మహిళలపై రాజకీయ దౌర్జన్యాలు | hooliganism on woaman in Telugu Desam Party | Sakshi
Sakshi News home page

మహిళలపై రాజకీయ దౌర్జన్యాలు

Published Sat, Mar 4 2017 11:45 PM | Last Updated on Fri, Aug 10 2018 9:46 PM

మహిళలపై రాజకీయ దౌర్జన్యాలు - Sakshi

మహిళలపై రాజకీయ దౌర్జన్యాలు

మహిళలను కించపరచే వ్యాఖ్యలతో రాజకీయ నాయకులు నోరు పారేసుకుంటున్న సందర్భాలు మాత్రమే కాదు, వారిపై యథేచ్ఛగా దౌర్జన్యకాండ సాగిస్తున్న సందర్భాలు కూడా ఉంటున్నాయి. అధికార బలం, రాజకీయ ప్రాబల్యం గల కొందరు నాయకులు మహిళలపై భౌతిక దాడులకు సైతం తెగబడుతున్నారు. మహిళా అధికారులు కూడా ఇలాంటి దాడులకు గురవుతున్నారంటే సాధారణ మహిళల పరిస్థితి ఎలా ఉంటోందో అర్థం చేసుకోవాల్సిందే. మహిళలపై రాజకీయ దౌర్జన్యాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్న కొన్ని సంఘటనలు...

మహిళా తహశీల్దారుపై దాడి
కృష్ణా జిల్లాలో తహశీల్దారు దోనవల్లి వనజాక్షిపై ఇసుక మాఫియా దాడికి తెగబడిన సంఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన 2015 జూలైలో జరిగింది. నూజివీడు నియోజకవర్గం పరిధిలోని ముసునూరు మండలం రంగంపేట వద్ద తమ్మిలేరులోని ఇసుకను ప్రభుత్వ చీఫ్‌ విప్‌ చింతమనేని ప్రభాకర్‌ అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో ముసునూరు తహశీల్దార్‌ అక్కడకు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ మరియన్నను పంపారు. చింతమనేని మనుషులు తనను నిర్బంధించడంతో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ ఈ విషయాన్ని తహశీల్దారుకు, పోలీసులకు ఫోన్‌లో తెలిపారు. తొలుత పోలీసులు అక్కడకు చేరుకున్నారు. రికార్డులు చూపమని పోలీసుల సమక్షంలోనే ఆర్‌ఐని చింతమనేని నిలదీశారు. తన వద్ద సరిహద్దుల రికార్డులు లేకపోవడంతో ఆయన మిన్నకుండిపోయారు. దాంతో ఇసుక రవాణాను మళ్లీ కొనసాగించారు.

విషయం తెలిసిన తహశీల్దారు అక్కడకు చేరుకుని ఇసుక రవాణాను ఆపాలని ఆదేశించారు. వారు వినకపోవడంతో ఆమె ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లకు అడ్డంగా కూర్చున్నారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ తదితరులకు ఫోన్‌ ద్వారా విషయాన్ని వివరించారు. ఈలోగా అక్కడకు చేరుకున్న చింతమనేని తహశీల్దారును, రెవెన్యూ సిబ్బందిని తొలగించాలంటూ వారిపైకి తన అనుచరులను ఉసిగొల్పారు. దీంతో డ్వాక్రా మహిళలు మూకుమ్మడిగా తహశీల్దారుపై పడి, చేతులు పట్టుకుని ఈడ్చుకుంటూ పక్కకు లాగేసి, ఆమెపై దాడి చేశారు. ఈ సంఘటనపై ముసునూరు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత సంఘటనా స్థలం పశ్చిమగోదావరి జిల్లా పరిధిలోనిదని నిర్ధారించడంతో కేసును పశ్చిమగోదావరి జిల్లా పెదపాడు పోలీస్‌ స్టేషన్‌కు బదలాయించారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు, స్వయంగా వనజాక్షితో మాట్లాడి వివాదాన్ని ముగించారు.

లావణ్యను పొట్టన పెట్టుకున్నారు
విశాఖపట్నం జిల్లా గాజువాక మండలంలోని వడ్లపూడి ప్రాంతానికి చెందిన లావణ్యను పోకిరీలు పొట్టన పెట్టుకున్నారు. భర్త మాటూరు అప్పలరాజు, ఆయన చెల్లెలు దివ్యలతో కలసి లావణ్య అనకాపల్లి నూకాంబిక ఆలయానికి వెళ్లింది. దర్శనం తర్వాత ఆలయ ప్రాంగణంలోనే వారు భోజనాలు చేశారు. ఆ సమయంలో అక్కడ తప్పతాగి ఉన్న కొందరు పోకిరీలు లావణ్య, దివ్యలతో అసభ్యంగా ప్రవర్తించారు. మహిళలను వేధించడం తగదంటూ అప్పలరాజు వారికి హితబోధ చేశారు. దీనిని మనసులో పెట్టుకున్న వారు తిరుగు ప్రయాణంలో అప్పలరాజు వాహనాన్ని కారులో వెంబడించారు. సాలాపువాని ప్రాంతం వద్దకు వచ్చే సరికి కారుతో ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్నారు. గత ఏడాది మే నెలలో జరిగిన ఈ సంఘటనలో లావణ్య అక్కడికక్కడే మృతి చెందగా, దివ్య తీవ్ర గాయాలపాలైంది. తల్లి మరణంతో పిల్లలు శశాంక్‌ (4), విశాల్‌ (1) అనాథలుగా మిగిలారు. కారు నడిపిన వ్యక్తిని దాడి హేమకుమార్‌గా గుర్తించారు. ఇది ప్రమాదం కాదని, ఉద్దేశపూర్వకంగా జరిగిన హత్యేనన్నది లావణ్య కుటుంబ సభ్యుల ఆరోపణ.

‘అనంత’ అరాచకాలు
అనంతపురం జిల్లాలో మహిళలపై అధికార పార్టీ నేతలు, కార్యకర్తల అరాచకాలు హద్దూ అదుపూ లేకుండా సాగుతున్నాయి. ఉరవకొండ నియోజకవర్గంలోని కూడేరు మండలం జల్లిపల్లిలో ఇటీవల సుధమ్మ అనే మహిళపై సర్పంచ్‌ నాగరాజు, జన్మభూమి కమిటీ సభ్యుడు చంద్ర అత్యంత పాశవికంగా దాడి చేశారు. ఈ సంఘటనను ‘సాక్షి’ వెలుగులోకి తేవడంతో రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేగింది. తన ఇంటి ఎదుట నీటి ట్యాంకు నిర్మాణానికి అభ్యంతరం చెప్పిందనే కోపంతో సర్పంచ్‌ నాగరాజు ఈ దారుణానికి తెగబడ్డారు. ఈ సంఘటనపై ప్రజా సంఘాల నుంచి కూడా నిరసనలు వెల్లువెత్తడంతో పోలీసులు నాగరాజుపై రౌడీషీట్‌ తెరిచారు. ఇది జరిగిన రెండు రోజులకే పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలం ఎల్జీబీ నగర్‌లో తోట పని చేసుకుంటున్న ఒక మహిళపై టీడీపీ కార్యకర్త వెంకటేశ్‌ అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. కళ్యాణదుర్గం నియోజకవర్గం కంబదూరు మండలం పాళ్లూరులో గిరిజన మహిళ వన్నూరమ్మ, ఆమె కుటుంబ సభ్యులపై టీడీపీ నేత నాగరాజు దాడి చేశారు.

గోదావరి ప్రాంతంలో మహిళల గోడు
అక్కా చెల్లెళ్లయిన శ్రీగౌతమి, పావని స్కూటీపై పాలకొల్లు నుంచి నర్సాపురం వెళుతుండగా కొందరు దుండగులు వారిని వెంటాడి, వేధించి కారుతో ఢీకొన్నారు. శ్రీగౌతమి అక్కడికక్కడే మృతి చెందింది. గాయాలపాలైన పావని జరిగిన సంఘటన ప్రమాదం కాదని తన అక్కను కుట్రపూరితంగా హత్య చేశారని ఆరోపించింది. నర్సాపురానికి చెందిన తెలుగుదేశం నేత సజ్జా బుజ్జి తన అక్కను రహస్యంగా రెండో పెళ్లి చేసుకున్నాడని, ఆయన భార్య తన అక్కను చంపించిందని ఆరోపించింది. తెలుగుదేశం ఎమ్మెల్యేలు బుజ్జికి అండగా నిలవడంతో పోలీసులు ఈ కేసును ప్రమాదంగా మూసేశారు.

భీమవరం మండలం తుందుర్రు గ్రామంలో నిర్మిస్తున్న గోదావరి మెగా అక్వా ఫుడ్‌పార్కుకు వ్యతిరేకంగా ఉద్యమించిన పాపానికి ఆరేటి సత్యవతి అనే మహిళపై హత్యాయత్నం కేసు బనాయించారు. ఆమెతో పాటు ఆమె కుమారుడిని కూడా ఈ కేసులో అరెస్టు చేసి, దాదాపు 40 రోజులు జైలులో పెట్టారు. సత్యవతి భర్త కేన్సర్‌తో బాధపడుతున్నాడని తెలిసినా, ఆమెకు బెయిల్‌ దొరక్కుండా అడ్డుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నించింది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహనరెడ్డి తణుకు జైలుకు వెళ్లి సత్యవతిని పరామర్శించారు. ప్రస్తుతం బెయిల్‌పై బయటకు వచ్చిన సత్యవతి భయపడకుండా ఉద్యమంలో పాల్గొంటున్నారు.

ఎంపీ కుమార్తెకే రక్షణ కరువు
చిత్తూరు జిల్లాలో సాక్షాత్తు అధికార పార్టీ ఎంపీ కుమార్తెకే రక్షణ కరువైన సంఘటన జరిగింది. మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి బంధువు ఒకరు చిత్తూరు ఎంపీ శివప్రసాద్‌ కుమార్తె డాక్టర్‌ మాధవీలత కారు డ్రైవర్‌ను కొట్టి, ఆమెపై అమానుషంగా ప్రవర్తించారు. పోలీసులు బొజ్జల బంధువుకు అన్ని విధాలా సాయం చేశారు. ఎంపీ కూతురినైన తనకు అవమానం జరిగిందని, పోలీసుల నుంచి గాని, ప్రభుత్వం నుంచి గాని తనకు రక్షణ కరువైందని డాక్టర్‌ మాధవీలత రోడ్డుపైనే విలపించారు.

బాసటగా నిలిచేవారూ ఉన్నారు...
కొందరు ప్రముఖులు అక్కడక్కడా మహిళలను కించపరచే వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నా, మహిళలకు బాసటగా నిలిచేవారూ లేకపోలేదు. మహిళలపై నోటి దురుసుతనాన్ని చాటుకుంటున్న వారిలో ఎక్కువమంది శాసన, అధికార యంత్రాంగాలలో ఉంటుంటే, మహిళలకు బాసటగా గళం వినిపిస్తున్న వారు ఇతరేతర రంగాలలో కొనసాగుతున్నారు. మహిళలను కించపరుస్తూ రాజకీయ, అధికార ప్రముఖులు చేస్తున్న వ్యాఖ్యలను ఖండిస్తూ సామాజిక మాధ్యమాల ద్వారా గళం వినిపిస్తున్నారు. మహిళలకు అండగా, వారి పట్ల జరుగుతున్న అన్యాయాలకు, అఘాయిత్యాలకు వ్యతిరేకంగా కొందరు ప్రముఖులు చేసిన వ్యాఖ్యలు...

