సాక్షి, న్యూఢిల్లీ : స్విట్జర్లాండ్‌లోని ‘వర్బియర్ స్కై రిసార్ట్’ విదేశీ యాత్రికులను విశేషంగా ఆకర్షించే విలాసవంతమైన విహార కేంద్రం. ఆ కేంద్రానికి ఎక్కువగా బ్రిటీష్ పర్యాటకులే వస్తుంటారు. అందుకని ఆ రిసార్ట్‌కు ‘లిటిల్ లండన్’ అని కూడా పేరు వచ్చింది. బ్రిటన్‌లో ప్రాణాంతక కరోనా వైరస్ నుంచి రూపాంతరం చెందిన కొత్తరకం వైరస్ అక్కడ విజృంభిస్తోందన్న వార్తలు రావడంతో బ్రిటిన్ నుంచి ప్రజల రాకపోకలను డిసెంబర్ 14వ తేదీ నుంచి స్విట్జర్లాండ్ ప్రభుత్వం నిషేధించింది. ముందుగానే విమానాలను బుక్ చేసుకొని అన్ని ఏర్పాట్లు చేసుకొని బయల్దేరిన బ్రిటిష్ ప్రయాణికులు దేశంలో అడుగు పెట్టగానే వారిని పది రోజులపాటు ‘క్వారంటైన్ (స్వీయ నిర్బంధం)’లోకి పంపించాలని నిర్ణయించింది. (ఎంత కాలంలో కరోనా ఖతం...?)
అలా స్విట్జర్లాండ్‌కు వచ్చిన 420 మంది బ్రిటన్ ప్రజలను వర్బియర్ స్కై రిసార్ట్‌కు క్వారంటైన్ కోసం అక్కడి స్థానిక ప్రభుత్వాధికారులు పంపించారు. అలా పంపించిన గంటలో దాదాపు 50 మంది తప్పించుకు పారిపోయారు. మిగిలిన 370 మంది బ్రిటీష్ పౌరుల్లో 200 మంది ఆదివారం ఉదయం నాటికి పరారయ్యారు. ఆదివారం మధ్యాహ్నం వరకు వారి గదుల ముందు ఏర్పాటు చేసిన టిఫిన్ క్యారియర్లు అలాగే ఉండిపోవడం, ఫోన్‌కాల్స్‌కు బదులు రాకపోవడంతో బయటి నుంచి తలుపులు తెరవగా గదుల్లో ఎవరూ లేరని హోటల్ సిబ్బంది తెలిపారు. మరో 13 మంది సోమవారం ఉదయం పారిపోయారని ప్రభుత్వ అధికార ప్రతినిధి జీన్ మార్క్ సాండోజ్ మీడియాకు తెలిపారు. వారిలో కొంత మంది ఫ్రాన్స్‌లో కనిపించినట్లు వార్తలు వచ్చాయి. దేశం నుంచి బ్రిటన్‌కు విమాన సర్వీసులను పూర్తిగా నిలిపి వేసిన నేపథ్యంలో వారంతా ఎటు పోయారో అర్థం కావడం లేదని సాండోజ్ వ్యాఖ్యానించారు. బ్రిటన్‌కు విమానాల రాకపోకలను పలు దేశాలతోపాటు ఫ్రాన్స్ కూడా నిలిపివేసిందని, అలాంటప్పుడు కొందరు బ్రిటీష్ పౌరులు అక్కడికి ఎందుకెళ్లారో అర్థం కావడం లేదని ఆయన చెప్పారు.
బ్రిటీష్ ప్రయాణికులను చీకట్లో రిసార్ట్‌కు తరలించారని, వారికి క్వారెంటైన్ గురించి ముందుగా తెలియదని, గదుల ముందు అన్న పానీయాలు ఏర్పాటు చేయడం, గదుల నుంచి బయటకు రాకుండా ఆంక్షలు విధించడంతో వారికి అసలు విషయం అర్థమై ఉంటుందని సాండోజ్ అన్నారు. క్రిస్మస్ సెలవుల సందర్భంగా పెద్ద సంఖ్యలో బ్రిటీష్ పర్యాటకులు వర్బియర్ స్కైరిసార్ట్‌కు వస్తారు. ఆనందంగా గడపాల్సిన సమయంలో నిర్బంధానికి బయపడి వారు పరారీ అయినట్లు తెలుస్తోంది. దట్టమైన మంచు కురుస్తున్న వేళల్లో వారు ఎంత దూరం వెళ్లగలరన్నది ప్రశ్నగా మిగిలింది.
Comments
Please login to add a commentAdd a comment