
అరణ్యం: ఎలుగుబంట్లు ఎలా నడుస్తాయి?
బ్లాక్ బేర్, బ్రౌన్ బేర్, పోలార్ బేర్ అంటూ పలు రకాలు ఉన్నాయి. ఎక్కువ ఉన్నది మాత్రం బ్రౌన్ బేర్. నివసించే పరిసరాలను బట్టి ఎలుగుల ప్రవర్తనలో తేడా ఉంటుంది తప్ప, వాటి లక్షణాలు దాదాపుగా ఒకలానే ఉంటాయి!
ఆడ ఎలుగును ‘సౌ’ అంటారు. మగ ఎలుగును ‘బోర్’ అంటారు. ఎలుగుల గుంపును ‘స్లాత్’ అంటారు!
ఎలుగుబంట్ల వయసును వాటి పళ్లను బట్టి లెక్కిస్తారు!
అన్ని ఎలుగులూ శాకాహారంతో పాటు మాంసాహారాన్ని కూడా తింటాయి. కానీ ధ్రువప్రాంత ఎలుగుబంట్లు మాత్రం కేవలం మాంసాహారాన్నే భుజిస్తాయి!
వీటికి నలభై రెండు పళ్లు ఉంటాయి. విచిత్రమేమిటంటే... శాకాహారాన్ని, మాంసాహారాన్ని కూడా నమిలేందుకు వీలుగా... వీటి పళ్లు రెండు రకాలుగా ఉంటాయి!
దౌడు తీసే గుర్రాన్ని పట్టుకోవడం ఎంత కష్టమో తెలుసు కదా! ఎలుగులు మాత్రం వాటిని చేజ్ చేసి పట్టుకోగలవు. అంత వేగంగా పరుగెడతాయి మరి!
మనిషి కంటే వంద రెట్లు వేగంగా ఇవి వాసనను పసిగట్టగలవు. ఇరవై మైళ్ల దూరంలో ఉండగానే వీటికి వాసన తెలిసిపోతుంది. మంచులో మూడు అడుగుల లోతున ఉన్న చే పలను కూడా ఇవి గుర్తించేస్తాయి!
పాండాలు తప్ప మిగిలిన అన్ని ఎలుగుబంట్లూ మనిషిలాగా రెండు కాళ్ల మీద నడుస్తాయి. ఇలా నడవడాన్ని ‘ప్లాంటిగ్రేడ్’ అంటారు!
ఇవి తమ కుటుంబాన్ని చాలా ప్రేమిస్తాయి. శత్రువు నుంచి తమ వారిని కాపాడటానికి ఒక్కోసారి ప్రాణాలను కూడా అడ్డేస్తాయట. పిల్లలయితే తల్లికి అస్సలు దూరంగా ఉండలేవు. పొరపాటున తల్లి చనిపోతే, కొన్ని వారాల వరకూ ఇవి ఏడుస్తూనే ఉంటాయట!
సినిమాల కంటే అవే ఇష్టం!
తెలుగు వాళ్లకు లియొనార్డో డికాప్రియో అంత బాగా మరే హాలీవుడ్ హీరో తెలియడేమో. ఎందుకంటే అతడు హీరోగా నటించిన టైటానిక్ సినిమాని భారతీయులు కూడా ఎంతో ఇష్టంగా చూశారు. జాక్, రోజ్‌ల ప్రేమ సఫలమవ్వాలని ఉత్కంఠను అనుభవించారు. చివరకు హీరోయిన్‌ని కాపాడి హీరో చచ్చిపోతే కలతచెంది కన్నీళ్లు పెట్టారు. అందుకే ఆ సినిమాని, అందులో ప్రాణత్యాగం చేసిన గొప్ప ప్రేమికుడు లియొనార్డోని ఎప్పటికీ మర్చిపోరు.
సినిమాలో హీరోయిన్ మీద అపారమైన ప్రేమ చూపించిన లియొనార్డో, నిజ జీవితంలో జంతువుల మీద చెప్పలేనంత ప్రేమను చూపిస్తాడు. మనకు ఏ చెడూ చేయని జంతువులకి మనం ఎంతో కీడు చేస్తున్నాం అంటూ బాధపడుతుంటాడు లియొనార్డో. అందుకే అతడు వీలైనన్ని ఎక్కువ జంతువులను పెంచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు.
లియొనార్డో ఇంట్లో బోలెడన్ని జీవులు కనిపిస్తూ ఉంటాయి. వాటిలో ఒకటి అతడికెంతో ప్రియమైన కుక్క. రెండోది, అతడు ఎంతో ఇష్టపడి తెచ్చుకున్న తాబేలు. దాన్ని మన హీరో బేబీ అని పిలుస్తాడు. మూడోది... బల్లి. దాని పేరు బ్లిజార్డ్. ఈ మూడింటితో ఆడుతూనే ఉంటాడు. అవి ఇచ్చినంత సంతోషాన్ని తనకు సినిమాలు కూడా ఇవ్వవంటాడీ యంగ్ స్టార్!