‘మహిళలపై నేరాలు జరుగుతున్న ప్పుడు సంఘంలోని పెద్దలు, రాజకీయ నేతలు, మంత్రులు... నేరం చేసిన వాళ్లను వదిలేసి బాధితులనే తప్పుపట్టడం కంటే అసహ్యకరమైనది మరొకటి ఉండదు’
– షబనా అజ్మీ, బాలీవుడ్‌ నటి, రాజ్యసభ మాజీ ఎంపీ

‘కళ్ల ముందే అనాగరిక చర్యలు, ఘోరాలు జరుగుతున్నా చూస్తూ మౌనంగా ఉండటం మహానేరం’
– మహేశ్‌ భట్, బాలీవుడ్‌ దర్శక–నిర్మాత

‘ముందుకు వెళ్లాల్సిందిపోయి అంతకంతకూ వెనక్కు వెళుతున్నాం. మన కంటే జంతువులు నయం. పూర్తిగా పశువుల్లా ప్రవర్తిస్తున్నాం. సిగ్గుపడాల్సిన పరిణామం’
– అక్షయ్‌ కుమార్, బాలీవుడ్‌ నటుడు

‘అమ్మాయిల మీద దాడి జరగగానే అధికారంలో ఉన్న ఇంగితంలేని మనుషులు జరిగిన దాన్ని ఖండించాల్సింది పోయి, అమ్మాయిలు ధరించే దుస్తులు, వాళ్లు రాత్రివేళ బయటకు వెళ్లడం గురించి వ్యాఖ్యలు చేయడం దారుణం... మగపిల్లలను వంశోద్ధారకుడంటూ నెత్తికెత్తుకోకండి. వాళ్లు పశువులుగా మారకుండా చూడండి. వాళ్ల బారిన పడకుండా అమ్మాయిలను కాపాడండి’
– అనుష్క శర్మ, బాలీవుడ్‌ నటి

‘మహిళల మీద జరుగుతున్నవి ఉత్త లైంగిక దాడులు కాదు... ఇవి స్త్రీద్వేషులు కొనసాగిస్తున్న లైంగిక ఉగ్రవాద చర్యలు’
– ఫర్హాన్‌ అక్తర్, బాలీవుడు నటుడు, దర్శకుడు

ఇలాంటి వ్యాఖ్యలను చేసే వాళ్లను పట్టించుకోవడం దండగ. వాళ్లంతా మధ్యయుగానికి చెందిన వాళ్లు. ప్రజాస్వామ్యం, సమానత్వం అంటే అర్థం తెలియని వాళ్లు. యాంటీ ఇంటలెక్చువల్స్, యాంటీ డెమోక్రాట్స్‌..
– రమామేల్కొటే, రిటైర్డ్‌ ప్రొఫెసర్, అన్వేషి ఫౌండర్‌

రాజకీయ నాయకులు, బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవాళ్లు అలా మాట్లాడడం బాధాకరం. ఇది తిరోగామి సంస్కృతి. అంటే స్త్రీలను ఇంట్లో, బ్యాంక్‌ లాకర్లలో భద్రంగా దాచుకునే వస్తువుల్లా చూడ్డమే ఇది.
– బిందు నాయుడు, దర్శకురాలు

అబ్బాయిలు, అమ్మాయిలు ఒకరినొకరు పరస్పరం గౌరవించుకోవాలి. అబ్బాయి ఎక్కువ, అమ్మాయి తక్కువ అనే భావనలోనే ఉన్నాం. అలాగే పెంచుతున్నాం. ఈ సంప్రదాయాన్ని ఇంటి దగ్గరే బ్రేక్‌ చేయాలి. అంటే పెంపకంలో మార్పు రావాలన్నమాట. అమ్మాయిని, అబ్బాయిని ఈక్వల్‌గా పెంచాలి. అబ్బాయిలు అమ్మాయిలను గౌరవంగా చూసేలా పెంచాలి. ఇద్దరినీ మంచి మనుషులుగా రెయిజ్‌ చెయ్యాలి.
– ఆనంద శంకర్‌ జయంతి, ప్రముఖ భరతనాట్య కళాకారిణి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement