నవ్విన వారిముందే రియల్ హీరో అయ్యాడు! | Hajabba construct Primary school real hero! | Sakshi
Sakshi News home page

నవ్విన వారిముందే రియల్ హీరో అయ్యాడు!

Published Sun, Feb 28 2016 5:13 PM | Last Updated on Thu, Oct 4 2018 6:57 PM

నవ్విన వారిముందే రియల్ హీరో అయ్యాడు! - Sakshi

నవ్విన వారిముందే రియల్ హీరో అయ్యాడు!

ఎవరు విసుక్కున్నా, చిరాకు పడినా నిరాశ పడలేదు హజబ్బా. వెనక్కి  తగ్గలేదు. తాను పొదుపు చేసిన, సేకరించిన డబ్బుతో ఊళ్లో ఒకటిన్నర ఎకరాల స్థలంలో ప్రాథమిక పాఠశాలను నిర్మించాడు.
 
ఆ విదేశీ పర్యాటకులు ఒకటికి రెండు సార్లు అడిగినా హజబ్బా దగ్గర జవాబు లేదు. అతనికి అవమానంగా, బాధగా అనిపించింది. ‘‘నేను చదువుకొని ఉండి ఉంటే ఇలా జరిగేదా?’’ అనుకున్నాడు మనసులో. మంగుళూరు(కర్నాటక)కు పాతిక కిలోమీటర్ల దూరంలో ఉన్న పాప్డు గ్రామంలో కమలాఫలాలు అమ్ముతాడు హజబ్బా. ఒకరోజు ఆ  ఊరికి వచ్చిన  విదేశీ పర్యాటకులు కమలా ఫలాల ధర గురించి హజబ్బాను అడిగారు. వారు దేని గురించి అడుగుతున్నారో హజబ్బాకు అర్థం కాలేదు. కాస్త అవమానంగా కూడా అనిపించింది. ఈలోపు ఎవరో వచ్చి- ‘‘ఈ  పండ్ల ధరల గురించి అడుగు తున్నారు’’ అని చెప్పారు.
 
ఈ సంఘటన హజబ్బాలో చాలా మార్పు తీసుకొచ్చింది. ‘పేదరికం కారణంగా నేను చదువుకోలేకపోయాను. కాస్తో కూస్తో చదువుకొని ఉంటే వాళ్లు మాట్లాడింది అర్థం చేసుకునేవాడిని కదా. నాలాంటి పరిస్థితి పేద పిల్లలెవరికీ రాకూడదు. వారి కోసం ఏదో ఒకటి చేయాలి’ అనుకున్నాడు. దానికోసం... ‘ఎలాగైనా సరే... నా ఊళ్లోని పేద పిల్లల కోసం ఒక బడి కట్టిస్తాను’ అనుకున్నాడు బలంగా.
 ఏ మంచి పనీ అవరోధాలు లేకుండా పూర్తి అవ్వదు అంటారు.

హజబ్బాకి కూడా అలాంటి అవరోధాలే ఎదురయ్యాయి. పేద పిల్లల కోసం స్కూలు కట్టాలన్న అతని ఆలోచన విని కొందరు వెటకారంగా నవ్వారు. కొందరు ‘స్కూలు కట్టడం అంటే అంత తేలికను కున్నావా?’ అని వెనక్కి లాగే ప్రయత్నం చేశారు. హజబ్బా భార్య మైమూన కూడా  తీవ్రంగా వ్యతిరేకించింది. ‘‘ముందు మన ముగ్గురు పిల్లల భవిష్యత్ గురించి ఆలో చించండి’’ అంది. అయితే భర్తలోని పట్టు దల, నిజాయితీ చూసి మనసు మార్చు కుంది.

భర్తకు అండగా నిలబడింది. అయితే ఎవరి అండనూ కోరుకోలేదు హజబ్బా. అతని లక్ష్యం పట్ల అతనికి స్పష్టత ఉంది. అందుకే సాధన మొదలు పెట్టాడు. మొదట స్కూలు కోసం కొంత స్థలాన్ని కొనుగోలు చేశాడు. అయితే స్కూలు కట్టించడానికి తాను పొదుపు చేసిన డబ్బు సరిపోదని అర్థమైంది. దాంతో గడపా గడపా తిరుగుతూ తోచిన సహాయం చేయమని కోరేవాడు. ఈ క్రమంలో అతనికి కొన్ని చేదు అనుభవాలు కూడా ఎదురయ్యాయి.

ఓసారి సహాయం కోసం ఒక సంపన్నుడి ఇంటికి వెళ్తే... ఒక్క పైసా సహాయం చేయకపోగా తన ఇంట్లో ఉన్న కుక్కను హజబ్బా మీదికి వదిలాడు. ఎవరు విసుక్కున్నా, చిరాకు పడినా, అదిలించినా, కోపగించుకున్నా నిరాశ పడలేదు హజబ్బా. తాను పొదుపు చేసిన, సేకరించిన డబ్బుతో  ఊళ్లో ఒకటిన్నర ఎకరాల స్థలంలో ప్రాథమిక పాఠశాలను నిర్మించాడు. ఆ విషయం పదిమంది దృష్టిలో పడింది.

స్థానిక దినపత్రికలో హజబ్బా మీద స్ఫూర్తిదాయక కథనం వచ్చింది. ఒక జాతీయ చానల్ వాళ్లు  ‘రియల్ హీరోస్’ అవార్డును ఇచ్చారు. వాళ్లు ఇచ్చిన అయిదు లక్షల్ని కూడా స్కూలు  కోసమే వెచ్చించాడు హజబ్బా. దీంతో మొదట నవ్విన వాళ్లందరికీ అతడి నిజాయితీ అందరికీ అర్థమైంది.   
 
హజబ్బా నిర్మించిన స్కూలు  ఇప్పుడు సెకెండరీ స్కూల్‌గా మారింది. ‘‘స్కూలు కట్టించడం వరకే నా పని’’ అంటూ ఆ స్కూలును ప్రభుత్వపరం చేశాడు హజబ్బా. స్కూలుకు తన పేరు పెట్టాలనే ప్రతిపాదనను కూడా తిరస్క రించాడు. దాంతో అతడి ఔన్నత్యం మరింత వెలుగులోనికి వచ్చింది. అతడికి అభిమానులు ఏర్పడ్డారు. అరకొర సౌకర్యా లున్న ఇంట్లో నివసిస్తూ అనారోగ్యానికి గురవుతున్న హజబ్బాకు వాళ్లంతా మంచి ఇల్లు కట్టించారు.

తన పేదరికం గురించి ఆలోచించకుండా పేదపిల్లల చదువుల గురించి ఆలోచిస్తున్న హజబ్బాపై జిల్లా, రాష్ర్ట స్థాయిలోనే కాదు జాతీయంగా కూడా  ప్రశంసలు వెల్లువెత్తాయి. అయితే అవేమీ పట్టించుకోడు హజబ్బా. తన పని తాను చేసుకు పోతాడు. ప్రస్తుతం గ్రామంలో ప్రి-యూనివర్శిటీ నిర్మాణ పనుల్లో తలమునకలవుతున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement