Tourist city
-
అత్యుత్తమ పర్యాటక నగరాల్లో హైదరాబాద్ ఒకటి
రాంగోపాల్‌పేట్(హైదరాబాద్): దేశంలోనే అత్యు త్తమ పర్యాటక నగరాల్లో హైదరాబాద్ ఒకటని కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. మంగళవారం నెక్లెస్‌రోడ్డులోని సంజీవయ్య పార్కులో కేంద్ర పర్యాటక శాఖ సెంట్రల్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ స్కీమ్‌లో భాగంగా రూ.50 కోట్ల నిధులతో ఏర్పాటు చేసిన లైట్ అండ్ సౌండ్ లేజర్‌షోను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి కిషన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రాడ్ కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ సంస్థ ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేసిందన్నారు. ప్రస్తుత మున్న కోహినూర్ వజ్రపు కథ స్థానంలో మరిన్ని కథలను తీసుకొస్తూ మార్పులు చేసేందుకు రాష్ట్ర పర్యాటక శాఖ చొరవ తీసుకో వాలని కోరారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ టూరిజం అభివృద్ధి చెందితే ఆదా యంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. కోహినూర్ కథను రాజ్యసభ సభ్యుడు, సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ పర్యవేక్షణలో రచయిత కంచి రాయగా, సింగర్ సునీత గాత్రం, వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించారు. ఇక్కడే నిర్మించిన మల్టీ పర్పస్ బాంక్వెట్ హాల్‌ను మంత్రులు ప్రారంభించారు. -
ప్రపంచంలోనే గొప్ప ప్రాంతాల జాబితాలో కేరళ, అహ్మదాబాద్
న్యూయార్క్: భారత్‌లోని రెండు ప్రాంతాలకు అరుదైన గౌరవం దక్కింది. టైమ్ మ్యాగజైన్ విడుదల చేసిన ప్రపంచంలోనే గొప్ప ప్రదేశాలు-2022 జాబితాలో గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరం, కేరళ రాష్ట్రాలకు చోటు దక్కింది. 50 అత్యుత్తమ పర్యటక గమ్యస్థానాల్లో భారత్‌లోని ఈ రెండు ప్రాంతాలు స్థానం సంపాదించాయి. ‘ప్రయాణాల ద్వారా మానవ సంబంధాల విలువ తెలుసుకునేందుకు 2022లో ఎదురైన సవాళ్లు దోహదపడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రజలు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. ప్రస్తుతం రోడ్డు, ఆకాశ మార్గాల్లో ప్రయాణాలు పుంజుకున్నాయి. ఆతిథ్య పరిశ్రమ మళ్లీ ప్రారంభమైంది. యాత్రికులను ఆహ్వానించేందుకు సిద్ధమైంది.’ అని పేర్కొంది టైమ్ మ్యాగజైన్. భారత్‌లోని తొలి యునెస్కో గుర్తింపు పొందిన వారసత్వ నగరం అహ్మదాబాద్‌లో ఎన్నో కలగలిసి ఉన్నాయని పేర్కొంది. 'సంప్రదాయ పర్యాటక ప్రాంతంగా మార్చేందుకు ఇక్కడ పురాతన స్థలాలతో పాటు కొత్త కొత్త ఆవిష్కరణలు ఉన్నాయి. అందులో సబర్మతి నది సమీపంలో 36 ఎకరాలతో ఉన్న గాంధీ ఆశ్రమం నుంచి ప్రపంచంలోనే సుదీర్ఘ నృత్య పండుగ నవరాత్రి ఉత్సవాల వరకు చాలా ఉన్నాయి.' అని పేర్కొంది. అహ్మదాబాద్ అంటే ఒక సైన్స్ సిటీగా పేర్కొంది. మరోవైపు.. భారత్‌లోని ఆగ్నేయ తీర ప్రాంతంలో కేరళ ఒక అందమైన రాష్ట్రంగా అభివర్ణించింది టైమ్. అందమైన బీచ్‌లు, ఆలయాలు, ప్రాంతాలు ఉన్నాయని, దేవతలు నివసించే దేశంగా మారిందని పేర్కొంది. ఈ ఏడాది భారత్‌లో పర్యాటక రంగాన్ని కేరళ మరింత ముందుకు తీసుకెళ్లినట్లు తెలిపింది. ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల జాబితాను సిద్ధం చేయడానికి ఈ సంవత్సరం టైమ్ మ్యాగజైన్ దాని అంతర్జాతీయ నెట్వర్క్ కరస్పాండెంట్లు, కంట్రిబ్యూటర్ల ద్వారా తమ అనుభవాలను అందించే వారి వైపు దృష్టి సారించి స్థలాల నామినేషన్లను స్వీకరించినట్లు పేర్కొంది. జాబితాలోని మరికొన్ని ప్రాంతాలు.. వరల్డ్స్ గ్రేటెస్ట్ ప్రాంతాల్లో యూఏఈలోని రాస్ అల్ ఖైమా, ఉతాహ్‌లోని పార్క్ సిటీ, సియోల్, ఆస్ట్రేలియాలోని గ్రేట్ బారియర్ రీఫ్, ద ఆర్కిటిక్, స్పెయిన్‌లోని వలెన్సియా, భూటాన్‌లోని ట్రాన్స్ భూటాన్ ట్రైల్, అంతర్జాతీయ స్పేస్ స్టేషన్, బోగోటా, జాంబియాలోని లోవర్ జాంబేజి నేషనల్ పార్క్, ఇస్తాన్‌బుల్, కిగాలీ, ర్వాండాలు ఉన్నాయి. ఇదీ చూడండి: అమర్నాథ్ యాత్రికుల బస్సుకు ప్రమాదం.. 15 మంది మృతి! -
200 మంది పర్యాటకుల పరారీ
సాక్షి, న్యూఢిల్లీ : స్విట్జర్లాండ్‌లోని ‘వర్బియర్ స్కై రిసార్ట్’ విదేశీ యాత్రికులను విశేషంగా ఆకర్షించే విలాసవంతమైన విహార కేంద్రం. ఆ కేంద్రానికి ఎక్కువగా బ్రిటీష్ పర్యాటకులే వస్తుంటారు. అందుకని ఆ రిసార్ట్‌కు ‘లిటిల్ లండన్’ అని కూడా పేరు వచ్చింది. బ్రిటన్‌లో ప్రాణాంతక కరోనా వైరస్ నుంచి రూపాంతరం చెందిన కొత్తరకం వైరస్ అక్కడ విజృంభిస్తోందన్న వార్తలు రావడంతో బ్రిటిన్ నుంచి ప్రజల రాకపోకలను డిసెంబర్ 14వ తేదీ నుంచి స్విట్జర్లాండ్ ప్రభుత్వం నిషేధించింది. ముందుగానే విమానాలను బుక్ చేసుకొని అన్ని ఏర్పాట్లు చేసుకొని బయల్దేరిన బ్రిటిష్ ప్రయాణికులు దేశంలో అడుగు పెట్టగానే వారిని పది రోజులపాటు ‘క్వారంటైన్ (స్వీయ నిర్బంధం)’లోకి పంపించాలని నిర్ణయించింది. (ఎంత కాలంలో కరోనా ఖతం...?) అలా స్విట్జర్లాండ్‌కు వచ్చిన 420 మంది బ్రిటన్ ప్రజలను వర్బియర్ స్కై రిసార్ట్‌కు క్వారంటైన్ కోసం అక్కడి స్థానిక ప్రభుత్వాధికారులు పంపించారు. అలా పంపించిన గంటలో దాదాపు 50 మంది తప్పించుకు పారిపోయారు. మిగిలిన 370 మంది బ్రిటీష్ పౌరుల్లో 200 మంది ఆదివారం ఉదయం నాటికి పరారయ్యారు. ఆదివారం మధ్యాహ్నం వరకు వారి గదుల ముందు ఏర్పాటు చేసిన టిఫిన్ క్యారియర్లు అలాగే ఉండిపోవడం, ఫోన్‌కాల్స్‌కు బదులు రాకపోవడంతో బయటి నుంచి తలుపులు తెరవగా గదుల్లో ఎవరూ లేరని హోటల్ సిబ్బంది తెలిపారు. మరో 13 మంది సోమవారం ఉదయం పారిపోయారని ప్రభుత్వ అధికార ప్రతినిధి జీన్ మార్క్ సాండోజ్ మీడియాకు తెలిపారు. వారిలో కొంత మంది ఫ్రాన్స్‌లో కనిపించినట్లు వార్తలు వచ్చాయి. దేశం నుంచి బ్రిటన్‌కు విమాన సర్వీసులను పూర్తిగా నిలిపి వేసిన నేపథ్యంలో వారంతా ఎటు పోయారో అర్థం కావడం లేదని సాండోజ్ వ్యాఖ్యానించారు. బ్రిటన్‌కు విమానాల రాకపోకలను పలు దేశాలతోపాటు ఫ్రాన్స్ కూడా నిలిపివేసిందని, అలాంటప్పుడు కొందరు బ్రిటీష్ పౌరులు అక్కడికి ఎందుకెళ్లారో అర్థం కావడం లేదని ఆయన చెప్పారు. బ్రిటీష్ ప్రయాణికులను చీకట్లో రిసార్ట్‌కు తరలించారని, వారికి క్వారెంటైన్ గురించి ముందుగా తెలియదని, గదుల ముందు అన్న పానీయాలు ఏర్పాటు చేయడం, గదుల నుంచి బయటకు రాకుండా ఆంక్షలు విధించడంతో వారికి అసలు విషయం అర్థమై ఉంటుందని సాండోజ్ అన్నారు. క్రిస్మస్ సెలవుల సందర్భంగా పెద్ద సంఖ్యలో బ్రిటీష్ పర్యాటకులు వర్బియర్ స్కైరిసార్ట్కు వస్తారు. ఆనందంగా గడపాల్సిన సమయంలో నిర్బంధానికి బయపడి వారు పరారీ అయినట్లు తెలుస్తోంది. దట్టమైన మంచు కురుస్తున్న వేళల్లో వారు ఎంత దూరం వెళ్లగలరన్నది ప్రశ్నగా మిగిలింది. -
ఈ 10 దేశాలు, నగరాలు తప్పక చూడాల్సిందే!
న్యూఢిల్లీ: 2020 సంవత్సరంలో ప్రపంచంలో తిరగాల్సిన పది దేశాలు, పది ప్రాంతాలు, పది నగరాల జాబితాను ‘లోన్లీ ప్లానెట్’ పుస్తకం విడుదల చేసింది. తప్పకుండా సందర్శించాల్సిన పది దేశాల్లో మొదటి స్థానం భూటాన్‌కు దక్కగా రెండో స్థానం ఇంగ్లండ్‌కు, మూడోస్థానం మెర్సిడోనియా దక్కింది. అరూబా, ఎస్వాటిని, కోస్టారికా, నెదర్లాండ్స్, లైబీరియా, మొరాకో, ఉరుగ్వే దేశాలు వరుసగా ఆ తర్వాత స్థానాలకు ఆక్రమించాయి. ఆ తర్వాత పర్యటించాల్సిన ప్రాంతాల్లో సెంట్రల్ ఆసియాలోని సిల్క్ రోడ్, ఇటలీలోని లే మార్షే, జపాన్‌లోని తొహొకు, అమెరికాలోని మెయిన్, బఫలో, ఇండోనేసియాలోని టెంగారా, భారత్‌లోని మధ్యప్రదేశ్, హంగేరిలోని బుడాపేస్ట్ తదితరాలు ఉన్నాయి. తప్పక చూడాల్సిన పది నగరాల్లో సాల్ట్‌బర్గ్, వాషింఘ్టన్ డీసీ, కైరో మొదటి స్థానాల్లో ఉన్నాయి. జర్మనీలో బాన్, బొలీవియాలోని లా పాజ్, వాంకోవర్, భారత్‌లోని కోచి, యూఏయీలోని దుబాయ్, కొలరాడోని డెన్వర్ నగరాన్ని ‘లోన్లీ ప్లానెట్’ ఎంపిక చేసింది. కొండలు, గుట్టలు, పచ్చని వాతావరణంతో రమణీయంగా కనిపించే భూటాన్‌ను చూడాల్సిన మొదటి దేశంగా, ‘టైమ్‌లెస్ ట్రెజర్’గా ప్రసిద్ధి చెందిన ఇంగ్లండ్‌లో చారిత్రక కట్టడాలు, చర్చులు చూడ ముచ్చటగా ఉంటాయని పేర్కొంది. అలాగే తాము ఎంపిక చేసిన ఇతర దేశాలు, ప్రాంతాలు, నగరాలు వేటికి ప్రసిద్ధో, వాటిని ఎందుకు చూడాలో ‘లోన్లీ ప్లానెట్’ పుస్తకంలో వివరించింది. -
హిల్ ఆఫ్ క్రాసెస్!
లిథువేనియాలోని అతి పెద్ద నగరాల్లో ఒకటైన సాయవుయైలో ఉంది ‘హిల్ ఆఫ్ క్రాసెస్’. ‘సాయవు’ అంటే లిథువేనియా భాషలో ‘సూర్యుడు’ అని అర్థం. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన ఈ నగరంలో సైకిల్ మ్యూజియం, చాక్లెట్ మ్యూజియం, రేడియో అండ్ టెలివిజన్ మ్యూజియం, క్యాట్ మ్యూజియం, నేషనల్ డాల్స్ మ్యూజియం, రైల్వే మ్యూజియం వంటి ఆకర్షణలు చాలా ఉన్నాయి. అలాగే ఎక్కడ చూసినా అద్భుతమైన శిల్పాలు కనిపిస్తాయి. వీటన్నిటికీ తోడు ‘హిల్ ఆఫ్ క్రాసెస్’ కూడా ఉండటంతో... ప్రముఖ పర్యాటక నగరంగా వెలుగొందుతోంది. ఆ కొండకు దగ్గరవుతున్న కొద్దీ భౌతిక ప్రపంచం నుంచి ఆధ్యాత్మిక తీరాలకు చేరువవుతున్నట్లుగా ఉంటుంది. అభయ హస్తమేదో మనకోసం చేయి చాస్తున్నట్లు ఉంటుంది. ఇక కళాప్రేమికులకైతే అక్కడి దృశ్యాలు సర్రియలిస్ట్క్ చిత్రాల్లా కనిపిస్తాయి. ఇన్ని ప్రత్యేకతలు గల ఆ ప్రదేశం... లిథువేనియాలో ఉంది. అదే ‘ద హిల్ ఆఫ్ క్రాసెస్’. ఈ పవిత్రకొండపై ఒక శిలువను నాటి, మనసులోని కోరికను రాసిన చీటీని ఆ శిలువకు తగిలించి, ఓ క్షణం పాటు ప్రార్థిస్తే ఆ కోరిక నెరవేరుతుందట. ‘నాన్నను మద్యపానం నుంచి దూరం చెయ్యి ప్రభూ’/‘చాలా కష్టపడి పరీక్షలకు ప్రిపేరవుతున్నాను. నీ ఆశీస్సులు కావాలి తండ్రీ’/‘అమ్మ చనిపోయిన దుఃఖం నుంచి తేరుకోకుండా ఉన్నాను... నా మనసుకు శాంతి కలిగించు దేవా.’ ‘హిల్ ఆఫ్ క్రాసెస్’పై ఉన్న లక్షలాది శిలువలకు వేళ్లాడే కాగితాలు, కాగితాలుగా మాత్రమే కనిపించవు. ఎన్నో హృదయాల స్పందనలా అనిపిస్తాయి. నిజానికి ఈ కొండ అసలు పేరేమిటి, దీని మీదికి ఇన్ని శిలువలు ఎందుకు వచ్చాయి, వాటిని పాతడం ఎప్పుడు మొదలైంది, ఎవరితో మొదలైంది అన్న విషయాలు ఎవరికీ స్పష్టంగా తెలియవు. కాకపోతే కొన్ని కథనాలు మాత్రం ప్రచారంలో ఉన్నాయి. 1831లో రష్యన్లకు వ్యతిరేకంగా పోలిష్, లిథువేనియా సైన్యాలు పోరా డాయి. యుద్ధంలో చాలామంది లిథు వేనియా సైనికులు మరణించారు. అయితే వారిలో చాలామంది మృతదేహాలు మాయమయ్యాయి. తమవాళ్లను చివరి సారిగానైనా చూసుకోలేకపోవడం ఆత్మీయులను కలచివేసింది. దాంతో మృతుల ఆత్మలకు శాంతి కలిగేందుకు ఏదో ఒకటి చేయాలని అనుకున్నారు. ఈ కొండమీదికి వెళ్లి తమవారికి గుర్తుగా శిలువలను పాతారు. వారి ఆత్మకు శాంతి కలగాలంటూ చీటీల మీద రాసి, శిలువలకు అతికించి, ప్రార్థించి వచ్చారు. అప్పటి నుంచి చనిపోయిన తమవారి ఆత్మకు శాంతి చేకూరేలా శిలువ నాటడం ఆచారంగా మారిందనేది ఒక కథనం. మరో కథనం ప్రకారం... ఒకానొక కాలంలో లిథువేనియాలో ఒక రైతు కూతురు జబ్బు పడి మృత్యువుకు చేరువయిందట. ఎందరు వైద్యులకు చూపించినా ఫలితం లేకపోయింది. ఒక రాత్రి అతడి కలలో తెలుపు దుస్తులు ధరించిన ఒక స్త్రీ ప్రత్యక్షమై... చెక్కతో తయారుచేసిన పెద్ద శిలువను దేశమంతా ఊరేగించి కొండపై నిలిపితే అమ్మాయి కోలుకుంటుందని చెప్పింది. రైతు అలానే చేశాడు. తర్వాత కొద్ది రోజులకే అమ్మాయి కోలుకుందట. ఇక అప్పటి నుంచి ప్రజలు తమకు సమస్య ఎదురైనప్పుడు, తమ మనసులోని మాటను దైవంతో చెప్పుకో వాలనుకున్నప్పుడు కొండపై శిలువను నాటడం ఆచారంగా మారిపోయిందట. మొదలైంది ఎప్పుడైనా ఎలాగైనా కానీ... ప్రస్తుతం ‘హిల్ ఆఫ్ క్రాసెస్’ ఓ ప్రముఖ పర్యాటక ప్రాంతంగా, ఆధ్యాత్మిక కేంద్రంగా మారిపోయింది. 1993లో రెండవ పోప్ జాన్ పాల్ ఈ కొండను దర్శించి, ‘హిల్ ఆఫ్ క్రాసెస్’ గురించి గొప్పగా ప్రసంగించడంతో మరింత ప్రాచుర్యం పొందింది. ప్రపంచం నలుమూలల నుంచీ లక్షలాది మంది వచ్చి, తమ కష్టాలు తొలగాలని, కోరికలు తీరాలని శిలువలు పాతి ప్రార్థిస్తున్నారు. వీరందరి కోసం కొండ సమీపంలోని చిన్న చిన్న దుకాణాలలో శిలువలు అమ్ముతారు. చీటీలు రాయడానికి పెన్నులు, కాగితాలు కూడా అందుబాటులో ఉంచుతారు. నిజానికి ఇక్కడకు వచ్చేవారిలో కేవలం క్రైస్తవులే కాకుండా అన్ని మతాల వారూ ఉంటారు. భక్తి, నమ్మకం అనేవి ఒక్క మతానికి చెందినవి కావని, సర్వమతాలూ సమానమేనని ‘హిల్ ఆఫ్ క్రాసెస్’కి వచ్చేవారి ద్వారా మరోసారి నిరూపణ అయ్యింది!