సముద్రాల మధ్య దాగిన ఎన్నో సహజమైన అద్భుతాల్లో ‘బ్లూ హోల్స్’ ప్రత్యేకమైనవి. భూ పరిణామ క్రమంలో మారిన వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఇవి ఏర్పడ్డాయి. సముద్రాల మట్టం ఈ స్థాయిలో లేని రోజుల్లో దాదాపు 15,000 వేల సంవత్సరాల కిందట ఇవి ఏర్పడ్డాయని శాస్త్రవేత్తలు తేల్చారు.
సముద్రాల మధ్య దాగిన ఎన్నో సహజమైన అద్భుతాల్లో ‘బ్లూ హోల్స్’ ప్రత్యేకమైనవి. భూ పరిణామ క్రమంలో మారిన వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఇవి ఏర్పడ్డాయి. సముద్రాల మట్టం ఈ స్థాయిలో లేని రోజుల్లో దాదాపు 15,000 వేల సంవత్సరాల కిందట ఇవి ఏర్పడ్డాయని శాస్త్రవేత్తలు తేల్చారు. అంత వరకూ తీరాల్లో లైమ్‌స్టోన్‌తో సాధారణ గుహల్లాగా ఉన్న ప్రాంతాలను సముద్రపు నీరు కప్పేయడంతో బ్లూ హోల్స్ ఏర్పడ్డాయని అంటారు. ‘బ్లూహోల్స్’ పేరుకు తగ్గట్టుగానే అత్యంత గాఢమైన నీలి రంగులో కనిపిస్తాయి. ప్రపంచ వ్యాప్తంగా సముద్రాల మధ్యలో ఎన్నో బ్లూ హోల్స్ ఉన్నాయి. అలాంటి వాటిలో ప్రముఖమైనది ‘గ్రేట్ బ్లూహోల్’.
కరీబియన్ దీవుల్లోని తీరపు నగరం అయిన బిలైజ్ సిటీ నుంచి సముద్రం వైపుగా వంద కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే ఈ గ్రేట్ బ్లూహోల్‌ను చేరుకోవచ్చు. వెయ్యి అడుగుల విస్తీర్ణంతో, 412 అడుగుల లోతుతో ఉంటుందిది. 1971లో ప్రపంచ ప్రసిద్ధ స్కూబాడైవర్, సముద్ర పరిశోధకుడు జాక్వెస్ కౌస్ట్యూ దీని ఉనికిని వెలుగులోకి తీసుకు వచ్చారు. అప్పటి నుంచి ఇది ఒక పర్యాటక ప్రాంతంగా విలసిల్లుతోంది. ఈ బ్లూహోల్ ‘స్కూబా డైవింగ్’కు ఒక అద్భుతమైన చోటుగా గుర్తింపు పొందింది. సముద్ర సాహసాలపై ఆసక్తి ఉన్న ఎంతోమంది ఇక్కడికి వెళుతుంటారు. రంగు రంగు చేపల మధ్య ఈ నీటిలో ఈదడం ఒక అద్భుతమైన అనుభవం అని డైవర్లు అంటారు. 1996లో ‘గ్రేట్ బ్లూ హోల్’ ను యూనెస్కో ప్రపంచ వారసత్వ స్థలాల్లో ఒకటిగా గుర్తించింది.
అబద్ధాన్ని కనిపెట్టడమెలా?
నేరస్తుడు అబద్ధం చెబుతున్నాడని కనిపెట్టడం పోలీసులకు తలకు మించిన పని. అందుకే లై డిటెక్టర్‌ను కనిపెట్టాల్సి వచ్చింది. ఇంతకీ ఇది అబద్ధాలను ఎలా కనిపెడుతుందో తెలుసా?
1921లో కాలిఫోర్నియా యూనివర్శిటీ వైద్య విద్యార్థి జాన్ లాగూన్ లై డిటెక్టర్‌ని కనిపెట్టాడు. అబద్ధం చెప్పేటప్పుడు మనిషి భావోద్వేగానికి లోనవుతాడు. ఆ సమయంలో అతడి శరీరంలో కొన్ని మార్పులు వస్తాయి. వాటిని లై డిటెక్టర్ పసిగట్టేస్తుంది. మొదట న్యూమోగ్రాఫ్ అనే సన్నని గొట్టాన్ని ఛాతి చుట్టూ కడతారు. చేతికి ఓ పట్టీని కడతారు. ఇవి రక్తపోటు, గుండె చప్పుడు, శ్వాసలో హెచ్చుతగ్గులు వంటి వాటి ద్వారా నిందితుడు అబద్ధం చెబుతున్నాడా లేదా అన్నది పసిగట్టి సిగ్నల్ ఇస్తాయి. అదీ సంగతి!
మీథేన్ ముంచేయనుంది...!
పారిశ్రామికీకరణ వంటి చర్యల వల్ల విపరీతంగా ఉత్పత్తి అవుతున్న మీథేన్ అర్కిటిక్ ఖండాన్ని కరిగించేస్తోంది. ‘ది గ్రేట్ అర్కిటిక్ ఎకనమిక్ టైమ్ బాంబ్’ పేరుతో వాతావరణ మార్పులకు అర్కిటిక్ ప్రభావితం అవుతున్న తీరు గురించి పరిశోధకులు లెక్కలు గట్టారు. కార్బన్ డై అక్సైడ్ కన్నా ప్రమాదకరమైనది మీథేన్ గ్యాస్. దీని ప్రభావంతో అర్కిటిక్ ఖండంలోని మంచు కరిగిపోతోంది. దీని వల్ల సముద్రమట్టం అమాంతం పెరిగిపోతోంది. ఫలితంగా తీర ప్రాంతాలు మునిగిపోవడంతో పాటు చాలా దేశాల్లో ప్రకృతి బీభత్సాలు ఏర్పడతాయని అంచనా వేస్తున్నారు. అర్కిటిక్‌తో భౌగోళికమైన, సముద్రపరమైన సంబంధం ఉన్న దేశాల్లో అతివృష్టి, అనావృష్టి పరిస్థితులు విలయకాండ సృష్టిస్తాయట. లక్షల కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరగబోతోందట!