రాజావారి శునక వైభోగం
జీవితంలో గడ్డు దినాలు ఎదురైనప్పుడు కొందరు ‘బొత్తిగా కుక్క బతుకైపోయింది’ అని వాపోతుంటారు. కాలం కలసి రావాలే గానీ, కుక్కలకు కూడా మహారాజ యోగం పడుతుందనే సంగతి వాళ్లకు తెలియదు పాపం. రాజు తలచుకోవాలే గానీ, శునకాలకు రాచమర్యాదలు కరువవుతాయా? గుజరాత్‌లోని జునాగఢ్ సంస్థానం లో ఏకంగా ఎనిమిది వందల గ్రామసింహాలు అనుభవించిన వైభోగం బహుశా మృగరాజులు, గజరాజులు కూడా అనుభవించి ఉండవు.
బ్రిటిష్ కాలంలో జునాగఢ్ సంస్థానాన్ని పరిపాలించిన మహమ్మద్ మహెబత్‌ఖాన్ రసూల్‌ఖాన్ నవాబుగారికి శునకాలంటే వల్లమాలిన ప్రీతి. నిజానికి ఆయన మనుషుల కంటే కుక్కలనే ఎక్కువగా ప్రేమించేవారని కూడా చెప్పుకొనేవారు. మహెబత్ ఖాన్ రసూల్‌ఖాన్ వారి సంస్థానంలో ఏకంగా ఎనిమిదివందల జాగిలాలు ఉండేవి. ప్రతి జాగిలానికీ సకల సౌకర్యాలతో కూడిన ఒక ప్రత్యేకమైన గది ఉండేది. ప్రతి గదిలోనూ టెలిఫోన్ ఉండేది. అలాగే, ఒక్కో జాగిలానికి ఒక్కో సేవకుడు ఉండేవాడు.
జాగిలాలకు ఏమాత్రం అస్వస్థత చేసినా అత్యున్నత స్థాయి బ్రిటిష్ పశువైద్యులను రప్పించి మరీ చికిత్సలు చేయించేవారు. సంస్థానంలో ఇన్ని శునకాలు ఉన్నా, నవాబుగారికి రోషనార అనే ఆడ జాగిలంపై ప్రత్యేకాభిమానం ఉండేది. నవాబుగారి అభిమాన జాగిలమైన రోషనార ఒకనాడు బాబీ అనే మగ శునకంతో జతకట్టింది. ఇక నవాబుగారి ఆనందానికి హద్దే లేకుండాపోయింది. రోషనారకు, బాబీకి ఘనంగా రాజలాంఛనాలతో వివాహం జరిపించారు. దర్బారు హాలులో వెండి వేదికను ఏర్పాటు చేశారు. వధువు జాగిలానికీ, వరుడు జాగిలానికీ స్వర్ణాభరణాలను అలంకరించారు. మేళతాళాలను మోగించారు.
అంగరంగ వైభవంగా ఏర్పాటు చేసిన ఆ వివాహానికి దేశంలోని సమస్త సంస్థానాధీశులకు మాత్రమే కాదు, అప్పటి బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ దొరవారిని కూడా ఆహ్వానించారు. పాపం... ఈ మహత్తర ఘట్టాన్ని తిలకించే ప్రాప్తం లేకపోవడం వల్ల ఇర్విన్ దొరవారు ‘అనివార్య’ కారణాల వల్ల ఈ వివాహానికి హాజరు కాలేకపోతున్నట్లు వర్తమానం పంపారు. ఘనత వహించిన మహెబత్‌ఖాన్ రసూల్‌ఖాన్ నవాబుగారు ఈ శునక కళ్యాణ మహోత్సవానికి ఆ రోజుల్లోనే రూ.20 లక్షల వరకు ఖర్చు చేశారు. ఇంతచేసిన ఈ వీర శునక ప్రేమికుడు తర్వాతి కాలంలో ర్యాబిస్‌తో కన్నుమూయడమే విషాదం.