మ్యాగజైన్ పై మోడల్ గిలు జోసెఫ్
తిరువనంతపురం : బహిరంగంగా పసిబిడ్డకు పాలిస్తే తప్పేంటని అమ్మలకు బాసటగా నిలుస్తూ ప్రముఖ మలయాళ మ్యాగజైన్ ‘గృహలక్ష్మీ’ ప్రత్యేక సంచికను విడుదల చేసింది. ఈ మ్యాగజైన్‌పై సోషల్ మీడియాలో ఓ వైపు ప్రశంసల జల్లు కురుస్తుండగా మరోవైపు కొన్ని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
మ్యాగజైన్ కవర్ పేజీపై మలయాళీ మోడల్ గిలు జోసెఫ్ పాలిస్తున్న ఫొటోను ప్రచురించారు. ఈ ఫొటోపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేయడంతో వివాదం నెలకొంది. ఉద్దేశం మంచిదైనా పెళ్లికాని జోసెఫ్ ఫొటోను ముద్రించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కవర్ పేజీపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వినోద్ మాథ్యూ అనే కేరళ న్యాయవాది మహిళల అసభ్య ప్రాతినిధ్య (నిషేధం) చట్టం, 1986 కింద మ్యాగజైన్ పబ్లిషర్, మోడల్ జోసెఫ్‌లపై ఫిర్యాదు చేశారు.
మోడల్ జోసెఫ్ పాలిస్తున్న కవర్‌పేజీపై ‘మేం పాలిస్తున్నాం.. తదేకంగా చూడకండి.. అని తల్లులు కేరళకు చెబుతున్నారు’ అనే క్యాఫ్షన్‌తో సదరు పబ్లిషర్ మ్యాగజైన్‌ను గురువారం విడుదల చేశారు. తల్లులు బహిరంగంగా శిశువులకు పాలు ఇవ్వడంలో తప్పులేదన్న అవగాహన కల్పించడమే తమ లక్ష్యమని మ్యాగజైన్ ఎడిటర్ పేర్కొన్నారు.
సిగ్గుపడాల్సిన అవసరం లేదు..
‘గృహలక్ష్మీ మ్యాగజైన్ ఓపెన్ బ్రెస్ట్‌ఫీడింగ్ ప్రచారంలో భాగస్వామినని గిలు జోసెఫ్ తెలిపారు. సమాజం తల్లులకు బహిరంగంగా పాలిచ్చే సౌకర్యం కల్పించడంలేదన్నారు. ఈ విషయంలో తల్లులు భయపడాల్సిన, సిగ్గుపడాల్సినవసరం లేదని జోసెఫ్ పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment