నిత్యకృషీవలురు
అపురూపం
అనుకోవడం వేరు... సాధించడం వేరు...
అనుకున్నది సాధించడం తేలికా కాదు... అందరివల్లా కాదు!
రాత్రికి రాత్రి సాధించడం సాధ్యమూ కాదు...
గట్టి పట్టు పట్టాలి. ఒక్కో మెట్టు ఎక్కాలి.
శిఖరాన్ని చేరాలి. చేరిన తర్వాత నిలుపుకోవాలి!
ఇవన్నీ చేసినవారు కె.విశ్వనాథ్, ఇళయరాజా!
ఒకరు దర్శక దిగ్గజం. ఇంకొకరు సంగీత శిఖరం!
కె.విశ్వనాథ్ సౌండ్ రికార్డిస్ట్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. కొన్ని సంవత్సరాల తర్వాత అక్కినేని ప్రోత్సాహంతో దర్శకత్వ శాఖలోకి వచ్చారు. నాటి ప్రముఖ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు దగ్గర కొన్ని చిత్రాలకు పనిచేశారు. అలా ‘మూగమనసులు’ చిత్రానికీ పనిచేశారు. అందులో అక్కినేని, సావిత్రిపై ‘ఈనాటి ఈ బంధమేనాటిదో...’ పాట చిత్రీకరణప్పుడు అక్కినేని పడకుండా ఆయన చేయిని ఒకవైపు దర్శకుడు ఆదుర్తి పట్టుకుంటే... సావిత్రి కొంగు ఎగురుతున్నట్లు కనపడటానికి ఆమె పైటను కె.విశ్వనాథ్ పట్టుకుంటారు. తర్వాత కాలంలో నిర్మాతల కొంగు బంగారమయ్యారు విశ్వనాథ్.
ఇళయరాజాకి చిన్నతనం నుండే సంగీతమంటే ప్రాణం! సంగీత దర్శకుడు కాకముందు కొన్ని సంవత్సరాల పాటు సంగీత కార్యక్రమాలకు, సినిమాలకు కీ-బోర్డ్ ప్లేయర్‌గా పనిచేశారు. అలా ఓ తమిళ సినీసంగీత కార్యక్రమంలో అప్పట్లో టాప్ సింగర్‌గా వెలుగుతున్న పి.సుశీల పాడుతుంటే, యువ ఇళయరాజా కీబోర్డ్ వాయిస్తున్నారు. అలా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి ఉత్తమ సంగీతానికి పర్యాయపదంలా ఎదిగారు లయరాజా ఇళయరాజా!
ఇద్దరూ చిన్నగా మొదలయ్యారు! పెద్దగా ఎదిగారు!
చరిత్ర సృష్టించారు! బతుకును ధన్యం చేసుకున్నారు!
నిర్వహణ: సంజయ్ కిషోర్