న్యూయార్క్: భారత్‌లోని రెండు ప్రాంతాలకు అరుదైన గౌరవం దక్కింది. టైమ్ మ్యాగజైన్ విడుదల చేసిన ప్రపంచంలోనే గొప్ప ప్రదేశాలు-2022 జాబితాలో గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరం, కేరళ రాష్ట్రాలకు చోటు దక్కింది. 50 అత్యుత్తమ పర్యటక గమ్యస్థానాల‍్లో భారత్‌లోని ఈ రెండు ప్రాంతాలు స్థానం సంపాదించాయి.
‘ప్రయాణాల ద్వారా మానవ సంబంధాల విలువ తెలుసుకునేందుకు 2022లో ఎదురైన సవాళ్లు దోహదపడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రజలు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. ప్రస్తుతం రోడ్డు, ఆకాశ మార్గాల్లో ప్రయాణాలు పుంజుకున్నాయి. ఆతిథ్య పరిశ్రమ మళ్లీ ప్రారంభమైంది. యాత్రికులను ఆహ్వానించేందుకు సిద్ధమైంది.’ అని పేర్కొంది టైమ్ మ్యాగజైన్. భారత్‌లోని తొలి యునెస్కో గుర్తింపు పొందిన వారసత్వ నగరం అహ్మదాబాద్‌లో ఎన్నో కలగలిసి ఉన్నాయని పేర్కొంది. 'సంప్రదాయ పర్యాటక ప్రాంతంగా మార్చేందుకు ఇక్కడ పురాతన స్థలాలతో పాటు కొత్త కొత్త ఆవిష్కరణలు ఉన్నాయి. అందులో సబర్మతి నది సమీపంలో 36 ఎకరాలతో ఉన్న గాంధీ ఆశ్రమం నుంచి ప్రపంచంలోనే సుదీర్ఘ నృత్య పండుగ నవరాత్రి ఉత్సవాల వరకు చాలా ఉన్నాయి.' అని పేర్కొంది. అహ్మదాబాద్ అంటే ఒక సైన్స్ సిటీగా పేర్కొంది.
మరోవైపు.. భారత్‌లోని ఆగ్నేయ తీర ప్రాంతంలో కేరళ ఒక అందమైన రాష్ట్రంగా అభివర్ణించింది టైమ్. అందమైన బీచ్‌లు, ఆలయాలు, ప్రాంతాలు ఉన్నాయని, దేవతలు నివసించే దేశంగా మారిందని పేర్కొంది. ఈ ఏడాది భారత్‌లో పర్యాటక రంగాన్ని కేరళ మరింత ముందుకు తీసుకెళ్లినట్లు తెలిపింది. ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల జాబితాను సిద్ధం చేయడానికి ఈ సంవత్సరం టైమ్ మ్యాగజైన్ దాని అంతర్జాతీయ నెట్‌వర్క్ కరస్పాండెంట్లు, కంట్రిబ్యూటర్ల ద్వారా తమ అనుభవాలను అందించే వారి వైపు దృష్టి సారించి స్థలాల నామినేషన్లను స్వీకరించినట్లు పేర్కొంది.
జాబితాలోని మరికొన్ని ప్రాంతాలు..
వరల్డ్స్ గ్రేటెస్ట్ ప్రాంతాల్లో యూఏఈలోని రాస్ అల్ ఖైమా, ఉతాహ్‌లోని పార్క్ సిటీ, సియోల్, ఆస్ట్రేలియాలోని గ్రేట్ బారియర్ రీఫ్, ద ఆర్కిటిక్, స్పెయిన్‌లోని వలెన్సియా, భూటాన్‌లోని ట్రాన్స్ భూటాన్ ట్రైల్, అంతర్జాతీయ స్పేస్ స్టేషన్, బోగోటా, జాంబియాలోని లోవర్ జాంబేజి నేషనల్ పార్క్, ఇస్తాన్‌బుల్, కిగాలీ, ర్వాండాలు ఉన్నాయి.
ఇదీ చూడండి: అమర్‌నాథ్ యాత్రికుల బస్సుకు ప్రమాదం.. 15 మంది మృతి!
Comments
Please login to add a commentAdd a comment