసుకుంటున్నారు. మనం కూడా తీసుకుందామా?’’ ప్రేమగా అడిగారు.
 
 ‘‘అదేంటండీ. ఈ మధ్యనే ఒక ఫ్లాట్ కొన్నాం కదా. మళ్లీ ఎలా కొనగలం?’’ అయోమయంగా అడిగాను. ‘‘ఏముందీ! ఇంకో లోన్ పెడితే అయిపోతుంది’’ చాలా సింపుల్ అన్నట్లు చెప్పారు. నవ్వొచ్చింది నాకు. ‘‘ఉన్న లోన్లు తీర్చలేక గింజుకుంటున్నాము. పైగా ఇంకో లోనా? నా వల్ల కాదు. అయినా రాత్రికి ఇవన్నీ మాట్లాడుదాం. ఉంటాను’’ అని చెప్పి ఫోన్ కట్ చేశాను. అశాంతిగా అనిపించింది. ఎంత గవర్నమెంట్ జాబ్ అయితే మాత్రం, ఇలా లోన్లు పెట్టుకుంటూ పోతే ఎలా? తీసుకున్నప్పుడు బాగానే ఉంటుంది. నెల నెలా ఇన్‌స్టాల్‌మెంట్ కడుతుంటే తెలుస్తుంది అందులోని బాధ. ప్రాణం ఉసూరుమంటుంది. జీతంలో ఈ కటింగులతో పాటూ ట్యాక్స్ కటింగ్ కూడా వచ్చినప్పుడు నెల గడవటమే కష్టం అయిపోతుంది. ఇవన్నీ ఆయనకి తెలీనివి కావు అయినా ఉదాసీనత. నేను కూడా జాబ్ చేస్తున్నాను కాబట్టి ఏదో రకంగా తీర్చొచ్చులే అన్న ధీమా! ‘‘మేడమ్! టైమైంది. లంచ్ చేద్దామా?’’ రాధిక అడగటంతో ఆలోచనల్లోంచి బయటపడి లంచ్‌బాక్స్ తీసుకుని లేచాను.
    
 సాయంత్రం ఇంటికి వచ్చేటప్పటికి రాజీ నా కోసం వెయిట్ చేస్తోంది. తాళాలు తీసి ఇంట్లోకి వెళ్లాం. సాయంకాలాలు ఇంటికి తొందరగా వచ్చేది నేనే! పిల్లలు స్కూల్ కాగానే అటు నుండి అటే ట్యూషన్‌కి వెళ్తారు. మా వారు బ్యాంక్‌కి తాళాలు వేశాక కానీ రారు. ‘‘రాజీ! టీ పెట్టు’’ అని చెప్పి బెడ్రూమ్‌లోకి వెళ్లి డ్రెస్ ఛేంజ్ చేసుకున్నాను. హాల్లోకి వచ్చి టీవీ ఆన్ చేస్తే, ఏదో డబ్బింగ్ సీరియల్ వస్తోంది. ఎవరో లేడీ విలన్ హెవీ మెలోడ్రామా డైలాగ్స్‌తో చావగొడుతోంది.  ఛానల్ మార్చేశాను. ఇంతలో రాజీ టీ పట్టుకొచ్చింది. అందుకుంటూ, ‘‘కూర్చో రాజీ’’ అన్నాను. ఎదురుగా నేలమీద కూర్చుంది.
 టీ సిప్ చేస్తూ, ‘‘ఏంటి రాజీ! అదోలా ఉంటున్నావు. పైగా ఈమధ్య తరచుగా లేట్‌గా వస్తున్నావు. ఏదైనా హెల్త్ ప్రాబ్లమా?’’ అనునయంగా అడిగాను.
 ‘‘అదేం లేదక్కా. ఆరోగ్యం బాగానే ఉంది. మనసే బాగుండటం లేదు’’.
 ‘‘ఏమైంది? నీ మొగుడు ఇప్పుడు నీతో బాగానే ఉంటున్నాడు కదా, రోజూ పనికి వెళుతున్నాడు అని చెప్పావు కదా!’’
 ‘‘ఏం బాగుండటమక్కా. చేతిలో డబ్బులుంటే చాలా ప్రేమగా మాట్లాడతాడు. లేకపోతే పిచ్చెక్కినట్టు తయారవుతాడు.’’
 ‘‘అందరు మొగుళ్లు అంతే రాజీ. అయినా మొన్ననే ఇరవై వేలు తీసుకెళ్లావు, ఏం చేశారు?’’
 ‘‘ఏమోనక్కా. తీసుకెళ్లి వాడికే ఇచ్చాను. ఖర్చు పెట్టేశాడు. గట్టిగా అడిగితే ఏవో లెక్కలు చెబుతాడు. బయట పనులు దొరకడం లేదు అని చెప్పి ఇంట్లోనే ఉంటున్నాడు. ఇప్పుడేమో మిమ్మల్ని అడిగి యాభై వేలు తీసుకొస్తే, ఒక ఆటో కొనుక్కుని తిప్పుకుంటాను అని చెప్పి రోజూ నా ప్రాణం తీసేస్తున్నాడు. నిన్ను అడగాలంటే నాకే సిగ్గుగా ఉంది.’’
 ‘‘అదేంటి? తీసుకున్న ఇరవై వేలు ఎలా తీరుద్దామా అన్న ఆలోచన లేకుండా ఇంకా అప్పు తెమ్మంటున్నాడా?’’ కోపంగా అన్నాను.
 
 ‘‘నేనూ అదే అడిగానక్కా. ‘నన్నే ఎదిరిస్తావా’ అని మీద పడి చితక్కొట్టాడు. ఒళ్లు నొప్పులతో పొద్దున్నే లేచి పనికి రావాలంటే ప్రాణం మీదకొస్తోంది. పిల్లల మొహం చూసి ఊరుకుంటున్నాను. లేకపోతే వాడిని ఎప్పుడో వదిలేసేదాన్ని’’ చిన్నగా ఏడుస్తూ చెప్పింది. ‘‘అయినా ఇన్ని అప్పులు చెయ్యమంటున్నాడు. ఎలా తీరుద్దామనుకుంటున్నాడు?’’ సందేహంగా అడిగాను. ‘‘ఏముందక్కా. నెలనెలా నా జీతం మొత్తం కట్ చేసుకోమని చెప్పమంటున్నాడు. ఆ లెక్క ప్రకారం మీరు నాకిచ్చే జీతానికి సంవత్సరం పాటు పనిచేస్తే కానీ అప్పు తీరదు. అంటే అన్ని రోజులు నాకు రోగమొచ్చినా ఏమొచ్చినా పని మానడానికి లేదు. అప్పు తీరదేమో అని భయం. వాడు మాత్రం ఇంట్లో కూర్చుని నామీద ఇంకా ఎలా సంపాదించాలా అని పథకాలు వేస్తుంటాడు. ఇంకా ఇంకా నన్ను ఊబిలోకి నెట్టేస్తున్నాడు. అందులో నుండి బయటపడలేనేమోనని భయంగా ఉంది’’ అని కళ్లు పెద్దవి చేసి చెప్పింది. అది చెప్పింది కూడా నిజమే!
 
 ఎందుకో దానిమీద జాలి వేసింది నాకు. కట్టుకున్న పాపానికి మొగుడిని భరిస్తోంది. సమాజానికి భయపడి తన్నులు తింటూ కాపురం సాగిస్తోంది. మొగుడి కోసం అప్పులు చేస్తోంది. అవి తీర్చడానికి ఒళ్లు హూనం అయ్యేలా పనులు చేస్తోంది. ఏం దోపిడీ ఇది? తప్పు ఆమెదో లేక మన సమాజపు కట్టుబాట్లదో నాకు అర్థం కావడం లేదు. అయినా చదువుకున్న నేను మాత్రం ఏం చేస్తున్నాను? నా భర్త ఆడించే ప్రతి ఆటకీ తల ఊపుతున్నాను కదా! పెళ్లయిన ఆడది చదువుకున్నా లేకపోయినా తెలివైన భర్త చేతిలో ఆర్థికంగా ఇలా పీడింపబడవలసిందే. రాజీ మొగుడికి నా భర్తకి పెద్ద తేడా లేదనిపించింది.
 ‘‘సరే ఏదో ఒకటి అవుతుందిలే. నువ్వేమీ భయపడకు. నీమీద నాకు నమ్మకం ఉంది. పాత అప్పు నెమ్మదిగా తీర్చుదువు గాని, యాభై వేలు మాత్రం నేను ఇవ్వలేను. అలాగని ఎప్పుడు అప్పు చేయకు. నీ మొగుడు అడిగితే, ‘మేం ఇవ్వలేదు’ అని చెప్పు. అంతే!’’ ఓదార్పుగా చెప్పాను. ‘‘అలాగే అక్కా’’ అని కళ్లు తుడుచుకుంటూ పనులు చేసుకోవడానికి లేచింది.
    
 రాత్రయింది.
 ట్యూషన్ నుండి వచ్చిన పిల్లలు స్నాక్స్ తిని టీవీ చూస్తున్నారు. నేను వంటగదిలో డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను. బుర్రలో ఒకటే ఆలోచనలు. సాయంత్రం రాజీ చెప్పింది విన్నాక మనసంతా ఏదోలా అయిపోయింది. అదేం దురదృష్టమో తమ జీవితాన్ని తాము సంతోషంగా గడిపే అవకాశం కూడా ఉండదు కొంతమందికి. పైగా అంత కష్టపడుతుంటే కూడా! ఏదేమైనా రాజీ సమస్య తీరాలంటే ఆమె భర్తలో మార్పు రావాలి. లేదంటే రాజీకి ఒంట్లో పనిచేసే ఓపిక తగ్గాలి. అదొక్కటే పరిష్కారం.
 డిన్నర్ రెడీ అయ్యాక, పిల్లలని తినమని చెప్పాను. వాళ్లు అలాగే టీవీ చూసుకుంటూ తినేశారు. ఆ తర్వాత నిద్రొస్తుందని చెప్పి బెడ్రూమ్‌లోకి వెళ్లి పడుకున్నారు. నేను టీవీ చూస్తూ మావారి కోసం వెయిట్ చేయసాగాను. దాదాపు పదవుతుండగా వచ్చారు ఆయన. ఫ్రెష్ అయి, డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చున్నాక, ఆయనకు వడ్డించి నేను కూడా పక్కన కూర్చుని తినసాగాను. ‘‘ఇంతకీ పొద్దున్న నేను చెప్పినదాని గురించి ఏం ఆలోచించావు?’’ సంభాషణ ప్రారంభించారాయన. ‘‘చెప్పడానికేముందండీ. ఇప్పటికే చాలా లోన్లు ఉన్నాయి. ఇక నేను లోన్లు పెట్టలేను’’ చెప్పాను. ‘‘అయితే ఏముంది. నా సేలరీ ఎలాగూ ఇంటి ఖర్చులకి సరిపోతుంది కదా!’’ ‘‘అలా అని చెప్పే ఇప్పటిదాకా అన్ని లోన్లు నాతోనే పెట్టించారు. నా సేలరీ మొత్తం లోన్లకే పోతుంది. పైగా అవన్నీ తీరాలంటే ఇంకా ఎలా లేదన్నా పదేళ్లు పడుతుంది. నా వల్ల కాదు.’’
 ‘‘అదేంటి అలా మాట్లాడుతున్నావు. ఇద్దరం జాబ్ చేస్తున్నాము. ఒంట్లో ఓపిక ఉన్నప్పుడు సంపాదించుకోకపోతే ఇంకెప్పుడు కొంటాము’’ చిరాగ్గా అన్నారు.
 ‘‘నాకు ఇంకా ఒంట్లో ఓపిక ఉందని మీకు ఎప్పుడు చెప్పాను? నేను జాబ్‌లో జాయిన్ అయి ఇప్పటికి పదిహేనేళ్లు అయింది. ఇంకో పదేళ్లు చేస్తే వి.ఆర్. తీసుకోవడానికి ఎలిజిబిలిటీ వస్తుంది. ఒకవైపు ఆఫీసు, ఇంకోవైపు ఇంటి పనులతో నేను చేసుకోలేకపోతున్నానని మీకు ఎన్నోసార్లు చెపాను. వి.ఆర్. తీసుకుంటానని కూడా చెప్పాను. అయినా మీరు వినడం లేదు. ఈ మధ్య నడుము నొప్పి కూడా మొదలైంది. ఇలాగే కంటిన్యూ అయితే కొంతకాలానికి నేను సిక్ అయిపోతాను. అప్పుడు మీరు దగ్గరుండి నన్ను చూసుకోగలరా?’’ సూటిగా అడిగాను. కాసేపు నిశ్శబ్దంగా ఉన్నారాయన.
 
 ‘‘ఇలా వితండవాదం చేస్తే ఎలా? ఎంతోమంది జాబ్స్ లేక అల్లాడుతున్నారు. నువ్వేమో ఉన్న జాబ్‌ని వదులకుంటానంటున్నావు. సంపాదన వద్దనుకుంటున్నావు. అయినా అంత పొడిచేసే పనేముంటుంది నీకు ఆఫీసులో. వెళ్లి కూర్చుని రావడమే కదా. అది కూడా కష్టమైపోయిందా?’’ చులకనగా మాట్లాడారు. బాధగా అనిపించింది నాకు. ఇదేనా ఆయన నన్ను అర్థం చేసుకున్నది! ‘‘ఆఫీసులో పని ఉన్నా లేకపోయినా మెంటల్ టెన్షన్ మాత్రం ఉంటుంది కదా! ఆ టెన్షనే వద్దనుకుంటున్నాను. అయినా నా నెత్తిమీద అప్పులు చేసి ఇన్ని ఆస్తులు కొన్నారు. ఏ ఒక్కటైనా నా పేరుమీద ఉందా?’’ సూటిగా అడిగాను. ఆయనకు పొలమారినట్టుంది. గబగబా గ్లాసెడు మంచినీళ్లు తాగారు. నేను స్థిరంగా చెప్పాను.
 
 ‘‘చూడండి. మీతో పెళ్లి అయ్యేటప్పటికే నేను ఒక ఉద్యోగిని. ఆర్థిక స్వాతంత్య్రం ఉన్న అమ్మాయిని. అయినా కూడా పెళ్లయిన తర్వాత మీ మాటకెప్పుడూ ఎదురు చెప్పలేదు. కనీసం నా జీతం స్కేల్ ఏ విధంగా పెరుగుతూ వెళుతుందో కూడా నాకు తెలీదు. సేలరీ రాగానే మీ చేతుల్లో పొయ్యడమే నాకు తెలుసు. ఇదంతా మీమీద ప్రేమతోనూ, ఇష్టంతోనూ చేశాను. అంతేగానీ తెలివితక్కువతనంతో కాదు. ఆస్తులు కొందామని మీరు నాతో లోన్లు పెట్టించినప్పుడు మీ వెనకాలే బ్యాంక్స్‌కి వచ్చి మీరు పెట్టమన్న చోటల్లా సంతకాలు చేశాను. ఏనాడూ మిమ్మల్ని ప్రశ్నించలేదు. నా పేరు మీద ఆస్తులేవీ లేవని మిమ్మల్ని అనుమానించలేదు. ఇదంతా మనిద్దరం ఒకటే అన్న భావనతోనే చేశాను. మన కుటుంబం ఆనందమే నా ఆనందం అనుకున్నాను. కానీ నేను కూడా మనిషినే, యంత్రాన్ని కాదు కదా! సాధారణంగా మనుషులు ఒక యంత్రాన్ని అది పూర్తిగా పాడై మూలన పడేవరకు వాడుకుంటారు.  నేను కూడా మనిషినే, యంత్రాన్ని కాదు కదా! సాధారణంగా మనుషులు ఒక యంత్రాన్ని అది పూర్తిగా పాడై మూలన పడేవరకు వాడుకుంటారు. వీలైతే మధ్యలో రిపేర్లు కూడా చేయిస్తుంటారు. ఇక అది ఎందుకూ పనికిరాదు అని నిశ్చయించుకున్నాక, పక్కన పడేస్తారు.
 
 వీలైతే మధ్యలో రిపేర్లు కూడా చేయిస్తుంటారు. ఇక అది ఎందుకూ పనికిరాదు అని నిశ్చయించుకున్నాక, పక్కన పడేస్తారు. మీరు కూడా నన్ను ఒక యంత్రంలానే ట్రీట్ చేస్తున్నారు. డబ్బు ఇచ్చే ఏటీయం మిషన్‌లా చూస్తున్నారు. జలగ రక్తాన్ని పీల్చినట్లు నన్ను పిండి మొత్తం ఫలితాన్ని రాబట్టుకోవాలని చూస్తున్నారు. అదీ నా బాధ. నా వల్ల కాదు. దయచేసి ఇకనుండైనా నన్ను ఒక మనిషిగా చూడండి. ఏది ఏమైనా ఐదేళ్ల తర్వాత నేను రిటైర్మెంట్ తీసుకుంటాను. ఈలోగా నామీద మీరు పెట్టిన లోన్లన్నీ తీర్చడానికి ప్రయత్నిస్తాను. ఆ తర్వాత ఒక గృహిణిగా అన్ని ధర్మాలు నిర్వహిస్తాను. అంతే!’’ అని చెప్పి చేతులు కడుక్కోవడానికి లేచి సింక్ వైపు వెళ్లాను. కొత్తగా మాట్లాడుతున్న నన్ను నోరెళ్లబెట్టి విపరీతమైన ఆశ్చర్యంతో చూడసాగారు ఆయన!
 - సన్నిహిత్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement