హిల్ ఆఫ్ క్రాసెస్! | Hill of Crosses!! | Sakshi
Sakshi News home page

హిల్ ఆఫ్ క్రాసెస్!

Published Sun, Sep 27 2015 1:14 AM | Last Updated on Sun, Sep 3 2017 10:01 AM

హిల్ ఆఫ్ క్రాసెస్!

హిల్ ఆఫ్ క్రాసెస్!

లిథువేనియాలోని అతి పెద్ద నగరాల్లో ఒకటైన సాయవుయైలో ఉంది ‘హిల్ ఆఫ్ క్రాసెస్’. ‘సాయవు’ అంటే లిథువేనియా భాషలో ‘సూర్యుడు’ అని అర్థం. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన ఈ నగరంలో సైకిల్ మ్యూజియం, చాక్లెట్ మ్యూజియం, రేడియో అండ్ టెలివిజన్ మ్యూజియం, క్యాట్ మ్యూజియం, నేషనల్ డాల్స్ మ్యూజియం, రైల్వే మ్యూజియం వంటి ఆకర్షణలు చాలా ఉన్నాయి. అలాగే ఎక్కడ చూసినా అద్భుతమైన శిల్పాలు కనిపిస్తాయి. వీటన్నిటికీ తోడు ‘హిల్ ఆఫ్ క్రాసెస్’ కూడా ఉండటంతో... ప్రముఖ పర్యాటక నగరంగా వెలుగొందుతోంది.
 
ఆ కొండకు దగ్గరవుతున్న కొద్దీ భౌతిక ప్రపంచం నుంచి ఆధ్యాత్మిక తీరాలకు చేరువవుతున్నట్లుగా ఉంటుంది. అభయ హస్తమేదో మనకోసం చేయి చాస్తున్నట్లు ఉంటుంది. ఇక కళాప్రేమికులకైతే అక్కడి దృశ్యాలు సర్రియలిస్ట్‌క్  చిత్రాల్లా కనిపిస్తాయి. ఇన్ని ప్రత్యేకతలు గల ఆ ప్రదేశం... లిథువేనియాలో ఉంది. అదే ‘ద హిల్ ఆఫ్ క్రాసెస్’. ఈ పవిత్రకొండపై ఒక శిలువను నాటి, మనసులోని కోరికను రాసిన చీటీని ఆ శిలువకు తగిలించి, ఓ క్షణం పాటు ప్రార్థిస్తే ఆ కోరిక నెరవేరుతుందట.
     
‘నాన్నను మద్యపానం నుంచి దూరం చెయ్యి ప్రభూ’/‘చాలా కష్టపడి పరీక్షలకు ప్రిపేరవుతున్నాను. నీ ఆశీస్సులు కావాలి తండ్రీ’/‘అమ్మ చనిపోయిన దుఃఖం నుంచి తేరుకోకుండా ఉన్నాను... నా మనసుకు శాంతి కలిగించు దేవా.’
 
‘హిల్ ఆఫ్ క్రాసెస్’పై ఉన్న లక్షలాది శిలువలకు వేళ్లాడే కాగితాలు, కాగితాలుగా మాత్రమే కనిపించవు. ఎన్నో హృదయాల స్పందనలా అనిపిస్తాయి. నిజానికి ఈ కొండ అసలు పేరేమిటి, దీని మీదికి ఇన్ని శిలువలు ఎందుకు వచ్చాయి, వాటిని పాతడం ఎప్పుడు మొదలైంది, ఎవరితో మొదలైంది అన్న విషయాలు ఎవరికీ స్పష్టంగా తెలియవు. కాకపోతే కొన్ని కథనాలు మాత్రం ప్రచారంలో ఉన్నాయి.
 
1831లో రష్యన్లకు వ్యతిరేకంగా పోలిష్, లిథువేనియా  సైన్యాలు పోరా డాయి. యుద్ధంలో చాలామంది లిథు వేనియా సైనికులు మరణించారు. అయితే వారిలో చాలామంది మృతదేహాలు మాయమయ్యాయి. తమవాళ్లను చివరి సారిగానైనా చూసుకోలేకపోవడం ఆత్మీయులను కలచివేసింది. దాంతో మృతుల ఆత్మలకు శాంతి కలిగేందుకు ఏదో ఒకటి చేయాలని అనుకున్నారు. ఈ కొండమీదికి వెళ్లి తమవారికి గుర్తుగా శిలువలను పాతారు. వారి ఆత్మకు శాంతి కలగాలంటూ చీటీల మీద రాసి, శిలువలకు అతికించి, ప్రార్థించి వచ్చారు. అప్పటి నుంచి చనిపోయిన తమవారి ఆత్మకు శాంతి చేకూరేలా శిలువ నాటడం ఆచారంగా మారిందనేది ఒక కథనం.
 
మరో కథనం ప్రకారం... ఒకానొక కాలంలో లిథువేనియాలో ఒక రైతు కూతురు జబ్బు పడి మృత్యువుకు చేరువయిందట. ఎందరు వైద్యులకు చూపించినా ఫలితం లేకపోయింది. ఒక రాత్రి అతడి కలలో తెలుపు దుస్తులు ధరించిన ఒక స్త్రీ ప్రత్యక్షమై... చెక్కతో తయారుచేసిన పెద్ద శిలువను దేశమంతా ఊరేగించి కొండపై నిలిపితే అమ్మాయి కోలుకుంటుందని చెప్పింది. రైతు అలానే చేశాడు. తర్వాత కొద్ది రోజులకే అమ్మాయి కోలుకుందట.

ఇక అప్పటి నుంచి ప్రజలు తమకు సమస్య ఎదురైనప్పుడు, తమ మనసులోని మాటను దైవంతో చెప్పుకో వాలనుకున్నప్పుడు కొండపై శిలువను నాటడం ఆచారంగా మారిపోయిందట.
 మొదలైంది ఎప్పుడైనా ఎలాగైనా కానీ... ప్రస్తుతం ‘హిల్ ఆఫ్ క్రాసెస్’ ఓ ప్రముఖ పర్యాటక ప్రాంతంగా, ఆధ్యాత్మిక కేంద్రంగా మారిపోయింది. 1993లో రెండవ పోప్ జాన్ పాల్ ఈ కొండను దర్శించి, ‘హిల్ ఆఫ్ క్రాసెస్’ గురించి గొప్పగా ప్రసంగించడంతో మరింత ప్రాచుర్యం పొందింది.

ప్రపంచం నలుమూలల నుంచీ లక్షలాది మంది వచ్చి, తమ కష్టాలు తొలగాలని, కోరికలు తీరాలని శిలువలు పాతి ప్రార్థిస్తున్నారు. వీరందరి కోసం కొండ సమీపంలోని చిన్న చిన్న దుకాణాలలో శిలువలు అమ్ముతారు. చీటీలు రాయడానికి పెన్నులు, కాగితాలు కూడా అందుబాటులో ఉంచుతారు. నిజానికి ఇక్కడకు వచ్చేవారిలో కేవలం క్రైస్తవులే కాకుండా అన్ని మతాల వారూ ఉంటారు. భక్తి, నమ్మకం అనేవి ఒక్క మతానికి చెందినవి కావని, సర్వమతాలూ సమానమేనని ‘హిల్ ఆఫ్ క్రాసెస్’కి వచ్చేవారి ద్వారా మరోసారి నిరూపణ అయ్యింది!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement