నాకు పెళ్లై రెండున్నర సంవత్సరాలు కావొస్తుంది. గర్భనిరోధక మాత్రలేవీ వాడలేదు. ఇప్పటి వరకు పిల్లలు లేరు. ట్యూబ్ టెస్టింగ్ చేయించుకోవాల నంటున్నారు. దీని గురించి తెలియజేయగలరు.
– డి.వసుమతి, అనంతపురం
సాధారణంగా గర్భం రావడానికి గర్భాశయానికి ఇరువైపులా ఉండే ఫెలోపియన్ ట్యూబ్‌లు తెరుచుకుని ఉండాలి. రెండింటిలో కనీసం ఒకటైనా తెరుచుకుని ఉండాలి. కొందరిలో ఏదైనా ఇన్‌ఫెక్షన్స్, ఇతరత్రా కారణాల వల్ల ఇవి మూసుకుపోయే అవకాశాలు ఉంటాయి. ఫెలోపియన్ ట్యూబ్‌లు తెరుచుకుని ఉన్నాయా, లేదా మూసుకుని ఉన్నాయా నిర్ధారించడానికి ట్యూబ్ టెస్టింగ్ చేస్తారు. వీటిలో ముఖ్యంగా సోనోసాల్పింగో గ్రామ్ (ఎస్‌ఎస్‌జీ), హిస్టిరో సాల్పింగోగ్రామ్ (హెచ్‌ఎస్‌జీ), లాపరోస్కోపిక్ క్రోమోట్యూబేషన్ వంటివి ఉంటాయి. ఎస్‌ఎస్‌జీలో సన్నని క్యాథటర్ ద్వారా యోని నుంచి గర్భాశయంలోనికి నార్మల్ సెలైన్ పంపించి, స్కానింగ్‌లో నార్మల్ సెలైన్ ట్యూబ్స్ నుంచి బయటకు వస్తుందా లేదా అని చూడటం జరుగుతుంది. హెచ్‌ఎస్‌జీలో ‘రేడియో ఒపేక్ డై’ అనే ద్రవాన్ని యోని నుంచి సర్విక్స్ ద్వారా గర్భాశయంలోకి పంపించి, పొట్ట పైనుంచి ఎక్స్‌రే తీయడం జరుగుతుంది. ఇందులో ట్యూబ్స్ తెరుచుకుని ఉంటే పై గర్భాశయంలో నుంచి ట్యూబ్స్‌లోకి ప్రవేశించి, బయటకు పొత్తి కడుపులోకి రావడం కనిపిస్తుంది. మూసుకుని ఉంటే డై ట్యూబ్‌లోకి ప్రవేశించదు. లేదా కొంత దూరం వరకు వచ్చి ఆగిపోవడం జరుగుతుంది. హెచ్‌ఎస్‌జీలో ట్యూబ్స్ మూసుకుని ఉన్నట్లు తేలితే, అది నిర్ధారణ చేయడానికి ల్యాపరోస్కోపిక్ క్రోమోట్యూబేషన్ పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ అందులో ట్యూబ్స్ మూసుకుని ఉన్నట్లు నిర్ధారణ జరిగితే హిస్టరోస్కోపీ క్యానులేషన్ ద్వారా ట్యూబ్స్‌ను తెరవడానికి ప్రయత్నించవచ్చు. హెచ్‌ఎస్‌జీ పరీక్ష చేసేటప్పుడు కొందరు భయంతో పొట్టను గట్టిగా బిగపట్టడం వల్ల డై సరిగా ట్యూబ్‌లలోకి ప్రవేశించదు. దానివల్ల హెచ్‌ఎస్‌జీలో ట్యూబ్స్ బ్లాక్ అయినట్లు రిపోర్ట్ వస్తుంది.అంతమాత్రాన అవి వందశాతం మూసుకుపోయాయని నిర్ధారించలేం. గర్భం రాకపోతే మొదట హార్మోన్ల పనితీరు, అండం విడుదల సక్రమంగా ఉన్నాయా లేదా, భర్త శుక్రకణాల నాణ్యత, సంఖ్య, కదలిక సరిగా ఉన్నదీ, లేనిదీ నిర్ధారణ చేసుకున్నాకే ట్యూబ్ టెస్టింగ్ చేయించుకోవడం మంచిది.
ప్రెగ్నెన్సీ సమయంలో సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల, పుట్టబోయే బిడ్డ ఆటిజమ్ సమస్య ఎదురయ్యే అవకాశాలు ఉంటాయనే ఒక స్టడీలో చదివాను. pట్ఛn్చ్ట్చ∙ఠిజ్టీ్చఝజీnటతప్పనిసరిగా తీసుకోవాలా?
– బి.సరోజ, భువనగిరి
ప్రెగ్నెన్సీ సమయంలో సరైన మోతాదులో సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల పుట్టబోయే బిడ్డలో ఆటిజం సమస్య వచ్చే అవకాశాలు, సప్లిమెంట్స్ తీసుకోని వారితో పోల్చితే చాలా తక్కువగా ఉంటాయి. మీరు తప్పుగా చదివినట్లు ఉన్నారు. ఆటిజం అంటే మానసిక పెరుగుదల లేకపోవడం, వినికిడి లోపాలు వంటి అనేక లక్షణాలతో కలసిన ఒక సిండ్రోమ్. జన్యుపరమైన కారణాలు, పర్యావరణ మార్పులు, తల్లిలో పోషక లోపాలు, రక్తహీనత, తల్లి మానసిక పరిస్థితి, కొన్ని రకాల మందులు, ఇన్‌ఫెక్షన్ల ప్రభావం, గర్భంలో ఉన్నప్పుడు ఆక్సిజన్ సరఫరా సరిగా లేకపోవడం, కాన్పులో ఇబ్బందులు, ఇంకా ఎన్నో తెలియని కారణాల వల్ల పిల్లల్లో ఆటిజం సమస్య రావచ్చు. కొందరు శిశువులకు గర్భంలో ఉన్నప్పుడు మెదడుకు ఆక్సిజన్ సరఫరా తగినంతగా ఉండకపోవచ్చు. దానివల్ల మెదడు పెరుగుదల, పనితీరులో లోపాలు ఏర్పడవచ్చు. కాబట్టి రక్త హీనతను అధిగమించడానికి సరైన పోషకాహారంతో పాటు ఫోలిక్ యాసిడ్, బి–కాంప్లెక్స్ వంటి సప్లిమెంట్స్ మాత్రల రూపంలో తీసుకోవడం మంచిది. ప్రీనేటల్ విటమిన్స్ గర్భం రాకముందు మూడునెలల నుంచే తీసుకోవడం మొదలుపెట్టి గర్భం వచ్చిన తర్వాత కూడా వాడుకోవాలి.
నాకు కొన్ని సంవత్సరాల క్రితం రొమ్ము క్యాన్సర్ వచ్చింది. ఇప్పుడు తగ్గిపోయింది. నాకు ఒక అమ్మాయి ఉంది. మళ్లీ పిల్లల్ని కనాలనుకుంటున్నాను. ‘పుట్టబోయే బిడ్డ రకరకాల ఆరోగ్య సమస్యలతో పుడతాడు’ అని కొందరు అంటున్నారు. ఇది నిజమేనా? నేను గర్భం దాల్చవచ్చా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? – జి.నాగమణి, నూజివీడు
ఇప్పుడు రొమ్మ క్యాన్సర్ తగ్గిపోయింది. మందులేమీ వాడటం లేదు కాబట్టి, ఇప్పుడు గర్భం దాల్చడం వల్ల బిడ్డలో ఆరోగ్య సమస్యలేవీ రావు. మీ వయసు రాయలేదు. మీ అమ్మాయి రొమ్ము క్యాన్సర్ రాకముందు పుట్టిందా, వచ్చిన తర్వాత పుట్టిందా అనే వివరాలు రాయలేదు. గర్భందాల్చే ముందు ఒకసారి డాక్టర్‌ని సంప్రదించి, రొమ్ముకు పరీక్షలు చేయించుకుని, అంతా బాగానే ఉంటే గర్భం కోసం ప్రయత్నించవచ్చు. గర్భం కోసం ప్రయత్నించే టప్పుడు ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్లు రోజుకొకటి చొప్పున వేసుకోవాలి. బరువు ఎక్కువగా ఉంటే, బరువు తగ్గి గర్భం కోసం ప్రయత్నించండి. గర్భంతో ఉన్నప్పుడు కూడా సరైన పోషకాహారం తీసుకుంటూ మరీ ఎక్కువ బరువు పెరగకుండా చూసుకోవాలి. ఒకవేళ సాధారణంగా గర్భం రాకపోతే, గర్భం కోసం చికిత్స తీసుకునేటప్పుడు హార్మోన్స్ ఎక్కువ మోతాదులో కాకుండా, తక్కువ మోతాదులో వాడుకోవాల్సి ఉంటుంది. ఈస్ట్రోజన్ వంటి హార్మోన్స్ మరీ ఎక్కువ తీసుకుంటే, కొందరి శరీర తత్వాన్ని బట్టి, ముందు వచ్చిన రొమ్ము క్యాన్సర్‌ను బట్టి అది తిరగబెట్టే అవకాశాలు కొద్దిగా ఉంటాయి. ఒకసారి డాక్టర్‌ని సంప్రదించి, గర్భం కోసం ప్రయత్నించవచ్చు.
డా‘‘ వేనాటి శోభ
బర్త్‌రైట్ బై రెయిన్‌బో హైదర్‌నగర్
హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment