ఇరుకు | Funday story of the week on September 7 | Sakshi
Sakshi News home page

ఇరుకు

Published Sun, Sep 7 2014 1:01 AM | Last Updated on Sat, Sep 2 2017 12:58 PM

ఇరుకు

ఇరుకు

విసుగ్గా వాచీ చూసుకున్నాను. రోజూ ఈపాటికి వచ్చేసేవాడు శంకరం, ఈ రోజింకా రాలేదు అనుకున్నాను. కారు ఏసీ చల్లదనం మెత్తగా స్పృశిస్తుంటే సెల్‌లో ఈ-మెయిల్స్ చెక్ చేసుకోవటం మొదలుపెట్టాను. ఇంతకీ శంకర్రావు, నేను ఒకే ఆఫీసులో పనిచేస్తున్నాం. ఇద్దరం సెక్షన్ ఇన్‌ఛార్జ్‌లమే. ఇద్దరివీ పక్క పక్క క్యూబికల్స్. శంకరం నాకన్నా ఐదారేళ్లు చిన్నవాడు. ప్రభుత్వం వారు సూచించినట్లు పూల్ ట్రాన్స్‌పోర్ట్‌లో భాగంగా ఇద్దరం ఆఫీసుకి ఒకే కారులో వెళ్తాం. నిజం చెప్పొద్దూ, ఇది నాకు సౌకర్యంగా ఉంది కాబట్టి నేను ఒప్పుకున్నాను. కారు నాది కాబట్టి పెట్రోల్ ఖర్చులో 60 శాతం శంకరానిది, నలభై శాతం నాది. మా ఇద్దరిళ్లు ఎదురెదురుగానే ఉంటాయి. నాది సొంతిల్లు. శంకర్రావు అపార్టుమెంటులో అద్దెకుంటున్నాడు. మా వ్యక్తిత్వాలు కూడా కలవవు. కానీ అవసరం మమ్మల్ని కలిపింది. శంకరానిది జాలి గుండె. చాలా సున్నితంగా ఉంటాడు. అతను మనసుతో ఆలోచిస్తాడు. నేను నా బ్రెయిన్ పవర్ ఉపయోగిస్తాను. ‘బీ ఏ రోమన్ వెన్ యూ ఆర్ ఇన్ రోమ్’ అంటాన్నేను. మనిషి ఆలోచన ప్రాక్టికల్‌గా ఉండాలని బలంగా నమ్ముతాను. అందుకే ఆఫీసులో వీళ్లిద్దరికీ లంకె ఎలా కుదిరిందా అని ఆలోచిస్తారు.

ఏదైనా పని చేయాలంటే నాకు గిఫ్టులు కావాలి. డబ్బులు బల్లమీదైనా పెట్టాలి. కాదంటే బల్ల కింద నుంచి ఇవ్వాలి. కొండకచో పార్టీలు ఇవ్వాలి. అవిచ్చేవాళ్లు నా ప్రాధాన్యత క్రమంలో ఉంటారు. అదే మీరు శంకరాన్ని కదిలించి చూడండి, ఎవరైనా ఒకటే అంటాడు. సీరియల్ నంబరు ప్రకారం వెళతానంటాడు. అందుకనే చాలామంది తమ ఫైల్స్ అతని టేబుల్ మీదకు కాకుండా నా టేబుల్ పైకి వస్తే బావుండనుకుంటారు. శంకరం టేబులంతా ఫైళ్లతో నిండిపోయి ఉంటుంది. అన్నీ సరిగ్గా ఉన్నప్పుడే ఆ ఫైల్ ముందుకు వెళుతుంది. దానికి చాలా సమయం పడుతుంది. అదే నా టేబుల్, కడిగిన ముత్యంలా ఉంటుంది. ప్రియుడి కోసం ఎదురుచూసే విరహ నాయికలా ఉంటుంది. శంకరం నా దారికి అడ్డురాడు కాబట్టి, నాకు అతనితో పేచీ లేదు. నేను సంపాదిస్తున్నాననే అసూయ అతనికి లేదు. నేనేం చెప్పినా వింటాడు. నాకో పెద్దరికమిస్తాడు. దానివల్ల నా అహం తృప్తిపడుతూనే ఉంటుంది. అసలు శంకరం ఆలస్యం చేస్తున్నందుకు ఈపాటికి నాకు కోపం వచ్చేయాలి కదా. దాన్ని కూడా నాకు అనుకూలంగా మార్చుకున్నాను. శంకరం ఆలస్యంగా వచ్చినప్పుడల్లా, ‘కామత్’లో కట్లెట్, కాఫీ ఇప్పించాలి. ఇది మా ఒప్పందం అని నేను పైకి చెప్పినా, అది నేను పొందే లాభం.

అదిగో వస్తున్నాడు శంకరం ఆయాసపడుతూ భుజానికి తగిలించుకున్న బ్యాగుతో. రా శంకరం... కామత్‌లో కాఫీ తాగి చాలా రోజులైంది అనుకున్నాను తృప్తిగా.  ‘సారీ ఆనంద్... ఇవ్వాళ గురువారం కదా! కొంచెం చిల్లర తెచ్చుకునేటప్పటికి ఆలస్యమైంది’. కారు తలుపు తీసి లోపల కూర్చుంటూ అన్నాడు. గేరు మారుస్తూ, ఇవ్వాళ శంకరం ఆలోచనల రూట్ మార్చాలనుకున్నాను. ‘‘అది సరే శంకరం! ప్రతి వారం గుడి దగ్గర నువ్వు దానం చేసే మొత్తం ఓ వంద రూపాయలుంటుంది. నెలకు నాలుగు వందల చొప్పున లెక్కవేసినా సంవత్సరానికి నాలుగు వేల ఎనిమిది వందలు. పోనీ ఒక్క గురువారమేనా అంటే మళ్లీ శనివారం సాయంత్రం గుడికి వెళతావు. అక్కడ లెక్క వేరే. ఇలా నెలకి ఎనిమిది వందల రూపాయలు. దీనివల్ల ఎవరికి లాభం. పుణ్యం సంపాదించుకుని వచ్చే జన్మలో మరింత బాగా ఉండాలనా? లేదంటే పునర్జన్మ లేకుండా ఉండాలనా? అంటే నీ స్వార్ధం కోసమేగా ఈ దానాలు?’’ ఏసీ చల్లదనంలో శంకరానికి నా మాటలు చెమటలు పట్టిస్తాయనుకున్నాను. అందుకేనేమో వెంటనే సమాధానం ఇవ్వలేదు. రెండు నిమిషాలాగాడు.
 ‘‘ఆనంద్! పాప పుణ్యాల చిట్టా దగ్గర పెట్టుకుని నేనేదో ఇస్తున్నానని అనుకోవటం లేదు. ఎన్నో జన్మలెత్తిన తర్వాత మనిషి జన్మ ప్రాప్తిస్తుందని చదివాను. విన్నాను. వచ్చే జన్మలో ఎవరం ఎలా ఉంటామో తెలీదు. అసలు జన్మంటూ ఉంటుందో కూడా తెలీదు. ఇలా అందరికీ ఇవ్వు అని ఆ బాబా నన్ను ఆజ్ఞాపించాడనుకుంటున్నాను. ఇస్తున్నాను. మనం మల్టీప్లెక్స్‌లో సినిమా చూసి ఒక పిజ్జానో, బర్గరో తింటే అయ్యే ఖర్చు కన్నా ఇది ఎక్కువని నేననుకోవటం లేదు.’’
 శంకరం వాదన ఇలాగే ఉంటుందని నాకు తెలుసు. అయినా అతనిలో ఏదో మార్పు తేవాలని నా వెర్రి ప్రయత్నం.
 ‘‘నువ్వు చెప్పిందే రైటనుకుందాం. నీ కుటుంబానికి ఇవ్వవలసిన ఆనందాన్ని, సుఖాన్ని ఆ మేరకు నువ్వు త్యాగం చేసినట్లే కదా!’’
 ‘‘ఎంతసేపూ నేనూ నా కుటుంబం అని ఆలోచిస్తూ కూర్చుంటే సమాజం ఇలాగే ఉండేదా ఆనంద్?’’. ఈ శంకరం ఎప్పుడూ ఇంతే. ఏదో సమాజాన్ని ఉద్ధరిస్తున్నాననే ఒక భ్రమలో బతుకుతున్నాడు. ఇలాంటి వాళ్లని ఆ దేవుడు కూడా మార్చలేడని దృష్టి రోడ్డు మీద పెట్టాను. మొత్తానికి వీడి నోరు మూయించగలిగానని శంకరం కూడా అనుకుంటున్నాడేమో! శంకరం కూడా నాలాగే ఆలోచిస్తాడన్న నా పిచ్చి ఊహకు నాకే నవ్వొచ్చింది. ఇద్దరం మా క్యాబిన్లలో కూలబడ్డామో లేదో, మా ప్యూన్ సాయిలు వచ్చాడు డెరైక్టర్‌గారు రమ్మన్నారంటూ. క్రీగంట శంకరం వంక చూశాను. మొహంలో ఏ ఫీలింగూ లేదు. శంకరానికి మా బాగా క్లాసు పీకితే ఆనందించాలన్న కోరిక కలిగింది ఆ క్షణాన.
    
 గ్లాస్ డోర్ చప్పుడు చేయకుండా మమ్మల్ని లోపలికి నెట్టింది. ఒక్క క్షణం తలెత్తి చూశాడు బాస్. ‘టేక్ యువర్ సీట్స్’ అన్నాడే కాని చాలా అసహనం ధ్వనించింది ఆ గొంతులో. నేరుగా విషయంలోకి వచ్చేశాడాయన.  ‘‘శంకరంగారూ! డెరైక్టరేట్ వాళ్లడిగిన స్టేట్‌మెంట్ ఎంతదాకా చేశారు. మీకు చెప్పి రెండు రోజులైంది. ఢిల్లీవాళ్లు ఫోన్ చేసి, ఇంకా అవ్వలేదా అంటున్నారు. అయినా మనకున్న ఇన్‌పుట్స్‌తో చెయ్యమన్నాను కదా. మీరేమిటి మొత్తం రికార్డులన్నీ తవ్విస్తున్నారట. ఆ తవ్వకాలు ఎప్పుడు పూర్తవుతాయి? మీ స్టేట్‌మెంట్ ఎప్పుడవుతుంది? ఎవడో ఢిల్లీలో కొత్తగా వచ్చాడు. వాడి ఉనికిని చాటుకోవటం కోసం ఇలాంటి అర్థం పర్థం లేనివి అడుగుతూ ఉంటాడు. అది వాడికీ తెలుసు, మనకూ తెలుసు. అక్కడ స్టేట్‌మెంట్ ఎంత కరెక్టుగా ఉన్నది అన్నదాని కంటే ఎంత తొందరగా పంపించామన్నది ప్రధానం. ఈ మాత్రం చిన్న లాజిక్ తెలుసుకోకపోతే ఎలా మీరు? ఆనంద్, ఆ స్టేట్‌మెంట్ మీరు తయారుచేయండి. సాయంత్రం లోపల పంపించాలి. నౌ యూ కెన్ గో’, నాకు ఆనందం కలిగించే ఆ నాలుగు మాటలు అని తన ఫైళ్లలో మునిగిపోయాడాయన. మహానుభావుడు అనుకున్నాను. శంకరం వంక చూశాను. మొహంలో ఏదైనా బాధ కనిపిస్తుందేమోనని. ఈయనా మహానుభావుడే, బాధను కూడా ఎంత జాగ్రత్తగా కనిపించకుండా దాస్తాడో అనుకున్నాను.
 మా డెరైక్టర్ మమ్మల్ని పిలవడం వెనుక అసలు కారణం నాకు తెలుసు. మెటీరియల్ పర్చేజ్‌కు సంబంధించి కొటేషన్లు తెప్పించటంలో కొంత మతలబు చేయాల్సి ఉంది. అది చేస్తే కాని మాకు గిట్టుబాటు కాదు. మా డెరైక్టర్ అనుకున్నట్లుగా శంకరం ఆ పని చేయటం లేదు. నువ్వు ఇలా ఎందుకు నేను చెప్పినట్లు చెయ్యవు అని మా బాస్ శంకరాన్ని అడగలేడు. అక్కసంతా ఇలా వెళ్లగక్కుతున్నాడు. నిజానికి స్టేట్‌మెంట్ అనేది ఆయన అల్లిన ఒక అందమైన కథ. శంకరాన్ని నా ముందు అవమానపరిస్తే కానీ ఆయన శాంతించడు. ఆ విషయం నాకర్థమైంది. నేనూ, శంకరం మా క్యాబిన్‌కు వచ్చాం. ప్యూన్‌ని పంపించి, శంకరానికి హితబోధ చేశాను.
 ‘‘చూడు శంకరం! మన బాస్ నువ్వు ఆయనకు అనుకూలంగా, ఆయన అనుకున్నట్లుగా పని చేయాలని ఆశిస్తున్నాడు. ఆ కొటేషన్ల విషయంలో చూసీ చూడనట్లు పోవచ్చు కదా!’’
 ‘‘ఆనంద్! నేను రూల్‌కు విరుద్ధంగా చేస్తే చెప్పండి వింటాను. కొటేషన్లు, టెండర్ల విషయంలో కొన్ని పద్ధతులుంటాయి కదా. వాటిని పాటించాలి కదా. పోనీ ఆయనకు నేను నచ్చకపోతే, ఆ సీటు నుంచి నన్ను తప్పించొచ్చు కదా!’’
 అవును నిజమే కదా అనుకున్నాను. పర్చేజ్‌కు సంబంధించి శంకరం నిష్ణాతుడు. బాస్ చెప్పినా వినకపోవడం అన్న తిక్కను తీసేస్తే మిగిలినవన్నీ అతను చాలా పర్‌ఫెక్ట్‌గా చేస్తాడు. వంక పెట్టడానికి వీల్లేదు. ఆ సంగతి మా డెరైక్టర్‌కు కూడా తెలుసు. ఇంకేం మాట్లాడతాను!
 ‘‘శంకరం మనకు నష్టం కలగనంత వరకు బాస్ చెప్పినట్లు చేయటంలో తప్పేమీ లేదు కదా’’ అనునయంగా అన్నాను.
 ‘‘ఆడిట్‌లోనో, విజిలెన్సులోనో బయటపడితే దానికి పేచీ ఎవరిది? అదే కాదు, అంతరాత్మను మోసం చేసుకుంటూ నేనలాంటి పనులు చేయలేను.’’శంకరం అన్న ఈ మాటలకి నా దగ్గర సమాధానం లేదు.నేనూ, శంకరం ఇద్దరం క్లాస్ వన్ ఆఫీసర్లమే. కానీ నాకు, అతనికి ఎంత తేడా! నేను ఏది చేసినా నా లెక్కలు నాకుంటాయి. లేకపోతే మంచి కారు, మంచి అపార్ట్‌మెంట్ ఎక్కడొచ్చేవి! శంకరంలాగా అద్దె కొంపలోను, అరువు కారులోను బతుకు బండి లాగిస్తుండేవాడిని అనుకున్నాను. అందుకే నేనంటే భయపడతారు. శంకరం అంటే జాలిపడతారు.
    
 శంకరాన్ని రాత్రికి ఇంటికి ఆహ్వానించాను. ఓ క్లయింటుని సతాయిస్తే స్కాచ్ బాటిల్ ఒకటి సమర్పించుకుని వెళ్లాడు. ఆ సందర్భాన్ని సెలబ్రేట్ చేస్తున్నాను. శంకరం తీసుకోడు కానీ నా ఎద సొదంతా వింటాడు. అక్కసంతా భరిస్తాడు. శంకరం మంచితనం, నిజాయితీ అంటే నా గుండె లోతుల్లో ఎక్కడో చిన్న సెగ రగులుతోంది. దాన్ని మింగలేను, కక్కలేను. ఈ రోజు అతని నిజాయితీ మూలాల అంతు తేల్చాలనుకున్నాను. నాకున్న మొహమాటం మొదటి డ్రింకుతో పోయింది. రెండో డ్రింకు కలుపుకుని అతడికో లైమ్ జ్యూస్ గ్లాసుని మళ్లీ నింపుతూ అడిగాను, ‘‘ఇప్పుడు చెప్పు శంకరం. ఇంత మంచితనం సిన్సియారిటీ అవసరమంటావా?’’
 
 ‘‘ఆనంద్, మీకో విషయం చెప్పాలి. మీరెలా పెరిగారో, మీ బ్యాక్‌గ్రౌండ్ ఏమిటో నాకు తెలీదు గానీ, నా జీవితం అంత సుఖంగా గడవలేదు. మాదో పేద కుటుంబం. పెద్ద కుటుంబం కూడా. చదువుకోసం చాలామంది దాతల మీద ఆధారపడ్డాను. మాలాంటి పేద విద్యార్థులకున్న ఓ వసతి గృహంలో చేరాను. నెల నెలా దాతల ఇళ్లకెళ్లి డబ్బులు తెచ్చుకుని దాంతోటి ఆ వసతి గృహాన్ని నడిపేవాళ్లం. ఈ క్రమంలో కొంతమంది విసుక్కునేవాళ్లు. కొంతమంది మర్యాదగా మాట్లాడి బాగా చదువుకోమని ప్రోత్సహిస్తూ ఉండేవాళ్లు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువు అయిన తరువాత వారి దయా దాక్షిణ్యాలతో అక్కడే ఉండి పోటీపరీక్షలు రాసి ఉద్యోగం సంపాదించుకున్నవాడిని. ఇప్పుడు చెప్పండి.
 
 ఆ అనాథాశ్రమం నన్ను అక్కున చేర్చుకోకపోయినా, దాతలు నాలుగు మంచి మాటలు చెప్పకపోయినా నేనీ స్థాయికి వచ్చేవాడినా! సమాజం పట్ల కృతజ్ఞత చూపకుండా ఎలా ఉంటాను! ఆదర్శవంతంగా జీవించకుండా నాలాంటి అనేక మందికి ఎలా సహాయపడగలను! నేనెక్కడైతే ఉండి చదువుకున్నానో దాని బాగోగులు చూస్తున్నాను. గుడికి ఎందుకు వెళతానంటారా! చాలా మంది అనాథలు గుడికి వచ్చినవారు తమకేదన్నా ఇవ్వకపోతారా అని ఎదురుచూస్తూ ఉంటారు. నేను వారికోసం వెళుతుంటాను. దానితో పాటు నన్ను మనిషిగా పుట్టించినందుకు ఆ బాబాకు నా కృతజ్ఞతను వ్యక్తపరుస్తూ ఉంటాను. ఇప్పుడు చెప్పండి నేను చేసే దాంట్లో తప్పేముందో.’’
 
 శంకరం మాటలు స్కాచ్ విస్కీ అందిస్తున్న మత్తుని, హాయిని కరిగించేశాయి. ఇదన్నమాట శంకరం బిడియం, నెమ్మదితనం, బెరుకు వెనకున్న అసలు కథ. అందుకే అతని గురించి ఎవరేమనుకున్నా తను అనుకున్న గమ్యం వైపు నెమ్మదిగా సాగుతున్నాడు. ఇలా తనకు తాను ఒక ఆదర్శాల చట్రాన్ని సృష్టించుకుని ఆ ఇరుకులోనే సుఖం పొందుతున్నాడు. సెంటిమెంటల్ ఫూల్ అనుకున్నాను.ఓదార్పుగా అతని భుజం తట్టాను.
    
 ఆ తర్వాతి గురువారం నాటికి శంకరం ముఖ్యమైన పనిమీద ఢిల్లీ వెళ్లాడు. శంకరం లేకుండా అలవాటు ప్రకారం గుడికి నేనొక్కడినే వెళ్లాను. నా అవినీతి సంపాదనకు రక్షణ కల్పించమనీ, ఆ సంపాదన తగ్గకుండా చూడమనీ కోరటం నాకలవాటు. అది ముగించుకుని బయటకు వస్తూ, శంకరం స్నేహితులు అదే ఆ బిచ్చగాళ్లందరూ ఏం చేస్తున్నారా అని గమనించాను. రెండు వరుసల్లో కూర్చున్నారు వాళ్లు. ఓ ఇరవై మందుంటారేమో. ఆడవాళ్లంతా ఒకవైపు, మగవాళ్లు ఒకవైపు. దుమ్ము కొట్టుకుపోయిన బట్టలు, అందరి చేతుల్లో చిన్న చిన్న బొచ్చెలు. మగవాళ్లయితే మాసిపోయిన గడ్డాలు, తైల సంస్కారం లేని జుట్టు. మొత్తంగా మురికి పేరుకుపోయిన శరీరాలు వాళ్లందరివి. కొంచెం పరీక్షగా చూసేసరికి నాకు ఒళ్లు జలదరించింది. శంకరం రాకపోవటం వలన వాళ్లు నిరాశ చెందినట్లున్నారు అనుకున్నాను. వారిలో ఓ ముగ్గురు నా వెనకే రావటం గమనించాను. కొంపదీసి నన్ను డబ్బులడగరు కదా అనుకున్నాను. కారు తలుపు తీసి లోపల కూర్చుని కారు ఇగ్నేషన్ కీ తిప్పేలోపు బాగా దగ్గరకు వచ్చారు వాళ్లు.‘‘బాబూ, మీతో పాటు వచ్చే అయ్య రాలేదా ఇయ్యాల’’ వాళ్లలో ఒకతను అడిగాడు.‘‘రాలేదు’’ అన్నాను.
 ‘‘ఆ అయ్య మంచిగనే ఉన్నాడు కదయ్యా’’ ఈసారి ఇంకోడడిగాడు.
 ‘‘ఏం ఇవ్వాళ మీ పైసలు మీకు రాలేదనా?’’ ఎంత అణుచుకున్నా వెటకారం దాగలేదు. వారానికోసారి చిల్లర డబ్బులిచ్చేవాడిని అంత ప్రేమగా వాళ్లు తలచుకోవటం నాకు ఆశ్చర్యం కలిగించింది.
 ఇగ్నేషన్ కీ తిప్పాను. ఇంజన్ మొరాయిస్తోంది. ఎంత ప్రయత్నించినా స్టార్ట్ అవటం లేదు. నాలో అలజడి మొదలైంది. వాళ్లు ముగ్గురూ నా వంకే చూస్తున్నారు. నాకు పట్టుదల పెరిగింది. చెమటలు పడుతున్నాయి కాని కారు కదలటం లేదు. మొరాయింపు ఆగటం లేదు.
 ఈసారి వాళ్లు ధైర్యం చేసి అడిగారు.
 ‘‘అయ్యా బండి తోస్తే కానీ కదలదేమో. ఒక్క నిమిషం మీరు అట్నే కూర్చోండి. మేం బండిని తోస్తాం’’.
 శుష్కించిపోయిన వాళ్ల శరీరాలు ఈ హెవీ వెయిట్ కారును నెట్టగలవా అని తొలుస్తున్నా, అక్కడ నా అహం కన్నా అవసరం ముఖ్యం కాబట్టి నీరసంగా తలూపాను.
 వాళ్ల తోపుకు బండి ఇరవై అడుగులు ముందుకు కదలగానే, గేరు వేశాను. ఇంజన్ గుర్రంలా సకిలించింది. కారు ముందుకు కదిలింది. న్యూట్రల్‌లో ఉంచి తలుపు తీసి బయటకు వచ్చి చేతులు జోడించాను. సిగ్గుతో జేబులోంచి పర్సు తీయబోయాను.
 ‘‘వద్దయ్యా. మా సారును తీసుకొచ్చే కారిది. ప్రతివారం మేం జూస్తుంటాం సార్, ఆ సార్ ఎప్పుడొస్తడాని. మమ్మల్ని నవ్వుతూ పలకరిస్తాడు. వచ్చేవారమొస్తడు కదు సార్. రమ్మని జెప్పుర్రి అయ్యా! మేము ఎదురుజూస్తుంటాం ఆ సార్ కోసం.’’ నా మాట కోసం ఎదురు చూడకుండానే వెళ్లిపోయారు వాళ్లు. శంకరాన్ని తలుచుకున్నప్పుడు వాళ్ల కళ్లల్లో కనిపించిన మెరుపు నా కళ్లు తెరిపించింది. శంకరంలో ఏమిటి గొప్ప అని నన్ను తొలిచే ప్రశ్నకు ఆ ముగ్గురి కళ్లలోని మెరుపే నాకు సమాధానం చెప్పినట్లనిపించింది. లోపలి ఇరుకేదో వదులయింది.
- సి.ఎస్.రాంబాబు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement