కొజికోడ్: 14 ఏళ్ల వ్యవధిలో ఒకే కుటుంబంలోని ఆరుగురు వ్యక్తుల అనుమానాస్పదంగా మృతి చెందడంపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు కేరళలోని కొజికోట్ గ్రామీణ ఎస్పీ కేజీ సైమన్ శనివారం వెల్లడించారు. వారందరు సైనైడ్ అనే విష ప్రయోగం కారణంగానే చనిపోయినట్లు తేలిందన్నారు. 2011లో చనిపోయిన రాయ్ థామస్ భార్య జూలీని ప్రధాన అనుమానితురాలిగా భావించి అరెస్ట్ చేశామన్నారు. ఆమెతో పాటు ఆమె స్నేహితుడైన ఎంఎస్ మాథ్యూని, వారికి సైనైడ్ సరఫరా చేసిన ప్రాజి కుమార్‌లను కూడా అదుపులోకి తీసుకున్నామన్నారు.
ఆస్తి కోసమే జూలీ ఈ హత్యలు చేసినట్లు భావిస్తున్నామన్నారు. వారి ఆహారంలో సైనైడ్‌ను కలపడం ద్వారా ఈ హత్యలు చేసినట్లు భావిస్తున్నామన్నారు. అమెరికాలో ఉండే థామస్ రాయ్ సోదరుడు తమకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు ప్రారంభించాన్నారు. ఇంటి పెద్ద అయిన అన్నమ్మ థామస్ 2002లో చనిపోయారు. ఆరేళ్ల తరువాత 2008లో ఆమె భర్త టామ్ థామస్ చనిపోయారు. 2011లో వారి కుమారుడు, జూలీ భర్త రాయ్ థామస్ మరణించాడు. అన్నమ్మ సోదరుడు మేథ్యూ 2014లో, వారి బంధువు సిలీ, ఆమె ఏడాది వయస్సున్న కుమార్తె 2016లో ప్రాణాలు కోల్పోయారు. రాయ్ థామస్ మరణించిన తరువాత సిలీ భర్తను జూలీ పెళ్లి చేసుకుంది.
ఆస్తి వ్యవహారాలు చూసే అన్నమ్మను ఆస్తిపై హక్కు కోసం చంపేశారని, ఆస్తిలో మరింత వాటా కోసం అన్నమ్మ భర్త టామ్‌ను, భర్తతో విబేధాలు రావడంతో రాయ్ థామస్‌ను, రాయ్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ చేయాలని ఒత్తిడి చేసినందువల్ల అన్నమ్మ సోదరుడు మేథ్యూని, సిలీ భర్తను పెళ్లి చేసుకోవడంకోసం సిలీతో పాటు ఆమె కూతురుని జూలీ హతమార్చినట్లు తెలుస్తోందని వివరించారు. అనుమానస్పద మరణాలు కావడంతో వారి మృతదేహాల నుంచి డీఎన్‌ఏ శ్యాంపిల్స్‌ను వెలికి తీసి ఫొరెన్సిక్ లాబ్‌కు పంపించామన్నారు. ఈ అన్ని మృతదేహాల్లోనూ విషపూరిత సైనైడ్ ఆనవాళ్లు ఉన్నాయని సైమన్ తెలిపారు. రాయ్ థామస్ సైనైడ్ వల్ల చనిపోగా, జూలీ మాత్రం తన భర్త గుండెపోటుతో చనిపోయాడని చెప్పారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment