సాక్షి, సిటీబ్యూరో : తనకు వచ్చిన ఎస్‌ఎంఎస్‌ను చూసిన ఓ యువకుడు రూ.14 లక్షలు పోగొట్టుకున్నాడు. పెట్టుబడుల పేరుతో ఎరవేసిన సైబర్ నేరగాళ్లు అతనితోపాటు మరికొందరిని మోసం చేశారు. దీంతో బాధితులు సైబర్ పోలీసులను ఆశ్రయించారు. టోలిచౌకి ప్రాంతానికి చెందిన మహ్మద్ సోహిబ్ సెల్‌ఫోన్‌కు ఇటీవల ఓ ఎస్‌ఎంఎస్ వచ్చింది. దక్షిణ కొరియాకు చెందిన పార్క్ గ్రీన్ గ్యాంగ్ నుంచి వచ్చినట్లు అందులో ఈ–మెయిల్ ఐడీ కూడా ఉంది. ఈ–మెయిల్ సందేశంలో తాను మహిళగా పరిచయం చేసుకున్న పార్క్ గ్రీన్.. తన వద్ద ఉన్న సొమ్మును భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని భావిస్తున్నట్లు చెప్పింది.
వెంటనే స్పందించిన సోహిబ్ తన వివరాలను ఈ–మెయిల్ చేశాడు. తన వద్ద ఉన్న 10 మిలియన్ డాలర్లు నీకు పంపిస్తున్నానని, వాటిని ఏదైనా లాభసాటి రంగంలో పెట్టుబడులు పెట్టాలని సూచించింది. ఇది జరిగిన రెండు రోజులకు ఢిల్లీ విమానాశ్రయం కస్టమ్స్ అధికారులుగా కొందరు నేరగాళ్ళు నగర యువకుడికి ఫోన్ చేశారు. పార్సిల్‌లో వచ్చిన డబ్బు విషయం చెప్పి వివిధ పన్నుల పేరుతో పలుసార్లు రూ.14 లక్షలు కాజేశారు. దీంతో బాధితుడు శుక్రవారం సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేశాడు.
►అంబర్‌పేట ప్రాంతంలో నివసించే ఓ కాలేజీ లెక్చరర్‌కు అదే కాలేజీ ప్రిన్సిపల్‌గా ఈ–మెయిల్ పంపిన సైబర్ నేరగాళ్ళు రూ.25 వేల విలువైన అమెజాన్ ఓచర్లు కాజేశారు. నారాయణగూడలోని ఓ కాలేజీలో లెక్చరర్‌గా పని చేస్తున్న ఓ మహిళకు తన ప్రిన్సిపాల్ పంపినట్లు ఓ ఈ–మెయిల్ వచ్చింది. అందులో రూ.25 వేల విలువైన అమెజాన్ ఓచర్లు కొని, తాను సూచించిన మెయిల్ ఐడీకి పంపాలని ఉంది. బాధితురాలు అలానే చేసిన తర్వాత ప్రిన్సిపాల్‌తో ఆరా తీయగా అసలు విషయం తెలిసింది.
►తన కుమారుడికి బుల్లెట్ వాహనం గిఫ్ట్‌గా ఇవ్వాలని భావించిన వెస్ట్ మారేడ్‌పల్లికి చెందిన మహిళ అందుకోసం ఓఎల్‌ఎక్స్‌లో సెర్చ్ చేసింది. అందులో ఉన్న నెంబర్‌కు సంప్రదించి బేరసారాలు పూర్తి చేసింది. చివరకు అడ్వాన్సుల రూపంలో వారికి రూ.75 వేలు చెల్లించి మోసపోయింది.
►షాహినాయత్‌గంజ్ ప్రాంతానికి చెందిన జనార్దన్ గౌడ్‌కు బ్లూ డాట్ కొరియర్ ద్వారా ఓ పార్సిల్ రావాల్సి ఉంది. నిర్ణీత గడువు ముగిసినా అది రాకపోవడంతో ఆయన సంస్థ కాల్ సెంటర్ కోసం గూగుల్‌లో సెర్చ్ చేశారు. అందులో కనిపించిన ఓ బోగస్ నెంబర్‌ను నిజమైనదిగా భావించి కాల్ చేశారు. అవతలి వ్యక్తులు చెప్పినట్లే చేసి రూ. 42 వేలు పోగొట్టుకున్నారు.
►మెహదీపట్నం ప్రాంతానికి చెందిన రాజేష్.. తన ఖాతా నుంచి రూ.41 వేలు గుర్తుతెలియని వ్యక్తులు డెబిట్‌కార్డుతో కాజేశారని తెలిపారు. ఈ మేరకు వేర్వేరు కేసులు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment